‘మునుగోడు’లో మునిగేదెవరు?
ABN , First Publish Date - 2022-08-07T06:25:01+05:30 IST
భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వం పన్నిన వ్యూహంలో భాగంగా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రాబోతోంది.

భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వం పన్నిన వ్యూహంలో భాగంగా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రాబోతోంది. మునుగోడు ఉప ఎన్నికలో మునిగేదెవరు? తేలేదెవరు? అన్నది తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సాధారణ ఎన్నికలకు మరో పదహారు మాసాల వ్యవధి మాత్రమే ఉంది. ఇప్పుడు మునుగోడుకు ఉప ఎన్నిక జరిగినా అందుకు కనీసం మూడు నెలల వ్యవధి పడుతుంది. అంటే ఉప ఎన్నికలో గెలిచేవారు ఏడాది మాత్రమే ఎమ్మెల్యేగా ఉంటారు. ఇంతోటి దానికి ఉప ఎన్నిక అవసరమా? అంటే బీజేపీ అగ్రనాయకత్వం అలా కోరుకుంటోంది మరి! ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారానికి మునుగోడు ఉప ఎన్నికతో ముందుగానే చెక్ పెట్టాలని కేంద్ర ప్రభుత్వ పెద్దలు పట్టుదలగా ఉన్నారు.
ఈ కారణంగానే కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రస్తుతం మునుగోడుకు ప్రాతినిధ్యం వహిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో రాజీనామా చేయించారు. రాజగోపాల్ మాత్రం నియోజకవర్గం అభివృద్ధి కోసం ఉప ఎన్నికకు వీలుగా రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఒకవేళ ఆయన బీజేపీ తరఫున పోటీ చేసి గెలిచినా ఏడాది వ్యవధి మాత్రమే ఉంటుంది కనుక అభివృద్ధికి అవకాశం ఉండదు. అందుకే ఇదంతా ఒక రాజకీయ క్రీడ అనుకోవాలి. ఈ క్రీడలో భాగంగా ముందుగా కాంగ్రెస్ పార్టీని బలహీనపరచి మునుగోడును గెలుచుకోవడం ద్వారా ఆ తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితిని దెబ్బతీయాలన్నది బీజేపీ పెద్దల అసలు వ్యూహం. మును గోడులో జెండా ఎగురవేయగలిగితే కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వలసలు పెరుగుతాయి. నరేంద్ర మోదీ, అమిత్ షాలకు కావాల్సింది అదే. బీజేపీ నుంచి ఎదురైన ఈ సవాల్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనుకుంటున్న కేసీఆర్‌కు మునుగోడు ఉప ఎన్నిక ద్వారా చెక్ పెట్టాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించింది. ఉప ఎన్నిక జరగాలంటే రాజగోపాల్ రెడ్డి రాజీనామాను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆమోదించాల్సి ఉంటుంది. గతంలో శాసన సభ్యుల రాజీనామాలను వెంటనే ఆమోదించకుండా నెలల తరబడి పెండింగ్‌లో పెట్టిన ఉదంతాలు తెలుగునాట మనం చూశాం. ఉప ఎన్నిక వాంఛనీయం కాదనుకుంటే రాజగోపాల్ రెడ్డి రాజీనామాను వెంటనే ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టించే వెసులుబాటు కేసీఆర్‌కు ఉంది. ఈ వెసులుబాటును ఆయన ఉపయోగించుకుంటారో లేదో తెలియదు.
మునుగోడుకు ఉప ఎన్నిక జరిపించే బదులు శాసనసభను రద్దు చేసి ముందస్తుకు వెళ్లి బీజేపీతో అమీతుమీ తేల్చుకునే వెసులుబాటు కూడా కేసీఆర్‌కు ఉంది. ఇప్పుడున్న పరిస్థితులలో మునుగోడులో అధికార పార్టీ ఓడిపోతే కేసీఆర్‌కు కష్టకాలం ఆరంభమవుతుంది. ఈ కారణంగా ఆయన ఏ మార్గం ఎంచుకుంటారో వేచిచూడాలి. అయితే, ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా అందుకు సమాయత్తమవుతున్నాయి. నిజానికి మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టుంది. అయితే, రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత పరిస్థితి ఎలా మారుతుందో తెలియదు. బీజేపీ నుంచి ఎదురైన సవాల్‌ను ఎదుర్కొనే విషయంలో ఐక్యంగా పోరాడాల్సిన కాంగ్రెస్ నాయకులు అంతర్గత కుమ్ములాటలతో బిజీగా ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కూడా మునుగోడు ఉప ఎన్నికతో ముడిపడి ఉంది. వలసలను ప్రోత్సహించడం ద్వారా కాంగ్రెస్‌ను ముందుగా బలహీనపరచి మునుగోడు గెలుచుకుని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాలని బీజేపీ అగ్ర నాయకత్వం నిర్ణయించుకుంది.
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనకొండ మాదిరి అన్ని రాష్ర్టాలకూ విస్తరించాలన్నది నరేంద్ర మోదీ – అమిత్ షాల అభిమతం. ‘అనువుగాని చోట అధికులమనరాదు’ అని చెబుతుంటారు. అయితే.. కేసీఆర్ ఇందుకు విరుద్ధంగా తనను తాను ఎక్కువగా ఊహించుకుంటూ ప్రధాని మోదీకి చెక్ పెట్టాలని భావిస్తున్నారు. ఒకప్పుడు మోదీకంటే బలంగా ఉన్న ఇందిరాగాంధీని అందరూ కలిసి ఓడించలేదా అని సర్దిచెప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఎమర్జెన్సీ పుణ్యమా అని దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నాయకులందరూ ఏకమయ్యారు. వారందరినీ జనతా పార్టీ రూపంలో ఒకచోటకు చేర్చిన మహానుభావుడు జయప్రకాశ్ నారాయణ. ఇప్పుడు మోదీకి వ్యతిరేకంగా జయప్రకాశ్ నారాయణ పాత్ర పోషించాలని కేసీఆర్ భావిస్తుంటే అది ఆయన ఇష్టం. మరోవైపు ఇదే కేసీఆర్ ఈడీ దాడుల గురించి తన మంత్రులను, ఇతర ముఖ్యులను హెచ్చరిస్తున్నారు. తాజాగా మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, గంగుల కమలాకర్, ఎంపీ రంజిత్ రెడ్డిలను ‘జాగ్రత్త’ అని కేసీఆర్ హెచ్చరించారు.
ఆనాడు జయప్రకాశ్ నారాయణ కూడా తగిన సమయం కోసం వేచి ఉన్నారు. అంతేకాదు, అప్పుడు ఉద్దండులైన నాయకులు ప్రతిపక్షంలో ఉన్నారు. అటల్ బిహారీ వాజపేయి వంటి మహానుభావుడి నేతృత్వంలోని జన్‌సంఘ్ కూడా జయప్రకాశ్ పిలుపునకు స్పందించి జనతా పార్టీలో చేరింది. మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. అప్పుడు ఆ ప్రభుత్వంలో హేమాహేమీలు మంత్రులుగా ఉండేవారు. దురదృష్టవశాత్తు మొరార్జీ ప్రభుత్వం ఎంతో కాలం మనలేదు. ఇది చరిత్ర! ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ ఏకపక్ష, నియంతృత్వ పోకడలకు పాల్పడుతున్నప్పటికీ ఆయనను ఎదిరించే సాహసానికి ఎంత మంది ముందుకు వస్తారన్నదే ప్రశ్న. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఒక అడుగు వెనక్కు వేయడం విజ్ఞులు చేసే పని. అలా కాకుండా మొండిగా ముందుకు వెళితే ముఖం పగులుతుంది. కానికాలం దాపురించినప్పుడు ఎవరికైనా హిత వాక్యాలు రుచించవు. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. జాతీయ రాజకీయాల సంగతి ఏమోగానీ, మునుగోడు రూపంలో కేసీఆర్‌కు ఇప్పుడు స్వరాష్ట్రంలోనే బీజేపీ సవాలు విసిరింది. తాను బాహుబలిని అని కేసీఆర్ భావిస్తున్నందున ఇంట గెలిచిన తర్వాత రచ్చ గెలవడానికి ఆయన బయలుదేరితే ఎవరికైనా ఎందుకు అభ్యంతరం ఉంటుంది? సొంత పార్టీ నాయకులను స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పనిస్తే కేసీఆర్‌కు తత్వం బోధపడుతుంది. ఇందుకు భిన్నంగా తన ఆలోచనలు, అభిప్రాయాలతో విభేదించే వారిని కించపరుస్తూ సొంత పత్రికలో పేజీలకు పేజీలు రాయించుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. జాతీయ రాజకీయాలలో కేసీఆర్ రాణిస్తే తెలుగువాడిగా, తెలంగాణవాసిగా నేను కూడా గర్విస్తాను. ఆల్ ద బెస్ట్ కేసీఆర్!
విలువలూ, వలువలూ వదిలేసి!
ఇప్పుడు ఆంధ్ర రాజకీయాలకు వద్దాం! శవ రాజకీయాలు తమకు కలసి వస్తాయన్న నమ్మకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో బలంగా ఉన్నట్టుంది. అందుకే కాబోలు... ఎవరు ఏ కారణంతో చనిపోయినా ఆ చావు తమకు ఉపయోగపడుతుందేమోనని వెతికే పనిలో బిజీగా ఉంటారు. తాజాగా ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకోగా... ‘హూ కిల్డ్ పిన్ని?’ అంటూ సోషల్ మీడియా వేదికగా రాజకీయ చలిమంటలు కాచుకోవడానికి తెగబడ్డారు. వైసీపీ సోషల్ మీడియా ద్వారా పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి నేతృత్వంలో ఈ వికృత క్రీడకు తెరలేవడం దిగజారుడు రాజకీయాలకు అద్దంపడుతోంది. గౌరవ ప్రదమైన కుటుంబాలలో ఎవరైనా ఏ కారణంతోనైనా ఆత్మహత్య చేసుకుంటే సహజ మరణంగా ప్రకటించి గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు నిర్వహించడం చూస్తూ ఉంటాం. ఉమామహేశ్వరి విషయంలో అలా జరగలేదు. ఆమె ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులే పోలీసులకు తెలిపారు. అయినప్పటికీ.. ఆమె అంత్యక్రియలు కూడా పూర్తి కాకుండానే, జూబ్లీహిల్స్‌లోని ఆరు ఎకరాల స్థలం విషయంలో లోకేశ్‌తో గొడవ జరిగినందుకే ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారన్న ప్రచారానికి వైసీపీ తెర లేపింది. ఈ ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని తేలిన తర్వాత కూడా విజయసాయి రెడ్డి వంటి వారు ఆమె మరణంపై ట్విటర్ వేదికగా సందేహాలు వ్యక్తంచేశారు.
ఇటీవలికాలంలో విజయసాయి రెడ్డి చేస్తున్న ట్వీట్లు చూస్తుంటే ఆయన ఏదో మానసిక వ్యాధితో బాధపడుతున్నట్టు అనిపిస్తోంది. ఎన్టీఆర్ దాదాపు ఏడేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయినా ఇప్పుడు విజయసాయి రెడ్డి అండ్ కో మాదిరిగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎవరూ ప్రజాధనాన్ని దోచుకోలేదు. తన కుటుంబ సభ్యులను ప్రభుత్వ కార్యక్రమాలకు, వ్యవహారాలకు ఆమడ దూరంలో ఉంచేవారు ఎన్టీఆర్. ఆయన నిప్పులా బతికారు. అటువంటి మహానుభావుడి రక్తం పంచుకు పుట్టిన ఉమామహేశ్వరి మరణాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకొనే ప్రయత్నం చేసిన పార్టీని, ఆ పార్టీ నాయకులను ఏమని అభివర్ణించాలో తెలియడం లేదు. చావులను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయడానికి అలవాటుపడిన వారిలో సున్నితత్వం ఉండాలనుకోవడం పిచ్చితనమే అవుతుంది. హెలికాప్టర్ ప్రమాదంలో రాజశేఖర రెడ్డి మరణించగా, ఆయన మరణాన్ని రాజకీయ పునాదిగా చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అదే అలవాటుగా మారింది. రాజశేఖర్ రెడ్డిని రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ద్వారా సోనియాగాంధీ హత్య చేయించారని తల్లి, చెల్లి ద్వారా ప్రచారం చేయించిన జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా, వ్యక్తిగతంగా లబ్ధి పొందారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే ముఖేశ్ అంబానీకి సాదర స్వాగతం పలికి, ఆయన ప్రతినిధికి రాజ్యసభ టికెట్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి తన చర్యను ఎలా సమర్థించుకోగలరు?
2019 ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరగ్గా, ఆ చావును కూడా వాడుకొని రాజకీయంగా లబ్ధి పొందారు. వివేకాది సహజ మరణమని బయటి ప్రపంచానికి వెల్లడించిన వ్యక్తి విజయసాయి రెడ్డి కావడం గమనార్హం. ఆయనది సహజ మరణం కాదు హత్య అని తేలిపోయిన తర్వాత ఆ నేరాన్ని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు మెడకు చుట్టడానికి ప్రయత్నించారు. వివేకా హత్య కేసును సీబీఐతో విచారణ చేయించాలని ఎన్నికలకు ముందు డిమాండ్ చేసిన జగన్ రెడ్డి.. ముఖ్యమంత్రి అయ్యాక మాత్రం ఆ అవసరం లేదని తేల్చిపారేశారు. దీన్నిబట్టి శవ రాజకీయాలు ఏ స్థాయిలో నడిచాయో అర్థం చేసుకోవచ్చు. కోడి కత్తి కేసును కూడా ఇలాగే వాడుకున్నారు. వివేకానంద రెడ్డి హంతకులను కాపాడటానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారన్న వార్తలు ప్రచారంలోకి రావడంతో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్లు ‘హూ కిల్డ్ బాబాయ్?’ అని ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేక ఇంతకాలం మౌనంగా ఉన్న వాళ్లు ఇప్పుడు ఉమామహేశ్వరి బలవన్మరణంతో చెలరేగడం మొదలుపెట్టారు. వివేకా హత్యతో ఉమామహేశ్వరి మరణానికి లంకె పెట్టి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు మొదలెట్టారు. హత్యకు, ఆత్మహత్యకు సాపత్యం ఏమిటి? ఈ విషయాన్ని ప్రజలు గ్రహించడంతో వైసీపీ కుయుక్తులు ఫలించలేదు. తెలుగుదేశంవాళ్లు ‘హూ కిల్డ్ బాబాయ్?’ అని ప్రచారం చేశారు కనుక మేం ‘హూ కిల్డ్ పిన్ని?’ అని ప్రచారం చేశామని దిక్కుమాలిన వాదాన్ని కూడా తెర మీదకు తెచ్చారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేయదు కదా! శవ రాజకీయాలకు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు కనుక విజయసాయి రెడ్డి అండ్ కో అదే బాటలో పయనించారు. ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన వారు ఎదురుదాడిని ఎంచుకున్నారు. విష ప్రచారానికి అలవాటుపడిన వారు అదే మార్గంలో పయనిస్తున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోత పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉమామహేశ్వరి మరణం కూడా వైసీపీ నాయకులకు రాజకీయ ముడిసరుకుగా మారింది.
సిగ్గు లేని మాటలు...
ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అంశమే తీసుకుందాం! చేసిన పనికి సిగ్గుపడాల్సిన గోరంట్ల మాధవ్ తన అధినేత జగన్మోహన్ రెడ్డి బాటలోనే ‘ఇదంతా బీసీలకు వ్యతిరేకంగా ఫలానా కులం వాళ్లు చేసిన కుట్ర’ అని బరితెగించి వాదిస్తున్నారు. ఎంపీ మాధవ్కూ, ఒక మహిళకూ మధ్య సాగిన వీడియో కాల్ వారి వ్యక్తిగత వ్యవహారమే అయినప్పటికీ అది లీక్ కావడానికి కారణం మీడియా కాదు కదా? ‘‘వీడియో కాల్ వ్యవహారం నా వ్యక్తిగతం. నగ్నంగా వీడియో కాల్ చేయడం నా ఇష్టం’’ అని మాధవ్ చెప్పుకొంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. ఎవరేమిటో ప్రజలే తేల్చుకుంటారు. అలా కాకుండా తన చర్యను ఎంపీ మాధవ్ సమర్థించుకున్న తీరు జుగుప్సాకరంగా ఉంది.
వైపీసీ నాయకులు ఇంతలా బరితెగించడానికి ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డే కారణం అని చెప్పాల్సి ఉంటుంది. ‘తోటకూర దొంగిలించిన నాడే మందలించి ఉంటే..’ అన్నట్టుగా జగన్‌రెడ్డి తన పార్టీలో కట్టుతప్పిన వారిపై చర్యలు తీసుకొని ఉంటే పార్టీ నాయకులలో భయం ఉండేది కదా! అలా చేయకపోగా ఒకాయనను ఏకంగా మంత్రిని చేయడంతో జగన్ మనసు గెలుచుకోవాలంటే బరితెగించాలన్న అభిప్రాయానికి ఆ పార్టీ వారు వచ్చినట్టున్నారు. దీంతో కొంతమంది అచ్చోసిన ఆంబోతుల్లా రోడ్లపై పడుతున్నారు. మహిళలను అక్కచెల్లెమ్మలని సంబోధించే జగన్మోహన్ రెడ్డి.. ఎంపీ మాధవ్ వ్యవహారం బయటకు వచ్చి మూడు రోజులవుతున్నా నోరు విప్పకపోవడం ఆశ్చర్యంగా ఉంది.
మాధవ్‌పై చర్య తీసుకోవడమా? లేదా? అన్నది వైసీపీ ఇష్టం. అయితే మాధవ్ వంటి వారిని ఉపేక్షించడం వల్ల మిగతా వారికి ఎటువంటి సందేశం ఇస్తున్నారో జగన్‌రెడ్డి తేల్చుకోవాలి. ఈ మూడేళ్లలో తప్పు చేసిన ఏ ఒక్కరిపైనా చర్య తీసుకోవడానికి ముఖ్యమంత్రి సిద్ధం కాకపోవడంతో తాము ఏం చేసినా చెల్లుబాటవుతుందన్న భావన వైసీపీ నాయకుల్లో ఏర్పడింది. అన్నింటికీ ఎదురుదాడికే అలవాటుపడిన జగన్ అనుయాయులు ఇప్పుడు మాధవ్ వ్యవహారాన్ని కప్పిపుచ్చడం కోసం తమ ప్రత్యర్థులకు సంబంధించిన ఇటువంటి వీడియోలు దొరుకుతాయేమోనన్న పనిలో ఉన్నారట! వ్యక్తిగత బలహీనతలు ఎవరెవరికి ఉన్నాయో ఆరా తీయడం మొదలెట్టారట. ‘మావాళ్లు మాత్రమే కాదు – తెలుగుదేశం వాళ్లు కూడా అంతే’ అని రుజువు చేసే పనిలో ఉన్నారన్న మాట! మొత్తానికి రాజకీయం అంటేనే రంకు అన్న అభిప్రాయం కలిగించే ప్రయత్నంలో ఉన్నారనుకోవాలి. శభాష్! మహిళా సాధికారత గురించి మాట్లాడేవారు తమ రాజకీయ అవసరాలకు మహిళలనే ముడిసరుకుగా వాడుకునే ప్రయత్నం చేయడం దౌర్భాగ్యం. రాజకీయాలో ఇంకెన్ని నికృష్ట పోకడలను చూడవలసి వస్తుందోనని నిన్నటి తరం నేతలు భయపడుతున్నారు. తప్పులను ఒప్పులుగా చెప్పుకొనే బరితెగింపు నాయకుల్లో వస్తోందంటే ప్రజల్లో చైతన్యం లోపించడం కూడా కారణమేమో తెలియదు. సర్వీసులో ఉన్నంతకాలం నిజాయితీకి, నిబద్ధతకు మారుపేరుగా ఉన్న ఐపీఎస్ అధికారి, సీబీఐ జేడీగా పనిచేసిన లక్ష్మీనారాయణ ప్రజా జీవితంలోకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోతే, గోరంట్ల మాధవ్ వంటి కరప్ట్ కేరెక్టర్లు ఎన్నికల్లో గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టడం మన కాలపు విషాదం.
సెహభాష్ సాయిరెడ్డీ...
మరో ఆణిముత్యం విజయసాయి రెడ్డి తాజాగా చేసిన ట్వీట్ గమనిస్తే ఆయన గుండెలు తీసిన బంటు అని మరోమారు స్పషమవుతోంది. రాజ్యసభలో మూడు ప్రైవేటు బిల్లులను తాను ప్రవేశపెట్టినట్టు ఆయన ప్రకటించారు. అందులో ఒకటి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఇతర పదవులకు జరిగే ఎన్నికల్లో ఓటు చేయడానికి వీలుగా ఎంపీ, ఎమ్మెల్యేలకు ఆటోమేటిక్‌గా బెయిల్ ఇవ్వడం! రెండవది.. తప్పుడు వార్తలు ప్రసారం చేసే చానళ్లు, డిజిటల్ మీడియాపై చర్యలు తీసుకొనే అధికారం ప్రెస్ కౌన్సిల్‌కు కల్పించడం. మూడోది ఏమిటంటే, రాష్ర్టాలు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రాజధానులు ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా రాజ్యాంగాన్ని సవరించే బిల్లు. విజయసాయి రెడ్డి వంటి వ్యక్తులు ఇటువంటి బిల్లులు పెట్టాలనుకోవడం విడ్డూరంగా ఉంది. సీబీఐ, ఈడీ కేసులలో ముద్దాయిగా ఉన్న విజయసాయి రెడ్డి ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. తనవంటి వారు ఎవరైనా జైలులో ఉండివుంటే వారికి కూడా బెయిల్ ఇప్పించడానికి విజయసాయి రెడ్డి నడుం బిగించినట్టున్నారు. వాహ్.. విజయసాయి రెడ్డీ! ఇలాంటి ఆలోచనలు మీకు మాత్రమే వస్తాయి! ఆర్థిక నేరాలకు పాల్పడినట్టు అభియోగాలు ఎదుర్కొంటున్న వారు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వంటి అత్యున్నత పదవులకు ఓటు వేసే వెసులుబాటు కల్పించడమే దౌర్భాగ్యం అనుకుంటే, ఎవరికైనా బెయిల్ దొరక్కపోతే వాళ్లు కూడా బెయిల్ పొందడానికి విజయసాయి రెడ్డి చేస్తున్న కృషిని అభినందించకుండా ఉండగలమా? విషాదమేమిటంటే, ఈడీ కేసులలో ఏ–2గా ఉన్న విజయసాయి రెడ్డి రాజ్యసభ చైర్మన్ స్థానంలో కూర్చున్నప్పుడే ప్రతిపక్షాలపై ఈడీ వేధింపుల గురించి సభలో చర్చ జరగడం. దీన్నే ‘ప్రజాస్వామ్య సౌందర్యం’ అని ముద్దుగా పిలుచుకుంటున్నాం.
విజయసాయి రెడ్డి వంటి వారిలో ఇలాంటి తెగింపు, తెంపరితనం వస్తున్నదంటే అందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా బాధ్యత వహించవలసి ఉంటుంది. ఆర్థిక నేరాలను సహించబోమంటూ ప్రతిపక్ష నాయకులపైకి ఈడీని ఉసిగొల్పుతున్న మోదీ–షా ద్వయం.. విజయసాయి వంటి వారిని అక్కున చేర్చుకోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? జగన్ అండ్ కోపై పెండింగ్‌లో ఉన్న కేసులకు అతీగతీ లేకుండా పోవడానికి కారణం ఏమిటి? అందుకు బాధ్యులు ఎవరు? అసత్యాలు ప్రసారం చేసే చానళ్లపై చర్యలు తీసుకోవాలని విజయసాయి రెడ్డి అభిప్రాయపడటం ‘జోక్ ఆఫ్ ద సెంచరీ’ అని చెప్పవచ్చు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ఆధ్వర్యంలోని నీలి మీడియా ఎన్ని నికృష్ట ప్రసారాలు చేసిందో మరచిపోయారా? వివేకానంద రెడ్డి హత్య తర్వాత ‘నారాసుర రక్త చరిత్ర’ అన్న నీచమైన కథనాన్ని ప్రసారం చేసిన సదరు నీలి మీడియాపై చర్య తీసుకోవాలని విజయసాయి రెడ్డి కోరగలరా? ఇప్పుడు అధికారంలోకి వచ్చినందున తమ అధికారం శాశ్వతం అని భ్రమిస్తూ విజయసాయి రెడ్డి ప్రైవేటు బిల్లు రూపకల్పనకు సాహసించి ఉంటారు.
ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను తప్పుబడుతున్న ఏ చానల్ కూడా జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని నీలి మీడియాలాగా దిగజారడం లేదు. రేపు అధికారం కోల్పోతే తప్పుడు వార్తలు ప్రసారం చేసినా చర్యలు తీసుకోకూడదని అప్పుడు మరో బిల్లు ప్రవేశపెట్టే ప్రయత్నాన్ని విజయసాయి రెడ్డి చేస్తారేమో తెలియదు. అయితే.. ఆయనకు రాజ్యసభ శాశ్వతం కాదు కదా! అవినీతి కేసులలో శిక్ష పడితే ఆయనకు ఇప్పుడున్న ఉద్యోగం కూడా ఊడుతుంది. ఒకటి కంటే ఎక్కువ రాజధానులను ఏర్పాటు చేసుకొనే వెసులుబాటు రాష్ర్టాలకు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు విషయానికి వద్దాం! మూడు రాజధానులు అన్న దిక్కుమాలిన ప్రచారానికి జగన్‌రెడ్డి ప్రభుత్వం తెరలేపినప్పుడు అది మీ ఇష్టం అని కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భాలలో స్పష్టం చేసింది కదా. అయినా ఈ బిల్లు అవసరమేమిటో విజయసాయికే తెలియాలి. ఐదేళ్ల పదవీ కాలం పూర్తయ్యేసరికి మూడు రాజధానులు కాదు కదా ఒక్క రాజధానిని కూడా కట్టడం జగన్‌కు చేతకాలేదని ప్రజలు ఎక్కడంటారో అన్న ఉద్దేశంతో ఆయన ఈ బిల్లు నాటకం ఆడుతున్నట్టుగా ఉంది. పైవాళ్ల అండ ఉంది కనుక విజయసాయి రెడ్డి వంటి వారికి ఆడింది ఆటగా పాడింది పాటగా సాగుతూ ఉంది. ఈ ధీమాతోనే వైసీపీ బరితెగిస్తోంది. దీన్ని అడ్డుకోవలసింది ప్రజలే. లేని పక్షంలో వైపీపీ నాయకులు కొందరు మరింత నగ్నంగా నర్తిస్తారు.
ఆర్కే
యూట్యూబ్‌లో
‘కొత్త పలుకు’ కోసం
QR Code scan చేయండి
