కేసీఆర్‌ అష్టదిగ్బంధనం?

ABN , First Publish Date - 2022-07-31T08:01:40+05:30 IST

‘ఎంకిపెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు’గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పెట్టుకున్న వైరం కారణంగా...

కేసీఆర్‌ అష్టదిగ్బంధనం?

‘ఎంకిపెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు’గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పెట్టుకున్న వైరం కారణంగా రాష్ట్రంలోని ప్రముఖ వ్యాపారవేత్తలకు కంటి మీద కునుకు లేకుండా పోతున్నది. కేసీఆర్‌పై పగ పెంచుకున్న ప్రధాని మోదీ హిట్‌ లిస్ట్‌లో తాము అకారణంగా చేరిపోయామని వారంతా ఆందోళన చెందుతున్నారు. కేసీఆర్‌తో సన్నిహితంగా ఉంటున్న సంస్థల కార్యకలాపాలపై ఈడీ అధికారులు దృష్టి కేంద్రీకరించారని, వాటిపై ఏ క్షణంలోనైనా దాడులు జరగవచ్చునన్న వార్తలు వస్తుండటంతో ఎప్పుడు ఎవరిపై దాడి జరుగుతుందోనని వారంతా హడలిపోతున్నారు. ప్రధానమంత్రితో అనవసరంగా గొడవ పెట్టుకున్న కేసీఆర్‌, ఇప్పటివరకు హాయిగా వ్యాపారాలు చేసుకుంటున్న తమను ఇబ్బందుల్లోకి నెడుతున్నారని ఒక ప్రముఖ వ్యాపారవేత్త వాపోయారు. ఇప్పుడు హైదరాబాద్‌లో ఏ నలుగురు వ్యాపారవేత్తలు కలిసినా ఈడీ దాడుల గురించే చర్చించుకుంటున్నారు. 


తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్‌ ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల రాష్ర్టానికి పెట్టుబడులు పెరిగాయి. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ వైఖరి కారణంగా ఆ రాష్ట్రం నుంచి కూడా పెట్టుబడిదారులు తెలంగాణకు క్యూ కట్టారు. రాష్ట్రం అభివృద్ధిపథంలో దూసుకుపోతున్న ఈ తరుణంలో కేసీఆర్‌ ఉన్నట్టుండి ప్రధానమంత్రిపై యుద్ధం ప్రకటించారు. దీంతో ఉభయుల మధ్యా రాజకీయ విభేదాల స్థానంలో వ్యక్తిగత వైరం ఏర్పడింది. కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాలన్న నిర్ణయానికి వచ్చిన బీజేపీ పెద్దలు ఈడీ వంటి ఏజెన్సీలను రంగంలోకి దించాలన్న నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలో కేసీఆర్‌తో సన్నిహితంగా ఉంటున్న వ్యాపారులు ఎవరు? వారు ప్రభుత్వంతో జరిపిన లావాదేవీలు ఏమిటి? ప్రభుత్వ పెద్దలకు ఎంతెంత కమీషన్లు ముట్టాయి? మొదలైన వివరాల సేకరణలో ఏజెన్సీలు బిజీగా ఉన్నాయి. అయితే కేసీఆర్‌ జైలుకు వెళ్లడం ఖాయమని రాష్ర్టానికి చెందిన బీజేపీ నాయకులు ప్రకటిస్తున్నప్పటికీ, నేరుగా కేసీఆర్‌ను కేసులలో ఇరికించే ఆలోచనలో కేంద్ర పెద్దలు లేరని తెలిసింది. ఆర్థికంగా కేసీఆర్‌కు చేదోడువాదోడుగా ఉంటున్న వ్యాపారులకు, కాంట్రాక్టర్లకు ఇప్పటికే హెచ్చరికలు వెళ్లాయి. కేసీఆర్‌తో ఆర్థిక లావాదేవీలు జరిపితే తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని వార్నింగ్‌లు ఇచ్చారు. 


2019 ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు ఆర్థిక సహాయం లభించకుండా కట్టడి చేసినట్టుగానే ఇప్పుడు తెలంగాణలో కూడా కేసీఆర్‌కు అదే పరిస్థితి కల్పించాలని బీజేపీ అగ్ర నాయకత్వం తలపోస్తోంది. ఈ నేపథ్యంలోనే ‘‘మీరంతా మా రాడార్‌లోకి వచ్చారు. మీరు జరిపే అన్ని ఆర్థిక లావాదేవీలూ మాకు తెలిసిపోతాయి. ఒళ్లు దగ్గర పెట్టుకొని ఉండండి. కేసీఆర్‌కు ఏ రూపంలో సహకరించినా దాని ఫలితం మీరే అనుభవించవలసి ఉంటుంది’’ అని పలువురు వ్యాపారులను, కాంట్రాక్టర్లను కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు హెచ్చరించినట్టు తెలిసింది. కేసీఆర్‌ను నేరుగా కేసులలో ఇరికిస్తే రానున్న ఎన్నికల్లో సానుభూతి పొందే అవకాశం ఉన్నందున ఆయనకు అటువంటి అవకాశం ఇవ్వకుండా కేసీఆర్‌ చుట్టూ ఉన్న వారికి ఉచ్చు బిగించాలని కేంద్ర ప్రభుత్వ పెద్దలు నిర్ణయించుకున్నారు. ‘‘మీలాంటి బలమైన నాయకులు మా పార్టీలోకి రావాలి. తెలంగాణలో కేసీఆర్‌ నియంతృత్వానికి ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైంది. త్వరలోనే కేసీఆర్‌ను అష్టదిగ్బంధనం చేయబోతున్నాం’’ అని కాంగ్రెస్‌కు చెందిన ఒక ప్రముఖుడి వద్ద కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యానించారట. 


కేసీఆర్‌కు సన్నిహితంగా ఉంటున్న వ్యాపారులు, కాంట్రాక్టర్లే కాకుండా టీఆర్‌ఎస్‌కు చెందిన కొంతమంది ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యుల జాబితా ఇప్పటికే కేంద్ర ఏజెన్సీలకు చేరింది. కేసీఆర్‌, కేటీఆర్‌ తరఫున వ్యవహారాలు చక్కబెడుతున్న ఎవ్వరినీ వదలవద్దని కేంద్ర ఏజెన్సీలకు ఆదేశాలు వెళ్లాయి. ఈ అంశమే ఇప్పుడు తెలంగాణలో హాట్‌ టాపిక్‌గా మారింది. సన్నిహితులు, ఆంతరంగికులపై కేంద్ర ఏజెన్సీలు దాడి చేసినా కేసీఆర్‌ నేరుగా స్పందించలేరని బీజేపీ పెద్దల అభిప్రాయం. ఒకవేళ అలాంటి వారి తరఫున కేసీఆర్‌ గొంతు ఎత్తితే.. వారితో మీకున్న సంబంధం ఏమిటని తాము ఎండగడతామని బీజేపీ ముఖ్యుడొకరు చెప్పుకొచ్చారు. కేసీఆర్‌ కూడా ఇటీవలి కాలంలో తనను కలసిన కొంతమంది ముఖ్యులతో మాట్లాడుతూ, ‘‘కేంద్ర హిట్‌ లిస్ట్‌లో మీరు కూడా ఉన్నారా?’’ అని వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన సరదాగా ఈ వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ వ్యాపారులు, కాంట్రాక్టర్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. కేసీఆర్‌ ఈ స్థాయిలో ప్రధాని మోదీపై యుద్ధం ప్రకటిస్తారని తెలియని కొంత మంది ముఖ్యులు, ఇటీవలి కాలంలో ఆయనతో సన్నిహితంగా ఉంటున్నారు. ఈ జాబితాలో ఉన్నవాళ్లు ‘ఎరక్కపోయి ఇరుక్కుపోయాం’ అని ఇప్పుడు వాపోతున్నారు. మొత్తానికి నరేంద్రమోదీ–కేసీఆర్‌ మధ్య సాగుతున్న జగడం ‘పిల్లికి చెలగాటం–ఎలుకకు ప్రాణసంకటం’ అన్నట్టుగా వ్యాపారులు, కాంట్రాక్టర్లకు సంకటంగా మారింది. తన రాజకీయం కోసం కేసీఆర్‌ ఆడుతున్న ఆటలో తాము పావులుగా మారుతున్నామని ఒక కాంట్రాక్టర్‌ వాపోయారు. కేసీఆర్‌ ఎందుకు మొదలుపెట్టారో తెలియదు గానీ, ఆయన ప్రారంభించిన యుద్ధం వల్ల తెలంగాణ రాష్ట్రం కూడా నష్టపోయే ప్రమాదం కనిపిస్తోంది. 


తెలంగాణలో ఇప్పుడు పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉంది. ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ స్వయంగా కేసీఆర్‌పై కన్నెర్ర చేస్తున్నందున ఈ పరిస్థితులలో తెలంగాణకు వెళ్లి ప్రభుత్వంతో సంబంధాలు పెట్టుకొని కొరివితో తలగోక్కోవడం ఎందుకు? అని పెట్టుబడిదారులు జంకుతున్నారు. దీనివల్ల రాష్ర్టానికి తీరని నష్టం జరుగుతుంది. ఇటీవలి కాలంలో కేసీఆర్‌ కూడా బేలన్స్‌ తప్పుతున్నారు. ఆయన ప్రధానిని అభ్యంతరకర భాషలో దూషిస్తున్నారు, అంత అవసరమా? అంటే, లేదు అని ఆయనకు ఎవరు చెప్పాలి? తనకు వ్యతిరేకంగా కేంద్రం చర్యలకు ఉపక్రమిస్తే దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్షాల మద్దతు కూడగట్టుకోవాలని కేసీఆర్‌ తలపోస్తున్నారు గానీ అది జరిగే పని కాదు. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్లో ఇద్దరు మంత్రులను ఈడీ అధికారులు అరెస్టు చేసి జైలుకు పంపించినా ఆయా రాష్ర్టాల ముఖ్యమంత్రులు నోరు మెదపలేని పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్‌తో చేయికలిపే వాళ్లు ఎవరూ కనబడటం లేదు. అందుకే ఆయన రాష్ట్రంలో తనకు ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్‌తో ఢిల్లీలో జత కట్టారు. కాంగ్రెస్‌తో కలసి ఆయన తన పార్టీ వారిని పార్లమెంట్‌లో ఆందోళన చేయమని ఆదేశాలు ఇచ్చారు. నాలుగు రోజుల నుంచి ఢిల్లీలో మకాం వేసిన కేసీఆర్‌, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్‌ యాదవ్‌ను మాత్రమే కలిశారు. ఆయన అంత సీరియస్‌ పొలిటీషియన్‌ ఏమీ కాదు. ఇక ప్రధానమంత్రికి వ్యతిరేకంగా ఇప్పటివరకు గళం విప్పిన ఇతర ముఖ్యమంత్రులు ఇప్పుడు తమ ఇల్లు చక్కబెట్టుకొనే పనిలో ఉన్నారు. అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షలు చేస్తున్నట్టుగా లీకులు మాత్రం వస్తున్నాయి. అధికారులతో ఢిల్లీలో సమీక్షలు చేయడం ఏమిటో తెలియదు. అదేదో హైదరాబాద్‌లో ముచ్చటపడి కట్టించుకున్న ప్రగతిభవన్‌లోనే సమీక్షలు చేయవచ్చు కదా? అంతమంది అధికారులు ఢిల్లీలో మకాం వేయడం వల్ల ప్రభుత్వానికి అనవసరపు ఖర్చు.


కేసీఆర్‌ చర్యలు అప్పుడప్పుడు వింతగా ఉంటాయి. ఆయన ఆలోచనలు ముందుగా ఎవరికీ తెలియవు. కనుక అలా ఎందుకు చేస్తున్నారా? అన్న అనుమానాలు కలుగుతుంటాయి. ప్రధానమంత్రితో ఈ స్థాయిలో యుద్ధం చేయడంపై కూడా ఇటువంటి సందేహాలే రేకెత్తుతున్నాయి. కేసీఆర్‌ ఏ ఉద్దేశంతో కాలు దువ్వుతున్నప్పటికీ దాని ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై లేకుండా చూడాలి. అయితే ఇప్పుడు చోటుచేసుకుంటున్న పరిణామాల వల్ల వ్యక్తులు మాత్రమే కాకుండా రాష్ట్రం కూడా నష్టపోయే సంకేతాలు కనిపిస్తున్నాయి. నిజానికి కేసీఆర్‌ పోకడలను తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ముఖ్యులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే వారెవరూ ఆయనను వారించలేరు. తెలంగాణపై బీజేపీ అగ్ర నాయకత్వం ఈ స్థాయిలో దృష్టి కేంద్రీకరించడానికి కేసీఆర్‌ మాత్రమే కారణం. కేసీఆర్‌ తీసుకున్న వైఖరి కారణంగా రాజకీయంగా తాము నష్టపోయే ప్రమాదం ఉందని టీఆర్‌ఎస్‌ ప్రముఖులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ దశలో వచ్చేనెల ద్వితీయార్ధం నుంచి దేశవ్యాప్తంగా పర్యటించాలని కేసీఆర్‌ నిర్ణయించుకోవడంపై వారు మరింత ఆందోళన చెందుతున్నారు. రాష్ర్టాన్ని వదిలేసి దేశాన్ని పట్టుకొని తిరిగితే మొదటికే మోసం వస్తుందని పలువురు మంత్రులు కూడా ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కేసీఆర్‌ వ్యూహాలన్నీ ఇప్పటివరకు సత్ఫలితాలనే ఇచ్చాయి కనుక ఇప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదని ఆయనను గుడ్డిగా సమర్థించేవారు చెబుతున్నారు. మోదీతో తలపడడం వల్లనే పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చారని వారు చెబుతున్నారు. ఒకటి మాత్రం వాస్తవం. కేంద్ర ప్రభుత్వ పెద్దలు అతి త్వరలో కేంద్ర ఏజెన్సీలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వబోతున్నారు. అప్పుడు దాని ప్రభావం ఎలా ఉంటుంది? అన్నది ప్రస్తుతం కీలకంగా మారింది. నిజానికి కేసీఆర్‌లో కూడా ఆందోళన ఉంది. అయితే ఆయన రాబోయే పరిణామాలను ఎదుర్కోడానికి తనదైన ఎత్తుగడలను అమలు చేస్తున్నారు. అవి ఫలిస్తాయా? వికటిస్తాయా? అన్నది వేచిచూడాలి. ఏదేమైనా కడుపులో నీళ్లు కదలకుండా ప్రభుత్వాన్ని నడుపుకోవలసిన కేసీఆర్‌ కోరి కష్టాలను కొని తెచ్చుకుంటున్నట్టు అనిపిస్తోంది. ఇదంతా స్వయంకృతాపరాధమే అవుతుంది.ఆర్కే 

యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి


ఆ ఒడ్డునుంటావా.. ఈ ఒడ్డుకొస్తావా?

బలమైన శత్రువుతో యుద్ధం చేయకూడదని ఎవరైనా చెబుతారు. అయితే కేసీఆర్‌ ఇప్పుడు అత్యంత బలవంతుడైన ప్రధానమంత్రి మోదీని శత్రువుగా ప్రకటించుకున్నారు. దేశ రాజకీయాలలో ప్రస్తుతం నరేంద్ర మోదీని ఎదిరించి నిలబడగలిగిన నాయకుడు లేదా నాయకురాలు కనిపించడం లేదు. మూడేళ్ల క్రితం ప్రధానికి వ్యతిరేకంగా కాలికి గజ్జె కట్టుకొని దేశవ్యాప్తంగా పర్యటించి ప్రతిపక్షాలను ఒకే వేదిక మీదకు తెచ్చిన చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల్లో చతికిలబడ్డారు. ఎన్నికల వరకు నరేంద్ర మోదీపై కాలు దువ్విన పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఇప్పుడు అస్త్రసన్యాసం చేశారు. తన మంత్రివర్గ సహచరుడిని హవాలా కుంభకోణంలో ఈడీ అధికారులు అరెస్టు చేసిన తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్‌ కూడా మౌనాన్ని ఆశ్రయించారు. 


మహారాష్ట్రలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రాన్ని ధిక్కరించిన ఉద్ధవ్‌ ఠాక్రేకు ఎటువంటి పరాభవం మిగిలిందో చూశాం. తండ్రి బాల్‌ ఠాక్రే ఏర్పాటు చేసిన శివసేన పార్టీ కూడా ఆయనకు దక్కని పరిస్థితి! మరాఠా నాయకుడు శరద్‌ పవార్‌ కూడా ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్‌ అగ్రనాయకత్వం సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ రోజుల తరబడి ఈడీ విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. తమకు వ్యతిరేకంగా ధిక్కార స్వరం వినిపించే నాయకులను ఎలా దారిలోకి తెచ్చుకోవాలో నరేంద్ర మోదీ–అమిత్‌ షాలకు తెలిసినంతగా మరెవరికీ తెలియదంటే అతిశయోక్తి కాదేమో. ఈ నేపథ్యంలో ప్రధానిని ఎదిరించడం ద్వారా జాతీయ రాజకీయాలలో హీరో అనిపించుకోవాలని కేసీఆర్‌ బయలుదేరారు. 


వివిధ రాష్ర్టాలలో పర్యటించడం కోసం ఆయన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక విమానాన్ని కూడా లీజుకు తెచ్చుకున్నారు. పెద్ద రాష్ర్టాల ముఖ్యమంత్రులు సైతం తమకు లొంగిపోతున్న ప్రస్తుత తరుణంలో చిన్న రాష్ట్రమైన తెలంగాణ (కు చెందిన) ముఖ్యమంత్రి కేసీఆర్‌ తమను ఎదిరించడం మోదీ–షా ద్వయానికి సహజంగానే రుచించడం లేదు. మమతా బెనర్జీ వంటి మొండి ఘటాన్నే లొంగదీసుకున్న కేంద్ర పెద్దలకు, కేసీఆర్‌కు చెక్‌ పెట్టడం పెద్ద కష్టం కాబోదు. నరేంద్ర మోదీ ఆలోచనలు, విధానాలపై ఎవరికి ఎటువంటి అభిప్రాయాలు ఉన్నప్పటికీ ఆయన ఇప్పుడు దేశ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఉన్నారు. మోదీ–షాల వ్యూహాలను తట్టుకొని నిలబడటం ఆషామాషీ వ్యవహారం కాదు. పశ్చిమ బెంగాల్లో పార్థా చటర్జీ అనే మంత్రి కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదిస్తున్నారని తెలుసుకొని, దాడులు చేసి 50 కోట్ల వరకు నగదు పట్టుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ను తక్కువ అంచనా వేయకూడదు. ప్రధాని మోదీ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని కేసీఆర్‌ వంటి వారు విమర్శించవచ్చు గానీ, అవకాశం వచ్చినప్పుడు రాజకీయ నాయకులు అందరూ ఇదే పని చేస్తుంటారు. 


2019 ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హైదరాబాద్‌ నుంచి నిధులు అందకుండా ఇదే కేసీఆర్‌ కూడా వ్యవస్థలను ఉపయోగించుకున్నారు. దేశంలో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోయే వ్యవస్థలను ప్రధాని మోదీ ఏర్పాటు చేసుకున్నారు. అందుకే ఆ ఒడ్డునుంటావా.. ఈ ఒడ్డుకొస్తావా? అని బరిగీసి మరీ ప్రధానమంత్రి సవాలు చేస్తున్నారు. అధికారంలో కొనసాగాలంటే తమకు దాసోహం అవ్వాల్సిందే అన్న పరిస్థితులను దేశ రాజకీయాలలో నరేంద్ర మోదీ కల్పించారు. ఒకప్పుడు ఇందిరాగాంధీ హయాంలో ఇటువంటి పరిస్థితి ఉండేది. ఇందిర కంటే మోదీ రెండాకులు ఎక్కువే చదివారు. నిర్దేశించుకున్న టార్గెట్లపై ఏజెన్సీలతో మెరుపు దాడులు చేయించడంలో ప్రధానమంత్రి దిట్ట అని చెప్పవచ్చు. రాజకీయ ప్రత్యర్థులను గెరిల్లా యుద్ధం ద్వారా మట్టుబెట్టడంలో కూడా మోదీ–షా ద్వయం నిష్ణాతులు. మహారాష్ట్రలో ఏక్‌నాథ్‌ షిండే రూపంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే అధికారానికి గ్రహణం పడుతుందని ఎవరైనా ఊహించారా? ఉద్ధవ్‌ను దెబ్బతీయడం కోసం ముఖ్యమంత్రిగా పనిచేసిన దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఉప ముఖ్యమంత్రిగా ఉండటానికి ఒప్పించడం మామూలు విషయం కాదు. ఇప్పుడు దక్షిణాది రాష్ర్టాలపై మోదీ–షాల దృష్టి పడింది. అసాధ్యాలను సుసాధ్యం చేసుకుంటూ వస్తున్న తమకు తెలంగాణను కైవసం చేసుకోవడం ఒక లెక్క కాదు అని వారు అభిప్రాయపడుతున్నారు. ఇతర పార్టీలకు చెందిన బలమైన నాయకులను బీజేపీలోకి ఆహ్వానించడం కోసం స్వయంగా ప్రధానమంత్రి జోక్యం చేసుకుంటున్నారు. తమ జాబితాలో ఉన్న కొద్ది మంది ముఖ్యులతో నరేంద్ర మోదీ స్వయంగా మాట్లాడుతున్నారు.


చిరంజీవిపై వల.. పవన్‌ కట్టడి!

తెలంగాణలో ‘ఆపరేషన్‌ ఆకర్ష్‌’ సక్సెస్‌ అయితే ఆ తర్వాత మోదీ–షా దృష్టి తమిళనాడుపై పడే అవకాశం ఉంది. జయలలిత మరణానంతరం తమ దారిలోకి రావడానికి నిరాకరించిన శశికళను జైలుకు పంపడమే కాకుండా రాజకీయంగా ఆమెను భూస్థాపితం చేశారు. ఇప్పుడు పన్నీర్‌ సెల్వంను అన్నాడీఎంకే నుంచి గెంటేయడంలో కూడా బీజేపీ పాత్ర ఉంది. ఈ విధంగా బలమైన అన్నాడీఎంకేను బలహీనపరచిన మోదీ–షాలు ఇప్పుడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్‌పై దృష్టిపెట్టకుండా ఉండరు. మహారాష్ట్రలో శివసేనపై చేసిన ప్రయోగాన్ని తమిళనాడులో డీఎంకేపై కూడా చేసే అవకాశం లేకపోలేదు. అక్కడ ఏక్‌నాథ్‌ షిండే పాత్ర ఎవరు పోషిస్తారా అని ఎదురుచూస్తున్నారు. డీఎంకేలో సీనియర్‌ నాయకుడైన దొరై మురుగన్‌ ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. బీజేపీ పెద్దలు ఆయనపై ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ద్రవిడ ఉద్యమం నేపథ్యంలో ఏర్పడిన డీఎంకే, అన్నాడీఎంకే లను చీలికలు పేలికలు చేసి బలహీనపరచడం ద్వారా తమిళనాడులో బీజేపీని విస్తరించాలన్నది మోదీ–షాల అభిమతంగా చెబుతున్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌ వయసు ప్రస్తుతం 69 ఏళ్లు. ఆంధ్రప్రదేశ్‌లో తమ అడుగులకు మడుగులొత్తే జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నందున ప్రస్తుతానికి వారికి ఆ రాష్ట్రం ముఖ్యం కాదు. ముందుగా చంద్రబాబునాయుడిని రాజకీయంగా కోలుకోలేని దెబ్బకొట్టి ఆ తర్వాత జగన్‌ను ఫినిష్‌ చేయాలన్నది బీజేపీ పెద్దల వ్యూహం. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని పటిష్ఠం చేసుకోవడం కోసం కాపు సామాజిక వర్గాన్ని దగ్గరకు తీసుకోవాలని కేంద్ర పెద్దలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవిని బీజేపీలో చేర్చుకొనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ కారణంగానే అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సందర్భంగా భీమవరానికి చిరంజీవిని ప్రత్యేకంగా ఆహ్వానించి అక్కడ ఆయనపై ప్రధాని మోదీ అంతులేని ఆప్యాయత ప్రదర్శించారు. అయితే మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని మధ్యవర్తుల వద్ద చిరంజీవి స్పష్టం చేసినట్టు తెలిసింది. దీంతో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ తెలుగుదేశం పార్టీ వైపు వెళ్లకుండా కట్టడి చేసే పనిలో ఉన్నారు బీజేపీ పెద్దలు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ భవితవ్యం ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. ఎన్నికలకు ఎక్కువ వ్యవధి లేనందున టీఆర్‌ఎస్‌లో చీలికకు బీజేపీ నాయకులు ప్రయత్నించకపోవచ్చు.


కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉన్నప్పుడు డీఎంకే, అన్నాడీఎంకే ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఎంజీఆర్‌, కరుణానిధి, జయలలిత కూడా కొంత అణకువతోనే ఉండేవారు. ఇందిరాగాంధీని ఎదిరించినప్పుడు అనేక చేదు అనుభవాలను ఎంజీఆర్‌, కరుణానిధి చవిచూశారు. ఈ కారణంగా ఇప్పుడు కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం ఆయనకు మంచి కంటే చెడే ఎక్కువ చేసే అవకాశం ఉంది. నరేంద్ర మోదీ వంటి బలమైన నాయకుడిని తమ నాయకుడు శత్రువుగా ప్రకటించుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో తెలివైన నిర్ణయం కాదని టీఆర్‌ఎస్‌ మంత్రి ఒకరు అభిప్రాయపడ్డారు. నిజానికి తెలంగాణ ప్రజల్లో కేసీఆర్‌ పట్ల విముఖత ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని రెచ్చగొట్టడం కేసీఆర్‌కు నష్టం చేస్తుందని టీఆర్‌ఎస్‌ ప్రముఖులు ఆందోళనగా ఉన్నారు. తత్వం బోధపడిన ముఖ్యమంత్రులు అందరూ ప్రధానమంత్రితో సఖ్యతగా ఉండటానికి ప్రాధాన్యం ఇస్తున్న ప్రస్తుత తరుణంలో ‘‘నేను తగ్గేదే లే’’ అని కేసీఆర్‌ బయలుదేరారు. ఏం జరుగుతుందో చూద్దాం!

Read more