స్వరాజ్యవేళ సిగ్గు సిగ్గు...!

ABN , First Publish Date - 2022-08-14T05:56:38+05:30 IST

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాలను జరుపుకొంటున్నాం. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్ధిని సాధించాం....

స్వరాజ్యవేళ సిగ్గు సిగ్గు...!

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాలను జరుపుకొంటున్నాం. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్ధిని సాధించాం. ఆర్థికంగా కూడా పురోగమించాం. 1947లో స్వాతంత్య్రం వచ్చినప్పుడు మన దేశ వార్షిక బడ్జెట్‌ 250 కోట్లు దాటలేదు. ఇందులో దాదాపు 30 కోట్ల ద్రవ్యలోటు ఉంది. తొలి బడ్జెట్‌ను దేశ ప్రథమ ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముగం శెట్టి ప్రవేశపెట్టారు. ఇప్పుడు దేశ వార్షిక బడ్జెట్‌ దాదాపు 30 లక్షల కోట్ల వరకు ఉంది. వార్షిక ఆదాయం 170 కోట్ల వరకు మాత్రమే ఉన్నప్పటికీ నాటి పాలకులు ప్రభుత్వ రంగ సంస్థలను, సాగునీటి ప్రాజెక్టులను చేపట్టారు. పంచవర్ష ప్రణాళికల ద్వారా వాటిని పూర్తిచేశారు. ఇప్పుడు ప్రభుత్వ ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగినప్పటికీ దశాబ్దాల క్రితం ఏర్పాటైన ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకుంటున్నాం. దేశం అభివృద్ధి పథంలో పరుగులు తీస్తోందని చెప్పుకొంటున్న పాలకులే పేదరికం పేరిట ఉచిత పథకాలకు తెర తీస్తున్నారు. ఇప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే రెండు శతాబ్దాల బ్రిటిష్‌ పాలనలో జరగనంతగా ఈ 75 ఏళ్లలో విలువల విధ్వంసం జరిగింది. అనైతికతే నైతికతగా చలామణి అవుతోంది. మన రూపాయి బక్కచిక్కి పోతున్నట్టుగానే మన నాయకులు కూడా నైతికంగా పతనమవుతూ వచ్చారు. అధికారమే పరమావధిగా రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. అధికారం కోసం సమాజాన్ని కులాలు, మతాల పేరిట ముక్కలు చెక్కలు చేశారు. తప్పుడు పనులు చేసే వారు కూడా కులాన్ని రక్షణ కవచంగా వాడుకోవడం మొదలెట్టారు. వజ్రోత్సవాల సందర్భంగా మన పతనాన్ని చూస్తే ఆవేదనే మిగులుతుంది. ఇప్పుడు రాష్ర్టాల్లో గానీ, కేంద్రంలో గానీ అధికారంలో ఉన్నవారెవరూ 1947కి ముందు పుట్టినవాళ్లు కారు. ప్రజా జీవితంలో ఉన్నత ప్రమాణాలు అంటే ఎలా ఉంటాయో చెప్పేవారు కూడా లేరు. ఎవరైనా చెప్పడానికి ప్రయత్నించినా ఎగతాళికి గురవుతున్నారు.


ఈ నేపథ్యంలోనే ఎంపీ గోరంట్ల మాధవ్‌ వంటి వారు రొమ్ము విరుచుకొని తిరగ్గలుగుతున్నారు. మాధవ్‌ చేసిన పాడు పనికి సిగ్గూ లజ్జా ఉన్నవారు ఎవరైనా నవరంధ్రాలూ మూసుకొని ముఖం చాటేసేవారు. గోరంట్ల మాధవ్‌ మాత్రం ఫలానా ఫలానా వాళ్ల ఇళ్లకు వెళ్లి ఒరిజినల్‌ చూపిస్తానంటూ పేలుతున్నారు. అతనికి ఆ ధైర్యం రావడానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డే కారణం. ‘‘చేసింది చాలు ఇక నోరు మూసుకొని కూర్చో’’ అని మందలించాల్సింది పోయి అధికార పక్షం వాళ్లు మాధవ్‌కు మద్దతుగా మాట్లాడుతున్నారంటే జగన్‌ ఇస్తున్న ప్రోత్సాహమే కారణం. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ పరీక్షలో సదరు వీడియో మార్ఫింగ్‌ అని తేలితే ఎవరూ ఊహించని కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పినవాళ్లు మాటమార్చి, ఎవరూ ఫిర్యాదు చేయనప్పుడు చర్యలు తీసుకోవడం ఎలా? నాలుగు గోడల మధ్య దిగంబరంగా ఉండటం నేరం కాదే? అంటూ వితండ వాదానికి దిగుతున్నారు. మధ్యలో కమ్మ కులాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం ఒకటీ! ఎవరికైనా దెబ్బ తగిలి నొప్పి పుడితే అమ్మా అని అరుస్తారు. అలాంటిది జగన్‌ అండ్‌ కో పుణ్యమా అని ఆంధ్రప్రదేశ్‌లో కమ్మా అని అరిచే పరిస్థితి ఏర్పడింది. మాధవ్‌తో పాటు ఆయనను సమర్థిస్తున్న వాళ్లు మాట్లాడిన మాటలు, వాడుతున్న భాష జుగుప్సాకరంగా ఉంది. జగన్‌కు మాత్రం వినసొంపుగా ఉంది. అందుకే ఆయన ఎవరినీ కట్టడి చేయడం లేదు. మొత్తంమీద వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని దిగంబర పార్టీగా మార్చేశారు. ఇక నుంచి ఆ పార్టీని దిగంబర పార్టీ అని పిలవడంలో తప్పులేదు. ఫిర్యాదు లేనప్పుడు చర్యలు ఎలా? అనడాన్ని బరితెగింపుగానే చూడాలి. గోరంట్ల మాధవ్‌ చేసిన వీడియో కాల్‌పై ఎవరూ ఫిర్యాదు చేయలేదు కనుక ఆయన చట్టపరంగా నేరం చేసినట్టు కాదు అన్న వాదనలో విషయం లేదనికాదు. అయితే ప్రజా జీవితంలో ఉన్నవారు నైతిక విలువలు పాటించాలి. ఉన్నత ప్రమాణాలతో జీవించాలి. చట్టపరంగా తప్పు కాని సందర్భంలో కూడా నైతికతకు ప్రాధాన్యం ఇచ్చిన ఎంతో మంది నాయకులను చూశాం. ఉమ్మడి రాష్ట్రంలో గవర్నర్‌గా పనిచేసిన ఎన్‌.డి.తివారీ విషయానికి వద్దాం. రాజ్‌భవన్‌లో ఆయన రాసలీలలను ‘ఏబీఎన్‌’ పదేళ్ల క్రితం ప్రసారం చేసింది. నిజానికి గవర్నర్‌ తివారీపై అప్పుడు కూడా ఎవరూ ఫిర్యాదు చేయలేదు. తివారీ తనను ప్రేమించి, ఒక కొడుకును కూడా కన్న తర్వాత నిరాదరించడంతో కినుక వహించిన ఒక మహిళ ఆయన రాసలీలలను ‘ఏబీఎన్‌’కు అందించారు. ఆ తర్వాత తివారీ సదరు మహిళను భార్యగా అంగీకరించడమే కాకుండా ఆమెకు పుట్టిన పిల్లాడిని కుమారుడిగా స్వీకరించవలసి వచ్చింది. అది వేరే విషయం. తివారీ వ్యవహారాన్ని ‘ఏబీఎన్‌’ ప్రసారం చేసినప్పుడు కూడా జాతీయ మీడియాకు చెందిన కొద్ది మంది అది ప్రైవేట్‌ వ్యవహారం కదా అని అభిప్రాయపడ్డారు. అయితే రాజ్‌భవన్‌లో అటువంటి ప్రవర్తనకు పాల్పడటం అనైతికం అని వారు విస్మరించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ రాసలీలలకు పాల్పడటం నేరమని భారతీయ శిక్షా స్మృతిలో లేదు. ఇక్కడ అనైతిక ప్రవర్తనే ముఖ్యం. అందుకే తివారీ అనైతిక చర్యలకు పాల్పడినందున గవర్నర్‌ పదవికి రాజీనామా చేయవలసిందిగా యూపీఏ చైర్‌పర్సన్‌గా ఉన్న సోనియాగాంధీ అప్పట్లో ఆదేశించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తొలి కేబినెట్‌లో ఉప ముఖ్యమంత్రిగా నియమితుడైన రాజయ్య రాసలీలలకు పాల్పడటంతో పాటు అవినీతికి కూడా పాల్పడుతున్నట్టు ఆరోపణలు వచ్చాయి. అయితే అవేవీ రుజువు కాలేదు. అయినా జరుగుతున్నది ఏమిటో కేసీఆర్‌కు తెలుసు కనుక రాజయ్యను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేశారు. ఈ రెండు ఉదంతాలలో కూడా నైతికతే ప్రధానాంశమైంది. గోరంట్ల మాధవ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి అనంతపురం జిల్లాకే చెందిన నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బస్సు రూట్ల జాతీయీకరణ విషయంలో హైకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. నిజానికి ఆ వ్యాఖ్యలు అంత తీవ్రమైనవి కూడా కావు. అయినా నైతిక విలువలకు కట్టుబడిన నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? గోరంట్ల మాధవ్‌ డర్టీ పిక్చర్‌ నూటికి నూరు శాతం నిజమని అందరికీ తెలుసు. అయినా ఆయనను వెనుకేసుకు రావాలని ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి నిర్ణయించుకున్నారు. అంతే క్షణాల్లో స్వరాలు మారిపోయాయి. అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప విలేఖరుల సమావేశం ఏర్పాటుచేసి ఒరిజినల్‌ వీడియో లభించలేదు కనుక ప్రచారంలో ఉన్న వీడియో నకిలీది అయి ఉండవచ్చునని డొంకతిరుగుడుగా చెప్పుకొచ్చారు. సదరు వీడియో మార్ఫింగ్‌కు గురికాలేదని ఫక్కీరప్పకు తెలియదా? ఆయన కూడా మాధవ్‌ వీడియోను చూసి తరించి ఉంటారు కదా? వీడియో మార్ఫింగ్‌ చేశారని మాధవ్‌ ఆరోపిస్తున్నందున ఆయనను పిలిచి విచారించాలి కదా? వీడియో గురించి ఎవరూ ఫిర్యాదు చేయలేదు కనుక సదరు వీడియోను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపడం లేదని ఎస్పీ చెప్పడం హాస్యాస్పదంగా లేదా? ఫిర్యాదు లేదని చెప్పి హత్యలు జరిగినా పోలీసులు ఇదే వైఖరి తీసుకుంటారా? గుర్తు తెలియని శవాలు దొరికినప్పుడు కేసులు కడుతున్నారు కదా? నాలుగు గోడల మధ్య జరిగేది నేరం కాదు, అనైతికం కూడా కాదని వైసీపీ ముఖ్యులు దిక్కు మాలిన వాదానికి దిగుతున్నారు. అలా అయితే పోలీసులు హోటళ్లు, లాడ్జీలపై దాడి చేసి వ్యభిచార నేరం కింద పట్టుకోవడం ఎందుకు? ఇక్కడ కూడా మహిళ గానీ, పురుషుడు గానీ ఫిర్యాదు చేయడం లేదుగా? పరస్పర అంగీకారంతోనే వ్యభిచారం చేస్తున్నారు కదా? వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య సందర్భంగా కూడా ఎవరూ ఫిర్యాదు చేయలేదు. అక్కడి పరిస్థితులను చూసిన పోలీసులే కేసు కట్టారు. ఆ తర్వాతే కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. మా ఇంట్లో నాలుగు గోడల మధ్య బాబాయిని హత్య చేస్తే మధ్యలో ఇతరులకు నొప్పి ఎందుకు? అని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి వాదించగలరా?


ఇంట్లో వాళ్లకు ఎంత కష్టం?

చేసిన దానికి గోరంట్ల మాధవ్‌ సిగ్గుపడుతూ ఉండకపోవచ్చు గానీ ఆ వీడియోలో ఉన్నది మాధవ్‌ అని ఆయన కుటుంబానికి తెలియదా? రాష్ట్ర ప్రజలు అందరూ ఆ వీడియో చూసి తరించారు. ఇప్పుడు తేలాల్సింది ఏమీ లేదు. చెప్పుచేతల్లో ఉన్న కూలి మీడియాను వాడుకొని అది ఒరిజినల్‌ కాదని ప్రచారం చేయించినంత మాత్రాన నిజం నిజం కాకుండా పోదు. జరిగిన దానికి మాధవ్‌ కుటుంబ సభ్యులు కచ్చితంగా సిగ్గుతో చితికిపోయి ఉంటారు. ఇలాంటి సందర్భాలలో పిల్లల పరిస్థితి ఏమిటో మాధవ్‌ ఆలోచించుకోవాలి. వారికి తోటివారి ముందు ఎంత కష్టంగా ఉంటుంది! నన్ను, చంద్రబాబును తిట్టినంత మాత్రాన పోయిన పరువు వస్తుందా? మనుషులకు ఏవో కొన్ని బలహీనతలు ఉంటే ఉంటాయి. గోరంట్ల మాధవ్‌కు ఈ బలహీనత ఉండి ఉండవచ్చు. ఆయన ఖర్మ కాలి వీడియో కాల్‌ బహిర్గతమైంది. జరిగిన దానికి చింతించాల్సింది పోయి ఎదురుదాడికి దిగడం, కురుబ కులాన్ని కవచంగా వాడుకొనే ప్రయత్నం చేయడం ఏమిటి? ఇన్ని రోజులుగా ఢిల్లీలో ఉంటూ వచ్చిన ఆయనకు భారీ ర్యాలీతో అనంతపురంలో స్వాగత ఏర్పాట్లు చేయడం ఏమిటి? ఎంపీగా ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఆయన ఏదైనా సాధించుకు వచ్చారని స్వాగతం చెప్తున్నారా? దిగంబరంగా పరాయి మహిళతో మాట్లాడ్డం ఘనకార్యంగా చలామణి చేయాలనుకోవడం, అందుకోసం కులాన్ని వాడుకొనే ప్రయత్నం చేయడం పతనానికి పరాకాష్ఠ. అధికారం ఉంది.. మా ఇష్టం.. విప్పుకొని తిరుగుతాం.. అడగడానికి మీరెవరు? అని దిగంబర పార్టీ నాయకులు తెగబడి వాదిస్తుండవచ్చును కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. ఒక ఐడియా జీవితాన్నే మార్చేసినట్టుగా ఒక మాధవ్‌ వీడియో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని దెబ్బతీసింది. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కురుబ కులానికి చెందిన ఎస్‌.రామచంద్రారెడ్డి మంత్రిగా పనిచేశారు. అవినీతికి చోటివ్వకుండా ఆయన నిప్పులా బతికి కురుబ కులానికి వన్నెతెచ్చారు. ఇప్పుడు మాధవ్‌ వంటి వారి వల్ల కురుబ కులానికి తలవంపులు వచ్చాయి. దిగంబర విన్యాసాలను ఏ కులం వాళ్లు అయినా ఎలా సమర్థిస్తారు? అనర్హులను అందలం ఎక్కిస్తే ఏమేమి జరుగుతాయో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అవే జరుగుతున్నాయి.


జగన్‌దే ఈ పాపం?

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఈ బరితెగింపు ఎందుకు, ఎలా వచ్చింది అంటే జగన్మోహన్‌ రెడ్డి మాత్రమే కారణంగా కనిపిస్తారు. అవినీతి కేసులలో అరెస్టయి జైలుకు వెళ్లిన జగన్‌ బెయిలుపై విడుదలైనప్పుడు కూడా ఊరేగింపు జరిపారు. ఇప్పుడు గోరంట్ల మాధవ్‌ వంటి వారికి అదే ఆదర్శమై ఉంటుంది. మూడేళ్లుగా బటన్లు నొక్కుతున్న జగన్‌రెడ్డికి రానంత పాపులారిటీ ఒక్క వీడియోతో గోరంట్ల మాధవ్‌కు వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ శిక్షాస్మృతి అమలులో లేదు. జగన్‌ అండ్‌ కో రూపొందించుకున్న సొంత శిక్షాస్మృతి మాత్రమే అమలులో ఉంది. కొంత మంది పోలీసు అధికారులు కూడా భారతీయ శిక్షాస్మృతిని మరచిపోయారు. ఈ మొత్తం వ్యవహారంలో బజారున పడి బరితెగించి అడ్డగోలు వాదనలు చేస్తున్నవారు జరిగిన దానిపై తమ ఇళ్లలోని ఆడవాళ్ల అభిప్రాయాలు తెలుసుకొనే ప్రయత్నం చేస్తే మంచిది. ముఖ్యమంత్రి సతీమణి భారతీరెడ్డి తమ ఎంపీ మాధవ్‌ చర్యను సమర్థించగలరా? మాధవ్‌ వ్యవహారం ముగిసిపోయిందని మంత్రి ఉషా శ్రీ చరణ్‌ వ్యాఖ్యానించారు. ఒక మహిళగా ఆమె అలా ఎలా వ్యాఖ్యానించారో! ఇకపై ఆమె గోరంట్ల మాధవ్‌తో పూర్వం వలె స్నేహపూర్వకంగా వ్యవహరించగలరా? మాధవ్‌ను సమర్థిస్తున్న మంత్రులు గానీ, మాజీ మంత్రులు గానీ, సజ్జల వంటి వారు గానీ ఆయనను తమ ఇళ్లకు భోజనానికి ఆహ్వానించి తమ కుటుంబాన్ని పరిచయం చేయగలరా? మాధవ్‌ చేసిన దానికి ఆయనను ఉరి తీయాలని చెప్పడం లేదు. చేసిన దానికి పశ్చాత్తాపం చెందకుండా ఇతరులను దూషించడం ఏమిటి? పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం ఉండదని అంటారు. మాధవ్‌లో ఈ లక్షణం ఏ కోశానా లేదు. అందుకు జగన్మోహన్‌ రెడ్డి బాధ్యుడు అవుతారు. ఏమిటీ పిచ్చి పనులు? అని మందలించి ఉంటే మాధవ్‌ నోరు మూసుకుని అజ్ఞాతంలోకి వెళ్లి ఉండేవాడు కదా? ఇందుకు భిన్నంగా అనంతపురం ఎస్పీ విలేఖరుల సమావేశం తర్వాత ఆయన అడ్డూ అదుపూ లేకుండా నోరు పారేసుకున్నారు. తాను చెప్పాలనుకున్న విషయాలపై తన శ్రీమతి అభిప్రాయాలు తెలుసుకొనే ప్రయత్నం చేసి ఉంటే మిగతా వారి మనోభావాలు ఏమిటో ఎస్పీ ఫక్కీరప్పకు తెలిసి ఉండేవి. వీడియో ఫేక్‌ అని ఎస్పీ చెప్పకపోయినా అది ఫేక్‌ అని ప్రచారం చేస్తున్నారు. అంతమాత్రాన జరిగిన నష్టం పూడ్చుకోలేరు. బహిరంగ ప్రదేశాలలో మతిస్థిమితం లేనివాడు ఎవడైనా దిగంబరంగా కనిపిస్తే అతడి శరీరానికి ఏదో ఒకటి కప్పడానికి ఎవరో ఒకరు ప్రయత్నిస్తారు. ఎందుకంటే అటువైపు మహిళలు కూడా వచ్చిపోతుండవచ్చు. ఎవరూ ముందుకు రాకపోతే పోలీసులే ఆ పని చేస్తారు. ఇది మన సంస్కృతి. వీడియో మార్ఫింగ్‌ అని తేలిపోయిందనీ కనుక ఇప్పుడు కావాలంటే మా ఇళ్లకు వచ్చి ఒరిజినల్‌ చూపిస్తాను అనీ మాధవ్‌ పేట్రేగిపోయారు. జగన్మోహన్‌ రెడ్డి మందలించక పోవడం వల్లనే కదా అతనిలో అంత బరితెగింపు వచ్చింది! ఆ దరిద్రం మాకెందుకు కానీ మాధవ్‌ను సమర్థిస్తున్న వారందరూ ఆయనను పిలుచుకొని ఆ విశ్వరూపాన్ని దర్శించి తరించండి. నోరు తెరిస్తే అక్కచెల్లెమ్మలు అని మాట్లాడే జగన్మోహన్‌ రెడ్డి ఒక్కసారైనా ఆ అక్కచెల్లెమ్మల మనోభావాలు తెలుసుకుంటే మంచిది. మాకు ఒరిజినల్‌ చూపిస్తానంటున్న మాధవ్‌ ఆ ఒరిజినల్‌ ఏదో తనకు పార్టీ టికెట్‌, బీఫామ్‌ ఇచ్చిన జగన్మోహన్‌ రెడ్డికి చూపిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు. ఇంత ఛండాలపు సమర్థనలు చేస్తున్నవారు మన ప్రజాప్రతినిధులు కావడాన్ని మించిన దౌర్భాగ్యం ఇంకేమి ఉంటుంది. స్వాతంత్య్ర వజ్రోత్సవాలలో ఈ మహానుభావులు పాల్గొనడం విషాదం. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే అర్హత జగన్‌ అండ్‌ కోకు ఉందా? నైతికత అనే పదమే వైసీపీ డిక్షనరీలో లేకుండా పోవడానికి కారణం ఏమిటి? అప్పు చేసి మరీ డబ్బు పంచుతున్నందున తాము ఎంత దిగజారి ప్రవర్తించినా ప్రజలు పట్టించుకోరన్న ధీమా జగన్‌ అండ్‌ కోకు నరనరాన పాకింది. ఇప్పుడు వెనుకేసుకొస్తున్న మాధవ్‌కు వచ్చే ఎన్నికల్లో జగన్‌రెడ్డి మళ్లీ టికెట్‌ ఇస్తారా? ఇస్తే మహిళలు అతడికి ఓటు వేయగలరా? ఒకవేళ మళ్లీ ఓటు వేసి మాధవ్‌ వంటి వారిని గెలిపిస్తే మాబోటి వాళ్లం నోరు తెరిస్తే ఒట్టు. 75 ఏళ్ల పార్లమెంటు చరిత్రలో గోరంట్ల మాధవ్‌ ఒక కళంకంగా నిలిచిపోయారు. ఇంతకు మునుపెన్నడూ పార్లమెంటు సభ్యులు ఎవరూ ఇటువంటి అప్రతిష్ఠ మూటగట్టుకోలేదు. ఎక్కడో ఉత్తరప్రదేశ్‌లో రైలు ప్రమాదం జరిగిందని నైతిక బాధ్యత వహించి మంత్రి పదవికి రాజీనామా చేసిన లాల్‌ బహదూర్‌ శాస్ర్తి వంటి మహనీయులు పునీతం చేసిన పార్లమెంటులోకి మాధవ్‌ వంటి వారు ఇప్పుడు ప్రవేశించారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాలు జరుపుకొంటున్న మనం సాధించిన ప్రగతి ఇదేనా? ఆజాదీ కా అమృతోత్సవ్‌ పేరిట స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి ఈ తరంలో దేశభక్తిని పెంపొందించాలని అనుకుంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనంగా ఉండటం తగునా? మాధవ్‌పై చర్య తీసుకోవాల్సిందిగా జగన్మోహన్‌ రెడ్డిని ప్రధానమంత్రి ఆదేశించలేరా? పార్టీ వేరైనా మోదీ ఈ దేశ ప్రధాని. ఇలాంటి పోకడలకు అడ్డుకట్ట వేయకపోతే మాధవ్‌ వంటి వాళ్లు మరింత బరితెగించి ప్రవర్తిస్తారు. దిగంబరంగా సంచరించడమే చట్టబద్ధమని ప్రచారం చేస్తారు. తప్పు చేస్తున్నావు అని చెప్పినవారి చెంపలే పగులగొడతారు. 


ఉచితాలకు ముకుతాడు పడేనా?

ఉచిత పథకాల విషయంలో ప్రజలకు ఉన్న బలహీనతే జగన్‌ వంటి వారు వెరపు లేకుండా ప్రవర్తించడానికి కారణం అవుతోంది. ఓట్ల కోసం అడ్డగోలుగా ఉచిత పథకాలు ప్రకటించడానికి అడ్డుకట్ట వేయాలని అనుకుంటున్నట్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రకటించడం ముదావహం. పదవీ విరమణ చేసే లోపు ఈ పోకడలకు విరుగుడు చర్యలు సూచించాలని అనుకుంటున్నట్టు ప్రధాన న్యాయమూర్తి చెప్పడం శుభ పరిణామం. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో సుముఖంగా ఉన్నందున ఇదే సరైన తరుణం. సంక్షేమం పేరిట అడ్డగోలుగా డబ్బు పంచే విధానానికి చెక్‌ పెట్టకపోతే చట్టసభలలో మాధవ్‌ వంటి వారే ఉంటారు. జగన్మోహన్‌ రెడ్డి వంటివాళ్లే ముఖ్యమంత్రులు అవుతారు. ఎన్ని తప్పుడు పనులు చేసినా ప్రజలు సహిస్తారు అన్న ధీమా వచ్చినప్పుడే మాధవ్‌ వంటి వారు తప్పు చేసి కూడా అడ్డగోలుగా సమర్థించుకుంటారు. వెధవ వేషాలు వేస్తే ప్రజలు కత్తిరిస్తారన్న భయం ఉంటే నైతిక విలువలకు కట్టుబడి ఉంటారు. రాజకీయాలలో విలువలు దిగజారిపోతున్నాయని ఆందోళన చెందని వారే లేరు. అలా ఎందుకు జరుగుతోంది అంటే, ఉచిత పథకాలే ప్రధాన కారణం. ప్రభుత్వాల ఆదాయంలో ఫలానా శాతానికి మించి సంక్షేమానికి ఖర్చు చేయకూడదన్న నిబంధన ఉంటే ఉచితాల జోలికి వెళ్లకుండా తమ ప్రవర్తన ద్వారా ప్రజల మనస్సు చూరగొనడానికి రాజకీయ నాయకులు కృషి చేస్తారు. జగన్‌ అండ్‌ కోలో కూడా వెరపు వచ్చి సెట్‌రైట్‌ అవుతారు. చూద్దాం.. పదవీ విరమణలోపు జస్టిస్‌ ఎన్వీ రమణ ఏ నిర్ణయం తీసుకుంటారో!

ఆర్కే


యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Updated Date - 2022-08-14T05:56:38+05:30 IST