ప్రాథమిక విధులను దేని నుంచి గ్రహించారు? పోటీ పరీక్షల కోసం!
ABN , First Publish Date - 2022-07-20T19:57:49+05:30 IST
సాధారణంగా ప్రాథమిక విధులు టాపిక్ చాలా సులభమైనదిగా పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు భావించినప్పటికీ ఈ కింది వాటిలో ఏది ఆదేశిక సూత్రం, ఏది ప్రాథమిక విధి అనే ప్రశ్నలు
ప్రాథమిక విధులు
సాధారణంగా ప్రాథమిక విధులు టాపిక్ చాలా సులభమైనదిగా పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు భావించినప్పటికీ ఈ కింది వాటిలో ఏది ఆదేశిక సూత్రం, ఏది ప్రాథమిక విధి అనే ప్రశ్నలు వచ్చినప్పుడు 11 ప్రాథమిక విధులను గురించి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే సరైన సమాధానం రాయగలరని గమనించాలి.
- మౌలిక రాజ్యాంగంలో ప్రాథమిక విధులు లేవు.
- 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా పది ప్రాథమిక విధులను రాజ్యాంగంలో పొందుపరిచారు.
- ప్రాథమిక విధులను IV(A) అనే భాగంలో ఆర్టికల్-51(ఏ)లో 'a' నుంచి 'k' వరకు రాజ్యాంగంలో పొందుపరిచారు.
- ప్రాథమిక విధులను యూఎస్‌ఎస్‌ఆర్ (రష్యా) రాజ్యాంగం నుంచి గ్రహించారు.
- 1976లో అప్పటి కేంద్ర న్యాయశాఖమంత్రి హెచ్.ఆర్.గోఖలే ప్రాథమిక విధులకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు.
- ప్రాథమిక విధులను రాజ్యాంగంలో పొందుపరచాలని సూచించిన కమిటీ - ‘స్వరణ్‌సింగ్ కమిటీ’.
- స్వరణ్‌సింగ్ కమిటీ సూచనల ఆధారంగా ప్రాథమిక విధులను పొందుపర్చినప్పటికీ ఆ కమిటీ చేసిన సూచనలను ప్రభుత్వం తిరస్కరించింది.
1. ప్రాథమిక విధులను పాటించని పౌరులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచిస్తూ చట్టం చేయవచ్చు.
2. ప్రాథమిక విధులను పాటించని వారిపై తీసుకున్న చర్యలను న్యాయస్థానాల్లో సవాలు చేయకుండటం
3. పన్ను చెల్లించడం ప్రాథమిక విధిగా ఉండాలి.
ప్రాథమిక విధుల జాబితా
ఆర్టికల్-51(ఎ): ప్రకారం ప్రతి పౌరుడు ఈ కింది ప్రాథమిక విధులు నిర్వహించాలి.
ఎ) రాజ్యాంగానికి కట్టుబడి, దాని ఆదర్శాలను, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించాలి.
బి) స్వాతంత్య్ర పోరాటపు ఆదర్శాలను కాపాడాలి.
సి) దేశ సమైక్యతను, సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని గౌరవించాలి.
డి) దేశ రక్షణకు, దేశ సేవకు సర్వత్రా(ఎల్లప్పుడూ) సిద్ధంగా ఉండాలి.
ఇ) ప్రజల్లో సౌభ్రాతృత్వాన్ని పెంపొందించి మత, భాష, వర్గ, ప్రాంతీయ విభేదాలను అదిగమించాలి. స్ర్తీ గౌరవానికి భంగం కలిగించే చర్యలను విడనాడాలి.
ఎఫ్) దేశ సంస్కృతి, వారసత్వాన్ని కాపాడాలి.
జీ) అడవులు, నదులు, సరస్సులు వంటి పర్యావరణాన్ని కాపాడాలి. వన్యప్రాణులను సంరక్షించి, జీవకోటిపై దయ కలిగి ఉండాలి.
హెచ్) ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని, మానవతా వాదాన్ని పెంపొందించాలి.
ఐ) ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి, హింసను విడనాడాలి.
జె) వ్యక్తి అన్ని రంగాల్లో ఔన్నత్యాన్ని సాధించాలి, దేశ ప్రతిష్ఠను పెంపొందించాలి.
కె) 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలను ప్రతి తల్లి, తండ్రి లేదా సంరక్షకుడు పాఠశాలకు పంపించాలి.
నోట్: మొదట్లో ప్రాథమిక విధులు పది మాత్రమే ఉండేవి. 2002లో 86 రాజ్యాంగ సవరణ ద్వారా ‘కె’ అనే ప్రాథమిక విధిని చేర్చారు.
ప్రాథమిక విధుల అమలుపై కమిటీ
- ప్రాథమిక విధుల అమలు తీరును అధ్యయనం చేయడానికి 1999లో ‘జె.ఎస్.వర్మ కమిటీ’ని నియమించారు.
- ఈ కమిటీ పరిశీలన ప్రకారం ప్రాథమిక విధులను అమలుచేయడానికి రాజ్యాంగంలో ఎలాంటి చట్టాలు లేవు. కానీ, పార్లమెంటు విభిన్న సందర్భాల్లో చేసిన చట్టాల ఆధారంగా కొన్ని ప్రాథమిక విధులు అమలవుతున్నాయి.
1. జాతీయ చిహ్న అవమానాల నిరోధక చట్టం-1971 ద్వారా మొదటి ప్రాథమిక విధి అమలవుతోంది.
2. వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 ద్వారా ఏడవ ప్రాథమిక విధి అమలవుతోంది.
3. అటవీ సంరక్షణ చట్టం-1980 ద్వారా ఏడవ ప్రాథమిక విధి అమలవుతోంది.
4. పౌర హక్కుల పరిరక్షణ చట్టం- 1976 ద్వారా అయిదో ప్రాథమిక విధి అమలవుతోంది.
నోట్: రాజ్యాంగంలో ప్రాథమిక విధులను కలిగి ఉన్న ప్రజాస్వామ్య దేశాలు- ఇండియా, జపాన్
ప్రాథమిక విధులకు సంబంధించిన కేసులు
- థియేటర్లలో సినిమా కంటే ముందు జాతీయగీతాన్ని వినిపించడం, ఆలపించడం తప్పనిసరికాదు. కానీ గౌరవించడం తప్పనిసరి. అనగా థియేటర్లలో జాతీయ గీతాన్ని వినిపిస్తే అప్పుడు తప్పనిసరిగా గౌరవించాలి అని శ్యామ్ నారాయణ్ చౌక్సే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (2018)లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
- జాతీయ గీతం పాడటం తప్పనిసరి కాదని, జాతీయగీతం పాడేలా ఆదేశాలు జారీచేయడం కూడా సాధ్యం కాదని, జాతీయ గీతాన్ని ఆలపించే సమయంలో వ్యక్తులు నిలిచి ఉండటం కూడా జాతీయ గీతాన్ని గౌరవించినట్లుగానే భావించాలని సుప్రీంకోర్టు బిజోయ్ ఇమ్మాన్యుయేల్ వర్సెస్ కేరళ రాష్ట్రం కేసులో తీర్పునిచ్చింది.
- ప్రాథమిక విధులు విస్మరించదగినవి కాదని, వాటిని గౌరవించి, పాటించాల్సిన బాధ్యత పౌరులందరిపైనా ఉందని ఏఐఐఎంఎస్ వర్సెస్ విద్యార్థి యాజమాన్యం కేసు (2002)లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
- ప్రాథమిక విధులు పౌరుని కనీస బాధ్యతలు అయినందున ప్రభుత్వాలు వాటిని పాటించే విషయమై చట్టాలను రూపొందించవచ్చు అని రూరల్ లిటిగేషన్ వర్సెస్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
- ప్రాథమిక విధుల అమలు కోసం మాండమస్ రిట్లు జారీ చేయడం సాధ్యంకాదని, చట్టబద్ధత లేనంత వరకు ప్రాథమిక విధులకు న్యాయ సంరక్షణ ఉండదని సూర్యనారాయణ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
- విద్యాసంస్థల్లో వారంలో రెండు గంటల నుంచి 3 గంటల వరకు పర్యావరణ పరిరక్షణపై తరగతులు నిర్వహించాలని, అదేవిధంగా పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అవగాహనను విద్యాసంస్థలు కల్పించాలని ఎం.సి.మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
ప్రాథమిక విధులపై వ్యాఖ్యానాలు
1. హక్కులు, విధులు ఒక నాణానికి భిన్న పార్శ్యాల వంటివి - లాస్కీ.
2. ప్రాథమిక విధులు కేవలం అలంకారప్రాయమైనది - కె.పి.ముఖర్జీ
3. ప్రాథమిక విధులు వ్యక్తి నైతిక ప్రవర్తనను పెంచే మార్గదర్శక సూత్రాలు - డి.కె.బారువా.
4. ప్రాథమిక విధులు అసంబద్ధంగా, గందరగోళంగా ఉన్నాయి - నానీ పాల్కీవాలా.
5. ఆదేశిక సూత్రాల అమలు ప్రభుత్వ చిత్తశుద్ధిపై ఆధాపడినట్లే, ప్రాథమిక విధుల అమలు అనేది వ్యక్తుల చిత్తశుద్ధిపై ఆధారపడి ఉంటుంది
- దుర్గాదాస్ బసు.
6. ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చడం అనవసరం - సి.కె.దఫ్తారి.
7. ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చడం వలన ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుంది
- ఇందిరాగాంధీ
నోట్: 2000 సంవత్సరంలో ఏర్పాటైన ఎం.ఎన్.వెంకటాచలయ్య కమిషన్ 2002లో నివేదికను సమర్పించింది. ఆ నివేదికలో కింది అంశాలను ప్రాథమిక విధులుగా గుర్తించాలని సూచించింది.
1. ప్రతి పౌరుడు, తప్పనిసరిగా ఓటును వినియోగించుకోవాలి.
2. పారిశ్రామిక యాజమానాలు తమ సిబ్బంది పిల్లల శారీరక, మానసిక అభివృద్ధిపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.
ప్రాథమిక విధులు విస్మరించదగినవి కాదని, వాటిని గౌరవించి, పాటించాల్సిన బాధ్యత పౌరులందరిపైనా ఉందని ఏఐఐఎంఎస్ వర్సెస్ విద్యార్థి యాజమాన్యం కేసు (2002)లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.


-వి.చైతన్యదేవ్
పోటీ పరీక్షల నిపుణులు
