భక్తి పోయింది... భయం తగ్గింది!

ABN , First Publish Date - 2022-06-12T05:59:01+05:30 IST

సేమ్‌టు సేమ్‌... అవే సన్నివేశాలు, అవే మాటలు! 2019 ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలా గాలిలో మేడలు కట్టారో, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కూడా అదే విధంగా ఊహల్లో...

భక్తి పోయింది... భయం తగ్గింది!

సేమ్‌టు సేమ్‌... అవే సన్నివేశాలు, అవే మాటలు! 2019 ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలా గాలిలో మేడలు కట్టారో, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కూడా అదే విధంగా ఊహల్లో విహరిస్తున్నారు. రెండేళ్లలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ‘‘175 స్థానాలకు 175 స్థానాలు ఎందుకు గెలుచుకోలేం? ప్రజల్లో నాపట్ల పూర్తి సంతృప్తి ఉంది. ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉంటేనే ఓడిపోతారుగానీ, నావల్ల కాదు’’ అని జగన్‌ చెప్పుకొచ్చారు. అప్పట్లో చంద్రబాబు కూడా ఇలాగే ‘‘ప్రజల్లో మన ప్రభుత్వం పట్ల 70 శాతం పైగా సానుకూలత ఉంది’’ అని పార్టీ సమావేశాల్లో చెప్పుకొనేవారు. దీనికి మద్దతుగా ఐఏఎస్‌ అధికారి అహ్మద్‌ బాబు పార్టీ నాయకులకు సర్వే వివరాలూ, గణాంకాలూ వివరించేవారు. ఇప్పుడు డాక్టర్‌ విజయకుమార్‌ అనే అధికారి వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా ఇలాగే వివరించారు. కొద్ది రోజుల క్రితం జగన్మోహన్‌ రెడ్డి నిర్వహించిన మంత్రులు, ఎమ్మెల్యేల సమావేశంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై ఆయన పార్టీకి చెందినవారు కూడా పెదవి విరుస్తున్నారు. గతంలో ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతోందని చెప్పడానికి ప్రయత్నించిన శాసనసభ్యులపై చంద్రబాబు విరుచుకుపడేవారు. ఇప్పుడు కూడా ‘అమ్మ ఒడి’లో కోత విధించడం, ఇసుక వ్యవహారంలో ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని చెప్పడానికి ప్రయత్నించిన మహీధర్‌ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, పార్థసారథి వంటివారిపై జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్లో పార్టీ కార్యకర్తల గోడు వినడానికి చంద్రబాబు సమయం ఇచ్చేవారు కాదు. ఇప్పుడు కూడా మూడేళ్లు దాటినా జగన్మోహన్‌ రెడ్డి పార్టీ కార్యకర్తలను కలుసుకోవడానికి ఇష్టపడటం లేదు. అధికారంలో ఉన్నవారికి అంతా పచ్చగానే కనిపిస్తుంది. తాము చేసేదంతా ‘రైట్‌ రైట్‌’ అని ముఖ్యమంత్రులకు అనిపిస్తుంది కాబోలు... అందుకే నాడు చంద్రబాబు నాయుడు అయినా, నేడు జగన్మోహన్‌ రెడ్డి అయినా వాస్తవాలు వినడానికి ఇష్టపడటం లేదు. వచ్చే ఎన్నికల్లో కుప్పంతో సహా మొత్తం 175 స్థానాలను ఎందుకు గెలుచుకోకూడదని మొన్నటి సమావేశంలో జగన్‌ ప్రశ్నించారు. నిజానికి ఈ ఆలోచనే ప్రకృతి ధర్మానికి విరుద్ధం. ప్రతిపక్షాలు ఉండకూడదని కోరుకోవడం అసంబద్ధంగానే ఉంటుంది.


భారీ భద్రత మధ్య కొన్ని అధికారిక కార్యక్రమాలలో మాత్రమే పాల్గొంటున్న జగన్‌, మిగతా సమయమంతా తాడేపల్లి ప్యాలెస్‌కే పరిమితమవుతున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతున్నదీ ఆయనకు తెలియడం లేదు. జగన్‌ చెబుతున్నట్లుగా శాసనసభ్యులపై ఎక్కువ వ్యతిరేకత కాదు– ముఖ్యమంత్రిపైనే వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ప్రభుత్వంలో కర్త, కర్మ, క్రియ ఆయనే. ప్రతి పథకానికీ, కార్యక్రమానికీ ‘జగనన్న’ అనే పేరు తగిలిస్తున్నారు. దీంతో తమకు మంచి జరుగుతున్నా, చెడు జరుగుతున్నా జగన్మోహన్‌ రెడ్డే కారణమని ప్రజలు భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ముఖం చూసి కాకుండా, ‘ఒక్క చాన్స్‌’ అని వేడుకోవడం వల్లనే జగన్‌ కోసం ప్రజలు ఓట్లు వేశారు. ఈ వాస్తవాన్ని ముఖ్యమంత్రి గుర్తించకుండా శాసనసభ్యులపై వ్యతిరేకత ఉంటే టికెట్లు ఇవ్వబోనని హెచ్చరిస్తున్నారు. అలా అయితే జగన్‌ పరిస్థితి ఏమిటి? ప్రభుత్వం చేపట్టిన ‘గడప గడపకూ’ కార్యక్రమంలో ప్రభుత్వ నిర్ణయాలనే ప్రజలు నిలదీస్తున్నారు. శాసనసభ్యులను వ్యక్తిగతంగా నిందించడంలేదు. పథకాల ద్వారా అన్ని లక్షల కుటుంబాలకు, ఇన్ని లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తున్నందున వాళ్లంతా తనకే ఓటు వేస్తారని జగన్‌ ప్రభుత్వం భ్రమల్లో ఉన్నట్టు కనిపిస్తోంది. వాస్తవానికి క్షేత్రస్థాయిలో ముఖచిత్రం మరోలా ఉంది. ప్రభుత్వ పథకాల వల్ల ఆర్థికంగా లబ్ధి పొందుతున్న వారిలో అరవై ఏళ్ల వయసు పైబడిన మహిళలు మాత్రం ఇప్పటికీ జగన్‌కు అనుకూలంగానే ఉంటున్నారు. అయితే వారి భర్తలు కానీ, కూతుళ్లూ లేదా కోడళ్లు ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారు. కుటుంబ నిర్వహణలో ప్రధాన భూమిక పోషించే యువతులు ధరల పెరుగుదల, పన్నులు వేయడంపై మండిపడుతున్నారు. తల్లీ లేదా అత్తగారు ముఖ్యమంత్రికి అనుకూలంగా మాట్లాడే ప్రయత్నం చేస్తే చాలు... ‘‘ఏంటిచ్చేది? కుడిచేత్తో ఇచ్చి ఎడమ చేత్తో అంతకంటే ఎక్కువ గుంజుకుంటున్నారు!’’ అని నొసలు చిట్లిస్తున్నారు. నాసిరకం మద్యం సరఫరా చేయడంపై పురు షుల్లో అత్యధికులు జగన్‌ను తిట్టిపోస్తున్నారు. సాయంత్రం పూట వైన్‌ షాపుల వద్దకు వెళ్లి గంటసేపు నిలబడితే చాలు, మద్యం కొనుగోలు చేసేవారు ఏం అంటున్నారో తెలుస్తుంది. దీన్నిబట్టి వయోజనులలో ప్రభుత్వంపై ఇంకా కొంత సానుకూలత ఉన్నప్పటికీ... మిగతా వారిలో వ్యతిరేకత ఉందనేది స్పష్టమవుతోంది. అంటే గత ఎన్నికల్లో జగన్‌కు పడ్డ ఓట్లలో వచ్చే ఎన్నికల్లో చాలామటుకు చీలిక ఉంటుందని అర్థమవుతోంది. క్షేత్రస్థాయిలో ప్రజలతో సంబంధం పెట్టుకున్న శాసనసభ్యులకు మాత్రమే ప్రభుత్వంపై ప్రజాభిప్రాయం ఏమిటో తెలుస్తుంది. తాడేపల్లి ప్యాలెస్‌కే పరిమితమైన జగన్‌కే తెలియడంలేదు.


బలహీనపడింది ఎవరు?

నిజానికి, అధికార పార్టీ శాసనసభ్యులు బలహీనపడలేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి బలహీనపడ్డారు. ప్రజల్లోనే కాదు... పార్టీలోనూ ఆయన బలహీనమవుతున్నారు. ప్రజల్లో సానుకూలత పెంచుకొనే ముఖ్యమంత్రికి పార్టీపై పూర్తి పట్టు ఉంటుంది. ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడినప్పుడు పార్టీపై కూడా పట్టు కోల్పోతారు. ఇప్పుడు జగన్‌ పరిస్థితి ఇదే. వైసీపీ ఏర్పాటు చేసిన నాటినుంచీ ఇప్పటివరకూ జగన్‌ అధ్యక్షతన జరిగే సమావేశాల్లో పాల్గొన్నవారు సైగలు చేసుకోవడానికి కూడా భయపడేవారు. జగన్‌ చెప్పే మాటలను నిశ్శబ్దంగా వినేవారు. తాజాగా జరిగిన సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పాటికి తాము మాట్లాడుకుంటూ కనిపించారు. తన మాటలు వినకుండా ఎవరికి వారు పక్కవారితో మాట్లాడుకుంటూ కనిపించడంపై జగన్‌ అసహనం వ్యక్తం చేసినా ఫలితం కనిపించలేదు. ‘‘గతంలో జగన్మోహన్‌ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు విజయమ్మ, షర్మిల అధ్యక్షతన పార్టీ సమావేశాలు జరిగినప్పుడు ఇలాగే గందరగోళంగా ఉండేవి. తాజాగా జగన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశం కూడా చేపల మార్కెట్‌ను తలపించే విధంగా ఉండటం ఇప్పుడే చూస్తున్నాను’’ అని ఒక సీనియర్‌ ఎమ్మెల్యే చెప్పారు. పార్టీ అధినేత ప్రజల్లో బలహీనపడినప్పుడే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని ఆయన విశ్లేషించారు. ‘‘పార్టీ అధినేతలు ఎవరైనా వారికి ప్రజల్లో ఆదరణ ఉన్నప్పుడు పార్టీ నాయకులు అణకువగా ఉంటారు, లేని పక్షంలో తలెగరేయడం మొదలు పెడతారు’’ అని మరో సీనియర్‌ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ‘‘రాష్ట్రంలో పరిస్థితులు ఎలా మారిపోతున్నాయో మాకు తెలుసుకానీ, ముఖ్యమంత్రికి తెలియదుగా! అందుకే ఆయన మొత్తం అన్ని స్థానాలూ మనవే అని చెప్పుకొంటున్నారు’’ అని ఆయన హేళనగా అన్నారు. తమలో సొంత బలం ఉన్న కొంత మంది ఇప్పటికే పక్క చూపులు చూస్తున్నారని ఒక మాజీ మంత్రి చెప్పుకొచ్చారు. అధినేతకు పార్టీపై పూర్తి పట్టు ఉన్నప్పుడు పార్టీ సమావేశాల వివరాలు విలేకరులకు తెలియడం కష్టంగా ఉంటుంది. అధినేత ప్రజల్లో పలుచనైనప్పుడు మాత్రం అట్టే శ్రమ పడకుండానే అంతర్గత సమావేశాల వివరాలు మీడియాకు తెలిసిపోతుంటాయి. మొన్న కూడా సమావేశం ముగియగానే వైసీపీకి చెందిన శాసనసభ్యులే స్వయంగా విలేకరులకు ఫోన్లు చేసి మరీ ఏమి జరిగిందో పూసగుచ్చినట్టు వివరించారు. దీన్నిబట్టి జగన్‌ పరిస్థితి ఏమిటో తెలుస్తోంది కదా! అయినా వాస్తవాన్ని గుర్తించడానికి ముఖ్యమంత్రి నిరాకరిస్తే ఎవరు మాత్రం ఏం చేయగలరు? తాజా సమావేశంలో కూడా 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలన్న తన కల గురించి జగన్‌ చెప్పుకొచ్చారు. ‘వచ్చే ఎన్నికల్లో మనకు వ్యతిరేకంగా ప్రత్యర్థులందరూ ఏకమవుతారు. అయినా మనం గెలిస్తే తర్వాత 30 ఏళ్ల వరకు మనకు తిరుగుండదు’ అని జగన్‌ చెప్పుకొచ్చారట! అలా కోరుకునే హక్కు ఆయనకుంది. అయితే, ‘మ్యాన్‌ ప్రపోజెస్‌.. గాడ్‌ డిస్పోజెస్‌’ అంటారు.


తప్పు చేయడమే వైసీపీలో ఒప్పా?

పార్టీకి నష్టం జరిగితే ఎమ్మెల్యేలదే బాధ్యత అని చెబుతున్న జగన్‌... ఈ మూడేళ్లలో తప్పు చేసిన ఒక్క ఎమ్మెల్యేను కూడా మందలించడం గానీ, చర్యలు తీసుకోవడం గానీ చూశామా! దీంతో ఎవరి స్థాయిలో వారు అరాచకంగా ప్రవర్తిస్తున్నారు. ఆ పాపమంతా జగన్‌కే చుట్టుకుంటుంది. ఎమ్మెల్యే ఇంట్లో పెళ్లికి హాజరుకాని వారి పథకాల్లో కోత విధిస్తారని ప్రకటించిన అధికారులను, వారిని ప్రేరేపించిన ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డిపై ముఖ్యమంత్రి జగన్‌ చర్యలు తీసుకోగలరా? నిన్నగాక మొన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేశ్‌ నిర్వహించిన జూమ్‌ కాన్ఫరెన్స్‌లోకి ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కొడాలి నాని ప్రవేశించి అనుచితంగా ప్రవర్తించారు. ఒక పార్టీ నాయకుడు నిర్వహించే సమావేశంలోకి మరో పార్టీ వాళ్లు ప్రవేశించి అలజడి సృష్టించాలనుకోవడం నేరం కాదా? ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కూడా అధికారులతో, పార్టీ నాయకులతో జూమ్‌ సమావేశాలు లేదా వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తుంటారు. వాటిల్లోకి కూడా ఇలాగే ఎవరైనా చొరబడవచ్చా? అలా చొరబడిన వారిపై చర్యలు తీసుకోరా? అదేమంటే లోకేశ్‌తో చర్చ జరపడం కోసం మా వాళ్లు వచ్చారని సమర్థించుకొనే ప్రయత్నం చేయడం ఇంకా రోతగా ఉంది. రాజ్యసభ సభ్యత్వం పునరుద్దరణ జరిగిన తర్వాత విజయసాయి రెడ్డి మరింత రెచ్చిపోతున్నారు. వయసుకీ, స్థాయికీ తగని వ్యాఖ్యలు చేస్తున్నారు. అతను అలా మాట్లాడాలని తాడేపల్లి ప్యాలెస్‌ ప్రోత్సహిస్తూ ఉండవచ్చునుగానీ... విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు, చర్యల వల్ల అంతిమంగా నష్టం జరిగేది జగన్‌కే! కొడాలి నాని, వంశీ అనుచిత ప్రవర్తనను కూడా అనుకూలంగా ప్రచారం చేసుకోవడానికి జగన్మోహన్‌ రెడ్డి కూలి మీడియాను ప్రయోగిస్తున్నారు. సంఘటన జరిగిన వెంటనే రెండు కూలి మీడియా చానళ్లు నానీ వద్దకు మైకులు తీసుకొని పరిగెట్టాయి.


ఎమ్మెల్యేలు ఏ ఉద్దేశంతో జూమ్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నప్పటికీ సభ్య సమాజం వారి చర్యలను హర్షించదు. ఇలాంటి వికారపు చేష్టలు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి ఆనందం కలిగిస్తుండవచ్చు. కానీ... అంతిమంగా నష్టం జరిగేది ఆయనకే. ప్రత్యర్థులను వేధించడం, వెంటాడటం వల్ల అధికారాన్ని శాశ్వతం చేసుకోవచ్చునని భావించడం మూర్ఖత్వమే అవుతుంది. జగన్మోహన్‌ రెడ్డి ఇవాళ ఇంత అప్రతిష్ఠ మూటగట్టుకోవడానికి కారణం ఇదే కదా! అందరికీ అన్నీ ఇస్తున్నా తనపై వ్యతిరేకత ఎందుకుంటుంది? అని ఆయన అనుకుంటూ ఉండవచ్చు. పథకాల మాటున జరుగుతున్నది ఏమిటో ప్రజలు గ్రహిస్తున్నారు. నిన్నగాక మొన్న అమలాపురంలో కులాల కుంపట్లు రగిలించారు. దళితుల ఓట్లను గంపగుత్తగా దక్కించుకోవడం కోసం సమాజంలో చిచ్చు పెట్టడాన్ని ఇతర సామాజిక వర్గాలు జీర్ణించుకోగలవా? రాష్ట్రంలో ఇంత విధ్వంసం జరిగినా ప్రజలు తనతోనే ఉన్నారని జగన్‌ అనుకుంటూ ఉంటే అది ఆయన ఇష్టం. ఆంధ్రావాళ్లు ఇక చాలు అని, తెలంగాణ వాళ్లు మాత్రం ‘ఆయనే ఉంటే బాగుండు’ అని భావిస్తున్నారంటే జగన్‌ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయినా నాకు 175 సీట్లు గంపగుత్తగా వస్తాయని జగన్‌ కలలు కంటూ ఉంటే అది ఆయన హక్కు. ఆంధ్రా వాళ్లు వెర్రివాళ్లనే ప్రగాఢ విశ్వాసం ఏదో జగన్‌లో బలంగా ఉండి ఉంటుంది. అందుకే ఆయన అలా నమ్ముతున్నట్టు ఉంది!


పొత్తుల్లో ఎవరెవరు... 

ఈ విషయం అలా ఉంచితే... ప్రతిపక్షాల మధ్య పొత్తుల అంశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. పొత్తులకు సంబంధించి తన ముందు మూడు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని జన సేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రకటించగానే కలకలం మొదలైంది. మూడు ప్రత్యామ్నాయాల్లో జనసేన– బీజేపీ కలసి పోటీ చేయడం ఒకటి అని ఆయన నోటి నుంచి వెలువడగానే ‘ఆ ప్రత్యామ్నాయం మాకు ఓకే’ అని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. పవన్‌ కల్యాణ్‌ తన ప్రత్యామ్నాయాలను ప్రతిపాదించగానే తమ అధినేతను ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంగీకరిస్తేనే ఎవరితోనైనా పొత్తు ఉంటుందని కొంతమంది జనసేన నాయకులు ప్రకటించారు. తిరుపతికి చెందిన ఒకరిద్దరు నాయకులు మరో అడుగు ముందుకేసి... రాష్ట్ర పర్యటనకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఈ విషయం తేల్చాల్సిందే అని అల్టిమేటం ఇచ్చారు. అయితే... నడ్డా ఏమీ పట్టించుకోకుండానే ఢిల్లీకి తిరిగి వెళ్లిపోయారు. పవన్‌ కల్యాణ్‌ తన మనసులో ఉన్న ప్రత్యామ్నాయాలను ఇప్పుడు ఎందుకు బహిర్గతం చేశారో తెలియదు. నిజానికి ఈ ప్రకటన చేయడానికి ముందు పవన్‌ కల్యాణ్‌ ఒక్కరే ఢిల్లీ వెళ్లి ఏపీలో బీజేపీ వ్యవహారాలను పర్యవేక్షించే బీఎల్‌ సంతోష్‌ ప్రభృతులను కలుసుకొని... తెలుగుదేశం పార్టీతో కలసి వెళ్లాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆ తర్వాత రాష్ర్టానికి తిరిగొచ్చిన పవన్‌ మూడు ప్రత్యామ్నాయాలను జనంలోకి వదిలారు. తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపే విషయంలో బీజేపీపై ఒత్తిడి తెచ్చే వ్యూహంలో భాగంగా ఆయన ఈ ప్రకటన చేశారేమో తెలియదు. ముఖ్యమంత్రి జగన్‌కు మేలు చేయడంకోసమే బీజేపీ నాయకులు పవన్‌తో ఈ ప్రకటన చేయించారన్న వాదన కూడా ఉంది. అయితే... రాష్ట్ర బీజేపీ నాయకులు చెబుతున్నదాన్నిబట్టి ఆ పార్టీ కేంద్ర నాయకత్వ వైఖరిలో ఇటీవల కొంత మార్పు వచ్చిందంటున్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉండేపక్షంలో తెలుగుదేశం పార్టీతో చేతులు కలపడానికి బీజేపీ అగ్ర నాయకత్వం సుముఖంగానే ఉందని చెబుతున్నారు. 


అంత ఈజీ కాదు... 

పవన్‌ కల్యాణ్‌ ప్రకటించిన ప్రత్యామ్నాయాలపై తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. అవసరాన్ని, పరిస్థితులను బట్టి పొత్తుల గురించి ఆలోచించాలని ఆ పార్టీ భావిస్తోంది. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను మరింత పెంచడం ద్వారా ప్రజలను తమకు అనుకూలంగా తిప్పుకోవడమే ప్రస్తుతం తమ ముందున్న లక్ష్యమని తెలుగుదేశం ప్రముఖుడొకరు చెప్పారు. నిజానికి తెలుగుదేశం కార్యకర్తలు మహానాడు సక్సెస్‌ తర్వాత దూకుడు మీదున్నారు. పొత్తులు లేకపోయినా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని వారు నమ్ముతున్నారు. అయితే, తెలుగుదేశం పార్టీలో సంస్థాగత బలహీనతలు ఇప్పటికీ ఉన్నాయి. జగన్మోహన్‌ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకతే తమను అధికారంలోకి తీసుకువస్తుందని అనుకోవడం పొరపాటే. జిల్లాల్లో ఇప్పటికీ అందరినీ కలుపుకొనివెళ్లే నాయకత్వం లేదు. ఒక్క ప్రకాశం జిల్లాలోనే నాయకులు, శాసనసభ్యులు సమష్టిగా ఏకతాటిపై నిలుస్తూ పార్టీని నిలబెట్టారు. మిగతా జిల్లాల్లో ఈ పరిస్థితి లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. నెల్లూరు వంటి జిల్లాల్లో స్థానిక నాయకత్వం బలహీనంగా ఉంది. పలుచోట్ల ఇప్పటికీ అధికార పార్టీతో లాలూచీ నడుస్తోంది. మేమంతా మీ పార్టీలోకి వస్తామంటున్న వైసీపీ నాయకుల మాటలను నమ్ముకొని నియోజకవర్గాల్లోని టీడీపీ నాయకత్వం రిలాక్స్‌ అవుతోంది. ప్రజల్లోని వ్యతిరేకతను క్యాష్‌ చేసుకొనే ఆలోచనలను స్థానిక నాయకత్వం చేయకుండా గెలిచిపోతామనుకుంటే పప్పులో కాలు వేసినట్టే. చంద్రబాబును చూసి జనం ఓటు వేసే విషయం నిజమే అయినా, స్థానికంగా ఓటర్లను సంఘటితం చేసి భరోసా కల్పించే నాయకత్వం ఉండాలి కదా? ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అంత తేలికగా అధికారాన్ని వదులుకొనే రకం కాదు. తెలుగుదేశం నాయకులు ఈ విషయం గుర్తుంచుకోవాలి. ఇంట్లో కూర్చుంటే అధికారం రాదు. అధికార దుర్వినియోగం ఏ స్థాయిలో ఉంటుందో జగన్‌ ఇప్పటికే అందరికీ చూపించారు. ఎన్నికల్లో కూడా డబ్బు వెదజల్లడంతో పాటు గరిష్ఠంగా అధికార దుర్వినియోగానికి పాల్పడతారు. అయితే పోలీసు యంత్రాంగంలో ఇటీవల మార్పు కనిపిస్తోంది. అధికార పార్టీకి ఇప్పుడు అడుగులకు మడుగులు ఒత్తుతున్న వారు ఎన్నికల సమయంలో కూడా అలాగే వ్యవహరించక పోవచ్చు. ప్రజల మూడ్‌ను బట్టి అధికార యంత్రాంగం మారుతుంది. జగన్‌రెడ్డి అభిప్రాయపడ్డట్టు రానున్న ఎన్నికలు చంద్రబాబుకు అత్యంత కీలకం. ఈ ఎన్నికల్లో గెలవని పక్షంలో మళ్లీ ఎన్నికలు వచ్చేనాటికి ఆయనకు ఎనభై ఏళ్లు నిండుతాయి. అందుకే ఈ ఎన్నికలను తట్టుకోగలిగితే ఆ తర్వాత తన అధికారానికి ఢోకా ఉండదని ముఖ్యమంత్రి జగన్‌ భావిస్తున్నారు. నిజానికి వచ్చే ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి ఎవరవుతారన్నది ముఖ్యం కాదు. రాష్ట్రం ఏమవుతుంది? అన్నదే ముఖ్యం. ప్రజలు ఈ దిశగా ఆలోచిస్తారని ఆశిద్దాం! ఇక పవన్‌ కల్యాణ్‌ ముఖ్యమంత్రి కావాలని నినదిస్తున్న జనసేన నాయకులకు ఒక సూచన. విధానపరమైన అంశాల్లో ఏ పార్టీకైనా స్పష్టత ఉండాలి. రాష్ట్రం మరింత విధ్వంసం కాకుండా కాపాడుకోవాలంటే వచ్చే ఎన్నికల్లో జగన్‌ వ్యతిరేక ఓటు చీలకూడదని, గతంలో మాదిరి ఓట్లను చీలనివ్వబోమని తొలుత ప్రకటించింది జనసేన మాత్రమే. అంటే తెలుగుదేశం పార్టీతో పొత్తుకు పవన్‌ సిద్ధపడినట్లేనని ఎవరైనా భావిస్తారు. బీజేపీ నుంచి రోడ్‌ మ్యాప్‌ కోసం ఎదురుచూస్తున్నానని కూడా పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. రాష్ట్రంలో బీజేపీ బలంతో పోల్చితే జనసేన బలమే ఎక్కువ. అలాంటప్పుడు జనసేన నిర్ణయంకోసం బీజేపీ ఎదురుచూడాలి కానీ, బీజేపీ నిర్ణయం కోసం జనసేన ఎదురుచూడటం ఏమిటి? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమని స్పష్టంగా ప్రకటిస్తూనే తన ముందు మూడు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని పవన్‌ కల్యాణ్‌ ప్రకటించడం ఆశ్చర్యంగా ఉంది. ఓట్లు చీలకూడదు అంటే ఒకటే ప్రత్యామ్నాయం ఉంటుంది కదా? ఇక ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అభ్యర్థిత్వాన్ని మిగతా పార్టీలు అంగీకరించాలన్న డిమాండ్‌కు వద్దాం. తాను ముఖ్యమంత్రి కావాలని పవన్‌ కల్యాణ్‌కు ఉన్నా, ఆయన ముఖ్యమంత్రి కావాల్సిందేనని జన సైనికులకు ఉన్నా ‘మా షరతులకు అంగీకరిస్తేనే పొత్తులు’ అని ప్రారంభంలోనే ప్రకటించి ఉండాల్సింది. అలా కాకుండా ఓట్లు చీలకూడదని ప్రకటించి ఇప్పుడు షరతులు పెట్టడం వల్ల జనసేన పార్టీకే నష్టం అన్న అభిప్రాయం వినిపిస్తోంది. నిజానికి పవన్‌ కల్యాణ్‌ ముఖ్యమంత్రి కావాలంటే ఆయన చాలా కష్టపడాలి. పార్ట్‌ టైం పొలిటీషియన్‌గా ఉంటే కుదరదు. జనసేన అంటే ఒక సామాజిక వర్గానికి పరిమితం అన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. ముందుగా ఈ అభిప్రాయాన్ని తొలగించే ప్రయత్నం జరగాలి. చివరిగా జనసేనానిగానీ, జనసైనికులుగానీ ఆచితూచి అడుగులు వేయడం అలవర్చుకోవాలి. ఈ నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌ తెలుసుకోవాల్సింది ఒక్కటే! ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి కావడమా? లేక జగన్‌ను ఇంటికి పంపడమా? తన ప్రాధాన్యత ఏమిటో తను తెలుసుకోవాలి. అదే సమయంలో ‘డబ్బులు ఎవరికీ ఊరకే రావు’ అన్నట్టుగా ముఖ్యమంత్రి పదవి అంటే అంత తేలిక కాదని కూడా జనసేనాని గుర్తించాలి. పొత్తుల గురించి పవన్‌ కల్యాణ్‌ ప్రకటించగానే తెలుగుదేశం నాయకులు స్పందించలేదు. అయినా వారు పవన్‌ కల్యాణ్‌ను కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్నారని వైసీపీ వాళ్లు సోషల్‌ మీడియా ప్రచారం మొదలెట్టారు. పవన్‌ కల్యాణ్‌ను రెచ్చగొట్టడమే అధికార పార్టీ వ్యూహం. దీన్నిబట్టి పొత్తులు కుదిరితే తమ అధికారానికి అంతిమ ఘడియలు సమీపించినట్టు వైసీపీ నాయకులు భయపడుతున్నట్టేగా! చూద్దాం... ఏం జరగనుందో!!

ఆర్కే


యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Read more