కొత్త యంత్రం!

ABN , First Publish Date - 2022-12-31T01:21:02+05:30 IST

దేశంలో ఎక్కడనుంచైనా ఓటరు ఓటుహక్కు వినియోగించుకోవడానికి తోడ్పడే రిమోట్‌ ఓటింగ్‌ మిషన్‌ (ఆర్‌వీఎం)ను ఎన్నికల సంఘం సిద్ధం చేస్తున్నందుకు మెచ్చుకోవాల్సిందే.

కొత్త యంత్రం!

దేశంలో ఎక్కడనుంచైనా ఓటరు ఓటుహక్కు వినియోగించుకోవడానికి తోడ్పడే రిమోట్‌ ఓటింగ్‌ మిషన్‌ (ఆర్‌వీఎం)ను ఎన్నికల సంఘం సిద్ధం చేస్తున్నందుకు మెచ్చుకోవాల్సిందే. ఉపాధికోసం నగరాలకు, పట్టణాలకు తరలిపోయే కార్మికశక్తి అత్యధికంగా ఉన్న దేశం కనుక ఇటువంటి పరికరాలు మనకు మరీ అవసరం. ఉన్నచోటనే ఉపాధిపొందగలిగే అవకాశాలు లేక, లక్షలసంఖ్యలో వలసపోయే ఉత్తరాది కార్మికులకు ఇటువంటి మిషన్‌ అందుబాటులోకి వస్తే, దక్షిణాదిలో ఉంటూ కూడా వారు తమకు నచ్చిన పార్టీకి ఓటువేసుకోవచ్చు. దేశంలో దాదాపు మూడోవంతుమంది ఓటర్లు దూరాభారం కారణం వల్లనే ఓటుహక్కు వినియోగించుకోలేకపోతున్నారని గుర్తించిన ఎన్నికల సంఘం, ఈ యంత్రాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఆ లోటును కొంతమేరకైనా తీర్చాలని తపిస్తున్నది. కచ్చితంగా తమ ఓటర్లేనని అనుకున్నవారు ఎక్కడెక్కడున్నా గుర్తించి బస్సుల్లోనూ, రైళ్ళలోనూ రప్పించి, అన్నపానీయాల ఖర్చుకూడా భరించి ఓట్లు వేయించుకోవాల్సివస్తున్న రాజకీయపార్టీలకు ఇకపై అంత శ్రమ కూడా ఉండకపోవచ్చు.

దీనిపనితీరును ప్రదర్శించి, రాజకీయపార్టీల అభిప్రాయాలను తెలుసుకొనేందుకు జనవరి 16న ఈసీ సమావేశం ఏర్పాటు చేసింది. గత సార్వత్రక ఎన్నికల్లో ముప్పైకోట్లమంది ఓటువేయలేకపోవడానికి ఇటువంటి పరికరం అందుబాటులో లేకపోవడం ఒక్కటే కారణమని చెప్పలేం కానీ, ఎన్నికల సంఘం మాత్రం ఈ లెక్కలను తన కొత్త ఆవిష్కరణకు ఒక ప్రధానకారణంగా చూపుతోంది. అడ్డంకులన్నీ అధిగమించి ఆర్‌విఎం ఆచరణలోకి వస్తే, ఒకేచోటనుంచి డెబ్బయ్‌రెండు నియోజకవర్గాల్లో ఓటుహక్కును వినియోగించుకొనేలా మిషన్‌ రూపొందినందున ఓటింగ్‌కు అవకాశం హెచ్చుతుంది, ఓటింగ్‌ శాతమూ మెరుగుపడవచ్చు. ఇది మంచిమార్పు అని మాజీ ఎన్నికల కమిషనర్‌ ఖురేషీవంటివారు మెచ్చుకుంటూ ఉంటే, కాంగ్రెస్‌ మాత్రం పెదవివిరిస్తోంది. ఇటీవల గుజరాత్‌ ఎన్నికల్లో పోలింగ్‌ గడువు ముగిసిన తరువాత కూడా భారీ ఓటింగ్‌ జరిగిన ఉదంతాన్ని ఆ పార్టీ ఇంకా మరిచిపోయినట్టు లేదు. గుజరాత్‌ ఎన్నికల్లో సాయంత్రం ఐదుతరువాత పదమూడుశాతం ఓట్లు నమోదుకావడంమీద విపక్షాలు అనుమానాలు వ్యక్తంచేస్తే, అప్పటికే క్యూలో ఉన్నవారిని సమయం దాటిన తరువాత కూడా అనుమతించడం సంప్రదాయమే కదా అని ఈసీ జవాబిచ్చింది. కానీ, కనీసం పాతిక నియోజకవర్గాల్లో ముప్పైనుంచి ముప్పైఐదువేల ఓట్లు ఈవీఎంలలో అతివేగంగా నమోదయ్యాయనీ, ఇవి అప్పటికే క్యూలో ఉన్నవారికంటే అధికమనీ ఆ పార్టీ వాదన. ఈవీఎంలో ఒక ఓటునమోదుకు పన్నెండు సెకన్లు పట్టాల్సి ఉండగా, మూడుసెకన్లకో ఓటుపడిందని కాంగ్రెస్‌ లెక్కచెప్పింది. ఈ కారణంగానే, కొత్త ఆర్‌విఎం వార్తను ఆస్వాదించాల్సింది పోయి, అధికారపార్టీ ఎన్నికల అక్రమాలను బహుళ నియోజకవర్గాలకు విస్తరించాలని అనుకుంటున్నదా? అని దెప్పిపొడుస్తున్నట్టుంది. ఎన్నికల వ్యవస్థమీద ప్రజలకున్న విశ్వాసాన్ని ఈ కొత్త మిషిన్‌ దెబ్బతీస్తుందని ఆ పార్టీ ఆరోపణ.

ఇప్పటికే ఈవీఎంల దుర్వినియోగంమీద విపక్షాలకు చాలా అనుమానాలున్నందున, కొత్త రిమోట్‌ ఓటింగ్‌ మిషిన్‌ మీద అవి విమర్శలు చేయడం సహజం. ఈ నమూనా యంత్రానికి తాము ఆమోదముద్రవేయడానికి ముందే ఈవీఎంల మీద తమకున్న అనుమానాలను తొలగించాలని అవి డిమాండ్‌ చేస్తున్నాయి. ఓడిపోతున్న పార్టీలన్నీ ఈవీఎంలను ఆడిపోసుకోవడం అనాదిగా ఉన్నదేకానీ, గతంలో ఈవీఎంలను ట్యాంపర్‌ చేయవచ్చుననీ, హార్డవేర్‌ మార్చవచ్చుననీ నిరూపించినవారు లేకపోలేదు. ఈవీఎంలను ఎలా హ్యాక్‌ చేయవచ్చునో చెబుతూ, అధికారపక్షం ఒక అస్మదీయ కమ్యూనికేషన్‌ సంస్థతో కలిసి ఇవీఎంల పనితీరు మార్చేసిందని మూడేళ్ళక్రితం ఒక సాంకేతిక నిపుణుడు లండన్‌ మీడియా సమావేశంలో ఆరోపించారు కూడా. ఇక దాదాపు పాతికలక్షల ఈవీఎంలు మాయమైపోయిన విషయంమీద ఇప్పటికీ విమర్శలు వస్తున్నా, పార్లమెంటులో కొందరు సమగ్రవివరాలతో ప్రశ్నించినా ఎన్నికల సంఘం మాట్లాడటం లేదు. ఇవన్నీ దుర్వినియోగమవుతున్నాయనీ, ఒకే పార్టీ ఆ పనిచేస్తున్నదనీ, అది తనకు మద్దతునిచ్చే ప్రాంతీయపార్టీలకు అసెంబ్లీ ఎన్నికల్లో అందించి క్విడ్‌ప్రోకోకు పాల్పడుతున్నదన్న రాజకీయ విమర్శలకు ఏ మాత్రం విలువనివ్వనక్కరలేదు కానీ, ఈవీఎంల పనితీరు, సంఖ్య విషయంలో ఇప్పటికీ కొనసాగుతున్న అనుమానాలను నివృత్తిచేయాల్సిన బాధ్యత ఈసీపై ఉన్నది. అది జరిగినప్పుడు అప్పుడు ప్రజలు కూడా కొత్త ఆర్‌వీఎంమీద రాజకీయపక్షాలు వెలిబుచ్చే అభ్యంతరాలు, విమర్శలకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలన్న ఎన్నికల సంఘం సదాశయంలో ఉత్సాహంగా భాగస్వాములవుతారు.

Updated Date - 2022-12-31T01:21:02+05:30 IST

Read more