నిర్ఘాంతపరచిన నిర్ణయం

ABN , First Publish Date - 2022-09-24T07:08:12+05:30 IST

భారతదేశంలో తొలి ఆరోగ్య విశ్వవిద్యాలయం విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం. దేశానికి గర్వకారణమైన ఈ విశ్వవిద్యాలయం..

నిర్ఘాంతపరచిన నిర్ణయం

భారతదేశంలో తొలి ఆరోగ్య విశ్వవిద్యాలయం విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం. దేశానికి గర్వకారణమైన ఈ విశ్వవిద్యాలయం పేరును హఠాత్తుగా ఎందుకు మార్చవలసి వచ్చిందో అంతుపట్టని విషయం. ఆన్‌ లైన్‌ లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏర్పాటుచేసి మరీ ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్ఆర్ పేరును ఏకపక్షంగా ఖరారు చేయడం తీవ్ర విస్మయానికి గురిచేస్తున్నది.

విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లాను ఏర్పాటు చేస్తున్నప్పుడు కృష్ణా జిల్లా పరిధిలో ఉన్న ఎన్టీఆర్ నివాస ప్రాంతానికి ఎన్టీఆర్ జిల్లా పేరు పెడితే బాగుంటుందని కొంతమంది మేధావులు ప్రభుత్వానికి సూచించారు. కానీ ప్రభుత్వం ఎన్టీఆర్ నివసించిన ప్రాంతాన్ని కృష్ణాజిల్లాగానే ఉంచి, విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లాను తన మొండి వైఖరితో బలవంతంగా నిర్ణయించింది. ఇప్పుడు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు తీసేసి వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం అని ఎందుకు మార్చారో అర్థం కాదు. ఇటీవల విజయవాడలోని ‘తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం’ ఆడిటోరియం పేరును కూడా కుదించేసి ‘కళాక్షేత్రం’గా ప్రభుత్వం మార్చి వేసింది. దాత పుణ్యమాని ఏర్పడిన ఈ కళావేదిక పేరుని కుదించడాన్ని మానుకోవాలని ప్రభుత్వానికి అనేకమంది విన్నవించారు. అయినా ప్రభుత్వం తీరు మారలేదు. ఇప్పుడు ఏకంగా ఒక ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును మార్చడం తీవ్రాతి తీవ్రమైన విషయం.

గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే... అప్పటి ప్రతిపక్ష నేతగా ఉండి సమర్ధించినవాడు, నేడు పాలకపక్షంలోకి వచ్చేసరికి మూడు రాజధానులు అంటూ మారుస్తూ ఉంటే.... భవిష్యత్తులో మరొక పార్టీ అధికారంలోకి వస్తే దానిని ఎన్ని రాజధానులు చేస్తామంటారో అన్నది భయం కలిగిస్తోంది. ప్రతి ఒక్క తెలుగువాడు ఇటువంటి విషయాలపై మనసులో మధనపడకుండా బహిరంగంగా వ్యతిరేకత వ్యక్తం చేయాలి. అధికారపక్షం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రతిపక్షం కూడా తమకు సమ్మతమైతేనే అది చట్టం అవుతుంది. దాన్ని మళ్ళీ మార్చడం అన్నది ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు. ఈ మాత్రం ఇంగితజ్ఞానం కూడా లేని అయోమయ స్థితిలో నేటి ప్రభుత్వాలు ఉండటం దురదృష్టకరం.

– చలపాక ప్రకాష్

Read more