మళ్లీ మొదటికి...

ABN , First Publish Date - 2022-10-21T06:04:14+05:30 IST

‘నాలుగునెలల వయసున్న నా కుమారుడు ఇప్పటికే, ఇద్దరు ప్రభువులను, ఇద్దరు ప్రధానులను, నలుగురు ఆర్థికమంత్రులను, ముగ్గురు హోంమంత్రులను చూసేశాడు...

మళ్లీ మొదటికి...

‘నాలుగునెలల వయసున్న నా కుమారుడు ఇప్పటికే, ఇద్దరు ప్రభువులను, ఇద్దరు ప్రధానులను, నలుగురు ఆర్థికమంత్రులను, ముగ్గురు హోంమంత్రులను చూసేశాడు’ అంటున్న ట్వీట్ ఒకటి బ్రిటన్ పరిణామాలను మూడుముక్కల్లో తెలియచెబుతోంది. వారాల తరబడి సాగిన వాదోపవాదాల అనంతరం, బ్రిటన్ పాలకపక్షనేతగా ఎన్నికై, దేశప్రధానిగా గద్దెనెక్కిన నలభైఐదురోజుల్లోనే లిజ్ ట్రస్ రాజీనామా చేయడం అక్కడి తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభానికి అద్దంపడుతోంది. ‘నేను యోధురాలిని, ఆరునూరైనా గద్దెదిగేదిలేదు’ అని ప్రకటించిన కొద్దిగంటల్లోనే ట్రస్ రాజీనామా చేయాల్సిరావడం వెనుక పార్టీనుంచి ఆమెపై ఎంత ఒత్తిడి ఉందో అర్థమవుతోంది.


బ్రెగ్జిట్ తరువాత కూడా బ్రిటన్ ను సంక్షోభాలు వీడడం లేదు. ట్రస్ ఏలుబడి ఆరంభమైన రెండువారాల్లోనే ఇద్దరు మంత్రులు రాజీనామా చేయడం, ఎన్నడూ నోరువిప్పని స్వపక్ష ఎంపీలు కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం పార్టీ ఎదుర్కొంటున్న నైరాశ్యానికి ఉదాహరణలు. మా ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన మీ నాయకురాలు బల్లకింద దాక్కున్నారా? అని విపక్షసభ్యురాలు ఎగతాళిగా ప్రశ్నిస్తే, ప్రధానమంత్రి స్థానంలో ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డ ఒక మంత్రి నీళ్ళునమలవలసి వచ్చింది. రాజుగారికి రాజీనామా పత్రం సమర్పించడానికి వెళ్ళినట్టున్నారు అన్న మరో వెటకారపు వ్యాఖ్యకు వారూ వీరూ అన్న తేడా లేకుండా అందరూ గొల్లున నవ్విన ఘట్టం అనతికాలంలోనే ట్రస్ ఎంతో చులకనైపోయారనడానికి నిదర్శనం.


మినీ బడ్జెట్ పేరిట ట్రస్, ఆమె ఆర్థికమంత్రి భారీ పన్నుకోతలతో ప్రకటించిన ప్యాకేజీ ఆర్థికరంగానికి ఊతానివ్వడం మాట అటుంచి విధ్వంసాన్ని సృష్టించింది. లక్షలాది సామాన్య కుటుంబాలను దెబ్బకొట్టింది. మార్కెట్లు కూలిపోయి, పౌండు పతనమైపోతున్నస్థితిలో కేంద్ర బ్యాంకు రంగంలోకి దిగవలసి వచ్చింది. ఈ సంక్షోభం సృష్టించిన అప్రదిష్ట నుంచి బయటపడటానికి అమెరికాలో ఐఎమ్ ఎఫ్ సమావేశంలో ఉన్న ఆర్థికమంత్రిని స్వదేశం రప్పించి మరీ ఆయన ఉద్యోగం తీసేశారు ట్రస్. ఆ తరువాత తనతో పాటు పార్టీ నాయకత్వానికి పోటీపడి ఎనిమిదో స్థానంలో ఉన్న జెరిమీ హంట్ ను ఆర్థికమంత్రి చేశారు. ఆయన మొన్న సోమవారం కేవలం ఆరునిముషాల్లో సదరు ప్యాకేజీని తిరగదోడటంతో మార్కెట్ స్థిమితపడింది కానీ, ఎన్నికల ప్రచారంలో ట్రస్ చెప్పిన ప్రతీపథకం రద్దయిపోయి ఆమె పరువుపోయింది. ట్రస్ కు ఆర్థికవ్యవహారాలమీద ఏ మాత్రం అవగాహన లేదన్న వాదనకు ఈ పరిణామాలన్నీ బలం చేకూర్చాయి. 


ఆమె తనను తాను అతిగా ఊహించుకుంటారనీ, సమర్థతలేకున్నా ఎగరిపడతారని అధికారపక్ష నేతలు ఇప్పుడు వ్యాఖ్యానిస్తున్నారు కానీ, ఆమె మాటకారితనానికి తబ్బిబ్బైపోయి, సంక్షోభంలో ఉన్న దేశాన్ని ఆమె చేతిలో పెట్టింది వీరే. కానీ, రక్షకురాలనుకున్నాఆమెకు అంతటిశక్తియుక్తులు లేవని అనతికాలంలోనే గుర్తించి తప్పుదిద్దుకున్నందుకు అభినందించాలి. పన్నెండేళ్ళుగా అధికారంలో కొనసాగుతున్న కన్సర్వేటివ్ పార్టీ బ్రెగ్జిట్‌తో మొదలై, ట్రస్ రాజీనామా వరకూ వరుస సంక్షోభాలతో బాగా దెబ్బతిన్నది. ఇప్పుడు దేశాన్ని కాపాడేది భారత సంతతికి చెందిన రిషీ సునక్ ఒక్కరేనని అత్యధిక ఎంపీలు భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆయన గతంలో ఏ చర్యలనైతే వ్యతిరేకిస్తూ, ఏ హెచ్చరికలైతే చేశాడో అవే ఇప్పుడు నిజమవుతున్నాయి. ఆయన ఓ రుషిలాగా, ఇంత సంక్షోభంలోనూ ఏమీ పట్టనట్టుగా ఉండిపోవడం వెనుక మంచి వ్యూహమే ఉన్నదని అంటున్నారు. ట్రస్ అనుభవం కంటికెదురుగా ఎలాగూ ఉంది. దేశం ఇంతగా దెబ్బతిని ఉన్నస్థితిలో దానిని గాడినపడవేయడం సులభమేమీ కాదు. కానీ, దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు బాధ్యత, సమర్థత ఉన్నవారెవ్వరూ వెనకన ఉండిపోవడం సరికాదు కనుక, పార్టీ యావత్తూ ఏకకంఠంతో కోరుకున్నప్పుడే రిషి ముందుకు రావచ్చు. ‘ఎవరినైనా ఎన్నుకోండి, సునాక్ తప్ప’ అని తనపార్టీ ఎంపీలను ప్రభావితం చేసిన బోరిస్ జాన్సన్ ఇప్పుడు నోరువిప్పలేకపోవచ్చు. ఆయనే మళ్ళీ బరిలోకి దిగితే వేరే విషయం. ఆరేళ్ళలో ఐదవసారి జరుగుతున్న కొత్త ప్రధానిని ప్రతిష్ఠించే కార్యక్రమం వారంలోనే ముగుస్తుందని అంటున్నారు కనుక, బ్రిటన్ ఏ దిశగా పోతున్నదో ఆ ఎంపికలోనే తేలిపోతుంది.

Updated Date - 2022-10-21T06:04:14+05:30 IST