కేసీఆర్‌.. కింకర్తవ్యం?

ABN , First Publish Date - 2022-07-24T08:25:01+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌కూ, భారతీయ జనతా పార్టీకీ మధ్య నడుస్తున్న వ్యూహప్రతివ్యూహాలు ఆసక్తికరంగా ఉండబోతున్నాయి. ఉన్నట్టుండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై యుద్ధం ప్రకటించి, ఆయనను వ్యక్తిగతంగా దుర్భాషలాడుతున్న...

కేసీఆర్‌.. కింకర్తవ్యం?

ముఖ్యమంత్రి కేసీఆర్‌కూ, భారతీయ జనతా పార్టీకీ మధ్య నడుస్తున్న వ్యూహప్రతివ్యూహాలు ఆసక్తికరంగా ఉండబోతున్నాయి. ఉన్నట్టుండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై యుద్ధం ప్రకటించి, ఆయనను వ్యక్తిగతంగా దుర్భాషలాడుతున్న కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాలన్న పట్టుదలతో బీజేపీ అగ్ర నాయకత్వం ఉండగా, వచ్చే ఏడాది జరిగే ఎన్నికలలో విజయం సాధించడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టి సారించారు. గత ఎన్నికల్లో చంద్రబాబు బూచిని చూపించి సునాయాసంగా విజయాన్ని అందుకున్న కేసీఆర్‌, ఈ పర్యాయం ప్రధాని మోదీ బూచిని చూపించాలని తలపోశారు. రాజకీయాలలో కేసీఆర్‌ కంటే రెండు ఆకులు ఎక్కువే చదివిన నరేంద్ర మోదీ– కేసీఆర్‌ పన్నిన వలలో చిక్కుకోకుండా తప్పించుకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీ తనపై దాడి చేస్తారని, దాన్ని అవకాశంగా మలచుకోవాలని కేసీఆర్‌ భావించారు. ‘అనుకున్నదొక్కటి అయిందొక్కటి బోల్తా పడ్డావులే బుల్‌ బుల్‌ పిట్టా’ అని  సినిమాలో పాట ఉన్నట్టుగా, హైదరాబాద్‌ సభలో కేసీఆర్‌ పేరును ఎక్కడా కూడా ప్రధాని మోదీ ప్రస్తావించకపోవడంతో కేసీఆర్‌ పాచిక పారలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వ వలకు చిక్కకుండా వచ్చే ఏడాది జరగవలసిన ఎన్నికలను ఎప్పుడు? ఎలా? జరిపించుకోవాలి అన్న అంశంపై కేసీఆర్‌ దృష్టి సారించారు. ముందస్తు ఎన్నికలకు వెళితే కేంద్ర ఎన్నికల సంఘం సహకరించకపోవచ్చునని, అసెంబ్లీని రద్దు చేస్తే రాష్ట్రపతి పాలన విధించవచ్చునని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కలత చెందుతున్నారు. అలా అని షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలకు వెళితే అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం అడ్డుపుల్ల వేయవచ్చునని కేసీఆర్‌ ఆందోళనతో ఉన్నారు. 2018లో శాసనసభ ఎన్నికల ఫలితాలు డిసెంబరు 8న వెలువడ్డాయి. ఆ తర్వాత శాసనసభ నెల తర్వాత ఏర్పడింది. ఆ తర్వాత మూడు నెలలకే లోక్‌సభకు సాధారణ ఎన్నికలు జరిగాయి.


షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలకు వెళ్లాలనుకుంటే కేంద్ర ఎన్నికల కమిషన్‌ సహకరించకుండా సాధారణ ఎన్నికలతో కలిపి నిర్వహిస్తే పరిస్థితి ఏమిటి? అని న్యాయ నిపుణులతో కేసీఆర్‌ మంతనాలు జరుపుతున్నారు. ఈ అంశమే ఇప్పుడు కేసీఆర్‌ను కలవరపెడుతోంది. సాధారణ ఎన్నికలతో కలిపి అసెంబ్లీ ఎన్నికలు జరిపితే పరిస్థితి బీజేపీకి అనుకూలంగా ఉంటుందని కేసీఆర్‌ భావిస్తున్నారు. గత ఎన్నికల్లో అసెంబ్లీ ఫలితాలు, లోక్‌సభ ఫలితాలు భిన్నంగా ఉన్న విషయం విదితమే. ఈ కారణంగా ముందస్తు ఎన్నికలకు వెళదామా? అంటే కేంద్రం ఎంతవరకు సహకరిస్తుందో తెలియదు. ముందుగా అనుకున్న దాని ప్రకారం వచ్చే ఏడాది మార్చిలో అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరిపించాలని కేసీఆర్‌ భావించారు. అలా అనుకుని అసెంబ్లీని రద్దు చేస్తే రాష్ట్రపతి పాలన విధించే అవకాశం లేకపోలేదని న్యాయ నిపుణులు సైతం కేసీఆర్‌ను హెచ్చరించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఏం చేయాలన్న విషయమై సుప్రీంకోర్టుకు చెందిన న్యాయ కోవిదులతో కేసీఆర్‌ చర్చలు జరుపుతున్నారు. తన పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి చందంగా ఉందని కేసీఆర్‌ గ్రహించినట్టు చెబుతున్నారు. ఈ కారణంగానే ఇటీవల ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసీఆర్‌ సహనం కోల్పోయి ప్రధాని మోదీని వ్యక్తిగతంగా దూషించారు. ప్రధాని కూడా ఈ అంశాన్ని మనసుకు తీసుకున్నారు. ఈ మధ్య కాలంలో తనను కలిసిన తెలుగు ప్రముఖులను తెలంగాణలో పరిస్థితుల గురించి ప్రధాని వాకబు చేస్తున్నారు. తెలంగాణలో అధికారంలోకి రావాలంటే మా పార్టీ ఏం చేయాలో చెప్పండని కోరుతున్నారు. అదే సమయంలో ఇతర పార్టీలకు చెందిన నాయకులను చేర్చుకోవడం ద్వారా పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి కేంద్రీకరించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఉదంతం ఇందులో భాగమే. రాష్ట్రంలో బీజేపీ బలం పెరుగుతున్నప్పటికీ అధికారంలోకి రావడానికి ఆ బలం సరిపోదు అని వివిధ సర్వేలలో వెల్లడవుతోంది. ఖమ్మం, నల్లగొండ వంటి జిల్లాల్లో పార్టీ సంస్థాగతంగా బలహీనంగా ఉన్న విషయం విదితమే. ఈ కారణంగానే రాజగోపాల్‌ రెడ్డిని పార్టీలో చేర్చుకొని ఉప ఎన్నిక జరిపించి అక్కడ గెలవడం ద్వారా ప్రజాభిప్రాయం బీజేపీకే అనుకూలంగా ఉందని చాటి చెప్పాలన్నది కమలనాథుల లక్ష్యం. నిజంగా రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా చేసి బీజేపీ తరఫున పోటీ చేసి గెలిస్తే మాత్రం నష్టపోయేది టీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్‌ కూడా. ఒక్క మాటలో చెప్పాలంటే మునుగోడు స్థానానికి ఉప ఎన్నిక జరిగితే మూడు ప్రధాన పార్టీలకూ అది జీవన్మరణ సమస్య అవుతుంది. మునుగోడులో కాషాయ జెండా ఎగిరితే మాత్రం కమలదళం బలం పెరిగిపోతుంది. పార్టీలో చేరికలు ఊపందుకుంటాయి. ఈ పరిణామం సహజంగానే కేసీఆర్‌కు రుచించదు. ఈ కారణంగానే కాంగ్రెస్‌ పార్టీలో కూడా చేరికలు ఉండేలా ఆయన పరోక్షంగా సహకరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే సొంతంగానే మెజారిటీ సమకూర్చుకోవాలి. మెజారిటీకి ఏ మాత్రం సీట్లు తగ్గినా టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, మజ్లిస్‌ పార్టీలు సహకరించవు. ఆ పరిస్థితి వస్తే బీజేపీకి వ్యతిరేకంగా ఈ మూడు పార్టీలూ చేతులు కలుపుతాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో కాంగ్రెస్‌ బలహీనపడితే నష్టం ఆ పార్టీకి మాత్రమే కాదు.. టీఆర్‌ఎస్‌కు కూడా. మూడు పార్టీల మధ్య పోటీ ఉంటుందని ప్రజలు కూడా భావిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉండటంతో పాటు రాష్ట్రంలో ఊపు మీదున్నందున బీజేపీ బలహీనపడే అవకాశాలు తక్కువ. రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో పాటు ధనబలం పుష్కలంగా ఉన్నందున టీఆర్‌ఎస్‌ బలహీనపడిపోదు. సమస్య అంతా కాంగ్రెస్‌ పార్టీకే. రేవంత్‌ రెడ్డి పీసీసీ చీఫ్‌ అయ్యాక తెలంగాణలో ఆ పార్టీకి ఊపు వచ్చింది. అదే సమయంలో కాంగ్రెస్‌లో అంతర్గత పోరు కూడా మొదలైంది. రాజగోపాల్‌ రెడ్డి వంటి మరికొంత మంది పార్టీని వదిలి వెళితే కాంగ్రెస్‌ పార్టీ మూడవ స్థానానికి దిగజారిపోతుందన్న ఆందోళనను ఆ పార్టీ కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్‌కు తామే ప్రత్యామ్నాయం అన్న భరోసాను రేవంత్‌ రెడ్డి ప్రజలకు కల్పించలేకపోతే ఎన్నికల్లో విజయ తీరాలకు చేరడం కష్టం. ఈ విషయం గుర్తించిన బీజేపీ అగ్రనాయకత్వం స్వయంగా రంగంలోకి దిగింది. నిన్నగాక మొన్న కొండా విశ్వేశ్వర్‌ రెడ్డిని, ఇప్పుడు రాజగోపాల్‌ రెడ్డిని పార్టీలో చేర్చుకుంటున్నారు. చేరికలు పెరిగే కొద్దీ కేసీఆర్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం అన్న అభిప్రాయం ప్రజల్లో బలపడుతుంది. అదే సమయంలో అవసరమైతే టీఆర్‌ఎస్‌–కాంగ్రెస్‌ పార్టీలు ఎన్నికల అనంతరం చేతులు కలుపుతాయని కమలనాథులు అంచనా వేస్తున్నారు. మొత్తంమీద సొంతంగా మెజారిటీ సమకూర్చుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తుండగా బీజేపీకి ఆ అవకాశం ఇవ్వకుండా ఎన్నికలు ఎప్పుడు జరిపించాలన్న విషయమై కేసీఆర్‌ కసరత్తు చేస్తున్నారు. ఈ రెండు పార్టీల మధ్య కాంగ్రెస్‌ పార్టీ తన ఉనికిని ఎలా కాపాడుకుంటుందో చూడాలి. ప్రశాంత్‌ కిశోర్‌ అంచనాల ప్రకారం తెలంగాణలోని గ్రామాలలో కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికీ బలంగా ఉంది. అంతేకాదు, ఆ పార్టీ ఇటీవల నిర్వహిస్తున్న కార్యక్రమాలకు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. అయితే కాంగ్రెస్‌ పార్టీ ఊపు మీద ఉందనుకున్నప్పుడల్లా పొంగు చల్లార్చడానికి అసంతృప్తవాదులు ఆ పార్టీలో ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఈ బెడదను ఎదుర్కొంటూ టీఆర్‌ఎస్‌– బీజేపీలను దాటి ముందుకు వెళ్లడానికి రేవంత్‌ రెడ్డి ఏం చేయబోతున్నారన్న దానిపై ఆ పార్టీ పరిస్థితి ఆధారపడి ఉంటుంది. కాంగ్రెస్‌ పెరిగినా ఫర్వాలేదు, బీజేపీ మాత్రం మరింత బలపడకూడదన్న అభిప్రాయంతో ఉన్న కేసీఆర్‌ అందుకోసం ఎటువంటి వ్యూహాలు రచిస్తారో వేచి చూద్దాం! కేసీఆర్‌ మాటల మాంత్రికుడు. అదే ఆయన బలం. ఆ బలంతోనే ముఖ్యమంత్రి కూడా అయ్యారు. అయితే ఇప్పుడు ఆ మాటలే ఆయన బలహీనత అయ్యాయి. ఈ బలహీనత ఆయనను మరింతగా పతనం వైపు నడిపిస్తుందా? అనేది కాలమే నిర్ణయిస్తుంది!


చాన్స్‌ అయిపోయింది!

ఇప్పుడు ఆంధ్రా రాజకీయాలకు వద్దాం. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి లెక్కలు తప్పుతున్నాయి. సుదీర్ఘ కాలం అధికారంలో ఉండటానికి ఆయన ఎంచుకున్న మోడల్‌లో ఎక్కడో తేడా కొడుతోంది! తన అంచనాలకు భిన్నంగా క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఉండటాన్ని జగన్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. తన అసహనాన్ని ఆయన శాసనసభ్యులు, పార్టీ నాయకులపై వ్యక్తంచేస్తూనే ఉన్నారు. ఈ మధ్య అధికారులపై కూడా అసహనం ప్రదర్శించారు. సంక్షేమం పేరిట ప్రజలకు డబ్బు పంచుకుంటూ పోతే తన అధికారం సుస్థిరంగా ఉంటుందని జగన్‌ తలపోశారు. ఈ కారణంగానే తాను 30 ఏళ్లు అధికారంలో ఉంటానని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన చెప్పుకొంటున్నారు. ఒకసారి అధికారంలోకి వస్తే చాలు 30 ఏళ్లు ఆ సీట్లో కదలకుండా ఉండిపోవచ్చునని లెక్కలు వేసుకున్న ఆయన, నిన్న మొన్నటి వరకు అదే ధీమాతో ఉన్నారు. సంక్షేమం పేరిట ఈ మూడేళ్లలో లక్షా 65 వేల కోట్ల రూపాయలు పంచిపెట్టిన తనకు కాకుండా జనం ఇంకెవరికైౖనా ఎందుకు ఓటు వేస్తారని ఆయన లెక్కలు వేసుకున్నారు. ఈ కారణంగానే సంపద సృష్టిపై జగన్‌ దృష్టి సారించలేదు. అభివృద్ధిని పట్టించుకోలేదు. అదే సమయంలో అడ్డగోలుగా అప్పులు చేస్తూ వచ్చారు. ఎడాపెడా పన్నులు వేశారు. అవినీతిని కేంద్రీకృతం చేసి అధికార దుర్వినియోగానికి తెర లేపారు. తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్టుగా ఇంచుమించుగా ఇదే పరిస్థితి ఉన్న శ్రీలంకలో ప్రజలు తిరగబడ్డారు. పాలకులు దేశం వదిలి పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామంతో కేంద్ర ప్రభుత్వం మేల్కొని రాష్ర్టాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ చేస్తున్న అప్పులపై దృష్టి సారించింది. కాగ్‌ కళ్లుగప్పి దొంగచాటుగా అప్పులు చేయడాన్ని గుర్తించి కట్టడికి చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది. రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా పన్నుల ఆదాయాన్ని కుదవపెట్టి ఆంధ్రప్రదేశ్‌ అప్పులు చేయడంపై రిజర్వు బ్యాంకు నేరుగా దృష్టి సారించింది.


ఈ విధానం ఆమోదయోగ్యం కాదని షెడ్యూల్డ్‌ బ్యాంకులను రిజర్వు బ్యాంక్‌ హెచ్చరించింది. దీంతో బటన్‌ నొక్కుడు కార్యక్రమాన్ని కొనసాగించడం ఎలా? అని జగన్మోహన్‌ రెడ్డి తలపట్టుకుంటున్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, తాను కష్టపడి బటన్‌ నొక్కుతున్నప్పటికీ, దేశంలో ఎక్కడా లేని పథకాలను అమలు చేస్తున్నప్పటికీ ప్రజల్లో ఆశించిన సానుకూలత లేకపోవడానికి కారణం ఏమిటని ఆయన ఈ మధ్య కాలంలో అధికారులను కూడా నిలదీస్తున్నారు. ఇక పార్టీ శాసనసభ్యులను ఉద్దేశించి మీరు పనితీరు మెరుగుపర్చుకోకుంటే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వబోనని హెచ్చరించారు. గత ఎన్నికల్లో తాను అధికారంలోకి రావడానికి దోహదపడిన ఎత్తుగడల రూపకర్త ప్రశాంత్‌ కిశోర్‌ బృందం కూడా క్షేత్ర స్థాయిలో పరిస్థితులు బాగోలేవని నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక అనంతరం జగన్మోహన్‌ రెడ్డి మరింతగా కలవరపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ అధికారంలోకి రావడం చాలా కష్టం– చంద్రబాబుకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి అని ప్రశాంత్‌ కిశోర్‌ కూడా తెలంగాణకు చెందిన ఓ ప్రముఖ నాయకుడి వద్ద వ్యాఖ్యానించారు.


నాడు తండ్రి.. నేడు కొడుకు!

అధికారంలో ఉన్నవాళ్లు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించుకొని దిద్దుబాటు చర్యలు తీసుకుంటూ ఉంటారు. 2019కి ముందు చంద్రబాబు బాటలోనే ఇప్పుడు జగన్మోహన్‌ రెడ్డి కూడా అంతా అనుకూలంగానే ఉందని అనుకుంటూ వచ్చారు. దిద్దుబాటు చర్యలు తీసుకొనే ఆలోచనను కూడా దరిదాపులకు రానివ్వలేదు. ముఖ్యమంత్రి మాటల్లో చెప్పాలంటే ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే వ్యవధి ఉంది. ఇప్పుడు దిద్దుబాటు చర్యలు తీసుకున్నప్పటికీ ఫలితం ఉండకపోవచ్చునని ప్రశాంత్‌ కిశోర్‌ బృందం కూడా తేల్చిచెప్పినట్టు తెలిసింది. దీంతో లక్షన్నర కోట్లకు పైగా పంచిపెట్టినా ఎందుకిలా జరుగుతోంది? అని ముఖ్యమంత్రి మథనపడుతున్నారు. తాను మంచి చేస్తున్నప్పటికీ ప్రజలు ఆ విషయం గుర్తించకపోవడానికి మీడియా ప్రధాన కారణమన్న నిర్ణయానికి వచ్చిన జగన్‌, దుష్ట చతుష్టయం అన్న పదాన్ని తెర మీదకు తెచ్చారు. రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ‘ఆ రెండు పత్రికలు’ అని నిందించేవారు. మీడియా కథనాలపై ఎదురుదాడి చేయించేవారు. దిద్దుబాటు చర్యలు తీసుకోకుండా ఎదురుదాడినే నమ్ముకోవడం వల్ల 2009 ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి అతి కష్టం మీద బొటాబొటి మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. అప్పట్లో మీడియా, ముఖ్యంగా ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనాలలోని అంశాలపైనే సీబీఐ విచారణ జరిపి జగన్మోహన్‌ రెడ్డిపై కేసులు పెట్టింది. కళ్లెదురుగా ఈ అనుభవం కనిపిస్తున్నప్పటికీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌ తన వైఖరి మార్చుకోలేదు. నాటి తండ్రి బాటలోనే ఇంకో అడుగు ముందుకేసి ఇప్పుడు దుష్ట చతుష్టయం అని నిందించడం మొదలుపెట్టారు. జగన్‌ అధికారంలోకి వస్తే అభివృద్ధి కనుమరుగవుతుందని, పోలవరం, అమరావతి ఆగిపోతాయని 2019 ఎన్నికలకు ముందు ‘ఆంధ్రజ్యోతి’ ప్రజలను హెచ్చరించింది. ఆనాడు మేం చెప్పిందే ఇప్పుడు జరిగింది. మీడియాను దోషిగా నిలబెట్టాలనుకుంటే పోలవరం, అమరావతిలను పూర్తిచేయవలసింది. జగన్మోహన్‌ రెడ్డి అలా చేయకపోవడం వల్ల మీడియా, ముఖ్యంగా ‘ఆంధ్రజ్యోతి’ విశ్వసనీయత పెరిగింది. మేం ప్రచురించి ప్రసారం చేసిన కథనాలు తప్పు అని ఈ మూడేళ్లలో జగన్‌ రుజువు చేయలేకపోయారు. జగన్‌ చెప్పేదానికీ, చేసేదానికీ పొంతన ఉండదు. ఈ విషయాన్ని ప్రజలు కూడా గుర్తించారు. అందుకే విశ్వసనీయతకు తాను చిరునామా అని చెప్పుకొంటున్నప్పటికీ జగన్‌ను జనం నమ్మడం లేదు. మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పుకొంటున్న ముఖ్యమంత్రిని ప్రజలు హేళన చేయడం మొదలుపెట్టారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీలు, చెప్పిన మాటలు ఆకర్షణీయంగా ఉండటంతో ప్రజలు నమ్మారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అంతా వంచన అని ప్రజలు భావిస్తున్నారు. ‘ఒక్క చాన్స్‌’ అంటే నమ్మి ప్రజలు అధికారం కట్టబెట్టారు. ఇప్పుడు ‘ఒక్క చాన్స్‌’ అయిపోయింది. చేసింది చాల్లే అని ప్రజలు ఈసడించుకొనే పరిస్థితి వచ్చింది.


అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే తన ప్రభుత్వంపై వ్యతిరేకత ఎందుకు ఏర్పడిందో గుర్తించి విరుగుడు చర్యలు తీసుకొని ఉండి ఉంటే ఇప్పుడు అసహనానికి గురయ్యే పరిస్థితి జగన్‌కు వచ్చి ఉండేది కాదు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు అన్నింటికీ ‘జగనన్న’ అన్న పేరు తగిలించి జనంలోకి తన పేరు మాత్రమే వెళ్లేలా చేసుకున్న ముఖ్యమంత్రి– మంత్రులు, ఎమ్మెల్యేలను డమ్మీలుగా మార్చారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నట్టుగా ప్రజలకు జగన్‌ పేరు తప్ప మంత్రులు, శాసనసభ్యుల పేర్లు కూడా గుర్తుకురాని పరిస్థితి రాష్ట్రంలో ఉంది. దీన్నిబట్టి మంచికీ, చెడుకీ కర్త కర్మ క్రియగా జగన్మోహన్‌ రెడ్డి మాత్రమే కనబడుతున్నారు. ఈ నేపథ్యంలో పనితీరు బాగాలేదని శాసనసభ్యులపై విరుచుకుపడితే ఏం ప్రయోజనం? గడచిన మూడేళ్లలో తప్పు చేసిన మంత్రులను గానీ, శాసనసభ్యులను గానీ ముఖ్యమంత్రి మందలించిన పాపాన పోలేదు. పైపెచ్చు అలాంటి వారిని ప్రోత్సహించారు. నోరు పారేసుకోవడం అదనపు అర్హతగా మార్చారు.


దాల్‌ మే కుచ్‌ కాలా హై...

నిజానికి పోలవరం ప్రాజెక్టును, రాజధాని అమరావతిని పూర్తిచేసే సువర్ణావకాశం జగన్మోహన్‌ రెడ్డికి లభించింది. అయితే మూడు రాజధానులు అంటూ దిక్కుమాలిన విధానానికి తెరలేపిన ఆయన ఇప్పుడు ఒక్క రాజధాని కూడా లేకుండా చేశారు. ఆత్మ పరిశీలన చేసుకోవలసిన ఆయన ఆత్మస్తుతి, పరనిందను నమ్ముకుంటున్నారు. ప్రజలు తనపట్ల సానుకూలంగా ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మరోలా ఉండటానికి శాసనసభ్యులు, అధికారులు కారణమని నిందిస్తున్నారు. నిజానికి శాసనసభ్యులు, అధికారులు నిమిత్తమాత్రులు. ప్రజల్లో ప్రస్తుతం ఉన్న వ్యతిరేకతకు జగన్‌ మాత్రమే కారకుడు. ప్రభుత్వాన్ని తప్పుబడుతున్న వారు శాసనసభ్యులు, అధికారులను నిందించడం లేదు. ముఖ్యమంత్రి జగన్‌ను మాత్రమే నిందిస్తున్నారు. ‘ఒక్క చాన్స్‌’ అని ప్రాధేయపడినందుకు అవకాశం ఇస్తే రాష్ర్టాన్ని నాశనం చేస్తున్నాడని జగన్‌ను మాత్రమే విమర్శిస్తున్నారు. వ్యవస్థలన్నీ నిర్వీర్యం అవడంతో ప్రభుత్వంపై ప్రజలు భరోసా కోల్పోయారు. పోలీసు వ్యవస్థను అడ్డగోలుగా దుర్వినియోగం చేస్తున్నారు. గ్రామస్థాయి కార్యకర్త నుంచి రాష్ట్రస్థాయి నాయకుడి వరకు పగలు, ప్రతీకారాలతో రగిలిపోయే పరిస్థితి కల్పించారు. నీలి మీడియా, కూలి మీడియాలో అనుకూల కథనాలను ప్రచురించి, ప్రచారం చేయించుకుంటున్న జగన్మోహన్‌ రెడ్డి, అవే నిజమని నమ్ముతున్నారు. అయితే తాను స్వయంగా నియమించుకున్న ప్రశాంత్‌ కిశోర్‌ బృందం కూడా ‘దాల్‌ మే కుచ్‌ కాలా హై’ అని స్పష్టంచేయడంతో ముఖ్యమంత్రి ఇప్పుడిప్పుడే కళ్లు తెరుస్తున్నారు. అయితే ఇంత కాలం కళ్లు మూసుకొని ఉన్న ఆయనకు నిజాలు కనిపించడం లేదు. చూపులో తేడా వచ్చింది. అందుకే దుష్ట చతుష్టయం అంటూ కొంతసేపు.. శాసనసభ్యులు, అధికారులే కారణమంటూ మరికొంతసేపూ నిందిస్తూ కాలం గడిపేస్తున్నారు. అసత్యాలే పునాదిగా అభూత కల్పనలను ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి, ఇప్పుడు మళ్లీ అవే అసత్యాలను ప్రచారం చేయడం ద్వారా ప్రజల దృష్టి తనవైపు మళ్లించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం ‘సోషల్‌ మీడియా వారియర్స్‌’ అంటూ ప్రత్యేకంగా నియామకాలు చేపట్టారు. దుష్ట చతుష్టయానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి సోషల్‌ మీడియా వారియర్స్‌ కావాలంటూ ప్రకటన చేశారు. సమయం మించిపోయింది ముఖ్యమంత్రి గారూ! ఈ సోషల్‌ మీడియా వారియర్స్‌ కూడా ఇప్పుడు మిమ్మల్ని కాపాడలేరు! మీకిచ్చిన ఒక్క చాన్స్‌ అయిపోయిందన్న నిర్ణయానికి ప్రజలు వచ్చేశారు! డబ్బులు పంచడం పక్కన పెడితే జగన్‌ పాలనలో గుర్తుపెట్టుకొనే అంశం ఏదైనా ఉందా అంటే ‘జగన్‌ అండ్‌ కో’నే చెప్పలేని పరిస్థితి! రాజశేఖర రెడ్డి పాలన అంటే నీటిపారుదల ప్రాజెక్టులు, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాలు వంటివి గుర్తుకొస్తాయి. ఇప్పుడు తన పాలనలో ‘అమ్మ ఒడి’ మినహా మరొక పథకం జగన్‌కు వెంటనే గుర్తుకు రావడంలేదు. ప్రజలకు మాత్రం రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీయడం, రోడ్లు గుంతలమయం కావడం వంటివి గుర్తుకొస్తున్నాయి. అతి సర్వత్ర వర్జయేత్‌ అంటారు.


అభివృద్ధి–సంక్షేమం మధ్య సమతౌల్యం లోపిస్తే ఎటువంటి అనర్థం జరుగుతుందో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అదే జరుగుతోంది. రాష్ట్రంలోని పరిస్థితులను శ్రీలంకతో ఎలా పోలుస్తారని సజ్జల వంటి వారు ఆక్షేపించడం వల్ల ప్రయోజనం లేదు. దక్షిణాఫ్రికాతో పోల్చి మూడు రాజధానుల సిద్ధాంతాన్ని తెర మీదకు తెచ్చినప్పుడు శ్రీలంకతో ఎందుకు పోల్చకూడదని సోషల్‌ మీడియాలో ఎదురుదాడి ప్రారంభమైంది. రిజర్వు బ్యాంక్‌ తాజాగా షెడ్యూల్డ్‌ బ్యాంకులకు జారీ చేసిన మెమోతో జగన్‌ సర్కారుకు ఇక అప్పు కూడా పుట్టదు. అప్పుడు కష్టపడి బటన్‌ నొక్కడానికి కూడా డబ్బులు ఉండవు. అదే జరిగితే జగన్‌ ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. బటన్‌ నొక్కి డబ్బు పంచడానికి మాత్రమే తాను ఉన్నానని వెరపు లేకుండా బహిరంగంగా చెప్పుకొంటున్న ముఖ్యమంత్రి  పాలనలో రాష్ట్రం పరిస్థితి శ్రీలంకలా కాకుండా మరోలా ఎలా ఉంటుంది? ఇప్పటికే రాష్ర్టాన్ని కులాల కుంపట్లలో వేయించుకుతింటున్నారు. ఇప్పుడు జగన్‌ నియమించబోతున్న సోషల్‌ మీడియా వారియర్స్‌ వల్ల ఇంకెన్ని అనర్థాలు చోటుచేసుకుంటాయో? ప్రజల్లో ఎటువంటి విద్వేషాలు రగిలిస్తారో? ప్రజలే అప్రమత్తమై ఈ ముప్పు నుంచి తమను తాము కాపాడుకోవాలి. రాష్ర్టాన్నీ కాపాడాలి!

ఆర్కే


యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Read more