కమలానికి కళంకం

ABN , First Publish Date - 2022-04-16T08:24:56+05:30 IST

కర్ణాటక పంచాయితీరాజ్ మంత్రి ఈశ్వరప్ప శుక్రవారం రాజీనామా చేశారు. తన ఆత్మహత్యకు ఈశ్వరప్ప అవినీతి కారణమని ఒక యువకాంట్రాక్టర్ ప్రకటించిన నేపథ్యంలో అధికార బీజేపీ ప్రభుత్వ...

కమలానికి కళంకం

కర్ణాటక పంచాయితీరాజ్ మంత్రి ఈశ్వరప్ప శుక్రవారం రాజీనామా చేశారు. తన ఆత్మహత్యకు ఈశ్వరప్ప అవినీతి కారణమని ఒక యువకాంట్రాక్టర్ ప్రకటించిన నేపథ్యంలో అధికార బీజేపీ ప్రభుత్వ అవినీతిమీద అక్కడ తీవ్ర రచ్చరేగింది. దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వమని రాహుల్ గాంధీ కూడా ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. చేసిన పనికి నలభైశాతం కమిషన్ ఇవ్వమని ఈశ్వరప్ప వేధించాడని సంతోష్ పాటిల్ అనే కాంట్రాక్టర్ ప్రకటించి ఆత్మహత్య చేసుకున్న ఘటన, సచ్ఛీలతకు మారుపేరుగా చెప్పుకుంటున్న బీజేపీకి ఎదురుదెబ్బ.


ఇదంతా రాజకీయ కుట్రనీ, వెనుక ఎవరో ఉన్నారనీ రాజీనామా ముందు మంత్రిగారు ప్రకటించారు. మంత్రిగా ఉంటే విచారణలో వేలుపెట్టానన్న ఆరోపణలు వస్తాయి కనుక తప్పుకుంటున్నాననీ, త్వరలోనే కడిగిన ముత్యంలాగా తిరిగి వచ్చి కుర్చీలో కూచుంటానని ప్రకటించారు. ముఖ్యమంత్రి బొమ్మయ్ సహా పార్టీ పెద్దలంతా ఈశ్వరప్ప పక్కన నిలబడి, అవే మాటలను పునరుద్ఘాటిస్తూ ఘనంగా వీడ్కోలు పలికారు. అవినీతితోపాటు ఒక వ్యక్తిచావుకు కూడా కారకుడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రిపై దర్యాప్తుకు ముందే వీళ్ళంతా ఇలా తీర్పులు చెప్పేయడం విచిత్రం. పార్టీ కార్యకర్త కూడా అయిన ఆ కాంట్రాక్టరు తాను పూర్తిచేసిన ఒక పని మొత్తం ఖరీదులో నలభైశాతాన్ని మంత్రిగారు కమిషన్ గా అడగడం సహించలేక, ఈ విషయాన్ని బయటపెట్టిన తరువాత ఎదురైన వేధింపులు భరించలేక ఆత్మహత్యచేసుకున్నాడు. తనచావుకు సదరు మంత్రిగారే కారణమని ప్రకటించాడు. విధిలేక ఈశ్వరప్ప రాజీనామా చేసినప్పటికీ, ఆయనను నిర్దోషిగా బయటపడవేసేందుకు ఇప్పటినుంచే కుట్రలు జరుగుతున్నాయని కాంగ్రెస్ ఆరోపణ. ఎఫ్ఐఆర్ లో ఈశ్వరప్ప నలభైశాతం కమిషన్ అడిగినట్టూ, చెల్లించలేక పాటిల్ ఆత్మహత్యచేసుకున్నట్టు చేర్చాలనీ, ఆయననూ, సన్నిహితులనూ అరెస్టు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఈశ్వరప్ప విషయంలో ఏం చేయాలన్నది పోలీసులు చూసుకుంటారనీ, వారు స్వతంత్రంగా నిర్ణయిస్తారని ముఖ్యమంత్రి ప్రకటించారు. దీని అర్థం చట్టం తనపని తాను చేసుకుపోతుందని కాబోలు. ఈశ్వరప్ప ఉదంతం వెనుక ఏవో రాజకీయ కుట్రలున్నాయని కేంద్ర, రాష్ట్ర బీజేపీ నాయకులంతా బాధపడిపోతున్నారు కానీ, పాటిల్ ఆత్మహత్య ఘటనతో కర్ణాటక కాంట్రాక్టర్ల సంఘానికీ గొంతు పెగిలింది. పాటిల్ చెప్పినవన్నీ కఠినసత్యాలేనంటూ రాష్ట్రంలో ఎంతమంది మంత్రులు, ఎన్ని శాఖలు భారీ కమిషన్లు డిమాండ్ చేస్తున్నదీ సంఘం అధ్యక్షుడు కెంపన్న విలేకరుల సమావేశంలో కుండబద్దలు కొట్టేశారు. కర్ణాటకలో ఇంత అవినీతిమయమైన ప్రభుత్వం ఎన్నడూ లేదనీ, తమ ఆరోపణలకు బలమైన ఆధారాలున్నాయని అన్నారు. పరిస్థితిలో మార్పు రాకపోతే ప్రతీ మంత్రినీ, ఎమ్మెల్యేనూ బయటపెడతామనీ, వచ్చేనెల 25నుంచి ప్రభుత్వ పనులు ఆపేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశం తరువాత కొందరు మంత్రులు సంఘం అధ్యక్షుడిపై కేసులు పెడతామనీ, ఇకపై ఇటువంటివారికి కాంట్రాక్టులు ఇవ్వబోమనీ హెచ్చరించడం మరో విశేషం. ఈశ్వరప్ప మీద ఆరోపణలు చేస్తూ, నిలిచిపోయిన తన నాలుగుకోట్ల రూపాయల బిల్లులు దక్కేట్టు చూడాలని కాంట్రాక్టర్ పాటిల్ కేంద్ర గ్రామీణమంత్రికీ, ప్రధానికీ కూడా కొద్దివారాల క్రితం లేఖలు రాశాడు కూడా. ఇప్పుడు కాంట్రాక్టర్ల సంఘం కూడా రాష్ట్రాన్ని తక్షణం ప్రక్షాళించాల్సిన అవసరం ఉందంటూ ప్రధానికీ, రాష్ట్రపతికీ లేఖలు రాసింది. పాలకుల కరుణాకటాక్షాలపై ఆధారపడే కాంట్రాక్టర్లకు పాటిల్ మరణం ఆగ్రహంతో పాటు, భవిష్యత్ భయాన్ని కూడా కలిగించినట్టుంది. 


ఈశ్వరప్ప ప్రజాబలం, మాటకారితనం ఉన్న బలమైన నాయకుడు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తస్థాయినుంచి ఉపముఖ్యమంత్రి స్థానం వరకూ ఎదిగి, ఒకదశలో యెడ్యూరప్పను ఢీకొట్టి సీఎం స్థానానికి అర్హుడని అనిపించుకున్నవాడు. కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆవేదననూ, ఆరోపణలనూ బీజేపీ ఏదో ఒకస్థాయిలో పట్టించుకొని ఉంటే ఇంత అప్రదిష్టపాలయ్యేది కాదేమో. ఒకపక్కన ఏవేవో కేసుల్లో విపక్ష నేతలను ఈడీ గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తుంటే, సీబీఐ దాడులు చేస్తూంటుంది. మహారాష్ట్ర మంత్రులు, అధికారులు జైళ్ళలోకి పోతుంటారు. ఈశ్వరప్ప వ్యవహారంపైనా, అది వెలుగులోకి తెచ్చిన మొత్తం అవినీతిపైనా సర్వస్వతంత్ర న్యాయవిచారణ ఎందుకు జరపకూడదన్న విపక్షనేతల ప్రశ్నలో ఔచిత్యం ఉన్నది. బొమ్మైను కీలుబొమ్మగా కూచోబెట్టి కేంద్రపెద్దలే అంతాదోచుకుంటున్నారన్న విమర్శలను పూర్వపక్షం చేయాలంటే, ప్రక్షాళన సమూలంగా జరగాల్సిందే.

Updated Date - 2022-04-16T08:24:56+05:30 IST