జగన్‌.. కపట నాటకం!

ABN , First Publish Date - 2022-07-10T06:19:14+05:30 IST

‘‘తల్లీ చెల్లీ అంటూ ఏ సెంటిమెంటూ లేని సిల్లీ ఫెలోవి’’ అని అసెంబ్లీ రౌడీ చిత్రంలో మోహన్‌బాబు ఒక డైలాగ్‌ చెబుతాడు. శుక్రవారంనాటి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశంలో ముఖ్యమంత్రి...

జగన్‌.. కపట నాటకం!

‘‘తల్లీ చెల్లీ అంటూ ఏ సెంటిమెంటూ లేని సిల్లీ ఫెలోవి’’ అని అసెంబ్లీ రౌడీ చిత్రంలో మోహన్‌బాబు ఒక డైలాగ్‌ చెబుతాడు. శుక్రవారంనాటి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి హావభావాలు చూసిన తర్వాత ఎందుకో ఈ డైలాగ్‌ గుర్తుకొచ్చింది. పార్టీ గౌరవాధ్యక్షురాలి పదవికి తల్లి విజయమ్మతో రాజీనామా చేయించిన జగన్‌కు నిజంగానే ఏ సెంటిమెంటూ లేదేమోనని అనిపిస్తోంది. ఆస్తుల పంపకం ఇష్టం లేక కొంతకాలం క్రితం చెల్లిని, ఇప్పుడు అధికారం కోసం తల్లినీ వదిలించుకున్న జగన్మోహన్‌రెడ్డి ఎవరినైనా వాడుకొని వదిలేస్తాడని రుజువైంది. పార్టీ నుంచి తప్పుకొంటున్నట్టు విజయమ్మ ప్రకటించగానే ‘వద్దు వద్దు’ అని కింద కూర్చున్న కార్యకర్తలు కేకలు వేస్తున్నప్పటికీ జగన్మోహన్‌ రెడ్డి మాత్రం చప్పట్లతో తల్లి నిర్ణయాన్ని స్వాగతించారు. శుక్రవారంనాటి పరిణామాల అనంతరం వైసీపీతో విజయమ్మకు ఉన్న పదకొండేళ్ల అనుబంధం తెగిపోయింది. నిజానికి పార్టీ గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి తప్పుకోవాలని విజయమ్మ అనుకోలేదు. కొంతకాలం క్రితం ఆమె ఈ నిర్ణయానికి వచ్చినప్పుడు వారించిన జగన్‌, ఇప్పుడు పార్టీ ప్లీనరీ సందర్భంగా రాజీనామా చేయాలని హుకుం జారీ చేశారు. ఈ మేరకు విజయమ్మకు లేఖ పంపించారు. తన రాజీనామాకు ఏ కారణం చెప్పాలో కూడా సదరు లేఖలోనే ఆమెకు సూచించారు. పుత్రరత్నం నుంచి వచ్చిన లేఖను చదివిన విజయమ్మ ‘అల్పుడు– ఈ అల్పబుద్ధులు ఎక్కడి నుంచి వచ్చాయో’ అని వ్యాఖ్యానించారట. జగన్మోహన్‌ రెడ్డి ఏ ఉద్దేశంతో తనను తప్పుకోమన్నాడో తెలిసి కూడా విజయమ్మ విధిలేని పరిస్థితిలో పుత్రవాత్సల్యాన్ని చంపుకోలేక తనపై రుద్దిన నిర్ణయాన్ని ప్రకటించారు. దివంగత రాజశేఖరరెడ్డి జయంతి రోజునే వైసీపీతో తెగదెంపులు చేసుకోవలసి రావడాన్ని విజయమ్మ జీర్ణించుకోలేకపోయారు. రాజీనామా నిర్ణయాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఆమె గొంతు వణికింది. పొంగుకొస్తున్న దుఃఖాన్ని అదిమిపెట్టి ఆమె పార్టీ నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత కుమారుడిని ఆలింగనం చేసుకున్న విజయమ్మ విలపించారు.


అయితే జగన్‌రెడ్డి మాత్రం చిరునవ్వులు చిందించారు. వైసీపీతో తన తల్లి విజయమ్మ సుదీర్ఘ అనుబంధాన్ని తెంచుకోవాలని నిర్ణయించుకోవడం షర్మిలకు ఇష్టం లేదని చెబుతున్నారు. తల్లి మనసు మార్చాలని ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించలేదట. ఇంతకూ విజయమ్మతో ఇప్పుడే ఎందుకు రాజీనామా చేయించినట్టు? వైఎస్‌ కుటుంబ సన్నిహితుల సమాచారం ప్రకారం అవినీతి కేసులలో తనకు శిక్షపడితే తన స్థానంలో సతీమణి భారతిని ముఖ్యమంత్రిని చేయడం కోసమే జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారట. విజయమ్మ పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా ఉంటే భారతికి ఇబ్బందులు తలెత్తవచ్చునని జగన్‌ అనుమానిస్తున్నారట. తాను జైలుకు వెళ్లాల్సి వస్తే వైసీపీని భారతీయ జనతా పార్టీ అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని, తమిళనాడులో జయలలిత మరణానంతరం శశికళను జైలుకు పంపించి తమ మాట వినే పళనిస్వామిని ముఖ్యమంత్రిని చేసిన తీరును గుర్తుచేసుకుంటున్నారని అంటున్నారు. జగన్‌పై సీబీఐ దాఖలు చేసిన కేసులలో ఒకటి రెండింటిలో భారతీరెడ్డి కూడా సహ నిందితురాలిగా ఉన్నారు. ఈ కేసుల నుంచి కనీసం తన భార్యనైనా తప్పించాలని మూడేళ్లుగా జగన్‌ బీజేపీ పెద్దలను వేడుకుంటున్నారు.


పైకి జగన్‌తో ప్రేమగా ఉంటున్న ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా మాత్రం ఆ ఒక్కటీ అడక్కు అన్నట్టుగా జగన్‌ కోర్కెను మన్నించడం లేదు. ప్రతిపక్షాలు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల నాయకుల బలహీనతలను అడ్డుపెట్టుకొని తమకు అనుకూలంగా వాడుకొనే మోదీ–షాలు వారికేమీ చేయరని ఇప్పటికే ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా విజయమ్మ కొనసాగితే ఆమెను తమవైపు తిప్పుకొని పార్టీని కమలనాథులు కబళించే ప్రమాదం ఉందని జగన్‌ తలపోస్తున్నారట. తమ వ్యూహానికి అడ్డు వచ్చే పక్షంలో ఇదివరకే ఉన్న కేసులలో భారతీరెడ్డిని కూడా ఇరికించడానికి బీజేపీ పెద్దలు వెనుకాడరన్నదే జగన్‌ అభిప్రాయంగా చెబుతున్నారు. రాబోయే పరిణామాలను ఊహించడం వల్లనే పక్కా స్కెచ్‌ ప్రకారం విజయమ్మను పార్టీ నుంచి తప్పించినట్టు స్పష్టమవుతోంది. తెలంగాణలో పార్టీ పెట్టుకున్న షర్మిలకు అండగా ఉండటం కోసమే వైసీపీ నుంచి తప్పుకొంటున్నట్టు విజయమ్మ ఇచ్చిన వివరణ కూడా జగన్‌ రూపొందించిన స్కెచ్‌ ప్రకారమే జరిగింది. పార్టీ నుంచి తప్పుకోవాలని విజయమ్మ స్వచ్ఛందంగా నిర్ణయించుకొని ఉంటే ఆమె గొంతు వణికేది కాదు. రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించిన కొంతసేపటి తర్వాత విజయమ్మ ప్లీనరీ వేదిక దిగి వెళ్లిపోయారు. అయితే ప్రజల నుంచి ఎటువంటి ఫీడ్‌ బ్యాక్‌ వచ్చిందో గానీ శనివారం జగన్‌రెడ్డి తన వెంట విజయమ్మను కూడా తీసుకెళ్లారు. ఈ పరిణామాన్ని షర్మిల జీర్ణించుకోలేకపోతున్నారు. రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు అందరూ యథావిధిగా ఇడుపులపాయకు వెళ్లారు. అక్కడ అందరూ కలివిడిగా ఉన్నారని, కలిసే భోజనం చేశారని జగన్‌ అనుకూల కూలి మీడియా కొంత ప్రచారం చేసింది. అయితే అక్కడ అలా ఏమీ జరగలేదు. అన్నాచెల్లెళ్లు ఎడమొహం పెడమొహంగానే ఉన్నారు. షర్మిల విడిగానే తండ్రి సమాధి వద్దకు చేరుకున్నారు. అక్కడ కూడా సోదరుడి వైపు కన్నెత్తి చూడలేదు. ఈ పరిణామాలన్నీ విజయమ్మను మానసిక క్షోభకు గురిచేశాయి. అందుకే ఆమె ప్లీనరీలో కూడా కంటతడి పెట్టారు. ఏదిఏమైనా రాజశేఖర రెడ్డి కుటుంబానికి వైసీపీతో ఉన్న అనుబంధం శుక్రవారంతో తెగిపోయింది. రాజశేఖర రెడ్డి సతీమణి విజయమ్మకు, గారాల పట్టి షర్మిలకు వైసీపీతో ఇప్పుడు ఎటువంటి సంబంధం లేదు. వైసీపీ ఇప్పుడు జగన్‌రెడ్డి సొంతం. ప్రజల కోసం దివంగత రాజశేఖర రెడ్డి పేరును, ఫొటోను మాత్రం మరికొంత కాలం వాడుకోవచ్చు. తన కడుపున పుట్టిన ఇద్దరు బిడ్డల మధ్య ఇటువంటి పరిస్థితి రావడం బాధగా ఉందని, అంతా దైవ నిర్ణయం అని తాను నమ్ముతున్నానని విజయమ్మ ఆవేదన వ్యక్తంచేశారు. జగన్‌ మంచి ముఖ్యమంత్రిగా రుజువు చేసుకున్నందున తెలంగాణలో షర్మిలకు అండగా ఉండాలని అనుకుంటున్నట్టు విజయమ్మ చేసిన వ్యాఖ్య ఒక రకంగా షర్మిలకు నష్టం చేస్తుంది. జగన్‌ పాలనపై తెలంగాణ ప్రజలకు పూర్తి అవగాహన ఉంది. అటువంటి పాలన తమకు వద్దని వారు భావిస్తారు. పుత్రవాత్సల్యాన్ని చంపుకోలేని విజయమ్మ, జగన్‌ పాలనను తప్పుబట్టలేకపోతున్నారు. ఫలితంగా షర్మిలకు నష్టం చేస్తున్నానన్న విషయాన్ని ఆమె విస్మరించారు. జగన్‌ మాత్రం తనకు తల్లి, చెల్లి సెంటిమెంట్‌ లేదని రుజువు చేసుకున్నారు. 


సునీతపై గురి!

ఇప్పుడు డాక్టర్‌ సునీత విషయానికి వద్దాం. తన తండ్రి వివేకానంద రెడ్డిని చంపించిన వాళ్లకు శిక్ష పడాలని ఆయన కుమార్తె డాక్టర్‌ సునీత పట్టువదలకుండా పోరాడుతున్నారు. ఇక్కడే జగన్‌రెడ్డి ఆమెను పావుగా వాడుకొనే ప్రయత్నాలు మొదలెట్టారు. వివేకా హత్య కేసులోని నిందితులకు ముఖ్యమంత్రి జగన్‌ అండగా ఉంటున్నారన్న అభిప్రాయం ప్రజల్లో వ్యాపించింది. దీంతో సునీతను కూడా రాజకీయంగా వాడుకోవడం ఎలా? అని జగన్‌ తన మెదడుకు పదును పెట్టారు. డాక్టర్‌ సునీత కోరితే పులివెందుల అసెంబ్లీ సీటును వదులుకోవడానికి కూడా జగన్‌ సిద్ధపడుతున్నారని, ఆయన జమ్మలమడుగు నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారని కూడా కథనాలను వండి వార్చేలా స్కెచ్‌ వేశారు. ఇదేదో ఆషామాషీగా రూపొందించిన వ్యూహం కాదు. నిజానికి చాలా కాలం నుంచి సునీత దంపతులు ముఖ్యమంత్రి జగన్‌కు దూరంగా ఉంటున్నారు. వైద్య వృత్తిలో బిజీగా ఉంటున్న ఆమెకు రాజకీయాల పట్ల కనీస ఆసక్తి కూడా లేదు. అయినా ఉన్నట్టుండి ఆమెను తెర మీదకు తెచ్చారు. సునీత కోసం పులివెందుల సీటును త్యాగం చేయడానికి జగన్‌ సిద్ధపడ్డారని ప్రచారం చేయడం ద్వారా రాజశేఖర రెడ్డి కుటుంబంపై జగన్‌కు ఇంకా అనురాగం మిగిలే ఉందని చెప్పుకోవడమే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. చిన్నాన్న హత్యకు గురైనందున చెల్లిని ఎమ్మెల్యేను చేయడం ద్వారా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని జగన్‌ అనుకుంటున్నారని ప్రజలను నమ్మించడమే ఈ స్కెచ్‌ ప్రధాన ఉద్దేశం. అంతేకాదు, వివేకా హత్య కేసు దర్యాప్తును నీరుగార్చడం కూడా ఈ వ్యూహంలో భాగంగా ఉంది. రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా డాక్టర్‌ సునీత కూడా ఇడుపులపాయ వెళ్లారని, అక్కడ అన్ని విషయాలూ మాట్లాడుకున్నారని, జగన్‌–సునీత మధ్య వివాదం చక్కబడిందని కూడా ప్రచారం చేశారు.


వైసీపీతో విజయమ్మకు ఉన్న అనుబంధాన్ని తుంచివేయడానికి స్కెచ్‌ రూపొందించిన సమయంలోనే సునీతను దగ్గరకు తీసుకుంటున్నట్టు ప్రచారం చేయడం మామూలు తెలివితేటలు కావు. జగన్నాటకం కారణంగా దివంగత రాజశేఖర రెడ్డి కుటుంబం అన్నీ ఉండి కూడా ఏమీ లేనిదిగా మిగిలిపోయింది. రాజశేఖర రెడ్డి ఏకైక కుమారుడు జగన్మోహన్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయినా రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులకు న్యాయం జరగడం లేదు. వివేకా హత్య కేసులో నిందితులకు శిక్షపడాలన్న ఆయన కుమార్తె డాక్టర్‌ సునీత కోరిక అరణ్య రోదనగా మారిపోయింది. తండ్రి చెప్పినట్టుగా ఆస్తిలో వాటా కావాలని కోరిన షర్మిలను తెలంగాణకు తరిమేశారు. భారతీరెడ్డికి రాజకీయంగా అడ్డుగా ఉంటుందేమోనని విజయమ్మను వైసీపీ నుంచి సాగనంపారు. శభాష్‌ జగన్‌రెడ్డీ! ఓటర్లను మాత్రమే అక్కచెల్లెళ్లుగా సంబోధించే జగన్‌రెడ్డి సొంత చెల్లెళ్లను మాత్రం గాలికి వదిలేశారు. రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులకు సొంత రాష్ట్రంలో చోటులేకుండా చేశారు. విజయమ్మ, షర్మిల, సునీత హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. ఇప్పుడు వైసీపీ జగన్‌ దంపతుల సొంతం. రాజుల కాలంలో అధికారం కోసం కుట్రలూ, కుతంత్రాలు జరిగాయని విన్నాం. ఇప్పుడు ఆధునిక భారతంలో జగన్మోహన్‌ రెడ్డి కనిపిస్తున్నారు. రాజశేఖర రెడ్డి కుటుంబీకులలో ఒక్కొక్కరిదీ ఒక్కో విధమైన ఆవేదన. తండ్రిని పోగొట్టుకొని న్యాయం కోసం డాక్టర్‌ సునీత అల్లాడుతున్నారు. తండ్రిని పోగొట్టుకోవడమే కాకుండా ఆస్తిని కూడా పొగొట్టుకొని షర్మిల ఒంటరిగా మిగిలారు. కన్నబిడ్డకూ, మరిది బిడ్డకూ అన్యాయం జరుగుతోందని తెలిసి కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి విజయమ్మది. ఇంతమంది వేదనలు, రోదనల మధ్య ఆనందంగా గడుపుతున్నది ఒకే ఒక్కరు. ఆ ఒక్కడూ జగన్మోహన్‌ రెడ్డి. ఇప్పటికైనా జగన్‌ నిజ స్వరూపాన్ని ప్రజలు గమనిస్తారా? మరోవైపు రెండు రోజుల పాటు నిర్వహించిన వైసీపీ ప్లీనరీలో ప్రజా సమస్యల గురించి ప్రస్తావించకుండా మీడియాను బూతులు తిట్టడానికే ప్రసంగించినవారు పరిమితం కావడం ఆ పార్టీ బలహీనతకు నిదర్శనంగా నిలిచింది.


జగన్‌.. నిజమైన దత్తపుత్రుడు!

కుటుంబ కథా చిత్రాన్ని కాసేపు పక్కన పెట్టి అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సందర్భంగా భీమవరంలో చోటుచేసుకున్న పరిణామాల గురించి చర్చించుకుందాం. ప్రభుత్వ వ్యవహారాలలో ‘ప్రోటోకాల్‌’ అని ఒకటి ఉంటుంది. అధికారిక కార్యక్రమాలలో స్థానిక ఎమ్మెల్యే, ఎంపీకి విధిగా భాగస్వామ్యం ఉండాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పాల్గొన్న భీమవరం కార్యక్రమంలో ఈ నిబంధనకు తిలోదకాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అభీష్టం మేరకే సదరు కార్యక్రమంలో ఎవరు పాల్గొనాలో నిర్ణయించారు. స్థానిక ఎంపీ రఘురామరాజు ముఖం చూడ్డానికి కూడా జగన్‌ ఇష్టపడరు. ఈ కారణంగానే రఘురామకృష్ణరాజుకు ప్రధానితో వేదిక పంచుకొనే అవకాశం లభించకుండా చేశారు. లోగుట్టు తెలియని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. అయితే అచ్చెన్నాయుడు తనతో పాటు వేదికపై కూర్చోడం ఇష్టం లేని జగన్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ ద్వారా ఆయనను కూడా అడ్డుకున్నారు. నిజానికి ప్రధానమంత్రి కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొనాలన్నది ఎస్పీజీ అనుమతితో నిర్ణయిస్తారు. అయితే భీమవరం కార్యక్రమంలో మాత్రం జగన్మోహన్‌ రెడ్డి కార్యాలయం పంపించిన జాబితాలోని వారికే చోటు దక్కింది. భారతీయ జనతా పార్టీ మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు కూడా ఆహ్వానం దక్కలేదు. మొహమాటంకొద్దీ చివరి క్షణంలో పవన్‌ కల్యాణ్‌కు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఆహ్వానం పంపారు. అయితే ప్రధానమంత్రి కార్యాలయానికి ముఖ్యమంత్రి కార్యాలయం పంపిన జాబితాలో ఆయన పేరు లేదు. పవన్‌ కల్యాణ్‌ అనే పేరు ఉచ్చరించడానికి కూడా జగన్‌ ఇష్టపడరు. ఆయనను చంద్రబాబు దత్తపుత్రుడిగా ముఖ్యమంత్రి సంబోధిస్తారు. అచ్చెన్నాయుడిని అడ్డుకున్న విషయం తెలుసుకొని ఆయనను అనుమతించాలని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఫోన్‌ చేసి చెప్పినా ఫలితం లేకుండా పోయింది. మొత్తమ్మీద ముఖ్యమంత్రికి ఇష్టమైన వారికి మాత్రమే ప్రధానమంత్రితో వేదిక పంచుకొనే అవకాశం లభించింది. బీజేపీ పెద్దలను నమ్ముకొని ముఖ్యమంత్రిని ఎదిరించిన ఎంపీ రఘురామకృష్ణ రాజుకు పరాభవమే మిగిలింది. కష్టం వచ్చినప్పుడు ఆదుకోవలసిన విష్ణుదేవుడే పట్టించుకోనప్పుడు నాబోటివాడు ఏం చేయగలడు? అని రఘురామరాజు నిర్వేదం వ్యక్తంచేయడాన్ని బట్టి బీజేపీ పెద్దలతో జగన్‌కు ఉన్న అనుబంధం ఎంత బలీయమైనదో స్పష్టమవుతోంది. తమను మాత్రమే నమ్ముకున్న రఘురాజును సంతృప్తిపరచడానికి అవసరమైన రక్షణ కల్పించిన బీజేపీ పెద్దలు, ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి నొచ్చుకోకుండా ఉండటానికి స్థానిక ఎంపీ అయినప్పటికీ వేదిక పంచుకొనే అవకాశం ఆయనకు కల్పించలేదు.


బీజేపీనా మజాకానా మరి! ప్రధాని మోదీకి నిజమైన దత్తపుత్రుడు జగన్‌ అని మరోసారి రుజువైంది. బీజేపీ పెద్దల వద్ద జగన్‌కు అరచేతి మందాన పలుకుబడి ఉన్నప్పటికీ ఆ పలుకుబడి రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడకపోవడం విషాదం. రాష్ట్రం కోసం అది కావాలి–ఇది కావాలి అని తమను ఇబ్బంది పెట్టని జగన్‌ అంటే బీజేపీ పెద్దలకు కూడా మక్కువ మిక్కిలిగా ఉంటోంది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పలుకుబడి సొంత ప్రయోజనాలకు ఉపయోగపడితే చాలని ముఖ్యమంత్రి భావిస్తుండగా, ఫలానాది కావాలని నోరు విప్పని జగన్‌ వంటి స్నేహితుడు మరొకరు దొరకరని కేంద్ర పెద్దలు మురిసిపోతూ ఉండవచ్చు. ప్రధాని కార్యక్రమానికి అనూహ్యంగా మెగాస్టార్‌ చిరంజీవికి మాత్రం అవకాశం లభించింది. అదేమంటే, ఆయన కేంద్ర పర్యాటక శాఖ మాజీ మంత్రి కనుక ఆహ్వానించామని కిషన్‌ రెడ్డి చెప్పుకొచ్చారు. అలా అయితే ఆ ప్రాంతానికే చెందిన కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజును కూడా ఆహ్వానించి ఉండాల్సింది. ప్రధాని ఆవిష్కరించిన అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని క్షత్రియ సమాజం సొంత ఖర్చులతో ఏర్పాటు చేసింది. అయినా ఆ సమాజానికి చెందిన కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజుకు, స్థానిక ఎంపీ రఘురామరాజుకు ఆహ్వానం దక్కలేదు. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి అల్లూరి సీతారామరాజు చిత్రంలో నటించి, నిర్మించిన ప్రముఖ నటుడు కృష్ణకు ఆహ్వానం అందిందో లేదో తెలియదు. కృష్ణ నిర్మించిన చిత్రం పుణ్యమా అని ఈ తరానికి అల్లూరి సీతారామరాజు గురించి తెలిసిందని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి జగన్‌ కార్యాలయం పంపిన జాబితాలో చిరంజీవి పేరు ఉండటం ఆశ్చర్యం కలిగించింది. ఆ మధ్య సినిమా టికెట్ల రేట్లను అమాంతం తగ్గించిన జగన్మోహన్‌ రెడ్డి చిరంజీవితో పాటు ప్రభాస్‌, మహేష్‌ బాబు వంటి ప్రముఖ హీరోలు తన వద్దకు వచ్చి చేతులు జోడించి వేడుకునే పరిస్థితి కల్పించారు. అప్పుడు చిరంజీవిని ప్రజల దృష్టిలో పలుచన చేయడం కోసం సదరు వీడియోను బయటకు వదిలిన జగన్‌, ఇప్పుడు భీమవరం వేదికగా చిరంజీవి తనకు సోదర సమానుడని చెప్పడం వింతగానే ఉంది. చిరంజీవి సొంత సోదరుడైన పవన్‌ కల్యాణ్‌ను అవకాశం వచ్చినప్పుడల్లా అవమానిస్తూ, ఆయన నటించిన సినిమాలకు ఇబ్బందులు సృష్టించిన జగన్‌కు ఇప్పుడు చిరంజీవిపై ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో అంటే కారణం ఉంటుంది. ఇలాంటివి చూసిన తర్వాత జగన్‌ను కపట నాటక సూత్రధారి అని పిలిస్తే తప్పుపట్టాల్సింది ఏమీ లేదనుకుంటా. భీమవరం సభలో చిరంజీవి మినహా మిగతావారంతా అద్భుతంగా నటించారని నాగబాబు చేసిన వ్యాఖ్యలతో ప్రతి ఒక్కరూ ఏకీభవించాల్సిందే. ఎందుకంటే వేదిక మీద ఉన్న మహా నటులను చూసిన తర్వాత చిరంజీవి నటన మరచిపోయి ఉండవచ్చు. కాపులను ఆకర్షించాలన్న తమ రాజకీయ వ్యూహంలో భాగంగా ఆరోజుకు చిరంజీవిని పావుగా బీజేపీ పెద్దలతోపాటు జగన్‌ వాడుకున్నారు. అయితే కాపులు గానీ, మరొకరు గానీ చిరంజీవి కూడా రాజకీయ నాయకుడే అన్న విషయాన్ని ఎప్పుడో మరచిపోయారు. ఆయనను ఇప్పుడు నటుడిగానే చూస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌ను మాత్రమే తమ నాయకుడిగా కాపులు, ఇతరులు ఇప్పుడు గుర్తిస్తున్నారు. బీజేపీ పెద్దల సహకారంతో విధ్వంసకర విధానాలతో జగన్‌, ఆంధ్రప్రదేశ్‌ను ఎంతగా నాశనం చేయాలో అంతా చేశారు, చేస్తున్నారు. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం అన్నట్టుగా తెలంగాణ అభివృద్ధి చెందుతూ ఆంధ్రప్రదేశ్‌ కునారిల్లడం ఎవరికైనా ఆవేదన కలిగిస్తుంది. చిరంజీవి వంటి వారు హైదరాబాద్‌లోనే నివసిస్తున్నప్పటికీ వారిని సెటిలర్లుగానే పరిగణిస్తారు. సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ మరింతగా కునారిల్లకుండా ఉండాలంటే ముఖ్యమంత్రి జగన్‌కు పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా, తెలిసి లేదా తెలియకుండా.. సహకరించకూడదు అన్న స్పృహ ఆంధ్రా మూలాలు కలిగివుండి హైదరాబాద్‌లో ఉంటున్న ప్రతి ఒక్కరిలో ఉండాలి. రాజకీయం కోసం, డబ్బు కోసం సొంత కుటుంబాన్నే బయటకు గెంటిన జగన్‌ పాలనలో మంచి జరుగుతుందని ఇంకా ఎవరైనా నమ్ముతుంటే వారి అమాయకత్వానికి జాలిపడటం మినహా ఇప్పుడు చేయగలిగింది ఏమీలేదు!

ఆర్కే


యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Updated Date - 2022-07-10T06:19:14+05:30 IST