తెలుగు బుల్‌డోజర్లు

ABN , First Publish Date - 2022-06-21T06:40:11+05:30 IST

ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రశ్నించే గొంతుకల అణచివేతకు జేసీబీలను వినియోగించడాన్ని న్యాయమూర్తులనుంచి, సామాన్యుల వరకూ అందరూ...

తెలుగు బుల్‌డోజర్లు

ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రశ్నించే గొంతుకల అణచివేతకు జేసీబీలను వినియోగించడాన్ని న్యాయమూర్తులనుంచి, సామాన్యుల వరకూ అందరూ ప్రశ్నిస్తున్నారు. తమకు గిట్టనివారినీ, తమను నిలదీసినవారినీ అణచివేసేందుకు బుల్ డోజర్లను ప్రయోగించడం బీజేపీ నేతలకు అలవాటైపోయిందని విపక్షాలు విమర్శిస్తుంటాయి. ప్రత్యేకంగా దేశంలో ఒక వర్గానికి చెందినవారు తమకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పుకొనేందుకు వీల్లేకుండా చేయడానికే మోదీ ఆశీస్సులతో బుల్ డోజర్ బాబాలు, మామలు రెచ్చిపోతున్నారన్న విమర్శ తెలిసిందే. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలి పరిణామాలను గమనించిన తరువాత బీజేపీని ఈ విషయంలో నిలదీసే, తప్పుబట్టే అర్హత ఇక్కడి పాలకులకు లేదని అనిపిస్తున్నది.  


రాజకీయ ప్రత్యర్థులను వెంటాడి వేటాడి వేధించడంలో లబ్ధప్రతిష్ఠులైన ఆంధ్రప్రదేశ్ పాలకులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిని లక్ష్యంగా చేసుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున నాలుగుగంటలకు రెవిన్యూ అధికారులు జేసీబీలతో వచ్చి అయ్యన్న ఇంటిమీద పడ్డారు. దానికి వారు పెట్టిన పేరు ఆక్రమణల తొలగింపు. అయ్యన్న కుటుంబం నిద్రలో ఉండగానే అధికారులు ఇంటి ప్రహారీగోడ కూల్చివేత ఆరంభించారు. సకల అనుమతులతో ఇల్లుకట్టుకున్నామని అయ్యన్న కుటుంబీకులు చెబుతుంటే, పంటకాలువ గట్టు ఆక్రమించుకొని ఇల్లుకట్టుకున్నారని అధికారులు అంటున్నారు. శనివారం రాత్రి ఓ నోటీసు తెచ్చి గోడకు అంటించి, కొద్దిగంటల్లోనే జేసీబీలతో కూల్చివేతకు సిద్ధపడటం ఆశ్చర్యం. పన్నెండు మంది ఎస్సైలు, మూడువందలమంది కానిస్టేబుళ్ళ మోహరింపు, అయ్యన్నకు అండగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు తరలిరావడంతో అనేకగంటలపాటు ఈ తతంగం తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. ఈ దాడికి ముందు పట్టణంలో విద్యుత్ నిలిపివేశారని స్థానికులు చెబుతున్నారు. చిత్రవిచిత్రమైన పదజాలంతో, విరుపులతో అయ్యన్న పాత్రుడు చేస్తున్న ఘాటైన విమర్శలు ఏలికలకు నచ్చకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. తాజాగా మినీమహానాడులో ముఖ్యమంత్రి మీద చేసిన వ్యాఖ్యలతో ఆయ్యన్న మీద అధికారపక్ష పెద్దలు మరింత కక్షగట్టారనీ, జైల్లోకి నెట్టాలని ఉవ్విళ్ళూరుతున్నారనీ తెలుగుదేశం నేతలు అంటున్నారు. అర్థరాత్రి ఈ కూల్చివేతలేమిటంటూ ఈ చీకటి దాడిని రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టి, అధికారులను మందలించి, ఆ పని నిలిపివేసింది కూడా. అయ్యన్నపాత్రుడిమీద ఇప్పటికే జగన్ ప్రభుత్వం పన్నెండుకేసులు పెట్టింది. వాటిలో రేప్ కేసు కూడా ఉందట. ఈ వయసులో తనమీద ఈ కేసు పెట్టడం తనను మానసికంగా దెబ్బతీయడానికేనని అంటున్నారు ఆయన. తెలుగుదేశం పార్టీ నాయకులపైనా, వారి వ్యాపారాలపైనేకాక, బంధుత్వం ఉన్నవారి ఆస్తులపై కూడా విరుచుకుపడటం అధికారపక్షానికి ఆనవాయితీగా మారింది. 


నిర్మాణానికి ఉపకరించే బుల్ డోజర్లను విస్థాపనకు, విధ్వంసానికి వాడటం విచిత్రం, విషాదం. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రామవరం అటవీరేంజ్ పరిధిలోని ఆదివాసీ గూడాల్లో గుత్తికోయలను హద్దుల్లో ఉంచేందుకు ఇటీవల అధికారులు జేసీబీలు ప్రయోగించారు. వారు తమ పంటలవైపు పోకుండా అధికారులు జేసీబీలతో కందకాలు తవ్వేశారని సామాజిక కార్యకర్తల ఆరోపణ. నిజానికి గుత్తికోయల విషయంలో అధికారుల ఈ నిర్వాకం గతంలోని పలు దౌర్జన్యాలతో పోల్చితే చిన్నది. చత్తీస్‌గఢ్‌లో దశాబ్దంన్నర క్రితం మావోయిస్టులను నియంత్రించేందుకు సాల్వాజుడుం ఆరంభించడంతో రేగిన హింసను తట్టుకోలేక తెలుగురాష్ట్రాలకు పారిపోయివచ్చిన ఈ గుత్తికోయల స్థితిగతులు పరమదయనీయంగా ఉన్నాయి. ఎస్టీ గుర్తింపు కోల్పోవడమే కాక, తెలుగురాష్ట్రాలలో అటవీ, పోలీసు సిబ్బంది కాఠిన్యంతో ఈ ఆదివాసీ కుటుంబాలు నలిగిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కంటే తెలంగాణలో వీరి సంఖ్య ఎక్కువ. ఇక్కడి ఇరవైవేలమందిని నియంత్రించేందుకు అటవీ అధికారులు అడపాదడపా దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ఈ అంతరాష్ట్ర శరణార్థుల విషయంలో న్యాయస్థానాల ఆదేశాలను కూడా రాష్ట్ర పాలకులు గౌరవించడం లేదు. కనీస సౌకర్యాలు, హక్కులు లేకుండా అనుక్షణం భయంభయంగా బతుకుతున్న వీరి విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలసికట్టుగా వ్యవహరించి ఒక ప్రణాళికను అమలు చేయడం అవసరం.

Updated Date - 2022-06-21T06:40:11+05:30 IST