‘న్యాయం’ గెలిచింది... అమరావతి నిలిచింది!

ABN , First Publish Date - 2022-03-06T06:06:48+05:30 IST

భవిష్యత్తుపై సవాలక్ష సందేహాలు! చుట్టూ చిమ్మ చీకటి! దారి చూపించవలసిన వాడే దారి తప్పాడు! ఇదీ టూకీగా ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి! ఈ నేపథ్యంలో రాజధాని అమరావతిపై చరిత్రాత్మక తీర్పు వెలువరించిన హైకోర్టు...

‘న్యాయం’ గెలిచింది... అమరావతి నిలిచింది!

భవిష్యత్తుపై సవాలక్ష సందేహాలు! చుట్టూ చిమ్మ చీకటి! దారి చూపించవలసిన వాడే దారి తప్పాడు! ఇదీ టూకీగా ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి! ఈ నేపథ్యంలో రాజధాని అమరావతిపై చరిత్రాత్మక తీర్పు వెలువరించిన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం వేగుచుక్కలా ‘నేనున్నాను’ అంది. రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లు అవుతున్నా రాజధాని ఏదో తెలియని అయోమయంలో కూరుకుపోయిన ఆంధ్రులకు అమరావతి మాత్రమే రాజధానిగా ఉంటుందని హైకోర్టు విస్పష్టమైన తీర్పును ప్రకటించడం ద్వారా ఊరటనిచ్చింది. విభజన చట్టంలో పొందుపరచిన ‘ది కేపిటల్‌’ అన్న పదానికి నిర్వచనం ఇవ్వడం ద్వారా రాష్ర్టానికి ఒకటే రాజధాని ఉంటుందని హైకోర్టు తేల్చి చెప్పింది. 30 వేల ఎకరాల పైచిలుకు భూములను పైసా ఖర్చు లేకుండా రైతులను మెప్పించి, ఒప్పించి సేకరించిన నాటి చంద్రబాబు ప్రభుత్వం రాజధాని నిర్మాణాలు ప్రారంభించింది. ఫ్లడ్‌ లైట్ల వెలుగులో వేల మంది కార్మికులు రాజధాని నిర్మాణాల పనుల్లో నిమగ్నమై ఉండేవారు. శాసనసభ, హైకోర్టు వంటి భవనాలు పూర్తయ్యాయి. మరెన్నో నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయి. అనుకున్నట్టుగా అమరావతి నిర్మాణం పూర్తయి ఉంటే ఆంధ్రప్రదేశ్‌కు అది ఒక ప్రధాన ఆర్థిక వనరుగా ఉండేది. ఈ దశలో విధి వక్రించి రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తూ శాసనసభలో తీర్మానం చేసినప్పుడు ఆమోదం తెలిపిన జగన్‌రెడ్డి... ముఖ్యమంత్రి అయ్యాక మాట మార్చారు. మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాటకు తెర తీశారు. అంతే.. ముఖ్యమంత్రి వాదనను బలపరుస్తూ మంత్రులు ప్రకటనలు చేశారు. అమరావతిని ఎడారిగా, శ్మశానంగా అభివర్ణించారు. నీలి మీడియా, కూలి మీడియా సహకారంతో అమరావతిని భ్రమరావతిగా, కమ్మరావతిగా చిత్రించారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట ఆడిన నాటకం వల్ల ప్రజలు కూడా సదరు ప్రచారాన్ని నమ్మి మోసపోయారు. ఎన్నికలకు ముందు నుంచి రాజధాని భూముల వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగిందని ప్రచారం చేసిన జగన్‌ అండ్‌ కో అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పాట పాడుతూ కొంతమందిపై కేసులు కూడా పెట్టారు. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అన్ని స్థాయిల్లో ఈ కేసులను కొట్టివేయడమే కాకుండా అమరావతిలో కుంభకోణం, లంబకోణం ఏదీ జరగలేదని విస్పష్టంగా తీర్పు ఇచ్చారు. అయినా విష ప్రచారాన్ని ఆపలేదు. అమరావతితో మానసిక అనుబంధం ఏర్పడకుండా ఒక వర్గం ప్రజలను విడదీయడంలో సక్సెస్‌ అయ్యారు. అదే సమయంలో రాజధానికి భూములు ఇచ్చిన రైతులు.. హక్కుల పరిరక్షణ కోసం పోరాడటం ప్రారంభించారు. ఈ క్రమంలో పోరాటంలో పాల్గొన్న మహిళలను అనేక విధాలుగా హింసించారు. వారి వస్త్రధారణ, కట్టుబొట్టుపై వికృత వ్యాఖ్యలు చేయడం ద్వారా మానసిక క్షోభకు గురిచేశారు. అయినా రైతుల మనోధైర్యం సన్నగిల్లలేదు. ఈ ఆందోళనను గుర్తించడానికి కూడా ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి నిరాకరించారు. రైతుల ముఖం చూడటానికి కూడా ఆయన ఇష్టపడలేదు. అయినా రైతులు వెనుకడుగు వేయలేదు. అత్యంత క్రమశిక్షణతో ఉద్యమం నిర్వహించారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరిట ఆంక్షల మధ్య పాదయాత్ర చేపట్టి ప్రజల మన్ననలు పొందారు. హైకోర్టు తీర్పు వెలువడే నాటికి అమరావతి ఉద్యమం 807 రోజులకు చేరింది. తెలుగునాట ఇంత శాంతియుతంగా ఇంతటి సుదీర్ఘకాలం సాగిన పోరాటం మరొకటి లేదు. రైతుల గోస ప్రపంచానికి తెలియకూడదన్న కుతంత్రంతో కొన్ని న్యూస్‌ చానళ్లను కట్టడి చేశారు. పాదయాత్రలో సహ రైతులు వివిధ దశల్లో, వివిధ రూపాల్లో చేపట్టిన ఆందోళనను సదరు చానళ్లు గుర్తించలేదు. ప్రభుత్వ దమనకాండను గుర్తించిన ఏబీఎన్‌, టీవీ5, ఈటీవీ చానళ్లు మాత్రం రైతుల తరఫున నిలబడ్డాయి. ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు మాత్రమే రైతుల ఆవేదన, ఆక్రందనలను పట్టించుకున్నాయి. వివాదం హైకోర్టుకు చేరింది. సుదీర్ఘ వాదనల అనంతరం హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. తీర్పును అడ్డుకొనే కుయుక్తిలో భాగంగా మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంటున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ఉద్దేశాన్ని గమనించిన న్యాయస్థానం తన తీర్పును యథావిధిగా వెలువరించింది. తీర్పునకు తూట్లు పొడిచే అధికారం లేకుండా త్రిసభ్య ధర్మాసనం పకడ్బందీగా తీర్పిచ్చింది. ప్రభుత్వం అష్ట దిగ్బంధానికి గురైంది. మూడు రాజధానుల పాట అందుకొనే వీలు లేకుండా రాజధానికి సంబంధించి మరో చట్టం చేసే అధికారం రాష్ట్ర శాసనసభకు లేదని న్యాయస్థానం తేల్చి చెప్పింది.


పాడిందే పాడుతూ..

హైకోర్టు ఇచ్చిన తీర్పును పూర్తిగా చదవకుండానే, చట్టాలు చేసే అధికారం శాసనసభకు లేదనడం ఏమిటి? అని ప్రజలను మళ్లీ తప్పుదారి పట్టించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. శాసనసభలు, పార్లమెంటు ఉన్నదే చట్టాలు చేయడానికి కదా అని దీర్ఘాలు తీశారు. ఆంధ్రప్రదేశ్‌కు ఒకటే రాజధాని ఉంటుందని కేంద్రం ప్రభుత్వం ఆమోదించిన చట్టంలో స్పష్టంగా ఉన్నందున.. మూడు రాజధానులు అంటూ మరొక చట్టం చేయడానికి శాసనసభకు అధికారం లేదని మాత్రమే హైకోర్టు తేల్చి చెప్పింది. పునర్విభజన చట్టంలో ‘ది కేపిటల్‌’ అన్న పదం పొందుపరచారని, ‘ది’ అంటే ‘వన్‌ అండ్‌ ఓన్లీ’ అన్న అర్థం అని హైకోర్టు తన తీర్పులో వివరించింది. అదేవిధంగా హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు మార్చే అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, రాష్ట్రపతి మాత్రమే నోటిఫికేషన్‌ జారీచేయవలసి ఉంటుందని త్రిసభ్య ధర్మాసనం స్పష్టంగా వివరించింది. హైకోర్టు తీర్పుపై మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. తాము అన్ని ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పాత పాటే పాడారు. రహదారులకు మరమ్మతులు కూడా చేయలేని స్థితిలో ఉన్న జగన్‌రెడ్డి ప్రభుత్వం అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేస్తుందంటే ప్రజలు ఇంకా నమ్ముతారా? అంటే అనుమానమే! ఎందుకోగానీ బొత్స వ్యాఖ్యల్లో నిగూఢార్థం వినిపిస్తోంది. ‘భాగమతి’ సినిమాలో విలన్‌ గురించి ప్రధాన పాత్రధారిణి అనుష్క పరోక్షంగా అన్ని వివరాలూ చెబుతుంటుంది. విచారణ చేపట్టిన సీబీఐ అధికారికి ప్రారంభంలో అర్థం కాకపోయినా, తర్వాత అనుష్క ఏమి చెబుతోందో అర్థమవుతుంది. బొత్స సత్యనారాయణ మాటల్లో అలాంటి అర్థాలు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకొనే ప్రయత్నం చేయాలి. రాష్ట్రంలో అభివృద్ధి మచ్చుకైనా కనబడ్డం లేదని చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతాడు. అమరావతిని అభివృద్ధి చేయడానికి వెసులుబాటు ఉన్నప్పటికీ.. దుర్బుద్ధితో పట్టించుకోని జగన్‌రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ఆర్థికంగా కూడా దివాలా అంచున ఉంది. ఈ స్థితిలో ప్రభుత్వం తరఫున మూడు రాజధానులకు మద్దతుగా ఎవరైనా ఇంకా మాట్లాడే సాహసం చేస్తే.. వారు పరోక్షంగా రాష్ర్టానికి అన్యాయం చేసినవారే అవుతారు. అమరావతిపై ఇంతకాలంగా నీచమైన, అసత్యాలతో కూడిన ప్రచారం చేసిన నీలి మీడియా, కూలి మీడియా తల ఎక్కడ పెట్టుకుంటుందో చూడాలి.


ఇప్పుడేం చేస్తారో?

కుల విద్వేషాలు రగిలించి రైతుల ఆక్రందనలు ఇతర జిల్లాల ప్రజలకు వినిపించకుండా ప్రయత్నాలు చేసినా అంతిమంగా ధర్మం–న్యాయం గెలిచింది. జయహో అమరావతి అని నినదించే హక్కు, స్వేచ్ఛను హైకోర్టు కల్పించింది. జగన్‌రెడ్డి ద్వేషించే సామాజిక వర్గానికి చెందిన వారెవరూ తీర్పు వెలువరించిన ముగ్గురు న్యాయమూర్తుల్లో లేకపోవడం గమనార్హం. రాష్ర్టానికి, ముఖ్యంగా రాజధాని రైతులకు ఉపశమనం కల్పించి ఊపిరి తీసుకొనే అవకాశం కల్పించిన హైకోర్టుకు శత సహస్ర కోటి వందనాలు. అవమానాలు, అవహేళనలు, ఛీత్కారాలను సహిస్తూ న్యాయం కోసం పోరాడిన రైతులకు, ముఖ్యంగా మహిళలకు ఎవరైనా పాదాభివందనం చేయాల్సిందే. ఇంతవరకూ బాగానే ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ఏం చేయబోతున్నారు? అన్నదే ప్రధానం. ఇప్పటికైనా చేసిన పొరపాటు గ్రహించి విజ్ఞతతో ఆలోచించి, న్యాయస్థానం చెప్పినట్టు అమరావతి నిర్మాణానికి అడుగులు వేస్తారా? లేక ప్రభుత్వానికి ఉన్న హక్కును ఉపయోగించుకొని అప్పీలుకు సుప్రీంకోర్టుకు వెళతారా? అన్నది స్పష్టంకావలసి ఉన్నది. ఈ రెండూ కాకుండా మళ్లీ మూడు రాజధానుల బిల్లును తీసుకు వచ్చి న్యాయస్థానంతో ఘర్షణకు దిగుతారా? అన్నది కూడా వేచి చూడాలి. జగన్‌రెడ్డి ఆలోచనలు ఏమైనప్పటికీ ఆయన ఇప్పటికే రాష్ర్టానికి తీరని నష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ విశ్వసనీయతను దెబ్బతీశారు. గొప్ప ముఖ్యమంత్రిని అనిపించుకుంటానని మొదట్లో నమ్మబలికిన జగన్‌రెడ్డి, అధమ ముఖ్యమంత్రి అనిపించుకోవడానికి వేగంగా అడుగులు వేస్తున్నారు. జగన్‌రెడ్డి తనకు ఉన్న ఐదేళ్ల పదవీకాలంలో మూడు రాజధానుల సంగతి పక్కనపెడితే ఒక్క రాజధానిని కూడా నిర్మించడు అని నేను ఎప్పుడో స్పష్టంచేశాను. ఆయనకు ఇప్పుడు రెండేళ్ల వ్యవధి మాత్రమే ఉంది. హైకోర్టు తీర్పు పుణ్యమా అని రాజధాని అమరావతికి సంబంధించిన చిక్కుముళ్లు అన్నీ వీడిపోయాయి. మళ్లీ కొత్త ముళ్లు వేయడమా? లేక న్యాయస్థానం ఆదేశాల ప్రకారం ముందుకు వెళ్లడమా? అన్నది ముఖ్యమంత్రి తేల్చుకోవాలి. సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళ్లినా జగన్‌ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తప్పకపోవచ్చునని న్యాయ నిపుణులు చెబుతున్నారు. జగన్‌రెడ్డి స్థానంలో ఎవరున్నా చేసిన తప్పులు సరిదిద్దుకోవడానికే ప్రయత్నిస్తారు. ఈ మూడేళ్ల పాలన చూశాక ఆయన అలా చేస్తారని భావించలేం. శుక్రవారంనాడు సజ్జల రామకృష్ణారెడ్డిని జగన్‌ తన ప్రతినిధిగా మీడియా ముందుకు వదిలినప్పుడే అది మారే గుణం కాదని తేటతెల్లమైంది. సజ్జల తన రొటీన్‌ వైఖరికి భిన్నంగా నక్కలూ కుక్కలూ అంటూ అక్కసు వెళ్లగక్కినప్పుడే అది జగన్‌ వాయిస్‌ అని తెలిసిపోయింది. హైకోర్టు తీర్పుపై జగన్‌ అండ్‌ కో కక్కలేక మింగలేక కడుపులో ఎంత వికారాన్ని దాచుకున్నదో సజ్జల మాటల్లో బయటపడింది. విపక్ష నేత చంద్రబాబుపైనా, నిజాలను నిర్భయంగా మాట్లాడే మీడియాపైనా,  చివరికి అమరావతి రైతులపైనా సజ్జల నోటి ద్వారా జగన్‌రెడ్డి కక్కించిన విషం అంతా ఇంతా కాదు. ఈ అక్కసుకు తోడు పచ్చి అబద్ధాలనూ అమరావతికి అంటగట్టారు. అమరావతి నిర్మాణానికి లక్షల కోట్లు ఖర్చవుతుందని, ఇంతటి ఆర్థిక భారాన్ని ఏ రాష్ట్రమూ భరించలేదని సజ్జల బీద అరుపులు అరిచారు. జగన్‌ అండ్‌ కో అమరావతి పీక నొక్కకుండా ఉంటే చాలు. అది ఎవరి దయాదాక్షిణ్యాలూ లేకుండానే అద్భుత నగరంగా రూపొందగలదు.  అమరావతి ప్లానింగ్‌లోనే స్వయంసమృద్ధి అంశం మిళితమై ఉంది. తన వనరులను తానే సృష్టించుకోగల విశిష్ట లక్షణం అమరావతి సొంతం. ఈ వాస్తవాలు తెలిసీ జగన్‌ అండ్‌ కో లక్ష కోట్ల అబద్ధాన్ని ప్రచారం చేస్తోంది. మాయమాటలతో ప్రజల కళ్లుగప్పినంత సులభంగా న్యాయస్థానాలను ఏమార్చలేరు. కోర్టులు తమ పని తాము చేసుకుపోతాయి.


హైకోర్టు తీర్పు ప్రకారం పునర్విభజన చట్టంలో పొందుపర్చిన ‘ది కేపిటిల్‌’ అన్న పదాన్ని సవరించకుండా మూడు రాజధానులను ప్రకటించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. నాకు అధికారం లేదు అని చెప్పడానికి న్యాయమూర్తులు ఎవరు? అని జగన్‌రెడ్డి హూంకరిస్తే చెయ్యగలిగింది ఏమీ లేదు. ‘ఒక్క చాన్స్‌ ప్లీజ్‌’ అంటూ జగన్‌రెడ్డి చెప్పిన మాటలు నమ్మి అధికారం కట్టబెట్టిన ప్రజలే అందుకు బాధ్యత తీసుకోవాలి. నిజానికి జగన్‌రెడ్డి పోకడలను అధికార పార్టీకి చెందిన మంత్రులు, శాసనసభ్యులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వ చర్యలను సమర్థిస్తూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న మంత్రులు సైతం ప్రైవేటు సంభాషణల్లో జగన్‌రెడ్డి తీరును తప్పుపడుతున్నారు. ఈ మధ్య హైదరాబాద్‌ వచ్చిన అధికార పార్టీ శాసనసభ్యులు ఇద్దరు పెళ్లి పత్రిక ఇవ్వడం కోసం తెలంగాణకు చెందిన ఒక ముఖ్య నాయకుడి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితులను ఆ నాయకుడు ప్రస్తావించగా, సదరు శాసనసభ్యులు చేతులు జోడించి మరీ.. ‘మేం ఓడిపోయినా ఫర్వాలేదు కానీ ఇలాంటి ప్రభుత్వం ఉండకూడదని కోరుకుంటున్నాం’ అని అన్నారు. తన పాలనను సొంత పార్టీ వాళ్లు కూడా ఛీత్కరించుకుంటున్న విషయం జగన్‌రెడ్డికి అర్థమవుతోందా? ఇప్పటికైనా చేసింది చాలు. ఇకనైనా ముఖ్యమంత్రిగా ఎలా ఉండాలో అలా ఉండటానికి ప్రయత్నిస్తే ఆయనకే మంచిది. లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు మేలు చేసినట్టే. 


శ్రీలక్ష్మి... నీ మహిమలు!

రాష్ట్ర ప్రయోజనాలు, చట్టాలు, నిబంధనలు పట్టించుకోకుండా జగన్‌రెడ్డి అడుగులకు మడుగులు ఒత్తుతున్న కొందరు అధికారులకు కూడా హైకోర్టు చురకలంటించింది. రాజధానిపై దాఖలైన వ్యాజ్యాల విచారణ నుంచి న్యాయమూర్తులు జస్టిస్‌ సత్యనారాయణ మూర్తి, జస్టిస్‌ సోమయాజులు తప్పుకోవాలంటూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు ఇస్తూ.. శ్రీలక్ష్మి వ్యక్తిత్వాన్ని ఎండగడుతూ న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీలక్ష్మి నిజాయితీ, సిన్సియారిటీ గురించి ఉభయ రాష్ర్టాలలో అందరికీ తెలిసిందే అంటూ న్యాయమూర్తులు పరోక్షంగా ఆమె ఓబులాపురం గనుల కేసులో విచారణను ఎదుర్కొంటున్న సంగతి గుర్తుచేశారు. ఈ వ్యాఖ్యలను శ్రీలక్ష్మి ఎట్లా తట్టుకున్నారో తెలియదు. శ్రీలక్ష్మికి ఒకప్పుడు మంచి పేరుండేది. నిప్పుకు చెదలు పట్టినట్టు సహవాస దోషం వల్ల శ్రీలక్ష్మి వంటి ఎంతో మంది అధికారులు చెడిపోయారు.


ముసుగు తొలగించి మరీ..

ఇప్పుడు వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య విషయానికి వద్దాం! రంకు నేర్చినవాడు బొంకు నేర్వడా.. అన్నట్టుగా దోషులను రక్షించే ప్రయత్నం చేసినవారు, నిజం బయటపడేసరికి అబద్ధాలకు తెగబడ్డారు. ఇంతకాలంపాటు ముసుగు కప్పుకొని నిందితులకు అండగా ఉంటున్న ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అండ్‌ కో.. ఇప్పుడు తమ ముసుగులను తొలగించేసుకున్నారు. సీబీఐ విచారణ పుణ్యమా అని వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్‌ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర రెడ్డి ప్రధాన నిందితులని రాష్ట్ర ప్రజలు నిర్ధారణకు వచ్చారు. దీంతో జగన్‌రెడ్డి తరఫున సకల శాఖా మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి రంగంలోకి దిగారు. అమరావతి విషయంలో నోరు పారేసుకున్నట్లే సజ్జల ఇక్కడా రెచ్చిపోయారు. మరోవైపు నుంచి నీలి మీడియాను, కూలి మీడియాను ఉసిగొల్పారు. అంతే, ‘ఉల్టా చోర్‌ కొత్వాల్‌ కో డాంటే’ అన్నట్టుగా నిందితుల తరఫున వకల్తా పుచ్చుకున్న వారందరూ ముక్తకంఠంతో బాధితులనే నిందితులుగా చిత్రించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వివేకా హత్య కేసు నిందితులలో ఒకరైన దస్తగిరిని అప్రూవర్‌గా ఎలా ప్రకటిస్తారని సజ్జల రామకృష్ణారెడ్డి వింత ప్రశ్న వేశారు. వాళ్ల రాజ్యాంగం వేరు కనుక అలా కుదరదేమో గానీ, దేశంలో అమలులో ఉన్న రాజ్యాంగం, చట్టాల ప్రకారం నిందితులనే అప్రూవర్‌గా మార్చుకుంటారు. ఏ కేసులో అయినా ఫిర్యాదుదారుడు లేదా కక్షిదారులతోపాటు నిందితులు, సాక్షులే ఉంటారు. ఎవరైనా ఫలానా వారు నేరం చేసినట్టు న్యాయస్థానంలో నిర్ధారణ కావాలంటే బలమైన సాక్ష్యాలు ఉండాలి. ఈ క్రమంలోనే కేసులు వీగిపోకుండా నిందితులను అప్రూవర్‌గా మార్చడానికి దర్యాప్తు అధికారులు ప్రయత్నిస్తారు. ఇలా చేయడం వివేకా హత్య కేసులోనే ప్రథమం కాదు. నిందితులను కాకుండా సాక్షులను, ఫిర్యాదుదారులను అప్రూవర్‌గా మారుస్తారా? సజ్జలకు ఈ విషయం తెలియక కాదు. ఇప్పటిదాకా ప్రజలను తప్పుదారి పట్టించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి అలవాటుపడ్డారు కనుక, ఇప్పుడు వివేకా కేసులో కూడా నిందితులను కాపాడటం కోసం ఇటువంటి ప్రశ్నలు, సందేహాలను జనంలోకి వదులుతారు. రాజకీయంగా తమను ఎదుర్కోలేక వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఇతరులను నిందిస్తున్న సజ్జల, ఇప్పుడు చేస్తున్నది ఏమిటి? బాధితుల వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. వివేకా హత్య జరిగిన రోజు ఒక మహిళ నుంచి ఆయన ఫోన్‌కు మెసేజ్‌ వచ్చిందని, ఆమె వివేకా రెండో భార్య అయి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారని గతంలో నేను ‘కొత్త పలుకు’లో పేర్కొనడాన్ని.. సజ్జల వ్యక్తిత్వ హననంగా చిత్రించే ప్రయత్నం చేశారు. అదే వ్యక్తిత్వ హననం అయితే ఇప్పుడు సజ్జల అండ్‌ కో చేస్తున్నది ఏమిటి? వివేకా రెండో పెళ్లి చేసుకున్నందున ఆయన కుమార్తె డాక్టర్‌ సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి ఆస్తుల కోసం గొడవపడ్డారని ప్రచారం చేయడం వ్యక్తిత్వ హననం కాదా? వివేకా సొంత బావమరిది కూడా అయిన సునీత భర్తను నిందితుడిగా చిత్రించడం సమర్థనీయం అవుతుందా? నిజానికి, వివేకా హత్య కేసులో అసలు నిందితులను తప్పించి డాక్టర్‌ సునీత భర్తను ఇరికించడానికై గట్టి ప్రయత్నమే జరిగింది. కేసు సీబీఐ చేతిలోకి వెళ్లకముందు జగన్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ ఆధ్వర్యంలో దర్యాప్తు జరిగింది. ఈ దర్యాప్తులో తిమ్మిని బమ్మిని చేయవచ్చునని తెర వెనుక ఉన్నవాళ్లు భావించారు. ఈ క్రమంలో హత్య జరిగిన రోజు ఉదయం ఐదున్నర గంటలకే డాక్టర్‌ సునీత దంపతులు కర్నూలుకు చేరుకున్నారని, ఎనిమిదింటికి పులివెందుల చేరుకున్నారని సిట్‌ తన నివేదికలో పేర్కొంది. అంటే వివేకా హత్య గురించి డాక్టర్‌ సునీత దంపతులకు ముందే తెలుసునని, అందుకే ఉదయం ఐదున్నరకు కర్నూలు చేరుకోగలిగారని వారిని ఇరికించే ప్రయత్నం జరిగిందనుకోవాలి. జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన కొత్తలో ఈ స్కెచ్‌ అమలు జరిగింది. ఈ మర్మం తెలియని డాక్టర్‌ సునీత దంపతులు అమాయకంగా జగన్‌రెడ్డిని నమ్మారు. జగన్‌ అండ్‌ కోకు అనుకూలంగా, జగన్‌ సూచనల మేరకు నాడు సునీత చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు ప్రచారంలోకి తీసుకురావడంలోని ఆంతర్యం ఇదే. దస్తగిరి వాంగ్మూలానికి జగన్‌ పత్రికలో చోటు ఉండదు కానీ, జైలులో ఉన్న శివశంకరరెడ్డి భార్య న్యాయస్థానికి చేసిన ఫిర్యాదు పూర్తి పాఠం మాత్రం ప్రచురణకు నోచుకుంటుంది. దీన్ని సజ్జల ఎలా సమర్థించుకుంటారో చూడాలి. సీబీఐ అధికారులు తాము ఏర్పాటు చేసిన సిట్‌ నివేదికను పరిగణనలోకి తీసుకోవాలని సజ్జల కోరుతున్నారంటే హత్య జరిగిన నాటి నుంచి తెర వెనుక ఏం జరిగి ఉంటుందో ఊహించవచ్చు. ఆస్తుల విషయంలో జగన్‌రెడ్డి తనకు అన్యాయం చేస్తున్నారని సొంత సోదరి షర్మిల వాపోతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో సోదరి డాక్టర్‌ సునీత కుటుంబాన్ని దోషిగా నిలబెట్టాలని జగన్‌ అండ్‌ కో ప్రయత్నించడం గమనార్హం.


‘అన్న’ను అంచనా వేయలేక!

తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసినట్టుగా... డాక్టర్‌ సునీత దంపతులు కూడా చంద్రబాబు చేతిలో పావులుగా మారారని, వచ్చే ఎన్నికల్లో సునీత పులివెందుల నుంచి తెలుగుదేశం తరఫున పోటీ చేయనున్నారని సరికొత్త ప్రచారానికి జగన్‌ అండ్‌ కో తెర తీసింది. 2024లో జరిగే ఎన్నికల్లో పులివెందుల నుంచి పోటీ చేసే అవకాశం కల్పిస్తానని వాగ్దానం చేసి, 2019 ఎన్నికలకు ముందే డాక్టర్‌ సునీత భర్తతో వివేకానంద రెడ్డిని చంద్రబాబు హత్య చేయించారని కూడా ఇకపై చెప్పబోతున్నారా? తాము జగన్‌రెడ్డి నిరాదరణకు గురయ్యామని సొంత చెల్లి షర్మిల, చిన్నాన్న కూతురు సునీత నెత్తీ నోరూ కొట్టుకుంటూ ఉంటే.. వారికి ఉపశమనం కలిగించకపోగా జగన్‌రెడ్డి కుటుంబంలో ఎవరో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని సజ్జల ఆరోపించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ ప్రచారాన్ని నమ్మే పిచ్చి జనం కూడా ఉంటారేమో తెలియదు. జగన్మోహన్‌ రెడ్డి గురించి ప్రజలకు తెలియదంటే అర్థం చేసుకోవచ్చు. నలభై ఏళ్లకు పైగా కలసి మెలసి పెరిగిన సోదరుడిని అంచనా వేయడంలో షర్మిల, సునీత విఫలం కావడమే విషాదం. గతంలో ఎంపీ పదవికి వివేకానంద రెడ్డి ఎందుకు రాజీనామా చేయవలసి వచ్చిందో డాక్టర్‌ సునీత దంపతులకు కూడా తెలుసు. ఎవరి కారణంగా వివేకా రాజీనామా చేశారో, అప్పుడు ఆయన మానసికంగా ఆందోళనకు గురికావడం, ఆ తర్వాత సోనియాగాంధీ జోక్యంతో రాజీనామా ఉపసంహరించుకోవడం అన్నీ డాక్టర్‌ సునీత దంపతులకు తెలుసు. అయినా.. జగన్‌రెడ్డిని సోదరుడిగా భావించి గుడ్డిగా నమ్మారు. దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు. డాక్టర్‌గా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న సునీతను ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో ముడిపెడుతున్నారంటే వాళ్లు ఎంతటి ఘటికులో, గుండెలు తీసిన బంట్లో అర్థం చేసుకోవచ్చు!

ఆర్కే


యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Updated Date - 2022-03-06T06:06:48+05:30 IST