జగన్‌ నయవంచన

ABN , First Publish Date - 2022-09-15T10:36:52+05:30 IST

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయి ఈ ఏడాది జూన్ రెండవతేదీనాటికి ఎనిమిదేళ్ళు దాటింది. విభజన చట్టం ప్రకారం, అంతా అనుకున్నట్టుగా సవ్యంగా జరిగివుంటే...

జగన్‌ నయవంచన

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయి ఈ ఏడాది జూన్ రెండవతేదీనాటికి ఎనిమిదేళ్ళు దాటింది. విభజన చట్టం ప్రకారం, అంతా అనుకున్నట్టుగా సవ్యంగా జరిగివుంటే, హైదరాబాద్ కోల్పోయి రాజధాని అంటూ లేకుండా మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్ ఈపాటికే నూతన రాజధాని ఏర్పాటు చేసుకొని, పాలన నల్లేరుమీద బండిలాగా పరుగులు తీస్తూవుండేది. కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే రాజధాని అంశం తీవ్ర సంక్షోభంలోనూ, రాజకీయ న్యాయపరమైన వివాదాల్లోనూ మునిగిపోయింది. మాట తప్పను మడమ తిప్పనని గొప్పలు చెప్పుకొనే జగన్మోహన్ రెడ్డి, నిండు సభలో తాను అమరావతి పక్షాన ఇచ్చిన హామీని వమ్ముచేస్తూ, మూడు రాజధానులంటూ ఓ కొత్త వాదన తెరమీదకు తెచ్చారు. చంద్రబాబుమీద వ్యక్తిగత వైరంతో ఆయన ప్రాణప్రతిష్ఠ చేసిన అమరావతిని దుంపనాశనం చేసే కుట్రకు పాల్పడ్డారు. మూడురాజధానులపై వివాదాస్పద చట్టాలు చేయడంతోనూ, హైకోర్టులో వ్యాజ్యాలతోనూ మరికొంత విలువైన కాలం గడిచిపోయింది. ఆ తరువాత హైకోర్టు వాటిని కొట్టివేస్తుందన్న భయంతో ఆఖరునిముషంలో ఉపసంహరించుకొని అతితెలివి ప్రదర్శించింది. అయినా, న్యాయస్థానం వేలాది ఎకరాలు ధారాదత్తం చేసిన రైతుల పక్షాన నిలిచి రాజధానిగా అమరావతినే కొనసాగించాలని విస్పష్టంగా తీర్పుచెప్పి ఇప్పటికి ఆర్నెల్లయింది. ఒకపక్క ఆ తీర్పును గౌరవిస్తున్నట్టుగా నాటకాలు సాగిస్తూనే, మరోపక్క తమ మూడుముక్కలాటలో మార్పులేదని అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీవ్రమైన అన్యాయం, తరతరాలకు తీరని ద్రోహం చేస్తున్నది జగన్ ప్రభుత్వం. 


ఆగస్టు పదిహేను ప్రసంగంలో జగన్ పరోక్షంగా మూడురాజధానుల ప్రస్తావన చేయడంతో ఆయన భజనబృందం మళ్ళీ రెచ్చిపోతున్నది. అమరావతి రైతుల అరసవిల్లి యాత్రను అడ్డుకుంటామని ఒకరంటారు. త్వరలోనే రాజధానిని తరలించేస్తామని ఇంకొకరు అదే పాట పాడుతూంటారు. 2024 ఎన్నికలు మూడు రాజధానులకు రెఫరెండమ్ అని బాహాటంగానే చెబుతున్న నేపథ్యంలో అధికారపక్షం వ్యూహం అర్థం చేసుకోవడం పెద్ద కష్టం కాదు. ఇప్పటికే చీలి, చిక్కిన రాష్ట్రంలో మరో రెండేళ్ళపాటు రాజధాని అంశాన్ని అలాగే రగిలిస్తూ ప్రాంతాలవారీగా విషం పోసి, విద్వేషాలు రెచ్చగొట్టి, ఎన్నికల్లో లబ్ధిపొందాలన్నది వీరి లక్ష్యం. ఈ మూడేళ్ళకాలంలో, అమరావతి ఎలాగూ చట్టుబండలైంది సరే, కర్నూలు ఎంత బాగుపడిందో, విశాఖ ఎంత వెలిగిందో తెలియనిదేమీ కాదు. విశాఖలో అత్యంత విలువైన ప్రభుత్వ భూములను అమ్మేయడం, మిగతావాటిని అధికారపక్ష నాయకులు కబ్జాచేయడం తప్ప ఉత్తరాంధ్రకు జరిగిన మేలంటూ ఏమీ లేదు. అమరావతి విషయంలో జగన్ ప్రభుత్వం ద్రోహాన్ని చూస్తున్నవారికి మూడురాజధానుల మాయ అర్థంకాకుండా పోదు. 


రాజధానిగా అమరావతిని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించినప్పుడు, ఆ నిర్ణయంలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా భాగస్వామి. దీనిని శిరసావహిస్తున్నానని ప్రకటించిన జగన్, ఆ తరువాత శాసనసభ ఎన్నికల ప్రచారంలో కూడా అమరావతికి వ్యతిరేకంగా పల్లెత్తుమాట అనలేదు. తాను అధికారంలోకి వస్తే, మూడురాజధానులు తెస్తానని అప్పుడే చెప్పివుంటే, 2024 ఎన్నికలేం ఖర్మ, 2019 ఎన్నికలే రెఫరెండమ్ అయివుండేవి. రాజధాని ఒక ప్రధానాంశంగా, కొత్త రాష్ట్రం మనుగడను, భవితవ్యాన్ని నిర్దేశించే కీలకాంశంగా ఉన్నప్పుడు దాని ఊసెత్తకుండా, ప్రజలను నమ్మించి మోసగించి అధికారంలోకి వచ్చినవారు, సగం పూర్తయిన అమరావతినే రాజధానిగా కొనసాగించాలని అడుగుతున్నవారినీ, అందుకోసం పోరాడుతున్నవారినీ అవమానిస్తున్నారు. అమరావతినే కొనసాగించాలనీ, ఆర్నెల్లలో రైతులకు న్యాయంచేయాలని ఆదేశించిన న్యాయస్థానాన్ని అడుగడుగునా వంచిస్తున్నారు. అమరావతిని సమస్యల సుడిగుండంలో మరింత ముంచే నిర్ణయాలు చేపడుతున్నారు. మూడురాజధానుల ప్రతిపాదనను అధికార వైసీపీ తప్ప అన్ని పార్టీలూ వ్యతిరేకిస్తున్నాయి. బీజేపీ బహుళ నాల్కలతో వ్యవహరిస్తూ, అమరావతి పక్షాన నిలిచినట్టుగా నామమాత్రపు యాత్రలతో నటిస్తున్నది. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్ళయినా ఇంకా అమరావతి విషయంలో అనిశ్చితి కొనసాగడం సరికాదు. ఈ మొత్తం వ్యవహారంలో కేంద్రం అసలు దోషి. అది తలచుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని నాటకానికి క్షణాల్లో తెరదించగలదు. అది వెంటనే ఆ కర్తవ్యానికి పూనుకొని ఆంధ్రపదేశ్ ప్రజలకు మేలు చేస్తుందని ఆశిద్దాం.

Updated Date - 2022-09-15T10:36:52+05:30 IST