కాంగ్రెస్‌ కష్టాలు

ABN , First Publish Date - 2022-04-29T09:05:09+05:30 IST

మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కమల్‌నాథ్ అసెంబ్లీలో విపక్షనాయకుడి హోదానుంచి గురువారం తప్పుకున్నారు. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) నాయకత్వానికి ఆయన చేసిన రాజీనామాను...

కాంగ్రెస్‌ కష్టాలు

మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కమల్‌నాథ్ అసెంబ్లీలో విపక్షనాయకుడి హోదానుంచి గురువారం తప్పుకున్నారు. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) నాయకత్వానికి ఆయన చేసిన రాజీనామాను అధిష్ఠానం ఆమోదించి, ఏడుపర్యాయాలు ఎమ్మెల్యేగా నెగ్గిన గోవింద్ సింగ్‌ను ఆ స్థానంలో నియమించింది. కమల్‌నాథ్ ఇకపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎంపీసీసీ) అధ్యక్షుడిగా ఒక పదవిలోనే కొనసాగుతారు. వచ్చే ఏడాది ఎన్నికలకు పోబోతున్న రాష్ట్రంలో పార్టీని పరుగులెత్తించేందుకు ఒక వ్యక్తి చేతిలో ఒకే పదవి ఉండటం ఉపకరిస్తుందని అంటున్నారు.


ఎన్నికలు సమీపిస్తున్నందున రాష్ట్ర పార్టీ సారధిగా మాత్రమే కొనసాగుతాననీ, మరొకటి వదిలేస్తానని రెండునెలలక్రితమే ఆయన సోనియాగాంధీని అనుమతి అడిగితే, ఇప్పుడు సరేనన్నారట. కొత్త సీఎల్పీ నాయకుడు కూడా కమల్ నాథ్ మనిషేననీ, రాష్ట్ర కాంగ్రెస్ లో మరికొన్ని మార్పులు జరగబోతున్నాయనీ అంటున్నారు. కమల్ నాథ్ అధిష్ఠానానికి విశ్వాసపాత్రుడనీ, గాంధీలకూ, జి 23 అనే పార్టీ అంతర్గత తిరుగుబాటు దారులకూ మధ్య సయోధ్య కుదర్చినవాడనీ తెలిసిందే. గత ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం సాధించినా, రెండేళ్ళక్రితం మెజారిటీ కోల్పోయినప్పటినుంచీ రాష్ట్రాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలన్న పట్టుదలతో కాంగ్రెస్ ఉంది. ఈ నేపథ్యంలోనే, కాంగ్రెస్ అధిష్ఠానం కొన్ని అప్రియమైన, కఠిన నిర్ణయాలకు సిద్ధపడిందనీ, కమల్‌నాథ్‌ను ఒకపదవికి పరిమితం చేయడం అందులోభాగమేనని అంటారు. ఒకవ్యక్తికి ఒకే పదవి అన్న సూత్రాన్ని జోడుపదవులు అనుభవిస్తున్న నాయకులందరికీ కాంగ్రెస్ వర్తింపచేయగలదా? అన్న చర్చను అటుంచితే, రాజస్థాన్‌లో కొద్దికాలం సద్దుమణిగిన అంతర్గతపోరు మళ్ళీ రాజుకొని సోనియాగాంధీకి అగ్నిపరీక్ష పెడుతోంది. ఇటీవలే సచిన్ పైలట్ ఆమెనూ, ప్రియాంకనూ కలుసుకొని మనసులో ఉన్న ఆగ్రహాన్నంతా కక్కేశారు. వచ్చే ఏడాది రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రిగా ఎవరి నాయకత్వంలో ఎన్నికలకు పోవాలో వెంటనే నిర్ణయించాలని ఆయన అధిష్ఠానాన్ని కోరారు. పంజాబ్‌లో జరిగింది రాజస్థాన్‌లో పునరావృతం కాకూడదని గుర్తుచేశారట. వరుసగా పలుమార్లు కలిసి నా స్థానం ఏమిటో ముందే తేల్చిచెప్పండని ఆయన మర్యాదగానే పార్టీ అధిష్ఠానాన్ని అడుగుతున్నాడు. బయట విలేకరులతో తాను పార్టీ అధికారంలోకి రావడానికి ఎంత కష్టపడ్డానో విప్పిచెబుతూ, రాజస్థాన్‌కు తన నాయకత్వం అవసరమని గుర్తుచేస్తున్నారు. రెండేళ్ళక్రితం ఆయన ఓ పద్దెనిమిదిమంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటుచేయడం, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన వందమంది ఎమ్మెల్యేలను ఎక్కడో రిసార్టులో దాచటం, కొద్దివారాల తీవ్ర రాజకీయ ఉత్కంఠ తరువాత గాంధీలు ఎట్టకేలకు పైలట్ ను బుజ్జగించడం తెలిసిందే. ఆయన మద్దతుదారులకు ఏవో కొన్ని పదవులు దక్కినప్పటికీ, సోనియా ఆశీస్సులు, మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందున అశోక్ గెహ్లాట్ పెత్తనం ఏమాత్రం సన్నగిల్లలేదు. మరోపక్క, జ్యోతిరాదిత్య, జితిన్ ప్రసాద వంటి తోటి కాంగ్రెస్ యువనాయకులు సాహసోపేతమైన నిర్ణయాలు చేసి రాజకీయలబ్ధి పొందిన నేపథ్యంలో పైలట్ మనసు ఆగడం లేదు. ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా నన్ను సీఎంని చేయండి, లేకుంటే రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమి ఖాయం అని పైలట్ విస్పష్టంగా ప్రకటించినట్టు వార్తలు వస్తున్నప్పటికీ, మరికొద్దినెలలు ఓపికపట్టమన్న పాతపాటే అధిష్ఠానం పాడతున్నదట. ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్‌లో ఎందుకు చేరలేదు, అందుకు కారకులెవ్వరన్నది అటుంచితే, ఆ పార్టీకి కావాల్సింది సరైన నాయకత్వమనీ, తాను కాదనీ, తాను చేరకున్నా ఏం చేయాలన్నది నిర్ణయించుకోవాల్సింది ఆ పార్టీయేనని ఆయన వరుసగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్‌లో మే 13నుంచి జరిగే ‘నవ సంకల్ప చింతన్ శివర్’లో కాంగ్రెస్ తనను తాను ప్రక్షాళించుకొనే దిశగా సాహోసేపేతమైన అద్భుత నిర్ణయాలు చేస్తుందని ఎవరూ భావించడం లేదు. కానీ, ప్రశాంత్ కిశోర్ పార్టీలో అడుగుపెట్టనందుకు అశోక్ గెహ్లాట్ వంటి ఆ తరం నేతలు ఎంతో సంతోషిస్తున్నారన్న విశ్లేషణలు మాత్రం జోరుగా సాగుతున్నాయి.

Updated Date - 2022-04-29T09:05:09+05:30 IST