దారుణాలు

ABN , First Publish Date - 2022-02-23T06:12:26+05:30 IST

హిజాబ్ ధారణ గురించిన వివాదంతో ఉద్రిక్తంగా ఉన్న కర్ణాటకలోని శివమొగ్గలో ఆదివారం నాడు హర్ష అనే ఇరవయ్యారేళ్ల యువకుడి దారుణహత్య పరిస్థితిని మరింత విషమింపజేసింది...

దారుణాలు

హిజాబ్ ధారణ గురించిన వివాదంతో ఉద్రిక్తంగా ఉన్న కర్ణాటకలోని శివమొగ్గలో ఆదివారం నాడు హర్ష అనే ఇరవయ్యారేళ్ల యువకుడి దారుణహత్య పరిస్థితిని మరింత విషమింపజేసింది. హిజాబ్ సమస్యకు, ఈ హత్యకు సంబంధం లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, భయాందోళనలు వ్యాపించే విధంగా ప్రచారాలు సాగుతున్నాయి. హత్య విషయంలో పోలీసుయంత్రాంగం చురుకుగా స్పందించి దర్యాప్తు చేపట్టి, ఆరుగురు నేరచరితులను అరెస్టు చేశారు. హత్యకు పాల్పడింది తామేనని అరెస్టయిన నిందితులు అంగీకరించారని పోలీసు వర్గాలు అనధికార వివరాలను మీడియాకు అందిస్తున్నాయి. తమ సంస్థ కార్యకర్తను దుర్మార్గంగా హత్యచేశారు కాబట్టి, బజరంగ్‌దళ్ లోని హర్ష సహచరులు ఆగ్రహావేశాలతో స్పందించడం సహజమే. ఈ సమయంలో బాధ్యతగా వ్యవహరించవలసిన రాష్ట్ర మంత్రులు కొందరు ప్రమాదకరమైన వ్యాఖ్యలు చేయడం మాత్రం విచారకరం. 


హర్ష తన పేరు చివర హిందూ అన్న గుర్తింపు పదాన్ని కూడా జోడించుకుని, సామాజిక మాధ్యమాలలో, మిత్రబృందంలో వ్యవహరించేవారు. అతని సోదరుడు చెబుతున్న దానిని బట్టి ‘ఎప్పుడూ హిందువుల గురించే ఆలోచిస్తూ ఉండేవాడు’. హర్ష సోదరి చెప్పినట్టు, మతాల గొడవలు వద్దని వారిస్తున్నా అతను వినేవాడు కాదు. హిందూ మతానికి అన్యమతస్థుల నుంచి ప్రమాదం ఉన్నదనో, మతాన్ని రక్షించుకోవాలనో, అతను భావిస్తూ ఉండవచ్చు. అటువంటి భావాలు కలిగే వాతావరణంలో అతను సంచరించి ఉండవచ్చు. ఎవరైనా సరే, భావాలున్నంతమాత్రాన హంతకదాడులు చేయడం సభ్యసమాజం అంగీకరించదు. కాబట్టి, హర్ష హంతకులను కఠినంగా శిక్షించవలసిందే. ఇప్పుడు అరెస్టయిన వారు కాక, మరెవరు ఈ కుట్రలో ఉన్నా, వారిని కూడా ప్రభుత్వ యంత్రాంగం వేటాడి న్యాయస్థానం ముందు నిలబెట్టవలసిందే. ఇంకా చిన్న వయసు వాడు, ఎంతో జీవితం ఉన్న వాడు అకాలంగా మరణిస్తే, అతని కుటుంబానికి ఎంతటి దుఃఖం?


హర్ష బజరంగ్‌దళ్‌లో క్రియాశీల కార్యకర్త కావడం వల్ల ఈ హత్య జరిగిందా, లేక, ఇతర కారణాలున్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హతుడు హర్ష మీద కూడా కొన్ని కేసులున్నాయని సాక్షాత్తూ హోంమంత్రి చెబుతున్నారు. హత్యకు ప్రేరేపించిన అంశమేమిటో ఇంకా నిర్ధారణ కావలసి ఉన్నది. కానీ, రాజకీయవాదుల ప్రసంగాలలోను, సామాజిక మాధ్యమాలలోను సొంత దర్యాప్తులు, సొంత నిర్ధారణలు జరిగిపోతున్నాయి. శివమొగ్గలో ఇతర మతస్థులకు ఇంత ధైర్యం మునుపు లేదని, మరెప్పుడూ ఇటువంటి చర్యకు తెగబడకుండా కఠినంగా శిక్షించాలని, హైదరాబాద్‌లో రేపిస్టులను ఎన్‌కౌంటర్ చేసినట్టు చేయాలని కర్ణాటక అధికార పెద్దలు, మంత్రులు ప్రకటనలు చేశారు. దాడి చేసినవారు ఫలానా మతస్థులంటూ, నిందితులను ఆ మతానికి చెందిన గుండాలు అంటూ గ్రామీణ శాఖ మంత్రి ఈశ్వరప్ప ఆవేశపడ్డారు. ఈయన గతంలో ఎర్రకోటపై కాషాయజెండా ఎగురవేయాలని వ్యాఖ్యానించి, పార్టీ పెద్దలకు తలనొప్పి తెచ్చారు. మత పరమైన కోణంతో పాటు, రాజకీయ కోణాన్ని జోడించడానికి కొందరు ఉత్సాహపడుతున్నారు. కాంగ్రెస్ నాయకుడు డి.కె. శివకుమార్ చేసిన ఒక వ్యాఖ్య ముస్లిములను రెచ్చగొట్టిందని, ఈ హత్య జరగడానికి అదే కారణమని బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. ఒక పక్కన కేసును ఛేదించడానికి, ఈ దుర్ఘటన కారణంగా ఉద్రేకాలు చేయి దాటిపోకుండా అదుపు చేయడానికి సతమతమవుతున్న పోలీసు యంత్రాంగానికి బాధ్యత లేని వాచాలత్వం కొత్త సమస్యలను తెచ్చిపెడుతుంది.


కొందరిని నిర్బంధించినా, ప్రధాన నిందితుడెవరో ఇంకా తెలియాలి. అరెస్టయిన నిందితులందరూ ముస్లిములే. వారు మతపరమైన కారణాలతో హర్ష మీద దాడి చేశారా, లేక, ఇతర వివాదాలేమైనా వారి మధ్య ఉన్నాయా, ఇస్లామిక్ తీవ్రవాద సంస్థల ప్రమేయం ఇందులో ఉన్నదా? ఈ ప్రశ్నలన్నిటికి సమాధానం లభించవలసి ఉన్నది. ఒక పక్కన ‘‘జస్టిస్ ఫర్ హర్ష’’ అన్న శీర్షికతో సామాజిక మాధ్యమాలలో సందేశాల ఉద్యమం నడుస్తున్నది. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఇటువంటి ఉద్యమాలకు రాజకీయ కోణం కూడా జతకావడంలో ఆశ్చర్యం లేదు. హిజాబ్ వివాదమే, ఎన్నికల సమయంలో దేశవ్యాప్త భావసమీకరణకు, రాజకీయ సమీకరణకు కారణమవుతున్నదని విశ్లేషకులు అంటున్నారు. ఎన్నో ఉద్రిక్తతలు, అభద్రతలు ఉన్నప్పటికీ, ఇప్పటివరకు శాంతియుతంగానే ఉన్న వివాదం, ఈ హత్యతో హింసాత్మక మలుపు తిరిగింది. ఇది మంచిది కాదు. ఉద్వేగాలను, అసహనాలను నాగరిక పద్ధతిలో సరిదిద్దుకునే పరిపక్వత మన సమాజానికి ఇంకా రాకపోవడం విచారకరం.


గత అక్టోబర్‌లో బెళగావిలో దారుణహత్యకు గురిఅయిన 24 ఏళ్ల అర్బాజ్ ఖాన్ కానీ, ఈ జనవరిలోనే నరగుండ్‌లో జరిగిన సమీర్ షాపూర్ అనే పంతొమ్మిదేండ్ల యువకుడు కానీ, ఇప్పుడీ హర్ష కానీ, అవాంఛనీయమైన ద్వేష, నేరపూరిత వాతావరణానికి బలి అయిన బాధితులు. ఇటువంటి హత్యలు జరగడానికి మూలకారణమేమిటో గుర్తించి, అందుకు విరుగుడు మందు వేయాలి. ఎంతో సానుకూల మనస్తత్వంతో, జీవితంలో పైపైకి పోవాలనుకునే చొరవతో ఉత్సాహంగా ఉండవలసిన యువకుల మనస్సుల్లో విషాన్ని నింపుతున్నదెవరో, వారి ఆలోచనల్లో ఉన్నదెంత దుర్మార్గమో?

Read more