బోజో పై తిరుగుబాటు

ABN , First Publish Date - 2022-07-07T06:56:33+05:30 IST

ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు, భారతీయ మూలాలున్న బ్రిటన్ ఆర్థికమంత్రి రిషీ సునక్‌తో ఆరంభమైన రాజీనామాల పర్వం మరింత వేగం పుంజుకుంది....

బోజో పై తిరుగుబాటు

ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు, భారతీయ మూలాలున్న బ్రిటన్ ఆర్థికమంత్రి రిషీ సునక్‌తో ఆరంభమైన రాజీనామాల పర్వం మరింత వేగం పుంజుకుంది. సునక్‌తో పాటు పాకిస్థాన్ మూలాలున్న మరోమంత్రి సాజిద్ జావేద్ కూడా రాజీనామా చేయడంతో ఈ రెండు స్థానాలను బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్(బోజో) మరో ఇద్దరితో భర్తీచేసుకున్నారు. కానీ, తమ రాజీనామాలు ఒక పెద్ద తిరుగుబాటుకు కారణమవుతాయని బహుశా వీరిద్దరూ ఊహించి ఉండరు. ఇప్పటివరకూ పాతికమందికి పైగా మంత్రులు, ఉన్నతస్థానాల్లోనివారూ రాజీనామాలు చేశారు. ఇంకా చాలామంది వరుసకడుతున్నట్టు బ్రిటన్ మీడియా అంటున్నది. ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ నాయకత్వం మీద తమకు నమ్మకం పోయిందనీ, నిత్యం ఆత్మవంచన చేసుకుంటూ ఆయన పక్షాన నిలిచేందుకు తమ మనసులు ఇక అంగీకరించడం లేదని వీరిద్దరూ తమ రాజీనామా లేఖల్లో ప్రకటించారు. దీనితో అగ్గిరాజుకొని, బోరిస్ తీరు నచ్చని వారంతా రాజీనామాలు చేస్తున్నారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఉన్నతపదవి కట్టబెట్టిన పాపం బోరిస్‌ను ఇలా వెంటాడుతున్నది. ఆరునూరైనా తప్పుకొనేది లేదని ప్రకటించిన ఆయన కచ్చితంగా లొంగిరావాల్సిన పరిస్థితులు విస్పష్టంగా కనిపిస్తున్నాయి. 


బోరిస్ ఏ కారణంగానైనా దిగిపోవాల్సి వస్తే రిషీ సునక్ ప్రధాని కావచ్చునని గతంలో బ్రిటిష్ మీడియా విశ్లేషించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయనే తప్పుకోవాల్సి వచ్చినా, ఎంతోకాలంగా గబ్బుపట్టిన ఓ వ్యవస్థను ప్రక్షాళించేందుకు సునక్ ముందడుగు ఉపకరిస్తుందని తోటివారంతా మెచ్చుకుంటున్నారు. ప్రజలు ఆశిస్తున్న రీతిలో ప్రభుత్వం సక్రమంగా, సమర్థంగా పనిచేయడం లేదనీ, ప్రజల ప్రయోజనాల దృష్టితో పాలన సాగడం లేదని సునక్ ఆరోపించి రాజీనామా చేసిన పదినిముషాల్లోనే జావీద్ కూడా మంత్రివర్గం నుంచి వైదొలిగారు. ఇక, మీ పాపాల్నీ, తప్పుల్నీ వెనకేసుకురాలేమని వారు ఆ లేఖల్లో తేల్చేశారు. పార్టీలో ఏర్పడిన ఈ సంక్షోభం నేపథ్యంలో, బోరిస్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నవారి సంఖ్య వేగంగా హెచ్చుతున్నది. పార్టీ చీఫ్ విప్ సహా చాలామంది మంత్రులు ఆయనను వెంటనే కుర్చీ దిగిపోమని కోరుతున్నారు. రిషీ సునక్ స్థానంలో ఇరవైనాలుగు గంటల క్రితమే ఆర్థికమంత్రి అయిన నదీమ్ జహావీ కూడా వారిలో ఒకరు. 


బోరిస్ చేజేతులా తెచ్చుకున్న కొత్త ఉపద్రవం ఇది. తనకు అత్యంత సన్నిహితుడైన మాజీ ఎంపీ క్రిస్ పించర్ మీద లైంగికవేధింపుల ఆరోపణలు ఎన్ని ఉన్నప్పటికీ లక్ష్యపెట్టకుండా అతగాడికి పదవి కట్టబెట్టడం ఈ తిరుగుబాటుకు ప్రధాన కారణం. అతడిని పార్టీ డిప్యూటీ హెడ్‌గా బోరిస్ నియమించినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. కానీ, పించర్ విషయంలో బోరిస్ చిలుకపలుకులనే ఆయన తోటివారూ వల్లిస్తూ కాలం నెట్టుకొచ్చారు. కానీ, ఇటీవల పించర్ మీద మీడియా ద్వారా కొత్త ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అతగాడి వైఖరి గురించి తనకు ముందుగా తెలియదనీ ఇప్పుడే తెలిసిందనీ బోరిస్ దబాయించారు. ఆ తరువాత, వేధింపులూ నిజమే, ఆ వ్యక్తి వ్యవహారశైలి బోరిస్‌కు ముందే తెలిసిన మాటా నిజమేనని నిర్ధారణ అయింది. పించర్ సస్పెండ్ అయ్యాడు. బోరిస్ నిజం ఒప్పుకొని క్షమాపణలు కోరవలసి వచ్చింది. ఈ పరిణామం ప్రభుత్వం పరువుతీసి, బోరిస్‌ను మరోమారు అబద్ధాలకోరుగా ప్రజల ముందు నిలబెట్టింది. కరోనాకాలంలో జనం అష్టకష్టాలు పడుతుంటే, బోరిస్ పలుమార్లు మందుపార్టీ చేసుకుని కొవిడ్ నిబంధనలు నిర్లజ్జగా ఉల్లంఘించిన ‘పార్టీగేట్’ వ్యవహారం తెలిసిందే. ఆ ఉపద్రవం పూర్తిగా చల్లారకముందే ఈ కొత్త కుట్ర బయటపడింది.  


ప్రజలు నన్ను అద్భుతమైన మెజారిటీతో అధికారంలో కూచోబెట్టారు కనుక, ఎన్ని అవాంతరాలు వచ్చినా తప్పుకొనేది లేదని బోరిస్ అంటున్నారు. మధ్యంతర ఎన్నికలంటూ ఉండవు, అసలు ఎన్నికలు జరిగేది రెండేళ్ళ తరువాతే అని ఆయన తేల్చేశారు. సాంకేతికంగా చూస్తే ఆయనమీద అవిశ్వాసం పెట్టడం ఇప్పట్లో కుదరదు కానీ, అవసరమైతే పార్టీ నియమాలు సవరించి ఆయనను దింపేందుకు కొందరు సిద్ధపడుతున్నారు. జరిగిందేదో జరిగిపోయింది, ఈసారికి వదిలేయండని ఆయన అంటున్నప్పటికీ జరగాల్సింది చాలా ఉందని అనేకుల అభిప్రాయం. గతంలో మార్గరేట్ థాచర్ లాగా ఈయన తనకు తానుగా తప్పుకుంటే కాస్తంత గౌరవమైనా మిగులుతుందేమో!

Updated Date - 2022-07-07T06:56:33+05:30 IST