Group special: ఉస్మానియా వర్సిటీలో ‘తెలంగాణ ఆకాంక్ష’

ABN , First Publish Date - 2022-12-05T16:43:43+05:30 IST

16వ శతాబ్ధం నుంచి ప్రపంచవ్యాప్తంగా, ప్రధానంగా యూరప్‌ లో అనేక మార్పులు ఆరంభమయ్యాయి. వ్యాపార పెట్టుబడి (మెర్కంటైల్‌ క్యాపిటలిజం) క్రమంగా విస్తరించి నూతన భౌగోళిక

Group special: ఉస్మానియా వర్సిటీలో ‘తెలంగాణ ఆకాంక్ష’
‘తెలంగాణ ఆకాంక్ష’

తెలంగాణ ఉద్యమం - రాష్ట్ర ఆవిర్భావం

16వ శతాబ్ధం నుంచి ప్రపంచవ్యాప్తంగా, ప్రధానంగా యూరప్‌ లో అనేక మార్పులు ఆరంభమయ్యాయి. వ్యాపార పెట్టుబడి (మెర్కంటైల్‌ క్యాపిటలిజం) క్రమంగా విస్తరించి నూతన భౌగోళిక ప్రదేశాల ఆవిర్భావానికి అవకాశాలను ఏర్పరచింది. పారిశ్రామిక విప్లవ ఫలితాలు నూతన శాస్త్ర సాంకేతిక, సాంస్కృతిక వికాసానికి దోహదపడ్డాయి. ఈ మార్పుల వెల్లువనే ‘సాంస్కృతిక పునరుజ్జీవం’గా గుర్తిస్తున్నారు. ఇది క్రమంగా విద్యావకాశాలు కల్పిస్తూ యూనివర్సిటీల ఏర్పాటుకు బాటలు వేసింది.

బౌద్ధ తాత్విక పునాదులు భారతదేశంలో యూనివర్సిటీల ఏర్పాటుకు బీజాలు వేశాయి. తక్షశిల, నలంద, ఒదాంత్‌పురి, జగదిల్ల, పాట్నా, నదియా, నాగార్జునకొండ మొదలైన ప్రాంతాల్లో విశ్వవిద్యాలయాలు ఏర్పాటయ్యాయి. దాంతో ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు విద్య కోసం ఇక్కడికి వచ్చేవారు.

ఆధునిక యుగంలో బ్రిటిష్‌ ప్రభుత్వం 1858లో బొంబాయి, కలకత్తా, మద్రా్‌సలో యూనివర్సిటీలను ఏర్పాటు చేసింది. క్రమంగా యూనివర్సిటీ స్థాయి విద్య విస్తరించింది. విశ్వవిద్యాలయ విద్య కోసం ప్రజల నుంచి డిమాండ్‌ పెరిగింది. ఈ నూతన మార్పుల ప్రభావం బ్రిటిష్‌ ఇండియా సంస్థానాలపై పడింది.

హైదరాబాద్‌ రాజ్యంలో ఆధునిక విద్య

1798, 1800 అక్టోబరు 12న రెండో నిజాం నవాబు నిజాం అలీ ‘ ద ట్రీటీ ఆఫ్‌ సబ్సీడియరీ అలయన్స్‌’ ఒప్పందంపై సంతకం చేశాడు. ఫలితంగా నిజాం రాజ్యం బ్రిటిష్‌ ఆధీన సంస్థానంగా మారిపోయింది. నిజాం రాజ్య నియంత్రణ కోసం రెసిడెంట్‌ వ్యవస్థను ఏర్పాటు చేసింది. దాంతో బ్రిటిష్‌ పరిపాలకులకు, ప్రభుత్వ వ్యవస్థ కోసం అవసరమైన సిబ్బంది హైదరాబాద్‌ కేంద్రంగా జీవనాన్ని ఆరంభించారు. వీరి కోసం అవసరమైన పాఠశాలలు ఏర్పాటు చేయాల్సిన అనివార్యత ప్రభుత్వానికి ఏర్పడింది.

1834లో బ్రిటిషర్లు సెయింట్‌ జోసెఫ్‌ పాఠశాలను ఏర్పాటు చేసారు. ఒకటో సాలార్‌జంగ్‌ చొరవతో ‘దారుల్‌-ఉల్‌-ఉలుమ్‌’ అనే ఓరియెంటల్‌ పాఠశాలను ప్రారంభించారు. మద్రాస్‌ యూనివర్సిటీకి అనుబంధంగా 1887లో నిజాం కాలేజీ ఏర్పాటైంది. దీనికంటే ముందు 1870లో సిటీ హైస్కూల్‌, ఇంజనీరింగ్‌ కాలేజ్‌, 1872లో చాదర్‌ఘాట్‌ హైస్కూల్‌ను ప్రారంభించారు. 1900 సంవత్సరం నాటికి 162 పాఠశాలలు హైదరాబాద్‌ రాజ్యంలో ప్రారంభమయ్యాయి.

ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పాటు

ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలంగాణ విద్యకు అమ్మఒడి లాంటిది. ఉస్మానియా వర్సిటీ ఏర్పాటులో అప్పటి మంత్రి, తరవాత ప్రధానిగా పనిచేసిన అక్బర్‌ హైదరీ కృషి శ్లాఘించదగినది. ఈ యూనివర్సిటీ ఏర్పాటులో ప్రపంచంలోని ప్రముఖ విద్యావేత్తల అభిప్రాయాలు తీసుకున్నారు. వారిలో రవీంద్రనాథ్‌, సర్‌ మైఖెల్‌ శ్లాడర్‌ ముఖ్యులు.

ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన ఫర్మాన 1917 ఏప్రిల్‌ 26న విడుదలైంది. ఈ నేపథ్యంలోనే 2017 ఏప్రిల్‌ 26న నిర్వహించిన వందేళ్ల ఉత్సవాలకు అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వర్సిటీ స్థల ఎంపికలో సర్‌ ప్మాలిక్‌ గెడ్డెస్‌ సూచన పరిగణనలోకి తీసుకున్నారు. అప్పటి హైదరాబాద్‌ నగరానికి తూర్పు దిక్కున దాదాపు 1600 ఎకరాల స్థలమైన అడిక్‌మెట్‌ను కేటాయించారు. నిర్మాణ పనుల బాధ్యత నవాబ్‌ జైన్‌ యార్‌ జంగ్‌ బహదూర్‌కు అప్పగించారు. ఆర్ట్స్‌ కాలేజ్‌ డిజైనర్‌గా, బెల్జియం ఆర్కిటెక్‌ మన్సియోర్‌ జస్పర్‌ తన నిర్మాణ కౌశల్యాన్ని చూపించారు. వాస్తవానికి ఆర్ట్స్‌ కాలేజ్‌ నిర్మాణం అనేక శైలులను సంతరించుకుంది. భవన తోరణాలు ఇండో సారసెనిక్‌ పద్ధతిలో, మధ్యలో ఇస్లామిక్‌, అరబిక్‌ పద్ధతులతోపాటు గోతిక్‌ శైలి కూడా ఉపయోగించారు. మొదటి అంతస్తులోని స్థంభాలు అజంత, ఎల్లోర గుహ స్థంభాలను పోలి ఉంటాయి.

ఉస్మానియా యూనివర్సిటీ కేవలం నిర్మాణపరంగా మాత్రమే కళాత్మకంగా మిగిలిపోలేదు. విద్య విస్తరణలో ఒక తల్లి పాత్రను తెలంగాణ సమాజంలో పోషించింది. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, బాబా సాహేబ్‌ అంబేడ్కర్‌, పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ, యాసర్‌ అరాఫత్‌, సర్వేపల్లి రాధాకృష్ణన్‌, ఆర్‌.వెంట్రామన్‌, మన్మోహన్‌ సింగ్‌ లాంటి అతిరథ మహారథులకు గౌరవ డాక్టరేట్లను అందించింది. తెలంగాణ మహామహులు పి.వి.నర్సింహారావు, దాశరథి, కొత్తపల్లి జయశంకర్‌, శ్యాంబెనగల్‌, మహ్మద్‌ అజారుద్దీన్‌, జార్జి రెడ్డి లాంటి అనేక మంది ఈ విశ్వవిద్యాలయ విద్యార్థులే.

ఉస్మానియా యూనివర్సిటీ కేవలం విద్యకే పరిమితం కాకుండా సమాజంలోని మార్పులకు దిక్సూచిలా, ఉద్యమాలకు కేంద్ర బిందువుగా వ్యవహరించింది.

ఉద్యమ కేంద్రంగా ఉస్మానియా

1919లో విడుదలైన ముల్కీల రక్షణ కోసం నిజాం రాజు జారీచేసిన ఫర్మానాకు ప్రేరణ ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమమే. డాక్టర్‌ జైర్‌ నాయకత్వంలో ఆరంభమైన పాన్‌ దక్కన్‌ ఉద్యమం ఈ ఫర్మానాకు కారణం.

ఉస్మానియా యూనివర్సిటీలో ఆరంభమైన తొలి ఉద్యమం ‘వందేమాతర’ ఉద్యమం. 1938లో యూనివర్సిటీ విద్యార్థులు నిజాం రాజ్య గీతం స్థానంలో వందేమాతరం ఆలపించడంతో వారిని క్యాంపస్‌ నుంచి బహిష్కరించారు. వీరిలో భారత మాజీ ప్రధాని పి.వి.నర్సింహారావు, ప్రముఖ నక్సలైట్‌ ఉద్యమ నిర్మాత దేవులపల్లి వెంకటేశ్వరరావు, నల్లగొండ మాజీ ఎంపీ ధర్మభిక్షం గౌడ్‌, మాజీ మంత్రి హయగ్రీవచారి, ఆరుట్ల రామచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు. ఓయూ విద్యార్థులకు మద్దతుగా నిలవడం వల్ల అప్పటి హైదరాబాద్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా నిషేధానికి గురైంది.

1935 ముల్కీ లీడ్‌ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు కీలక పాత్రను పోషించారు. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ముల్కీలలో చైతన్యం పెంచడంలో మహోత్తరమైన బాధ్యత ఉస్మానియా యూనివర్సిటీ పోషించింది.

ముల్కీ ఉద్యమం 1952

వాస్తవానికి హైదరాబాద్‌ రాజ్యం యూనియన్‌ ఆఫ్‌ ఇండియాలో చేరిన తర్వాత, హైదరాబాద్‌ రాష్ట్రంగా మారింది. ఇక్కడి యువత ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ఆశించింది. కానీ అప్పుడే ఏర్పడిన బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచకపోగా, అప్పటికే వివిధ ఉద్యోగాల్లో స్థిరపడిన గైర్‌ ముల్కీలను సైతం తొలగించలేకపోయింది. ఈ ప్రభుత్వ వైఖరికి నిరసనగా వరంగల్‌ కేంద్రంగా ముల్కీ ఉద్యమం ఆరంభమైంది. విద్యార్థి జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఏర్పడింది. దీని నాయకుడు ఆరెళ్లి బుచ్చయ్యగౌడ్‌. ఈ నేపథ్యంలోనే మర్కజీ పాఠశాలలో స్థానిక ప్రధానోపాధ్యాయుడు హరున్‌-ఉల్‌-రషీద్‌ పట్ల మద్రాస్‌, ఆంధ్ర నుంచి రప్పించిన అధికారి పార్థసారధి వ్యవహార సరళి విద్యార్థుల్లో ఉద్యమం పట్ల ఉత్తేజితుల్ని చేసింది.

ఈ ఉద్యమమే తర్వాత కాలంలో సిటీ కాలేజ్‌, హైదరాబాద్‌ ఉద్యమంగా ప్రసిద్ధి చెందింది. 1952, అక్టోబరు 3, 4 తేదీలలో జరిగిన కాల్పుల్లో దాదాపు 12 మంది విద్యార్థులు మరణించారు.

1969 తెలంగాణ హక్కుల సంరక్షణ ఉద్యమం

వాస్తవానికి 1969 ఉద్యమ కేంద్రంగా ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచ వ్యవహరించాయి. ఈ ఉద్యమానికి మద్దతుగా 1969 జనవరిలో ఓయూలో విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఏర్పడింది. ఈ ఉద్యమంలో రెండు భిన్న నాయకత్వాలు ఉండేవి. వాటిలో రక్షణల ఉద్యమానికి వెంకటరాం రెడ్డి, విభజన ఉద్యమానికి మల్లికార్జున్‌ నాయకత్వం వహించారు. ఉస్మానియా విద్యార్థి ఉద్యమంలో గోపాల్‌, పులి వీరన్న, శ్రీధర్‌రెడ్డి, పుల్లారెడ్డి, మధుసూదన్‌, డాక్టర్‌ కొల్లూరి చిరంజీవ, ఆరిఫుద్దీన్‌ తదితరులు కీలక పాత్రను పోషించారు.

ఈ నేపథ్యంలోనే 1969, మే 20న ఉస్మానియా విశ్వవిద్యాలయ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ రావాడ సత్యనారాయణ ఆధ్వర్యంలో మేధావుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రొఫెసర్‌ మౌజం అలీ అధ్యక్షత వహించారు. ప్రొఫెసర్‌ శ్రీధర్‌ స్వామి సమన్వయ కర్తగా వ్యవహరించారు. ఈ సెమినార్‌లోనే ప్రొఫెసర్‌ జయశంకర్‌ తొలిసారిగా నాగార్జున సాగర్‌ నీటి పంపకాలపై తన పరిశోధన ప్రతిని సమర్పించారు. ఈ పరిశోధన పత్రాలతో విడుదలైన గ్రంథమే ‘తెలంగాణ మూవ్‌మెంట్‌ యాన్‌ ఇన్వెస్టిగేషన్‌ ఫోకస్‌’.

1969 ఉద్యమం అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోయింది. దీంతో నిరాశ చెందిన విద్యార్థి నాయకులు, విద్యార్థులు తరవాతకాలంలో వామపక్ష భావజాలానికి ఆకర్శితులు అయ్యారు. వీరంతా వామపక్ష ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీని కీలకమైన భూమికను పోషించే స్థాయికి తీసుకుని వెళ్లారు.

తుది దశ : రాష్ట్ర ఏర్పాటు ఇతర యూనివర్సిటీల పాత్ర

తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ఉస్మానియ, కాకతీయ, తెలంగాణ, శాతవాహన, మహాత్మాగాంధీ, పాలమూరు యూనివర్సిటీల విద్యార్థుల పాత్ర అద్వితీయమైనది. మలిదశ ఉద్యమానికి ఓయూ కేంద్ర బిందువుగా మారింది. పోలీస్‌ సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ నియామకాల్లో హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌గా సుప్రీంకోర్టు ప్రకటించగానే ఉస్మానియా క్యాంపస్‌ కేంద్రంగా ఉద్యమం ఆరంభమైంది. ‘సింహగర్జన’, ‘పొలికేక’ పేర్లతో విద్యార్థులు భారీగా సమావేశాలు నిర్వహించారు. 2010 జనవరి 1న ‘నా రక్తం - నా తెలంగాణ’ పేరుతో విద్యార్థులు నిర్వహించిన కార్యక్రమం గిన్నిస్‌ బుక్‌ రికార్డుల్లో చోటు చేసుకుంది. శ్రీకాంతాచారి, సిరిపురం యాదయ్యలాంటి వందల మంది విద్యార్థుల ప్రాణత్యాగాలు అనుక్షణం తెలంగాణ ఉద్యమాన్ని కణకణమని మండేలా చేశాయి.

గ్రూప్‌-1, గ్రూప్‌-2, పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ తదితర పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో విద్యార్థుల పాత్ర గూర్చి సంపూర్ణ అవగాహనను కలిగి ఉండాలి. హైదరాబాద్‌ రాజ్యం నుంచి ఆధునిక తెలంగాణ వరకు ఈ భౌగోళిక ప్రాంతంలో విద్య విస్తరణ, జ్ఞాన ప్రసరణతోపాటుగా, విద్యార్థి, ఉద్యమ తీరు తెన్నులపై నోట్స్‌ సిద్ధం చేసుకోవాలి.

మలిదశ ఉద్యమానికి ఓయూ కేంద్ర బిందువుగా మారింది. పోలీస్‌ సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ నియామకాల్లో హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌గా సుప్రీంకోర్టు ప్రకటించగానే ఉస్మానియా క్యాంపస్‌ కేంద్రంగా ఉద్యమం ఆరంభమైంది. ‘సింహగర్జన’, ‘పొలికేక’ పేర్లతో విద్యార్థులు భారీగా సమావేశాలు నిర్వహించారు. 2010 జనవరి 1న ‘నా రక్తం - నా తెలంగాణ’ పేరుతో విద్యార్థులు నిర్వహించిన కార్యక్రమం గిన్నిస్‌ బుక్‌ రికార్డుల్లో చోటు చేసుకుంది.

1969, మే 20న ఉస్మానియా విశ్వవిద్యాలయ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ రావాడ సత్యనారాయణ ఆధ్వర్యంలో మేథావుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రొఫెసర్‌ మౌజం అలీ అధ్యక్షత వహించారు. ప్రొఫెసర్‌ శ్రీధర్‌ స్వామి సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సెమినార్‌లోనే ప్రొఫెసర్‌ జయశంకర్‌ తొలిసారిగా నాగార్జున సాగర్‌ నీటి పంపకాలపై తన పరిశోధన ప్రతిని సమర్పించారు. ఈ పరిశోధన పత్రాలతో విడుదలైన గ్రంథమే ‘తెలంగాణ మూవ్‌మెంట్‌ యాన్‌ ఇన్వెస్టిగేషన్‌ ఫోకస్‌’.

-డాక్టర్‌ రియాజ్‌

సీనియర్‌ ఫ్యాకల్టీ, అకడమిక్‌ డైరెక్టర్‌,

5 మంత్ర కెరీర్‌ పాయింట్‌, హైదరాబాద్‌

Updated Date - 2022-12-05T16:43:44+05:30 IST