‘పులివెందుల పులి’.. కాదు, పిల్లే!

ABN , First Publish Date - 2022-01-02T08:31:39+05:30 IST

తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచిందని అంటారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి విషయంలో నూతన సంవత్సరంలో ఇలాగే జరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. రెండున్నరేళ్ల క్రితం ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత దేవుడు ఎంత గొప్ప స్ర్కిప్ట్‌ రాశాడో...

‘పులివెందుల పులి’.. కాదు, పిల్లే!

తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచిందని అంటారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి విషయంలో నూతన సంవత్సరంలో ఇలాగే జరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. రెండున్నరేళ్ల క్రితం ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత దేవుడు ఎంత గొప్ప స్ర్కిప్ట్‌ రాశాడో అని జగన్‌రెడ్డి మురిసిపోయారు. ఆయన వరకు దేవుడు అప్పుడు గొప్ప స్ర్కిప్ట్‌నే రాశాడు. కానీ అది రాష్ర్టానికి మాత్రం శరాఘాతంలా మారింది. అదే సమయంలో జగన్‌రెడ్డి కూడా రెండున్నరేళ్ల తర్వాత చక్రవ్యూహంలో చిక్కుకుపోతున్నారు. బాబాయి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు త్వరలోనే ఓ కొలిక్కి రానుండగా, ముఖ్యమంత్రిపై సీబీఐ, ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్ల విచారణ కూడా నూతన సంవత్సరంలో ప్రారంభం కానుంది. ఈ రెండు అంశాలలో కీడును శంకిస్తున్న జగన్‌రెడ్డి వాటి నుంచి బయటపడటానికి ఢిల్లీలోని కేంద్రప్రభుత్వ పెద్దలను మచ్చిక చేసుకునే ప్రయత్నం ముమ్మరంగా చేయడంతో పాటు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అంటే ఇష్టం లేకపోయినా, సతీసమేతంగా ఆయనను కలుసుకుని మరీ గతంలో జరిగిన దానికి సారీ చెప్పుకొన్నారు. గతంలో జగన్‌ వదిలిన బాణం, ఆయనకోసం పాదయాత్ర కూడా చేసిన చెల్లి షర్మిల... బాబాయి వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో తనకు తెలిసిన విషయాలను సీబీఐ అధికారులకు వివరించడానికి సిద్ధపడుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేయించారనే విషయమై ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చిన సీబీఐ అధికారులు, మోటివ్‌ను ఎస్టాబ్లిష్‌ చేసే ప్రయత్నంలో ఉన్నారు. కుడి చేతితో ఎడమ చేయి నరుక్కుంటామా? అని జగన్‌రెడ్డి చెబుతున్నప్పటికీ కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. తండ్రీకొడుకులను అతి త్వరలో సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేయబోతున్నారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో జగన్‌ సోదరి షర్మిల సీబీఐ అధికారులకు తన వంతు సహకారం ఇవ్వబోతున్నారని సమాచారం. వివేకానందరెడ్డి జీవించి ఉన్నప్పుడు కడప లోక్‌సభ స్థానం నుంచి ‘‘అయితే నువ్వు లేదా నేను పోటీ చేయాలి గానీ.. అవినాశ్‌రెడ్డి పోటీ చేయడం ఏమిటి’’ అని షర్మిల వద్ద పదేపదే ప్రస్తావించేవారని తెలిసింది. అప్పట్లో షర్మిల కూడా ఈ వాదనతో ఏకీభవించారని చెబుతున్నారు. అయితే జగన్‌రెడ్డి మాత్రం బాబాయిని, చెల్లిని కాదని వరుసకు సోదరుడైన అవినాశ్‌రెడ్డి వైపు మొగ్గు చూపారు. ఈ విషయం తెలుసుకున్న సీబీఐ అధికారులు అప్పట్లో ఏం జరిగింది? అని షర్మిలను అడిగి తెలుసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం ఉంది. ‘‘కడప నుంచి మనిద్దరిలో ఎవరో ఒకరం పోటీ చేద్దాం’’ అని బాబాయి వివేకానందరెడ్డి సూచించిన విషయం వాస్తవమేనని సీబీఐ అధికారులకు షర్మిల మౌఖికంగా తెలిపినట్టు సమాచారం. సీబీఐ అధికారులు అడిగితే స్టేట్‌మెంట్‌ రూపంలో కూడా ఇదే విషయాన్ని చెప్పడానికి ఆమె సిద్ధపడుతున్నట్టు తెలిసింది. అదే జరిగితే వివేకానందరెడ్డి హత్యకు మోటివ్‌ లభించినట్టే అవుతుంది. అప్పుడు అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి చుట్టూ పూర్తిగా ఉచ్చు బిగుసుకుంటుంది. వివేకా హత్య జరిగినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్‌రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వైపు వేలెత్తి చూపారు. నారాసుర రక్త చరిత్ర అని తన నీలిమీడియా ద్వారా ప్రచారం చేయించారు. అది వాస్తవం కాదని కుడిచేయి ఎడమచేతిని నరికిందని సీబీఐ విచారణలో నిర్ధారణ అయితే జగన్‌రెడ్డికి నైతికంగా పెద్ద దెబ్బ తగిలినట్టు అవుతుంది. షర్మిల సాక్ష్యం అంటూ చెబితే మాత్రం సీబీఐ అధికారుల విచారణకు బలం చేకూరినట్టవుతుంది. ఆస్తుల వ్యవహారంతో పాటు రాజకీయపరమైన అంశాలపై సోదరుడు జగన్‌రెడ్డితో షర్మిల ఘర్షణ పడిన విషయం విదితమే. తెలంగాణలో తాను రాజకీయంగా బలపడకుండా సోదరుడు అడ్డుపడుతున్నారని షర్మిల ఇప్పటికే ఆగ్రహంగా ఉన్నారు. తాను ప్రారంభించిన వైఎస్సార్‌ తెలంగాణ పార్టీలో ముఖ్యనాయకులు చేరకుండా ఆయన తన అధికారాన్ని ఉపయోగించి అడ్డుకుంటున్నారని షర్మిల ఆగ్రహంగా ఉన్నారు. పార్టీని ప్రారంభించక ముందే ఆమెతో చేతులు కలుపుతానని తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ఒక మాజీ ఎంపీ హామీ ఇచ్చారు. అయితే జగన్‌రెడ్డి ఆ మాజీ ఎంపీకి ఫోన్‌ చేసి షర్మిల పార్టీలో చేరవద్దని గట్టిగా చెప్పినట్టు తెలిసింది. దీంతో సదరు మాజీ ఎంపీ అప్పటి నుంచి షర్మిలకు మొహం చాటేస్తున్నారు. ఇలాగే మరికొందరి విషయంలో కూడా జరిగింది. దీంతో అప్పటికే ఆగ్రహంగా ఉన్న షర్మిల, పదిరోజుల క్రితం ఇడుపులపాయ అతిథి గృహంలో సోదరుడు జగన్‌రెడ్డితో గొడవపడ్డారు. ‘‘నాకు అన్యాయం చేస్తే ఆ దేవుడు నీకు కూడా నష్టం చేస్తాడు.. నీవు పోగేసుకున్న సంపద నీకు దక్కకుండా ఆ దేవుడే చూసుకుంటాడు’’ అని ఆ సందర్భంగా ఆమె సోదరుడికి శాపనార్థాలు పెట్టినట్టు తెలిసింది. ‘‘తెలంగాణలో నేను రాజకీయంగా బలపడకుండా అడ్డుకుంటావా? ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా నిన్ను కూడా బలహీనపరుస్తాను’’ అని సోదరుడిని హెచ్చరించినట్టు సమాచారం. జగన్‌రెడ్డి గురించి తెలిసిన రాజశేఖర్‌రెడ్డి కుటుంబసభ్యులెవరూ అతడిని ఎదిరించి మాట్లాడరు. షర్మిల మాత్రం అందుకు విరుద్ధంగా సోదరుడి మొహం మీదే తన మనసులో ఉన్నదంతా వెళ్లగక్కారు. ఘర్షణ అనంతరం తల్లి విజయమ్మను వెంటబెట్టుకుని రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతంలో తండ్రి రాజశేఖర్‌రెడ్డి సమాధిని సందర్శించి నివాళులర్పించిన షర్మిల, అక్కడి నుంచి హైదరాబాద్‌ వెళ్లిపోయారు. ఆ మరుసటి రోజు క్రిస్మస్‌ సందర్భంగా ఇడుపులపాయలో కేక్‌ కట్‌ చేసే కార్యక్రమంలో భాస్కర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డితో పాటు రాజశేఖర్‌రెడ్డి సోదరులు సుధీకర్‌రెడ్డి, రవీంద్రరెడ్డి, సోదరి విమల కూడా పాల్గొన్నారు. ఈ విషయంలో కూడా షర్మిల తన అభ్యంతరం చెప్పినట్టు తెలిసింది. సొంత సోదరుడైన వివేకాను హత్య చేయించినవారితో కలిసి క్రిస్మస్‌ వేడుకల్లో ఎలా పాల్గొంటారని సుధీకర్‌, రవీంద్రను డాక్టర్‌ సునీత, షర్మిలలో ఒకరు ప్రశ్నించినట్టు తెలిసింది. వివేకాను వాళ్లు హత్య చేయించారని రుజువు కాలేదు కదా? అని వారు సమర్థించుకునే ప్రయత్నం చేయబోగా, ‘రేపు మీదాకా వస్తే గానీ మీకు తెలియదు’ అని అన్నట్టు చెబుతున్నారు.


భారతీరెడ్డికీ ఫోన్‌?

షర్మిల సాక్ష్యం కోసం సీబీఐ అధికారులు ప్రయత్నం చేయడం, సాక్ష్యం చెప్పడానికి ఆమె కూడా సిద్ధంకావడంతో ఇటు జగన్‌, అటు అవినాశ్‌రెడ్డి కుటుంబంలో ఆందోళన మొదలైంది. భాస్కర్‌రెడ్డిని, అవినాశ్‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేయబోతున్నారని కొద్ది రోజులుగా ప్రచారంలో ఉంది. వివేకా హత్య జరిగిన రోజు అవినాశ్‌రెడ్డి ఎవరెవరికి ఫోన్‌ చేశారన్న సమాచారం కూడా సీబీఐ అధికారులు సేకరించారు. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి సతీమణి భారతీరెడ్డికి కూడా అవినాశ్‌రెడ్డి ఫోన్‌ చేశారని రాజశేఖర్‌రెడ్డి కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ విషయమై భారతీ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తారో లేదో తెలియదు. ఈ పరిణామాలు ఎటు నుంచి ఎటు దారితీస్తాయో చూడాలి. వివేకా హత్య కేసులో షర్మిల స్టేట్‌మెంట్‌ అంటూ ఇవ్వడం జరిగితే అదొక కీలక పరిణామం అవుతుందని మాత్రం చెప్పవచ్చు. ఈ కేసులో సీబీఐ అధికారులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని అంటున్నారు. కేంద్రంలో పెద్దల వద్ద ఎంత అణిగిమణిగి ఉంటున్నప్పటికీ జగన్‌రెడ్డికి ఇప్పటివరకు వారి నుంచి ఎటువంటి ఉపశమనం లభించలేదని చెబుతున్నారు. అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిని నిందితులుగా సీబీఐ అధికారులు నిర్ధారించి అరెస్ట్‌ చేస్తే మాత్రం ఇప్పటివరకు వారిద్దరినీ వెనకేసుకొస్తున్న జగన్మోహన్‌రెడ్డి ఆత్మరక్షణలో పడిపోతారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోకి రావాల్సిందిగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు చెందిన కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యులు షర్మిలను ఆహ్వానిస్తున్నారు. ఒకరిద్దరు కీలకమంత్రులు విజయమ్మతో టచ్‌లో ఉన్నారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి రావాల్సిందిగా వైసీపీకి చెందిన కొందరు ఇప్పటికే షర్మిలను ఆహ్వానించారు. అయితే ఈ కార్యక్రమానికి వెళ్లాలా? వద్దా? అని ఆమె తేల్చుకోలేకపోతున్నారు. వెళ్తే తనకు కలిగే ప్రయోజనం ఏమిటి? సోదరుడు జగన్‌రెడ్డికి జరిగే నష్టం ఏమిటి? అని ఆమె బేరీజు వేసుకుంటున్నారు. జగన్‌రెడ్డి అభీష్టానికి వ్యతిరేకంగా తాను ఆ కార్యక్రమానికి హాజరైతే సోదరుడి ప్రతిస్పందన ఎలా ఉండొచ్చన్న దానిపై తన సన్నిహితులతో ఆమె మంతనాలు జరుపుతున్నారు. వైసీపీ నాయకులెవరూ తనను కలవకుండా జగన్‌రెడ్డి కట్టడి చేస్తారన్న అభిప్రాయంతో ఉన్న షర్మిల, ప్రజల స్పందన ఎలా ఉంటుందా అని ఆరా తీస్తున్నారు. అయితే ఆస్తుల పంపకంలో అన్యాయం చేయడమే కాకుండా తెలంగాణలో కూడా రాజకీయంగా తనకు నష్టంచేస్తున్న సోదరుడిపై ప్రతీకారం తీర్చుకోవాలన్న పట్టుదలతో షర్మిల ఉన్నారు. ఈ క్రమంలో ఆమె అడుగులు ఎటు పడతాయో వేచి చూడాలి. కుటుంబసభ్యుల మధ్య గొడవలు రానేకూడదు.. వచ్చాయంటే అవి తీవ్రంగానే ఉంటాయి. దాయాదుల మధ్య పోరు మొదలవ్వనే కూడదు. ఒకసారి మొదలైతే ఒక పట్టాన పోనేపోదు. ప్రస్తుత పరిస్థితుల్లో వివేకా హత్యకేసు నుంచి అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డిని ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఎలా రక్షించుకుంటారో చూడాలి. అదే సమయంలో సోదరి షర్మిల ఆగ్రహాన్ని చల్లబర్చడానికి రాజీ ప్రయత్నాలకు దిగి వస్తారా? లేదా? అన్నది కూడా వేచి చూడాలి. జగన్‌ వేయబోయే అడుగులను బట్టి కుటుంబకలహాలు ఏ మలుపు తిరుగుతాయన్నది ఆధారపడి ఉంటుంది.


సారీ.. మన్నించండి జస్టిస్‌!

బాబాయి హత్యకేసు విచారణ ముగింపుదశకు చేరుకోవడంతోపాటు అవినీతి ఆరోపణలకు సంబంధించి తనపై సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసులు విచారణకు రావడంతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిలో ఆందోళన మొదలైనట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ కారణంతోనే భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ విజయవాడ పర్యటన సందర్భంగా ఆయన అసాధారణ రీతిలో వ్యవహరించారు. ఏ వ్యక్తినైతే భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమించకూడదంటూ ఆయనపై పలు ఆరోపణలు చేశారో, అదే జస్టిస్‌ రమణకు అపూర్వరీతిలో స్వాగతసత్కారాలు చేశారు. ఇదే జస్టిస్‌ రమణ కుమార్తెలపై రాజధాని భూముల్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారంటూ క్రిమినల్‌ కేసులు పెట్టిన విషయం మర్చిపోయి, సతీసమేతంగా వెళ్లి మరీ ఆయనను కలుసుకున్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమణ గౌరవార్థం రాష్ట్ర గవర్నర్‌ హై టీ ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం విడిగా మళ్లీ అదే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయదు. అయితే జగన్‌ ఇందుకు విరుద్ధంగా రాష్ట్రప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా మరో హై టీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, జస్టిస్‌ రమణకు తన మంత్రులను పరిచయం చేశారు. నిజానికి ఆ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులలో కొందరు గతంలో జస్టిస్‌ రమణను పరోక్షంగా విమర్శించినవారే. ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కాకుండా అడ్డుకోవడానికి ఆయనపై పలు ఆరోపణలు చేస్తూ అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బాబ్డేకు తాను స్వయంగా రాసిన లేఖను తన ముఖ్య సలహాదారు అజయ్‌ కల్లంతో విలేకరుల సమావేశంలో విడుదల చేయించిన ఘనత జగన్‌రెడ్డికి ఉంది. ఇప్పుడదే జగన్‌రెడ్డి తనకు ఏ మాత్రం ఇష్టం లేని జస్టిస్‌ రమణను అపూర్వ స్వాగతసత్కారాలతో మురిపించే ప్రయత్నం చేయడం విడ్డూరమే. తన మనుషులతో జస్టిస్‌ రమణ పేరు చివర చౌదరి అని తగిలించి మరీ ప్రచారం చేయించిన ముఖ్యమంత్రి, అప్పటి చర్యలకు ఏం సమాధానం చెబుతారు? జస్టిస్‌ ఎన్వీ రమణపై గతంలో అనేక నిందలు వేసి అవహేళన చేసి, చేయించిన జగన్‌రెడ్డి ఆయనకు అసాధారణ రీతిలో అతిథి మర్యాదలు చేయడం ఎవరికైనా ఆశ్చర్యం కలిగించకమానదు. నిజానికి సదరు కార్యక్రమాల రూపకల్పనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రస్తుతం కీలక అధికారిగా ఉన్న ఒకరితోపాటు, గతంలో అదే పదవిలో ఉండిన మరో అధికారి కీలక పాత్ర పోషించారు. ఈ ఇరువురు అధికారులు ముఖ్యమంత్రి తరఫున రాయబారం నడిపారు. దీంతో జగన్‌రెడ్డి  దంపతులను ప్రత్యేకంగా కలుసుకోవడానికి జస్టిస్‌ రమణ అంగీకరించారని తెలిసింది. ఈ సందర్భంగా గతంలో జరిగినదానికి తనను క్షమించవలసిందిగా ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఆయనను వేడుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ‘‘నిజానికి సారీ అని చెప్పడం చాలా చిన్న పదం. నేను చేసిన తప్పుకు సారీ అంటే సరిపోదు. కొంతమంది అప్పట్లో నన్ను తప్పుదారి పట్టించారు. వారి మాటలు నమ్మి నేను మీకు వ్యతిరేకంగా లేఖ రాశాను. పెద్ద మనసు చేసుకుని మన్నించండి’’ అని జగన్‌రెడ్డి ఈ సందర్భంగా ప్రాధేయపడినట్టు తెలిసింది. నిజానికి అతడి గురించి అందరూ అనుకునేదొకటి, ఇప్పుడు చూస్తున్నది మరొకటి. పులివెందుల పులి అని తన వందిమాగధులతో పిలిపించుకోవడం జగన్‌రెడ్డికి అమితానందాన్నిస్తుంది. ఆయన ఎవరి మాటా వినడు- ఎవరినీ లెక్క చేయడు అని ఇప్పటివరకు అందరూ భావించారు. అయితే పరిస్థితులు అనుకూలించనప్పుడు జగన్‌రెడ్డి పులి కాదు పిల్లిలా మారిపోతారని ఇప్పుడు రుజువైంది. ఢిల్లీ పెద్దల వద్ద తనకున్న సాన్నిహిత్యాన్ని అడ్డుపెట్టుకుని జస్టిస్‌ రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కాకుండా అడ్డుకోవడానికి జగన్‌ అండ్‌ కో ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశారు. తమ నాయకుడు సదరు ప్రయత్నాలలో సఫలీకృతుడవుతాడని భావించి వందిమాగధులు జస్టిస్‌ రమణపై తమ వంతుగా రాళ్లు వేశారు. ఇప్పుడదే మనుషులు జగన్‌రెడ్డి జావకారిపోవడంతో అదే జస్టిస్‌ రమణపై పూలవర్షం కురిపించారు. భారత ప్రధాన న్యాయమూర్తి ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు వెళ్లిన రోజే ఆయనను దృష్టిలో పెట్టుకుని జింబో పేరిట ఒకరు రాసిన వ్యంగ్య కవితను జగన్‌రెడ్డికి చెందిన నీలిమీడియాలో ప్రచురించారు. మరుసటి రోజు నుంచి అదే నీలి మీడియాలో జస్టిస్‌ రమణ కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. దీన్నిబట్టి జగన్‌రెడ్డి మనస్తత్వం అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు అని ఎవరైనా భావించకుండా ఉంటారా? నిజానికి విజయవాడలో జస్టిస్‌ రమణ, ముఖ్యమంత్రి జగన్‌కు మధ్య జరిగిన సమావేశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘‘అందరూ కళ్లకు గంతలు కట్టుకోండి. భారతదేశపు అత్యున్నత న్యాయాధికారితో దేశంలోనే అత్యంత తీవ్ర ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు సమావేశం అవుతున్నారు’’ అని పోస్టింగ్‌లు కూడా సోషల్‌ మీడియాలో దర్శనమిచ్చాయి. బ్యూటీ ఆఫ్‌ డెమోక్రసీ -ట్రాజెడీ ఆఫ్‌ డెమోక్రసీగా కూడా సదరు సమావేశాన్ని కొందరు అభివర్ణించారు. అయితే ఈ సమావేశంపై ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ జగన్‌రెడ్డి నిజరూపం ఏమిటో అందరికీ తేటతెల్లం కావడానికి అది ఉపయోగపడింది. తనపై అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసులు ఉండి ఉండకపోతే జస్టిస్‌ రమణ పర్యటనను ఆయన పట్టించుకుని ఉండేవారు కాదు. వాస్తవానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన తర్వాత తొలిసారిగా తిరుమల పర్యటనకు వచ్చిన జస్టిస్‌ రమణను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పట్టించుకోలేదు. జిల్లాకు చెందిన మంత్రులు కూడా ఆయనకు స్వాగతం చెప్పలేదు. ఇప్పుడదే చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏకంగా జస్టిస్‌ రమణ స్వగ్రామానికి వెళ్లి ఆయనకు స్వాగతం పలికారు. అక్కడ ఆయనను ప్రశంసల వర్షంలో ముంచెత్తారు. తన కేసుల నుంచి ఉపశమనం పొందడం కోసం జగన్‌రెడ్డి ఎంతకైనా దిగజారతారని ఈ ఉదంతంతో వెల్లడైంది. ఈ కారణంగానే రాష్ట్ర ప్రయోజనాలను కూడా పణంగా పెట్టి ఢిల్లీ పెద్దల వద్ద ప్రణమిల్లుతున్నారు. అదే క్రమంలో ఇప్పుడు జస్టిస్‌ రమణను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించారు. అయితే స్వాగతసత్కారాలకు, ‘సారీ’లకు భారత న్యాయవ్యవస్థ పొంగిపోదు-, లొంగిపోదు. ప్రశంసలకు పడిపోయి విమర్శలకు కుంగిపోతే అది న్యాయవ్యవస్థ ఎలా అవుతుంది? భావోద్వేగాలకు, రాగద్వేషాలకు అతీతంగా న్యాయవ్యవస్థ వ్యవహరిస్తున్నది కూడా. జగన్‌రెడ్డిపై ఎంతటి తీవ్రమైన అభియోగాలు నమోదైనప్పటికీ ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి కనుక కలుసుకోవడానికి జస్టిస్‌ రమణ అంగీకరించి ఉండవచ్చు. జగన్‌రెడ్డి ప్రస్తుతం నిందితుడు మాత్రమే. దోషిగా నిర్ధారణ కాలేదు. భారత ప్రధాన న్యాయమూర్తిని కలుసుకున్నంత మాత్రాన ఆయనపై విచారణకు వస్తున్న కేసులలో తీర్పులు తారుమారవుతాయని ఎవరూ భావించకూడదు. జగన్‌రెడ్డి కానీ, ఆయన తరఫున జస్టిస్‌ రమణతో సమావేశం ఏర్పాటు చేయించినవాళ్లు కానీ అలా భావిస్తే పప్పులో కాలేసినట్టే. అయితే వ్యవస్థలను చంద్రబాబు మాత్రమే మేనేజ్‌ చేస్తారని ఇప్పటివరకు నిందిస్తూ వస్తున్న జగన్‌రెడ్డికి ఇకపై ఆ అవకాశం కూడా ఉండదు. న్యాయవ్యవస్థను మేనేజ్‌ చేద్దామన్న ఉద్దేశంతోనే భారత ప్రధాన న్యాయమూర్తిని కలిశానని ఆయన చెప్పగలరా? ఇప్పటివరకు న్యాయస్థానాలు తన ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబట్టిన ప్రతి సందర్భంలోనూ వ్యవస్థలను ఎవరో మేనేజ్‌ చేస్తున్నారని జగన్‌ అండ్‌ కో నిందిస్తూ వచ్చింది. ఇప్పుడు దానికి ఆ అవకాశం కూడా ఉండదు. నిజానికి జస్టిస్‌ రమణ, జగన్‌రెడ్డి మధ్య జరిగిన సమావేశం వల్ల ఒక విధంగా న్యాయవ్యవస్థకే ఉపశమనం లభించిందని చెప్పవచ్చు. రానున్న రోజులలో ప్రభుత్వ నిర్ణయాలపై వచ్చే తీర్పులు గానీ, జగన్‌రెడ్డిపై విచారణకు రానున్న కేసులలో తీర్పులు ఎలా ఉన్నప్పటికీ న్యాయవ్యవస్థను జగన్‌ అండ్‌ కో శంకించలేరు. ఇప్పటివరకు జగన్‌ అండ్‌ కో నుంచి ఎదురవుతున్న దాడితో న్యాయవ్యవస్థ ఎంతో ఒత్తిడికి గురైంది. ఇప్పుడు ఆ ఒత్తిడి నుంచి దానికి ఉపశమనం లభించిందని భావించవచ్చు. ‘అంతన్నాడు.. ఇంతన్నాడు.. గంగరాజు..’ అన్నట్టుగా జగన్‌రెడ్డి ఇప్పటిదాకా ఇచ్చింది కూడా బిల్డప్‌ మాత్రమే అని తేలిపోయింది. కనుక పులివెందుల పులి వంటి టైటిల్స్‌ ఆయనకు నప్పవు. తానెంతగానో ద్వేషించిన జస్టిస్‌ రమణతో సమావేశం కావడం కోసం, ఆయనకు స్వాగతసత్కారాలు చేయడం కోసం జగన్‌ పరితపించవలసి రావడం విధి ఆడే నాటకంలో ఒక భాగం మాత్రమే. నూతన సంవత్సరంలో జగన్‌రెడ్డి జీవితంలో ఇటువంటి నాటకాలతో పాటు ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూద్దాం!!

ఆర్కే


యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Updated Date - 2022-01-02T08:31:39+05:30 IST