మరింత సంక్షోభంలోకి..!

ABN , First Publish Date - 2022-11-05T01:20:04+05:30 IST

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మీద జరిగిన హత్యాయత్నం అక్కడి ఘర్షణపూరితమైన రాజకీయాల్లో మరింత అగ్గిరాజేస్తుందనడంలో...

మరింత సంక్షోభంలోకి..!

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మీద జరిగిన హత్యాయత్నం అక్కడి ఘర్షణపూరితమైన రాజకీయాల్లో మరింత అగ్గిరాజేస్తుందనడంలో సందేహం లేదు. ఆయన పార్టీ ఏలుబడిలోనే ఉన్న పంజాబ్ ప్రావిన్స్‌లో, ఆయన స్వంత నియోజకవర్గ పరిధిలోని వజీరాబాద్‌లో గురువారం జరిగిన కాల్పుల ఘటనలో గాయపడిన ఇమ్రాన్ ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. కాలికి కట్టుతో ఆస్పత్రినుంచి చేసిన ప్రసంగంలో నాలుగుబుల్లెట్లు తన రెండు కాళ్ళలోకి దూసుకుపోయాయని, హత్యకు కుట్ర జరుగుతున్నట్టుగా తనకు ముందే తెలుసునని ఆయన ప్రకటించారు. గుట్టుచప్పుడు కాకుండా తనను మట్టుబెట్టే ఓ కుట్రకు సంబంధించిన వీడియో ఆధారాన్ని కూడా త్వరలోనే బయటపెడతానని ఆయన ప్రకటించారు. తనమీద దాడికి పాకిస్థాన్ ప్రధాని, హోంమంత్రి, ఐఎస్ఐ అధినేతలు కారకులని ఆరోపించారు. హత్యకు పాల్పడిన వ్యక్తి ప్రొఫెషనల్ కిల్లర్ ఏమీ కాదు. ఇమ్రాన్ దైవదూషణకు పాల్పడుతున్నాడనీ, అందుకే చంపాలనుకున్నానని నిందితుడు చెప్పాడు. తనను మతద్రోహిగా ముద్రవేయడం ద్వారా తన ప్రాణాలకు నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం ప్రమాదం తెచ్చిపెడుతున్నదని ఇమ్రాన్ వాదిస్తున్న నేపథ్యంలో, ఈ ఘటన జరిగినందున, నిందితుడికి ఒక మతఛాందస సంస్థతో అనుబంధం కూడా ఉన్నందున ఆయన వాదనకు ఊతం దక్కినట్టే. కానీ, ఆ వీడియో విడుదల చేసినందుకు పంజాబ్ ప్రభుత్వం సీనియర్ పోలీసు అధికారులను సైతం సస్పెండ్ చేసి, దర్యాప్తుకు ఆదేశించింది. ఈ హత్య వెనుక చాలామంది పెద్దలున్నారనీ, భయంకరమైన కుట్ర ఉన్నదనీ వాదిస్తున్నప్పుడు ఇది బయటకు రావడం పెద్దగా మేలుచేయదని అక్కడి ముఖ్యమంత్రి భావించి ఉండవచ్చు. ఇమ్రాన్‌కు భద్రత కల్పించాల్సిన పంజాబ్ ప్రభుత్వమే తమ మీద ఎదురుదాడి చేస్తున్నదని, కేంద్ర, రాష్ట్రాల సంయుక్త దర్యాప్తు జరగాలని హోంమంత్రి అంటున్నారు. ఈ పరస్పర ఆరోపణలు అటుంచితే, ఈ ఘటనతో ఇమ్రాన్‌కు రాజకీయంగా మేలు జరుగుతుందని ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో షరీఫ్‌లూ భుట్టోలూ ఒక్కటై ఇమ్రాన్‌ను విశ్వాసపరీక్షలో ఓడించిన తరువాత, తాను పదవి కోల్పోవడానికి అమెరికా కారణమని ఆయన నిందించిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఆయన తక్షణ ఎన్నికలు డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ర్యాలీలు జనంతో కిటకిటలాడిపోతున్నాయి. ఈ సభల్లో ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను, మిలటరీనే కాక, గతంలో ఎవరూ చేయనివిధంగా ఐఎస్ఐని తీవ్రంగా విమర్శించడం విశేషం. ఆయన దెబ్బకు దేశచరిత్రలో తొలిసారిగా ఇటీవల ఐఎస్ఐ చీఫ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆరోపణలను ఖండించాల్సి వచ్చింది. ఆర్మీనీ, ఐఎస్ఐని ఆత్మరక్షణలోకి నెట్టేస్తున్న ఇమ్రాన్ ఎన్నికలరంగంలోనూ తనను రుజువు చేసుకుంటున్నారు. అవిశ్వాసంలో ఓడిపోయిన తరువాత పార్టీ ఎంపీలందరితో రాజీనామాలు చేయించి ఆయా స్థానాలకు తిరిగి ఎన్నికలు నిర్వహించవలసిన పరిస్థితిని సృష్టించారు. ఇటీవలే ఒకేమారు ఆరుస్థానాల్లో తానే నిలిచి గెలిచి తన ప్రజాభిమానానికి ఎదురులేదని నిరూపించారు. అధికారపక్షం ఫిర్యాదు మేరకు, ఎన్నికల సంఘం ‘తోషా ఖానా’ వ్యవహారంలో తనను ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించడంతో సుప్రీంకోర్టులో పోరాడుతున్నారు. సత్వర ఎన్నికలు డిమాండ్ చేస్తూ సాగిస్తున్న యాత్రకు స్వల్పవిరామం ఇచ్చి, ఇటీవలే తిరిగి దానిని ఆరంభించిన వెంటనే ఇమ్రాన్‌పై ఈ దాడి జరిగింది. ఈ నెలాఖరులో ఆర్మీచీఫ్ బాజ్వా రిటైరవబోతున్నారు. ఆర్మీలో విభేదాల వల్ల, ఆయన స్థానంలో ఎవరిని కూచోబెట్టాలన్న విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతున్నది. ఇటీవల బాజ్వా అమెరికా సందర్శించినప్పుడు ఆయన సైనిక పాలనకు వీలుగా పావులు కదుపుతున్నారని విమర్శలు వచ్చాయి. సైన్యంతో ప్రత్యక్ష ఘర్షణకు దిగినందువల్ల పదవికోల్పోవలసి వచ్చిన ఇమ్రాన్ బాజ్వాతో రాజీయత్నాలు కొనసాగిస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. సైన్యం ఇమ్రాన్ తో రాజీపడుతుందా, ఇమ్రాన్ ఒత్తిడి మేరకు సత్వర ఎన్నికలు జరుగుతాయా అన్న విషయాలు అటుంచితే, ఇరవైశాతం ద్రవ్యోల్బణంతో ఆర్థిక కష్టాల్లో పీకలోతుగా ఉన్న పాకిస్థాన్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆ దేశాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి.

Updated Date - 2022-11-05T01:20:28+05:30 IST

Read more