విశ్వసనీయత పెంచండి

ABN , First Publish Date - 2022-09-29T06:10:35+05:30 IST

పీఎంకేర్స్ ఫండ్ ట్రస్టీలుగా ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరో ముగ్గురిని నియమించారు. ఇప్పటికే, కేంద్రమంత్రులు కొందరు ట్రస్టీలుగా ఉన్న ఈ ఫండ్‌లోకి టాటా సంస్థల పెద్ద ...

విశ్వసనీయత పెంచండి

పీఎంకేర్స్ ఫండ్ ట్రస్టీలుగా ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరో ముగ్గురిని నియమించారు. ఇప్పటికే, కేంద్రమంత్రులు కొందరు ట్రస్టీలుగా ఉన్న ఈ ఫండ్‌లోకి టాటా సంస్థల పెద్ద రతన్ టాటా, లోక్‌సభ మాజీ డిప్యూటీ స్పీకర్ కరియా ముండా, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కేటీ థామస్‌లను నరేంద్రమోదీ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలుగా చేర్చుకున్నారు. వీరందరూ ఎనిమిదిపదుల వయసు దాటినవారే. మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రాజీవ్ మహర్షి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సుధామూర్తి, పిరమల్ ఫౌండేషన్ మాజీ సీఈవో ఆనంద్ షాలతో సలహామండలి కూడా ఏర్పడింది. నూతన ట్రస్టీలు, సలహాదారుల భాగస్వామ్యంతో పీఎం కేర్స్ దృక్పథం మరింత విశాలమవుతుందని ప్రధాని ప్రకటించారు. పీఎం కేర్స్ ఫండ్ ఒక ప్రభుత్వ సంస్థ కాదని పాలకులు వాదిస్తున్న క్రమంలో, దానిని ఒక చారిటబుల్ ట్రస్టుగా స్థిరపరచేందుకు ఈ చేరికలు ఉపకరిస్తాయి.


‘ప్రైమ్‌మినిస్టర్స్ సిటిజెన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ ఫండ్’ అన్న పేరు పెట్టుకున్నప్పుడు క్షేత్రస్థాయిలో అదే లక్ష్య సాధనకు దశాబ్దాలుగా పనిచేస్తున్న సంస్థలూ, వ్యక్తులు, ప్రముఖులు ఎంతోమంది ఉండగా వీరినే ఎందుకు నియమించాలన్న విమర్శలు రావడం సహజం. తనకు నచ్చినవారిని నియమించుకొనే అధికారం ఫండ్ చైర్మన్‌గా మోదీకి ఉన్నమాట కాదనలేనిది. ఈ ఫండ్ స్వరూపస్వభావాల మీదా, పారదర్శకత, జవాబుదారీ తనంపైనా దాని ఆరంభంనాటి నుంచి వివాదం సాగుతున్న నేపథ్యంలో, ఇప్పుడు ట్రస్టీలుగా, సలహాదారులుగా చేరినవారంతా ప్రముఖులు, ప్రజల్లో ఎంతోకొంత సానుకూలత ఉన్నవారు కనుక ఫండ్‌కు మరింత గౌరవం చేకూర్చేందుకు వీలవుతుంది.


అత్యవసరాల్లో ఆదుకొనేందుకు రాజ్యాంగబద్ధమైన పీఎం రిలీఫ్ ఫండ్ ఒకటి ఉండగా, కొత్తగా ఈ నిధి ఎందుకన్న ప్రశ్న ఆదిలోనే ఎదురైంది. కరోనా సంక్షోభకాలంలో అటువంటి విపత్తుల సందర్భంగా ఉపయోగించే లక్ష్యంతో పుట్టుకొచ్చిన ఈ నిధిని ప్రధాని కార్యాలయమే నిర్వహిస్తున్నది. ప్రభుత్వ మౌలిక సదుపాయాలు వాడుకుంటూ, జాతీయ చిహ్నాన్ని ఉపయోగించుకుంటున్న ఈ నిధి, కాగ్ ఆడిటింగ్‌కు అతీతం. ఇప్పుడు అదే ట్రస్టులో మాజీ ‘కాగ్’ ఓ ట్రస్టీ కావడం విశేషం. సమాచార హక్కును కూడా ఈ ట్రస్టు ఖాతరు చేయదు. ప్రైవేటు వ్యక్తులు, సంస్థలనుంచి నిధులు సేకరిస్తున్నప్పుడు కాగ్ లెక్కలు చూడటమేమిటని ప్రభుత్వం వాదన. కానీ, పీఎం కేర్స్‌కు ప్రభుత్వ రంగ సంస్థలు,  శాఖల నుంచి భారీ ఎత్తున విరాళాలు అందుతున్న విషయం తెలిసిందే. పాలకుల ఆదేశాలు లేనిదే ప్రభుత్వ సంస్థలు ఇలా విరాళాలు ఇవ్వవు. పైగా ప్రధాని కార్యాలయం అదేపనిగా వీటి వెంటపడిందనీ, ఏ సంస్థ ఎంత ఇవ్వాలన్న లక్ష్యాలు నిర్ణయించిందన్న విమర్శలు కూడా వచ్చాయి. ట్రస్ట్‌కు విరాళం ఇవ్వాల్సిందిగా ప్రభుత్వరంగ సంస్థలు ప్రకటనలు కూడా ఇస్తుంటాయి. ఈ ఫండ్‌ స్వరూప స్వభావాలమీద నిర్దిష్టమైన వివరణ అంటూ ఇప్పటివరకూ లేదు. మీడియా నుంచి, ప్రజాక్షేత్రం నుంచి, చివరకు న్యాయస్థానాల నుంచీ ప్రశ్నలు ఎదురైనప్పుడు, ఎప్పటికి ఏదీ అవసరమో ఆ జవాబు మాత్రమే ప్రభుత్వం నుంచి వస్తుంది. అది ఎలా ఏర్పడింది, ఏ విధంగా పనిచేస్తున్నది, ఆదాయ వ్యయాలు ఏమిటన్నవి బ్రహ్మరహస్యం. అప్పుడప్పుడు పీఎంవో ఈ ఫండ్ నుంచి ఇన్ని వేల కోట్లు ఫలానా అవసరానికి ఖర్చుచేశామని చెబుతుంటూంది అంతే.


ట్రస్టు చట్టబద్ధతను, సమాచార హక్కు పరిధిని తేల్చమంటూ దాఖలైన పిటిషన్లమీద న్యాయస్థానాలు ఇంకా మల్లగుల్లాలు పడుతున్నాయి. రతన్ టాటా వంటివారు వచ్చి చేరినందున ఈ ఫండ్ మీద విమర్శల తీవ్రత తగ్గవచ్చునేమో కానీ, దాని నిర్వహణ విధానంమీద ఉన్న ప్రశ్నలు ఆగిపోవు. ఈ నిధితో నాసిరకం మెడికల్ సామగ్రి కొన్నారన్న ఆరోపణలు కూడా గతంలో వచ్చాయి. ఈ ధర్మనిధికి చేరుతున్న సొమ్మంతా ధర్మబద్ధమైనదేనా అన్న వాదనలు అటుంచితే, అది ప్రైవేటు సొమ్మయినా, ప్రభుత్వ రంగసంస్థల ద్వారా చేకూరే ప్రజల సొమ్ము అయినా ప్రతీ రూపాయినీ సద్వినియోగం చేయాలి. అదొక ధర్మనిధి మాత్రమేననీ, ప్రభుత్వంతో సంబంధం లేదనీ న్యాయస్థానాల్లో వాదిస్తూ, లెక్కాపత్రం లేకుండా, ఎవరికీ జవాబు చెప్పనక్కరలేకుండా వ్యవహరించడం సరికాదు. కొత్తగా చేరిన ట్రస్టీలు కాస్తంత చొరవతీసుకొని పారదర్శకతనూ, జవాబుదారీతనాన్నీ పాటిస్తే ట్రస్టుకు మంచిపేరు వస్తుంది, తమ గౌరవమూ నిలబడుతుంది.

Read more