Group-1 Mains: తెలంగాణ భావానికి మూలం..!

ABN , First Publish Date - 2022-11-21T16:32:14+05:30 IST

తెలంగాణ ఉద్యమం(Telangana Movement) అర్థం కావాలంటే ముల్కీ గురించి తెలియాలి. లోతుగా, ఒక్కముక్కలో చెప్పాలంటే ‘ముల్కీ.’ మూలాల నుంచే తెలంగాణ ఉద్యమం మొదలైంది. రాష్ట్ర ఆవిర్భావ దశలు అర్థం కావడానికి, ముల్కీ ఉద్యమ

Group-1 Mains: తెలంగాణ భావానికి మూలం..!
తెలంగాణ భావానికి మూలం..!

గ్రూప్‌-1 మెయిన్స్‌ ప్రత్యేకం

తెలంగాణ ఉద్యమం- రాష్ట్ర ఆవిర్భావం

తెలంగాణ ఉద్యమం(Telangana Movement) అర్థం కావాలంటే ముల్కీ గురించి తెలియాలి. లోతుగా, ఒక్కముక్కలో చెప్పాలంటే ‘ముల్కీ.’ మూలాల నుంచే తెలంగాణ ఉద్యమం మొదలైంది. రాష్ట్ర ఆవిర్భావ దశలు అర్థం కావడానికి, ముల్కీ ఉద్యమ పరిణామ క్రమం తెలియాలి. ఈ నేపథ్యంలోనే టీఎస్‌పీఎస్సీ సిలబస్‌(Tspsc Syllabus) ను ఫ్రేమ్‌ చేసిన నిష్ణాతులు చరిత్ర మూలాలను హైద్రాబాద్‌ సంస్థానం ఆవిర్భావం నుంచి నేటి వరకూ పొందుపరిచారు. పోటీ పరీక్షలకు సంసిద్ధం అవుతున్న అభ్యర్థులు, ప్రధానంగా గ్రూప్‌-1 మెయిన్స్‌ కోసం చదువుతున్న వారు ముల్కీ ఉద్యమం ఆవిర్భావ పరిస్థితులను, అప్పటి హైదరాబాద్‌ సంస్థానంలో నెలకొన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలను తెలుసుకోవడం తప్పనిసరి.

dakae.gif

హైదరాబాద్‌ సంస్థానం

1724లో మొదటి నిజాంగా పిలిచిన కమ్రుద్దీన్‌ చిన్‌ కిలిచ్‌ ఖాన్‌ ఔరంగబాద్‌ రాజధానిగా ఆస్‌ఫజాహీ రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. 1763లో హైదరాబాద్‌ తిరిగి రాజధానిగా తన కేంద్ర బిందువు వ్యవస్థను నిర్మించుకుంది. 1798, 1800 సంవత్సరాల్లో రెండో నిజాం నవాబు ‘నిజాం అలీ’ బ్రిటిషర్లతో ఒక ఒప్పందం చేసుకున్నాడు. ఫలితంగా అస్‌ఫజాహీ రాజ్యం బ్రిటిష్‌ సామ్రాజ్యానికి కొన్ని పరిమితులకు లోబడి నియంత్రిత రాజ్యంగా మారింది. 1857 సిపాయిల తిరుగుబాటుకు మద్ధతుగా, రోహిల్లా నాయకుడు తుర్రేబాజ్‌ ఖాన్‌, మౌల్వి అల్లాఉద్దీన్‌, సురాపురం సంస్థానాధిపతి వెంకటప్పయ్య, ముందర్గి భీమ్‌రావు, కేలస్‌ జమీందార్‌ రంగారావు తదితరులు తిరుగుబాట్లు చేశారు. ఈ క్రమంలో 5వ నిజాం రాజు అఫ్జలుద్దీన్‌ ఆదేశాలమేరకు అప్పటి ప్రధాని మొదటి సాలర్‌జంగ్‌ ఆ తిరుగుబాట్లను అణచివేశాడు. ఫలితంగా బ్రిటిష్‌ రాజ్య పాలకుల ప్రత్యేక అతిథిగా ‘డాక్టర్‌ ఆఫ్‌ లా’ బిరుదు పొందాడు.

1857 తరవాత ప్రవేశపెట్టిన సంస్కరణలు, సింగరేణి బొగ్గుతో లభ్యమైన అదనపు ఆదాయం, ‘సర్‌ఖస్తి(దళారి)’ వ్యవస్థ తీసివేయడం ద్వారా వచ్చిన ప్రత్యక్ష ఆదాయం నిజాం కాలంనాటి ఆర్థిక వ్యవస్థను సుసంపన్నం చేశాయి.

భూగోళం: హైదరాబాద్‌ సంస్థానం 82,968 చదరపు మైళ్ల విస్తీర్ణంతో కూడిన రాజ్యం. భారతదేశంలో జమ్మూకశ్మీర్‌ మినహా మిగతా సంస్థానాల కంటే విస్తీర్ణమైంది. మిగతా సంస్థానాలన్నింటికంటే ఎక్కువగా అంటే సుమారు కోటి జనాభాను కలిగి ఉన్న ప్రాంతం. 22,500 గ్రామాలు, 80 పట్టణాలు, 18,000 చదరపు మైళ్ల అటవీ విస్తీర్ణం ఈ సంస్థానం సొంతం.

తొలి ఆధునిక సంస్కరణలు

హైదరాబాద్‌ సంస్థానంలో తొలి ఆధునిక సంస్కరణల కోసం ప్రయత్నం చేసినవారిలో బ్రిటిష్‌ రెసిడెంట్‌ సర్‌ చార్లెస్‌ మెట్‌కాఫ్‌(1820-1825) ముఖ్యులు.

 • సైనిక బలగాలను తగ్గించి, ప్రభుత్వ వ్యయాన్ని నియంత్రణలోకి తీసుకుని వచ్చాడు.

 • పన్నుల వసూళ్ల కోసం ప్రత్యేక తాలుక్‌దార్లను నియమించాడు.

 • భూసారాన్ని పరిశీలించి 10 సంవత్సరాలకు శిస్తును నిర్ణయించాడు.

 • రాష్ట్రాన్ని జిల్లాలుగా విభజించి రెవెన్యూ అధికారులను నియమించాడు.

 • ప్రతి పాలనాంశంపై బ్రిటిష్‌ పర్యవేక్షకులను ఏర్పాటు చేశాడు.

మెట్‌కాఫ్‌ సంస్కరణలను మరింత ఆధునీకరించిన ఘనత సాలర్‌జంగ్‌ది. సిపాయిల తిరుగుబాటును అణచివేసి ఆంగ్ల పాలకులకు ప్రీతి పాత్రుడైన ప్రధానమంత్రి సాలర్‌జంగ్‌.

సాలర్‌జంగ్‌ సంస్కరణలు

1853 -1883 వరకు దాదాపుగా ముప్పై సంవత్సరాలు ప్రధానిగా పనిచేసిన సాలర్‌జంగ్‌ అనేక సంస్కరణలను ప్రవేశపెట్టి ఆధునిక హైదరాబాద్‌ నిర్మాణానికి ఆధ్యుడిగా నిలిచాడు.

పరిపాలన సంస్కరణలు

 • దళారి వ్యవస్థ ‘సర్‌ఖస్తీ’ని తొలగించి, దాని స్థానంలో జిల్లా యూనిట్‌గా ‘జిల్లాబందీ’ విధానాన్ని ఏర్పాటు చేశాడు.

 • రాజ్యం సుభాలుగా, సుభాలు జిల్లాలుగా, జిల్లాలు తాలుకాలుగా విభజించారు. నాలుగు సుభాలు, 16 జిల్లాలు, 74 తాలుకాల ద్వారా పరిపాలన వికేంద్రీకరణ జరిగింది.

 • పోలీస్‌, రెవెన్యూ, న్యాయ, విద్య, ఆరోగ్య మంత్రిత్వశాఖలు ఏర్పాటు చేశారు.

 • ప్రైవేట్‌ సైన్యాన్ని రద్దు చేశారు. 1862లో తొలిసారిగా సచివాలయం/సెక్రటేరియట్‌ను ఏర్పాటు చేశారు.

రెవెన్యూ సంస్కరణలు

అప్పటి రెవెన్యూ మంత్రి ముఖురం-అల్‌-దౌల బహద్దూర్‌ ఆధ్వర్యంలో 1864లో రెవెన్యూ బోర్డును ఏర్పాటు చేశారు. 1875లోనే తొలిసారిగా భౌగోళిక సర్వే నిర్వహించారు.

 • రెవెన్యూ వసూళ్లకోసం తహసిల్దార్‌, గిర్దావర్‌ వ్యవస్థలు ఏర్పాటు చేశారు.

 • నాణాల ముద్రణ పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చి, నిజాం హాలీ సిక్కాలు, బ్రిటిష్‌ కల్దార్‌ రూపాయిలు వినిమయంలోకి వచ్చాయి.

 • న్యాయ సంస్కరణలు

 • ఆధునిక యురోపియన్‌ న్యాయ వ్యవస్థను అనుసరించారు.

 • 1870లో హైకోర్టును స్థాపించారు.

 • తొలిసారిగా క్రిమినల్‌ కోర్టును ఏర్పాటు చేశారు.

 • అనాగరిక శిక్షలు నిషేధించారు.

 • జడ్జీల నియామకం వంశపారంపర్యంగా ఉండటాన్ని తొలగించారు.

పోలీస్‌ సంస్కరణలు

 • నిజామత్‌ పేరుతో ప్రత్యేక పోలీస్‌ విభాగం ఏర్పాటైంది

 • మలీ-ఇ-కొత్వాల్‌ పేరుతో నగర పోలీస్‌ వ్యవస్థ రూపుదిద్దుకుంది.

 • స్థానిక స్టేషన్లకు ‘అమీన్‌సాబ్‌’ పేరుతో అధికారులను నియమించారు.

 • నేరాల అదుపు కోసం నిరంతర పర్యవేక్షణ ఉండేది.

విద్యా సంస్కరణలు

 • ఆంగ్ల విద్య ప్రాధాన్యాన్ని గర్తించారు

 • 1855లోనే ‘దారుల్‌-ఉల్‌-ఉలుమ్‌’ పేరుతో ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలను ఏర్పాటు చేశారు.

 • 1870లో ఇంజనీరింగ్‌ కాలేజ్‌, సిటీ హైస్కూల్‌, 1872లో చాదర్‌ఘాట్‌ స్కూల్‌, 1873లో నవాబుల పిల్లల కోసం ప్రత్యేక స్కూలు...ఇలా మొత్తం 162 పాఠశాలలను ఏర్పాటు చేశారు.

ముల్కీల రక్షణ కోసం ఫర్మానాలు

సాలర్‌జంగ్‌ సంస్కరణలను అమలు చేయడం కోసం ప్రత్యేక ఉద్యోగిస్వామ్య వ్యవస్థ అవసరమైంది. ఈ ఉద్యోగిస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం ‘సాలర్‌జంగ్‌’ బ్రిటిష్‌ ఇండియా నుంచి పాలనాధికారులను ఎక్కువ జీతాలిచ్చి హైదరాబాద్‌ ఆహ్వానించాడు. వీరిలో ఉత్తరప్రదేశ్‌ నుంచి ‘బిల్‌గ్రామి’, బెంగాల్‌ నుంచి ఛటోపాధ్యాయులు, మద్రాస్‌ నుంచి ‘ఆంధ్రులు’ అధిక సంఖ్యలో వచ్చి ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వీరు స్థానిక ప్రజలను చిన్న చూపు చూడసాగారు. స్థానికులు వీరిని ‘దిగుమతి దారులు’గా గుర్తించేవారు. ఈ వైరుధ్యం తరవాత కాలంలో ముల్కీ, గైర్‌ ముల్కీగా విభజన రేఖ గీసింది. స్థానికులకు ఎక్కువ అవకాశాలు ఇవ్వలంటూ ప్రజలు నిరసనలు చేయడంతోపాటు, నిజాంకు పలు మెమొరాండాలు సమర్పించారు. స్థానికుల ఆసక్తులను గౌరవించిన నిజాం ప్రభుత్వం స్థానికుల అవకాశాలకు రక్షణ కల్పిస్తూ 1868లో ఒక గెజిట్‌ను విడుదల చేసింది. ఆ గెజిట్‌లోనే తొలిసారిగా అధికారికంగా ‘ముల్కీ’ అనే పదం ఉపయోగించారు.

తరవాత కాలంలో ఈ ముల్కీల రక్షణ కోసం కొనసాగిన ఉద్యమాలే ‘ముల్కీ’ ఉద్యమాలుగా గుర్తింపు పొందాయి.

1857 తరవాత ప్రవేశపెట్టిన సంస్కరణలు, సింగరేణి బొగ్గుతో లభ్యమైన అదనపు ఆదాయం, ‘సర్‌ఖస్తి(దళారి)’ వ్యవస్థ తీసివేయడం ద్వారా వచ్చిన ప్రత్యక్ష ఆదాయం నిజాం కాలంనాటి ఆర్థిక వ్యవస్థను సుసంపన్నం చేసాయి.

ముగింపు

పోటీ పరీక్షల కోసం సిద్ధం అవుతున్న అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ ఫలితమనే విషయాన్ని గ్రహించాలి. ఈ ఉద్యమాల మూల చరిత్రను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అధ్యయనంలో హైదరాబాద్‌ సంస్థానం నుంచి నేటి వరకు సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో సంభవిస్తున్న మార్పులను పరిశీలిస్తూ ప్రత్యేక నోట్స్‌ను రాసుకోవాలి. ప్రధానంగా మెయిన్స్‌ ప్రశ్నల సమాధానాల్లో స్పష్టత, సరళత, ప్రశ్నకు అనుగుణ్యమైన సమాధానాలు రాయగలగాలి.

-డాక్టర్‌ రియాజ్‌

సీనియర్‌ ఫ్యాకల్టీ, అకడమిక్‌ డైరెక్టర్‌,

5 మంత్ర కెరీర్‌ పాయింట్‌, హైదరాబాద్‌MD-riyaz.gif

Updated Date - 2022-11-21T16:42:13+05:30 IST

Read more