విజయ స్ఫూర్తి

ABN , First Publish Date - 2022-08-10T06:35:15+05:30 IST

బర్మింగ్‌హామ్‌ వేదికగా పన్నెండురోజుల పాటు అంగరంగ వైభవంగా సాగిన క్రీడా మహోత్సవానికి తెరపడింది.

విజయ స్ఫూర్తి

బర్మింగ్‌హామ్‌ వేదికగా పన్నెండురోజుల పాటు అంగరంగ వైభవంగా సాగిన క్రీడా మహోత్సవానికి తెరపడింది. కోట్లాది మందిని మురిపించి, వేలాది మంది అథ్లెట్లను మెరిపించిన కామన్వెల్త్‌ క్రీడా సంరంభం సోమవారంతో పరిసమాప్తమైంది. తొలిరోజే రెండు స్వర్ణాలతో ఘనంగా బోణీ కొట్టిన ఆస్ట్రేలియా చివరిదాకా ఆధిపత్యాన్ని నిలబెట్టుకొని మొత్తం 178 పతకాలతో అగ్రస్థానం దక్కించుకుంది. వరుసగా రెండోసారి ఈ ఘనత దక్కించుకున్న ఆసీస్‌ ఈ క్రీడల్లో అగ్రపీఠాన నిలవడం ఇది పదమూడోసారి. ఒకప్పటి తమ పాలన లోని దేశాలు పాల్గొనే ఈ క్రీడల్లో ఇంగ్లండ్‌ 176 పతకాలతో ద్వితీయస్థానం సంపాదించుకుంది. 92 పతకాలతో  కెనడా మూడోస్థానంలో, 215 మంది క్రీడాకారులతో వెళ్లిన భారత బృందం 61 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచాయి. క్రితంసారి 66 పతకాలతో ఒకమెట్టుపైనే ఉన్న భారతదేశానికి ఈమారు ఐదు పతకాలు తగ్గాయి. స్వర్ణాల పరంగా గత క్రీడల్లో 26 దక్కితే, బర్మింగ్‌హామ్‌లో ఆ సంఖ్య 22కు పరిమితమైంది. మనకు గట్టి పట్టున్న షూటింగ్‌ క్రీడాంశానికి ఈసారి చోటు లేకపోవడం అవకాశాలను బాగా దెబ్బతీసింది. గత క్రీడల్లో మన షూటర్లు ఏకంగా 16 పతకాలు కొల్లగొట్టిన విషయం తెలిసిందే. ఇక, కచ్చితంగా స్వర్ణం గెలుస్తాడనుకున్న ఒలింపిక్‌ విజేత, జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా గాయంతో క్రీడల ఆరంభానికి ముందు తప్పుకున్నాడు. ఇలాంటి ప్రతికూల పరిణామాల మధ్య బర్మింగ్‌హామ్‌కు పయనమైన మన జట్టు తొలి ఐదు స్థానాల్లో నిలవడమే లక్ష్యం అని చెప్పి, ఆ మాటను నిలబెట్టుకుంది.


ఇన్నేళ్ల కామన్వెల్త్‌ చరిత్రలో భారత్‌కు అత్యధిక పతకాలు తెచ్చి పెట్టినవి రెజ్లింగ్‌, షూటింగ్‌, వెయిట్‌లిఫ్టింగ్‌ లాంటి సంప్రదాయ క్రీడాంశాలే. ఈ ఆనవాయితీని కొనసాగిస్తూ ఈమారు మన కుస్తీ యోధులు అత్యధికంగా ఆరు స్వర్ణాలు సహా పన్నెండు పతకాలను పట్టుకురాగా.. మూడు స్వర్ణాలు కలిపి పది పతకాలను లిఫ్టర్లు సాధించారు. ఆ తర్వాత అథ్లెటిక్స్‌లో ఎనిమిది పతకాలు రావడం శుభ పరిణామం. 1958లో ఫ్లయింగ్‌ సిఖ్‌ మిల్కా సింగ్‌ స్వర్ణం సాధించాక కొన్ని దశాబ్దాల పాటు అథ్లెటిక్స్‌లో పతకాలే రాని దురవస్థ ఉండేది. కానీ, 2010లో ఢిల్లీ ఆతిథ్యమిచ్చిన కామన్వెల్త్‌ క్రీడల నుంచి ఈ పరిస్థితిలో మార్పు వస్తోంది. అంతకంతకూ మెరుగవుతూ అథ్లెట్లు కామన్వెల్త్‌ క్రీడల్లో విశేషంగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. ట్రిపుల్‌ జంప్‌లో ఎల్డోస్‌ పాల్‌, అబ్దుల్లా, మహిళల జావెలిన్‌ త్రోలో అన్నూరాణి, పదివేల మీటర్ల నడకలో ప్రియాంక, లాంగ్‌ డిస్టెన్స్‌ విభాగంలో అవినాష్‌ దేశానికి తొలిసారి పతకాలు అందించి చరిత్ర సృష్టించారు. మహిళల లాన్‌ బౌల్స్‌లో స్వర్ణం గెలిచిన జట్టులోని సభ్యులైన లవ్‌లీ, పింకీ, రూప, నయన్మోని.. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూ క్రీడలకు సన్నద్ధమై ఫలితాన్ని రాబట్టిన తీరు సర్వత్రా ప్రశంసనీయం. వృత్తులు, నేపథ్యాలు, ప్రాంతాలు వేరైనా ఆటకోసం ఒక్కటిగా కలిసి జట్టును విజేతగా నిలిచిన ఈ నలుగురి కథనం ఎందరికో స్ఫూర్తిదాయకం. మనకు అంతగా పరిచయం లేని లాన్ బౌల్స్‌లాంటి ఈవెంట్లలోనూ పతకాలు దక్కడం విశేషం. 


ఈసారి క్రీడల్లో తెలుగు తేజాలు తమ ప్రతిభా పాటవాలను చాటుకున్నారు. బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు, సాత్విక్‌ సాయిరాజ్‌, కిడాంబి శ్రీకాంత్, బాక్సింగ్‌లో నిఖత్ జరీన్‌, హుస్సాముద్దీన్‌, టేబుల్‌ టెన్నిస్‌లో ఆకుల శ్రీజ పతకాలు అందుకొని అభిమానులను విశేషంగా అలరించారు. తన శిక్షణ కోసం మూడేళ్లపాటు ఉద్యోగం మానేసిన తండ్రి పోరాటం వృథా కానీయకుండా బాక్సర్‌ నీతూ బంగారు పతకాన్ని ముద్దాడడం, తండ్రితో పాటు కిళ్లీ కొట్టులో పనిచేస్తూనే శిక్షణకు సన్నద్ధమైన లిఫ్టర్‌ సంకేత్ సర్గార్‌ రజత పతకాన్ని అందుకోవడం.. ఇలా విభిన్న నేపథ్యాలున్న క్రీడాకారులు కామన్వెల్త్‌లో సాధించిన విజయాలు దేశవాసులను అబ్బురపరిచాయి. బర్మింగ్‌హామ్‌లో మనవారి ప్రదర్శన కొంత సంతోషాన్ని ఇస్తున్నా అసలు సవాల్‌ వచ్చే ఏడాది చైనాలో జరిగే ఆసియా క్రీడల్లో ఎదురుకానుంది. కామన్వెల్త్‌తో పోలిస్తే అక్కడ ప్రమాణాలు, అథ్లెట్ల మధ్య పోటీ ఎక్కువ. అందువల్ల, కామన్వెల్త్‌లో చేసిన తప్పులను సమీక్షించుకొని, ఆసియాడ్‌కు మరింత సమర్థవంతంగా సన్నద్ధమవ్వాలి.

Read more