విజయ పరిమళం

ABN , First Publish Date - 2022-05-21T05:54:17+05:30 IST

ఖత్‌ జరీన్‌.. ఇప్పుడీ పేరు దేశమంతా మార్మోగిపోతోంది. ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో విజయఢంకా మోగించిన తెలుగు వనిత. ప్రపంచ టైటిల్‌ గెలిచిన ఐదో భారత బాక్సర్‌.

విజయ పరిమళం

ఖత్‌ జరీన్‌.. ఇప్పుడీ పేరు దేశమంతా మార్మోగిపోతోంది. ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో విజయఢంకా మోగించిన తెలుగు వనిత. ప్రపంచ టైటిల్‌ గెలిచిన ఐదో భారత బాక్సర్‌. నిఖత్‌ తొలిసారి ఆ మెగా ఈవెంట్‌లో స్వర్ణం గెలిచినా.. ఈ విజయం గురించి యావత్‌ భారతం ప్రత్యేకంగా చర్చించుకుంటోంది. ఆమె సాధారణ స్థాయి నుంచి ప్రపంచ ఛాంపియన్‌గా ఎదిగిన వైనం అందరినీ అబ్బురపరుస్తోంది. ఎన్నో అవరోధాలు, మరెన్నో అవమానాలు, సవాళ్లను అధిగమించి విశ్వవేదికపై త్రివర్ణపతాకాన్ని రెపరెపలాడించిన ఈ తెలంగాణ అమ్మాయి జీవితం యువ క్రీడా తరంగాలకు ఎంతో స్ఫూర్తిదాయకం.


బాక్సింగ్‌లో తలపడేందుకు అవసరమైన రింగ్‌ కూడా సరిగా లేని పట్టణం నుంచి వచ్చిన నిఖత్‌ తొలుత అథ్లెటిక్స్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. కానీ, తన పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడి సలహాతో పంచ్‌లు విసరడంపై మక్కువ పెంచుకుంది. బాక్సింగ్‌ అంటే అబ్బాయిలకేనా.. అమ్మాయిలు ఎందుకు ఆడరాదంటూ ఆ చిరుప్రాయంలోనే తండ్రిని ప్రశ్నించింది. ఆర్థిక వెసులుబాటు అంతంత మాత్రంగానే ఉన్న ఆ మైనారిటీ కుటుంబం నిఖత్‌ ప్రాక్టీస్‌ కోసం సొంతూరిని వదిలి హైదరాబాద్‌ వచ్చేసింది. తమ నలుగురు కూతుళ్లలో మూడో అమ్మాయి అయిన నిఖత్‌ కెరీర్‌ కోసం ఆ తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారు. ముఖంపై దెబ్బలు తగిలే ఆటలు అమ్మాయిలకు అవసరమా అంటూ చాలామంది హేళన చేసినా, వాటిని పట్టించుకోకుండా కుమార్తెను ప్రోత్సహించారు. ప్రాక్టీస్‌ సందర్భంగా రింగ్‌లో దెబ్బలు తగిలితే ఫిజియోథెరపిస్టులైన ఆమె ఇద్దరు సోదరీమణులు చికిత్స చేసేవారు. తనకోసం అడుగడుగునా అండగా నిలిచిన కుటుంబం త్యాగానికి ప్రతిఫలంగా.. నిఖత్‌ పట్టుదలగా కష్టపడి అనతికాలంలోనే ప్రొఫెషనల్‌ బాక్సర్‌గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. పద్నాలుగేళ్ల వయసులోనే జూనియర్‌ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి ఆనాడే సీనియర్‌ స్థాయిలో అతిపెద్ద విజయాన్ని అందుకునేందుకు బాటలు వేసుకుంది.


మూడేళ్ల క్రితం ప్రతిష్ఠాత్మక స్ర్టాంజా మెమోరియల్‌ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో 52 కిలోల ఫ్లయ్‌వెయిట్‌ విభాగంలో పసిడి పతకంతో పాటు ఆసియా ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని దక్కించుకుంది. ఈ క్రమంలోనే టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ తరఫున జట్టులో చోటుకోసం తన ఆరాధ్య క్రీడాకారిణి, దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌తో హక్కుల కోసం నిఖత్‌ పెద్ద పోరాటమే చేసింది. మేరీకోమ్‌ విభాగం నుంచే నిఖత్‌ కూడా పోటీపడాల్సి వచ్చింది. దీంతో ఎలాంటి ట్రయల్స్‌ లేకుండా సీనియర్‌ అన్న కారణంతో నేరుగా మేరీని విశ్వక్రీడల్లో ఆడించాలని జాతీయ బాక్సింగ్‌ సమాఖ్య ఏకపక్ష నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని నిఖత్‌ ప్రశ్నించింది. నిబంధనల ప్రకారం ఇద్దరికీ సెలెక్షన్‌ ట్రయల్స్‌ నిర్వహించి గెలిచిన వారికి టోక్యో ఎంట్రీ ఖరారు చేయాలని తన గొంతును వినిపించింది. కానీ తన ఆవేదనను ఎవరూ పట్టించుకోకపోవడంతో జాతీయ సమాఖ్యపై నేరుగా కేంద్ర క్రీడామంత్రికి లేఖ రూపంలో ఫిర్యాదు చేసి తెగువ చూపించింది. ఎట్టకేలకు నిఖత్‌ డిమాండ్‌కు తలొగ్గి ట్రయల్స్‌ నిర్వహిస్తే, ఆ బౌట్‌లో నిఖత్‌పై మేరీకోమ్‌ గెలిచింది. కానీ, ఓ జూనియర్‌ బాక్సర్‌ తన విషయంలో పోటీకి దిగడాన్ని సహించలేకపోయిన మేరీ.. బౌట్‌ ముగిశాక నిఖత్‌తో అమర్యాదగా ప్రవర్తించింది. నిఖత్‌ కరచాలనం కోసం ముందుకొచ్చినా చేయి కూడా ఇవ్వకుండా మేరీకోమ్‌ అక్కడి నుంచి కోపంతో వెళ్లిపోయింది. ఈ అవమానాలన్నింటినీ మౌనంగా భరించిన నిఖత్‌.. తన పంచ్‌తోనే అందరికీ సమాధానమివ్వాలని భావించింది. కసిగా ప్రాక్టీస్‌ చేసి మళ్లీ మునుపటి ఫామ్‌ను అందిపుచ్చుకుంది. వివిధ అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొని రాణించింది. ఈసారి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌నకు సన్నద్ధమైంది. రింగ్‌లో పోటీపడి అద్భుతమైన ప్రదర్శన కనబరచి దేశానికి వన్నె తెచ్చింది. ఏకంగా విశ్వవిజేతగా అవతరించింది. మూడేళ్ల క్రితం తన హక్కుల కోసం చేసిన పోరాటం తప్పు కాదని నిరూపించింది. ఈ అరుదైన విజయానికి నూరుశాతం అర్హురాలినని చాటి చెప్పింది. ప్రపంచ టైటిల్‌తో భారత బాక్సింగ్‌ను మరో మెట్టు పైకి తీసుకెళ్లిన నిఖత్‌ ఒలింపిక్‌ స్వర్ణ పతక కల నెరవేరాలని ఆశిద్దాం.


నిఖత్‌ జరీన్‌ విజయంతో ఇప్పుడు భారత క్రీడారంగ పురోగతిలో తెలుగు మహిళామణుల ముద్ర మరోసారి స్పష్టమైంది. టెన్నిస్‌లో సానియా మీర్జా, బ్యాడ్మింటన్‌లో సైనా, సింధు, క్రికెట్‌లో మిథాలీ రాజ్‌ ఎలాగైతే తమ ప్రత్యేకతను చాటుకున్నారో.. బాక్సింగ్‌లో నిఖత్‌ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.

Updated Date - 2022-05-21T05:54:17+05:30 IST