బీజేపీకి మేలు చేసేలా కేసీఆర్‌ ఎత్తుగడలు

ABN , First Publish Date - 2022-10-09T06:00:30+05:30 IST

జాతీయ పార్టీని ప్రారంభించి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నానని చాలా రోజులుగా ప్రకటిస్తూ వస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చివరికి విజయ దశమి రోజున తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా...

బీజేపీకి మేలు చేసేలా కేసీఆర్‌ ఎత్తుగడలు

జాతీయ పార్టీని ప్రారంభించి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నానని చాలా రోజులుగా ప్రకటిస్తూ వస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చివరికి విజయ దశమి రోజున తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మారుస్తున్నట్టు ప్రకటించారు. ఆ వెంటనే టీఆర్‌ఎస్‌కు చెందిన నాయకులు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు చేసుకున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా ఎందుకు మార్చారో, పేరు మార్చుకోవడం ద్వారా జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌ ప్రకంపనలు ఎలా సృష్టిస్తారో పార్టీ సర్వసభ్య సమావేశానికి హాజరైన వారికి గానీ, సంబురాలు చేసుకున్నవారిలో అత్యధికులకు గానీ తెలియదు. కేసీఆర్‌ ఆలోచన ఏమిటో, దేశ రాజకీయాలలో ఆయన కీలక భూమిక ఎలా పోషించబోతున్నారో పార్టీ ముఖ్యులకు కూడా తెలియకపోవడానికి కారణం లేకపోలేదు. భారత రాష్ట్ర సమితి విషయమై కేసీఆర్‌ తన ఆలోచనలను పార్టీ నాయకులతో పంచుకోలేదు. ఆయన ఆదేశాల ప్రకారం సర్వసభ్య సమావేశానికి వచ్చారు. సంబురాలు జరిపించారు. అయితే కేసీఆర్‌ తీసుకున్న ఈ నిర్ణయంపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తెలంగాణ ప్రజల మనోభావాలతో పెనవేసుకుపోయిన తెలంగాణ రాష్ట్ర సమితి అస్తిత్వం కోల్పోవడాన్ని ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. రెండు దశాబ్దాల క్రితం తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసిన కేసీఆర్‌, తెలంగాణ సమాజంలో ప్రత్యేక రాష్ట్ర వాంఛను వ్యాపింపజేశారు. అనేక మంది సహకారంతో పుష్కర కాలంపాటు పోరాటం చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారు. దీంతో తెలంగాణను, కేసీఆర్‌ను విడదీసి చూడలేని పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర సమితిని తెలంగాణ ప్రజల ఇంటి పార్టీగా ప్రచారం చేశారు. టీఆర్‌ఎస్‌తో పాటు కారు గుర్తు కూడా ప్రజల్లోకి వెళ్లిపోయింది. తెలంగాణ అంటే టీఆర్‌ఎస్‌గా, టీఆర్‌ఎస్‌ అంటే తెలంగాణగా ఆ పార్టీ ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. రాజకీయంగా బలహీనపడినప్పుడల్లా తెలంగాణ సెంటిమెంటును రగిలిస్తూ తన బలాన్ని కాపాడుకుంటూ వచ్చిన కేసీఆర్‌, ఇప్పుడు ఈ నిర్ణయంతో తెలంగాణ సెంటిమెంటు అనే అస్ర్తాన్ని స్వయంగా వదులుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జాతీయ రాజకీయాల విషయం అటుంచితే, స్వరాష్ట్రంలోనే ఈ నిర్ణయం కేసీఆర్‌కు నష్టం చేకూరుస్తుందన్న అభిప్రాయం కూడా గట్టిగా వినిపిస్తోంది. నిజానికి కేసీఆర్‌ చేస్తున్న ఈ హడావిడి పట్ల టీఆర్‌ఎస్‌కు చెందిన కీలక నేతలు సైతం విముఖంగా ఉన్నారు. ప్రధానమంత్రి కావాలన్న కోరికతో తెలంగాణ ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలం కొనసాగే అవకాశాన్ని కేసీఆర్‌ కోల్పోయే అవకాశం ఉందని పలువురు కీలక నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఏ పార్టీ అయినా జాతీయ పార్టీగా ఎన్నికల కమిషన్‌ వద్ద గుర్తింపు పొందాలంటే చాలా తతంగం ఉంటుంది. తమది జాతీయ పార్టీ అని ఎవరికి వారు ప్రకటించుకున్నంత మాత్రాన చెల్లుబాటు కాదు. ఒకప్పుడు ఎన్టీఆర్‌ కూడా తెలుగుదేశం పార్టీని భారతదేశం పార్టీగా మార్చాలనుకున్నారు. అయితే పార్టీ ముఖ్యుల సూచన మేరకు ఆ ఆలోచనను ఆయన విరమించుకున్నారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకత్వం చేపట్టిన చంద్రబాబు కూడా తమది జాతీయ పార్టీ అని ప్రకటించుకున్నారు. పేరులో ‘జాతీయ’ అన్న పదం తప్పితే తెలుగుదేశం పార్టీ ఇతర రాష్ర్టాల్లో పోటీ చేసిందీ లేదు, గెలిచిందీ లేదు. దీంతో ఎన్నికల కమిషన్‌ వద్ద తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీగానే గుర్తింపు పొందుతోంది. ఈ కారణంగా సైకిల్‌ గుర్తు తెలుగు రాష్ర్టాలకే పరిమితమైంది. ఇప్పుడు కేసీఆర్‌ వంతు వచ్చింది. రాజకీయంగా తాను ఏ నిర్ణయం తీసుకున్నా విజయం తథ్యం అన్న మితిమీరిన విశ్వాసంతో కేసీఆర్‌ ఉన్నారు. సొంతంగా ఆలోచించకుండా ఆయన తెలివిగలవాడు అని మాత్రమే నమ్మేవారు కేసీఆర్‌ మాటలనే వల్లె వేస్తుంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నియంతృత్వ పోకడలు భరించలేనంతంగా ఉంటున్నందున తాను నడుం బిగించాల్సి వచ్చిందని కేసీఆర్‌ చెబుతున్నారు. మోదీని ఎదిరించే విషయంలో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా మెత్తబడిపోయారని, ఈ పరిస్థితులలో తాను కార్యరంగంలోకి దూకుతున్నానని కేసీఆర్‌ చెబుతున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర సమితి పేరును మార్చుకోవడం తెలివైన చర్య కాదన్నది విస్తృత అభిప్రాయంగా ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని తెలుగుదేశం పార్టీ పోటీ చేయడంతో ‘ఇంకేముందీ, టీఆర్‌ఎస్‌ ఓడిపోతే మళ్లా ఆంధ్రా వాళ్ల పెత్తనం షురూ అవుతుంది’ అని కేసీఆర్‌ సెంటిమెంటు రగిలించి ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. ఇప్పుడు ఆయనే ఇతర రాష్ర్టాలలో పోటీ చేయాలని భావిస్తున్నందున ఇకపై తెలంగాణ సెంటిమెంటు కార్డును వాడుకొనే అవకాశం కోల్పోతారు. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్రలలో కొన్ని సీట్లలో పోటీ చేయాలని కేసీఆర్‌ భావిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ విషయమే తీసుకుందాం, కాలు జారినా తీసుకోవచ్చును గానీ, నోరు జారితే వెనక్కు తీసుకోలేమంటారు. ఉద్యమ సమయంలో ఆంధ్రావాళ్లను నీచంగా తిడుతూ కేసీఆర్‌ చేసిన ప్రసంగాల వీడియోలు ఇప్పుడు చలామణిలోకి వచ్చాయి. ఆ మాటలు విన్న ఆంధ్రావాళ్లు ఎవరూ కేసీఆర్‌కు ఓటు వేయరు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులతో తనకు ఉన్న పూర్వ పరిచయాలతో వారిలో కొందరినైనా భారత రాష్ట్ర సమితిలో చేర్చుకోవాలని కేసీఆర్‌ భావిస్తున్నట్టు కూడా వార్తలొచ్చాయి. ఈ చేరికలు జరుగుతాయో లేదో తెలియదు గానీ, తెలుగుదేశం నుంచి చీలికలను ప్రోత్సహిస్తే ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డికి మేలు చేయడానికి కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారు అన్న ప్రచారం మొదలవుతుంది. అదే జరిగితే ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్‌ఎస్‌ సంగతి అటుంచితే తెలంగాణలో కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఆంధ్రా మూలాలు ఉన్నవారు సంఘటితం అవుతారు. ఇది ఆయనకు ఇప్పటికిప్పుడు జరిగే నష్టం. ఇక కర్ణాటక విషయానికి వస్తే జేడీయూ నేత కుమారస్వామి ఒక్కరే కేసీఆర్‌తో పాటు నడవబోతున్నట్టు ప్రకటించారు. అయితే బీఆర్‌ఎస్‌ తమ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని, సరిహద్దు జిల్లాలలో కొన్ని లోక్‌సభ సీట్లకు పోటీ చేసుకోవచ్చునని కుమారస్వామి చెప్పుకొచ్చారు. బీఆర్‌ఎస్‌కు కర్ణాటకలో బలం ఉంటే కుమారస్వామి అనుమతి అవసరం ఉండదు. అయితే ఆ పరిస్థితి లేదు. కర్ణాటకలో వచ్చే ఏడాది ప్రథమార్థంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా ఆర్థిక సహాయం చేస్తానని కేసీఆర్‌ నమ్మబలకడంతో ఆయనతో ఫొటోలు దిగడానికి కుమారస్వామి అంగీకరిస్తున్నారు. కర్ణాటకలో కుమారస్వామి పార్టీ ఉప ప్రాంతీయ పార్టీ వంటిది. మొన్నటివరకు కాంగ్రెస్‌ మద్దతుతో ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన, బీజేపీ ఆపరేషన్‌ పుణ్యమా అని పదవిని కోల్పోయారు. ఎన్నికల్లో 30 నుంచి 40 స్థానాలు గెలుచుకొని ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్‌, బీజేపీలతో బేరం పెట్టుకోవడం కుమారస్వామికి అలవాటే. ఇప్పుడు ఆర్థికంగా గిట్టుబాటు అవుతుందనే ఉద్దేశంతో జాతీయ స్థాయిలో కేసీఆర్‌తో కలసి నడుస్తానని ఆయన ప్రకటించారు. కర్ణాటకలోని తెలుగువారి ఓట్లపై కేసీఆర్‌ కన్నుపడినట్టుంది. అయితే కర్ణాటకలో స్థిరపడిన తెలుగువారిలో అత్యధికులు ఆంధ్రావాళ్లు కావడం గమనార్హం. ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే అక్కడ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని కేసీఆర్‌ భావిస్తున్నారో తెలియదు. బీజేపీ కొట్టిన దెబ్బతో అధికారం కోల్పోయి సొంత పార్టీ శివసేన కూడా చేజారే పరిస్థితుల్లో చిక్కుకున్న ఉద్దవ్‌ ఠాక్రేతో చేతులు కలిపే అవకాశం లేదు. మహారాష్ట్రలో మజ్లిస్‌ పార్టీతో కలసి పోటీ చేయాలని ఆయన ఆలోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే ఆ రాష్ట్రంలోని ఏ పార్టీ కూడా కేసీఆర్‌తో జత కట్టడానికి ముందుకు రాకపోవచ్చు. అయితే తెలంగాణ సరిహద్దు గ్రామాల్లోని ప్రజలు కొద్దిమంది బీఆర్‌ఎస్‌ వైపు మొగ్గు చూపవచ్చు. ఎన్నికల్లో గెలవడానికి ఆ కొద్దిమంది బలం సరిపోదు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటకలో భారత రాష్ట్ర సమితి పరిస్థితి ఇది. ఇక ఉత్తరాది రాష్ర్టాల విషయానికి వస్తే అక్కడ బీఆర్‌ఎస్‌ ప్రభావం చూపుతుందని చెప్పలేని పరిస్థితి. ఆ రాష్ర్టాల్లోని నాయకులకు సొంత ఎజెండాలు ఉన్నాయి. ఎవరి ఆకాంక్షలు వారివి. జాతీయ రాజకీయాల్లో ఎవరు కీలక పాత్ర పోషించాలనుకున్నా సంఖ్యా బలం అవసరం. ఈ కారణంగానే కేసీఆర్‌ 60 లోక్‌సభ స్థానాలపై గురిపెట్టినట్టు వార్తలు వచ్చాయి. నిజంగా మిత్రపక్షాల సహకారంతో కేసీఆర్‌ 60సీట్లు గెలుచుకోగలిగితే ఆయన జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించవచ్చు. అయితే 60 సీట్లు సాధ్యమా? అన్నది ప్రశ్న. మొత్తానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తానే ప్రత్యామ్నాయం అని రుజువు చేసుకోవాలన్న తపనతో కేసీఆర్‌ ఉన్నారు. తన నాయకత్వం కోసం దేశ ప్రజలందరూ ఎదురు చూస్తున్నట్టుగా కేసీఆర్‌ తన సొంత పత్రికల్లో ప్రచారం చేసుకుంటున్నారు. ఆ ప్రచారం చూస్తే కేసీఆర్‌ ప్రధానమంత్రి అయిపోయినట్టేనని పలువురు భ్రమించే అవకాశం ఉంది. దక్షిణాదికి చెందినవాళ్లు జాతీయ రాజకీయాల్లో రాణించడం ఆషామాషీ విషయం కాదు. సంఖ్యాపరంగా ఉత్తరాది రాష్ర్టాలే డామినేట్‌ చేస్తాయి. దక్షిణాది రాష్ర్టాల్లో బలంగా ఉన్నామనుకొనేవారు ఎవరూ కేసీఆర్‌తో కలసి నడిచేందుకు సిద్ధంగా లేరు. ఈ కారణంగా కేసీఆర్‌ కలల ప్రపంచంలో విహరిస్తున్నారా? అన్న సందేహం కలుగక మానదు. జాతీయ రాజకీయాలలో భారతీయ జనతా పార్టీ ఆధిపత్యాన్ని దెబ్బకొట్టడానికే తాను కార్య రంగంలోకి దూకుతున్నట్టు కేసీఆర్‌ ప్రకటిస్తున్నప్పటికీ, ఈ విషయంలో ఆయన చిత్తశుద్ధిపై పలువురు సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని మరింత బలహీనపర్చడానికి కేసీఆర్‌ స్కెచ్‌ వేస్తున్నారు. రాహుల్‌ గాంధీ పాదయాత్ర సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఒకరిద్దరు ఎంపీలు బీఆర్‌ఎస్‌లో చేరతారని మంత్రి కేటీఆర్‌ శుక్రవారం ప్రకటించారు. అంటే, కాంగ్రెస్‌ పార్టీ మరింతగా బలహీనపడాలని కేసీఆర్‌ కోరుకుంటున్నట్టే కదా? అపుడు తెలంగాలో బీజేపీ మరింత పుంజుకుంటుంది. తమ అధికారానికి సవాలుగా మారిన బీజేపీకి మేలు చేకూర్చే విధంగా కేసీఆర్‌ ఎత్తుగడలు ఎందుకుంటున్నాయో తెలియదు. కర్ణాటక, మహారాష్ట్రలో కూడా కేసీఆర్‌ పెట్టుకోవాలనుకుంటున్న పొత్తులు కాంగ్రెస్‌కు నష్టం చేసి, బీజేపీకి మేలు చేసే విధంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి ద్వారా తాను బీజేపీని ఎలా కట్టడి చేయబోయేదీ తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌ ముందుగా వివరించి నచ్చజెప్పవలసి ఉంది. లేని పక్షంలో మొదటికే మోసం వస్తుంది. తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మార్చాలని నిర్ణయించడానికి ముందు టీఆర్‌ఎస్‌లో మేధోమథనం జరిగి ఉంటే అనేక సందేహాలకు సమాధానాలు దొరికివుండేవి. కేసీఆర్‌ తన ఆలోచనలను పార్టీలో ఎవరితోనూ పంచుకోలేదు కనుక భారత రాష్ట్ర సమితి ఏమిటో? దాని భవిష్యత్తు ఏమిటో? ఎవరికీ తెలియదు. ఇప్పటివరకు కేసీఆర్‌ ఏం చేసినా ఆయనకు కలసి వచ్చినందున ఇప్పుడు కూడా టీఆర్‌ఎస్‌ పేరు మార్చి బీఆర్‌ఎస్‌ అని పెట్టడం కూడా కలసివస్తుందని, కేసీఆర్‌ ప్రధానమంత్రి అయినా ఆశ్చర్యం లేదని నమ్మేవారు గులాబీ పార్టీలో గణనీయంగానే ఉన్నారు. అయితే జాతీయ రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్‌ విఫలమైనందున ఆ పాత్రను బీఆర్‌ఎస్‌ పోషిస్తుందని కేసీఆర్‌ అండ్‌ కో చెబుతున్నారు గానీ అదెలాగో సమాధానం మాత్రం లభించడం లేదు.


మునుగోడు తొలి సవాల్‌!

జాతీయ నాయకుడిగా గుర్తింపు పొంది ప్రధానమంత్రి అవ్వాలంటే కేసీఆర్‌ ఎన్నో విషమ పరీక్షలను అధిగమించవలసి ఉంది. విజయ దశమి రోజు ఆయన ప్రకటించిన భారత రాష్ట్ర సమితికి జాతీయ పార్టీ గుర్తింపు రావాలంటే ఎన్నికల కమిషన్‌ షరతులకు అనుగుణంగా ఫలితాలను చూపించవలసి ఉంటుంది. వచ్చే నెలలో గుజరాత్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేసే విషయమై కేసీఆర్‌ చప్పుడు చేయడం లేదు. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, బిహార్‌ వగైరా రాష్ర్టాల్లో ఎన్నికలు జరుగుతాయి. ప్రగతిభవన్‌లో జరిగే సమావేశాలకు రైతు నాయకుల పేరిట ఉత్తరాదికి చెందిన ఎవరెవరినో కేసీఆర్‌ పిలిపించుకొని పక్కన కూర్చోబెట్టుకుంటుంటారు. వారెవరో తెలంగాణ ప్రజలకు తెలియదు. రైతు నాయకులను మాత్రమే నమ్ముకొని ఉత్తరాదిన రాజకీయాలు చేయాలనుకుంటున్నారేమో తెలియదు. తెలంగాణ మోడల్‌ దేశానికి రోల్‌ మోడల్‌ అవుతుందని కేసీఆర్‌ నమ్ముతున్నారు. తెలంగాణ యువత మాత్రం కేసీఆర్‌ కుటుంబాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ కారణంగా జాతీయ రాజకీయాలు అంటూ హడావిడి చేయడం ద్వారా తెలంగాణ సమాజంపై మళ్లీ పట్టు సంపాదించుకోవడానికి కేసీఆర్‌ ఎత్తుగడ వేశారని భావిస్తున్న వాళ్లు కూడా ఉన్నారు. కేసీఆర్‌ ఎత్తుగడలను పసిగట్టడం అంత తేలిక కాదు. అనాలోచిత నిర్ణయాలు తీసుకొని చేతిలో ఉన్న అధికారాన్ని వదులుకొనేంత అమాయకుడేం కాదు కేసీఆర్‌. తెలంగాణలో తాను చేయడానికి ఇంకేమీ లేదని ఆయన నమ్ముతున్నారు. 2018 ఎన్నికలకు ముందు నుంచే ఆయన ఈ అభిప్రాయంతో ఉన్నారు. జాతీయ రాజకీయాలు అనే పురుగు చాలా ఏళ్ల క్రితమే ఆయనలో ప్రవేశించింది. తన శక్తియుక్తులకు తెలంగాణ రాష్ట్రం తగిన మైదానం కాదని కేసీఆర్‌ భావిస్తున్నట్టుగా ఉంది. కంటి సైగతో తెలంగాణను పాలించిన కేసీఆర్‌కు బోర్‌ కొట్టినట్టుంది. అందుకే దేశాన్ని కూడా తన కనుసైగలతో పాలించాలని అనుకుంటున్నారేమో తెలియదు. కేసీఆర్‌ మాటల మాంత్రికుడు అన్న విషయం అందరికీ తెలిసిందే. తనకున్న టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలతో జాతీయ రాజకీయాలను కూడా శాసించాలని ఆయన కోరుకుంటున్నట్టుగా ఉంది. అందుకే తెలంగాణ మైదానాన్ని వదిలి భారతదేశాన్నే తన ఆటకు మైదానంగా మలచుకోవాలని ఆయన తలపోస్తున్నట్టు ఉంది. ఈ ఆటలో ఆయన గోల్‌ కొడతారా? లేక బోల్తా పడతారా? అన్నది వేచి చూడాలి. అయితే టీఆర్‌ఎస్‌లోని ఆలోచనాపరులు మాత్రం కేసీఆర్‌ వ్యూహాలను చూసి భయపడుతున్నారు. ఇదంతా అయ్యేది కాదు పొయ్యేది కాదని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆ విషయం ఆయన వద్ద ప్రస్తావించడానికి ఎవరికీ ధైర్యం చాలడం లేదు. కేసీఆర్‌ ఆదేశాలను ప్రస్తుతానికి వీరవిధేయులుగా అమలు చేస్తున్నారు. తెలంగాణ సమాజం కూడా గుంభనంగా ఉంది. కేసీఆర్‌ తెలివితేటలపై అపారమైన నమ్మకం ఉన్నవారు మాత్రం అంతా మంచే జరుగుతుందన్న భరోసాతో ఉన్నారు. జాతీయ రాజకీయాల కోసం సొంత విమానం సమకూర్చుకోవాలన్న నిర్ణయం మాత్రం కేసీఆర్‌కు నష్టం చేసేదిగా ఉంది. భారతదేశ చరిత్రలో ఇంతవరకూ ఏ రాజకీయ పార్టీకి కూడా సొంత విమానం లేదు. అలాంటిది కేసీఆర్‌ సొంతానికి విమానం కొనుగోలు చేయడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయింది. దీంతో కేసీఆర్‌ వద్ద లెక్కలేనంత ధనం ఉందన్న ప్రచారం ఊపందుకుంది. ఎనిమిదిన్నరేళ్లుగా అధికారంలో ఉన్న కేసీఆర్‌ వద్ద అంత డబ్బు ఎలా చేరింది? అన్నది ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశమైంది. ఫలితంగా కేసీఆర్‌ నిజాయితీపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. మరోవైపు బీజేపీ అగ్రనేతలు కేసీఆర్‌ కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. కేసీఆర్‌ ఎత్తుగడలు తమకు నిజంగానే నష్టం చేస్తాయన్న అనుమానాలు బలపడిన మరుక్షణం బీజేపీ పెద్దలు తమదైన శైలిలో ప్రతిచర్యకు ఉపక్రమిస్తారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్‌ ఎంచుకున్నది ముళ్లబాటేనా? లేక పూలబాటా? అన్నది తేలాలంటే మరికొంత కాలం వేచి చూడాలి. లోక్‌సభ ఎన్నికలు 2024లో జరుగుతాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023 చివర్లో జరుగుతాయి. ఈలోపు మునుగోడు ఉప ఎన్నిక వచ్చిపడింది. మునుగోడులో ప్రస్తుతానికి వాతావరణం టీఆర్‌ఎస్‌కు అనుకూలంగానే ఉంది. పోలింగ్‌కు ఇంకా 24 రోజుల వ్యవధి ఉంది. ఈలోపు ఏమైనా జరగొచ్చు. మునుగోడులో కాంగ్రెస్‌ పార్టీ ఏ మాత్రం బలహీనపడినా భారతీయ జనతా పార్టీ పుంజుకుంటుంది. ఏ కారణం చేతనైనా మునుగోడులో టీఆర్‌ఎస్‌ విజయం సాధించకపోతే జాతీయ రాజకీయాల సంగతేమో గానీ తెలంగాణలోనే కేసీఆర్‌కు కష్టాలు మొదలవుతాయి. మునుగోడులో బీజేపీ విజయం సాధిస్తే కాంగ్రెస్‌– టీఆర్‌ఎస్‌ నుంచి ఆ పార్టీలోకి చేరికలు పెరుగుతాయి. అంతిమంగా అది 2023లో తెలంగాణలో కేసీఆర్‌ అధికారానికి ముప్పుగా మారుతుంది. ధన బలం విషయంలో కేసీఆర్‌తో పోటీపడగలిగే స్థితిలో ఉన్నది భారతీయ జనతా పార్టీ మాత్రమే. సాధారణంగా బీజేపీ కేంద్ర నాయకులు ఉప ఎన్నికల్లో అభ్యర్థులకు ఆర్థిక సాయం అందించరు. మొదటిసారిగా హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌కు కొంత మేరకు ఆర్థిక సహాయం చేశారు. ఇప్పుడు మునుగోడు స్థానానికి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా చేయడానికి బీజేపీ పెద్దల ఒత్తిడే కారణం కనుక ఆయనకు అడిగినంత ఆర్థిక సహాయం అందించడానికి పార్టీ సిద్ధంగా ఉందని చెబుతున్నారు. టీఆర్‌ఎస్‌–బీజేపీలతో ధన బలం విషయంలో కాంగ్రెస్‌ పోటీ పడగలదా? అంటే అనుమానమే! మునుగోడు ఉప ఎన్నిక మిగతా పార్టీలతో పోల్చితే టీఆర్‌ఎస్‌కు అత్యంత కీలకం. భారత రాష్ట్ర సమితి ప్రకటన నేపథ్యంలో మునుగోడులో తెలంగాణ రాష్ట్ర సమితి ఓడిపోతే జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌ ఆశలు గల్లంతవుతాయి. ఆయన నవ్వులపాలవుతారు. ఈ కారణంగానే కేసీఆర్‌ తన చతురంగ బలాలను మునుగోడులో మోహరింపజేశారు. బీజేపీ తరఫున ప్రచారానికి కూడా దాదాపు పది వేల మంది రంగంలోకి దిగుతున్నారు. ఆరెస్సెస్‌ కార్యకర్తలు ఇదివరకే క్షేత్రస్థాయిలో వాలిపోయారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ఎంపీలు తమ పార్టీలో చేరబోతున్నారని కేటీఆర్‌ చేసిన ప్రకటన ఆశ్చర్యం కలిగించక మానదు. బీజేపీ నుంచి అసలైన ప్రమాదం పొంచి ఉందని కళ్ల ముందు కనిపిస్తున్నప్పటికీ ఆ పార్టీని మరింత బలపర్చడానికి టీఆర్‌ఎస్‌ ప్రయత్నించడం వింతగా కనిపిస్తున్నది. ప్రస్తుతానికి జాతీయ రాజకీయాల గురించి కేసీఆర్‌ అండ్‌ కో ఎన్ని ప్రకటనలు చేసినా ముందుగా మునుగోడు, తర్వాత 2023 ఎన్నికలు, ఆ తర్వాత మాత్రమే అసలైన సినిమా ఏమిటో మన కళ్ల ముందు సాక్షాత్కారం అవుతుంది. ప్రస్తుతానికి మునుగోడు ట్రైలర్‌ చూసి ఆనందిద్దాం. ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌ పాత్రపై ఎవరికి వారు ఊహాగానాలు చేసుకోవచ్చు. ఇంట గెలిచి రచ్చ గెలవడానికి కేసీఆర్‌ ప్రయత్నిస్తారా లేక ప్రధానమంత్రి పదవిపై ఆశతో ఉన్న పదవిని కూడా పోగొట్టుకుంటారో వేచి చూడాల్సిందే!

ఆర్కే


యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Updated Date - 2022-10-09T06:00:30+05:30 IST