భారత ప్రజాస్వామ్య కీర్తిపతాక

ABN , First Publish Date - 2022-02-13T06:15:49+05:30 IST

దామోదరం సంజీవయ్య శతజయంతి ఉత్సవాలు రేపటితో ముగియనున్నాయి..

భారత ప్రజాస్వామ్య కీర్తిపతాక

దామోదరం సంజీవయ్య శతజయంతి ఉత్సవాలు రేపటితో ముగియనున్నాయి.  అటు రాష్ట్రప్రభుత్వం, ఇటు పేరెన్నికగన్న ఎన్నో సంస్థలు, రాజకీయపార్టీలు సైతం సంజీవయ్య శతజయంత్యుత్సవాలను నిర్వహించడం హర్షదాయకం. గత సంవత్సరం ఫిబ్రవరి 14న ఆంధ్రరాష్ట్రమంతటా 13 జిల్లా కేంద్రాల్లో, సంజీవయ్య స్వగ్రామం కర్నూలు జిల్లా పెదపాడులో రాష్ట్ర వేడుకలుగా ఈ ఉత్సవాలను ప్రారంభించుకోవడం ఆనందదాయకం. హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున ఉన్న ఆయన నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి, పాటిగడ్డలోని సంజీవయ్య పార్కులో, ఆ మహనీయుడు రాష్ట్రానికి, దేశానికి చేసిన సేవల్ని స్మరించుకున్నాం. ఈ ఫిబ్రవరి 14వ తేదీన శత సంవత్సరాల వేడుకలను అదే రీతిన జరుపుకోవాలి.


దామోదరం సంజీవయ్య కారణజన్ముడు. నిండా 40 ఏళ్ల వయస్సు దాటకుండానే, వంశపారంపర్య హక్కు ఏదీ లేకుండానే ఆంధ్రప్రదేశ్‌ వంటి అతి పెద్ద రాష్ట్రానికి ముచ్చటగా నాలుగో ముఖ్యమంత్రి (1960–1962)గా పదవిని చేపట్టడం విశేషమే కదా? అప్పుడు ఆయన వయస్సు 39 సంవత్సరాల లోపే. 29వ ఏటనే అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రాజాజీ మంత్రివర్గంలో పనిచేసి, పది సంవత్సరాల రాజకీయానుభవంతో దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి కావడం గొప్ప కాక మరేమిటి?


సంజీవయ్య ఏనాడూ తాను స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నట్లు ప్రకటించుకోలేదు. ఆ ఉద్యమాన్ని తన కనుసన్నల్లో నడిపించిన గాంధీజీని ప్రత్యక్షంగా చూడని వ్యక్తి ఆయన. అయినా మహాత్ముడు చూపిన బాటలో సాగుతూ అనతికాలంలోనే అఖిలభారత కాంగ్రెసు కమిటీ (ఎఐసిసి)కి రెండు దఫాలుగా అధ్యక్షపీఠాన్ని అధిష్ఠించడం సామాన్యమైన విషయం కాదు.  ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాటల్లో చెప్పాలంటే– ‘భారతదేశ ప్రజాస్వామ్య ఘనతకు దామోదరం సంజీవయ్య జీవితం ఒక గొప్ప ఉదాహరణ.’


సంజీవయ్య 22 ఏళ్ల రాజకీయ ప్రస్థానం త్రివేణీ సంగమం– ట్రినిటీ. ముగ్గురు ముఖ్యమంత్రులు– ప్రకాశం పంతులు, బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి – నేతృత్వంలో రాష్ట్రమంత్రి; ముగ్గురు దేశ ప్రధానులు– జవహర్‌లాల్‌ నెహ్రూ, లాల్‌బహదూర్‌ శాస్త్రి, ఇందిరాగాంధీ – నాయకత్వంలో కేంద్రమంత్రిగా కొనసాగిన ఘనత సంజీవయ్యకే దక్కింది. నేటి పరిభాషలో చెప్పాలంటే, మూడు రాజధానులు – మద్రాసు, కర్నూలు, హైదరాబాద్‌ కేంద్రంగా ప్రభుత్వంలో పనిచేయటం విశేషం కాక మరేమిటి?


పుట్టింది పేద కుటుంబంలో నైనా, ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగం, సంపాదించాలన్న సంజీవయ్య సంకల్పానికి మేనమామ, అన్న (చిన్నయ్య) ఎంతగానో సహకరించారు. ఆ రోజుల్లో అన్ని వ్యవసాయ కూలీ కుటుంబాల మాదిరిగానే ఆయన కుటుంబసభ్యులు కుటుంబ పోషణార్థం పశువులు కాయడం, కూలీ పనులకు పోవడం, కౌలుకు పొలాల్ని సాగు చేయడం వంటి పనులు చేసేవారు. తీరిక సమయాల్లో నేతబట్టలు అమ్ముకోవడం వృత్తిగా ఉండేది. ఏనాడూ ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడకుండా గుట్టుగా, సంస్కారవంతంగా జీవనం సాగించిన కుటుంబం సంజీవయ్యది. అయితే ఈ మధ్య సోషల్‌ మీడియాలో వస్తున్న కథనాలు విపరీత ధోరణులకు దారితీసేవిగా, ఆ కుటుంబ గౌరవాన్ని కించపరిచేవిగా ఉండడం ఒకింత బాధాకరం. మరీ ముఖ్యంగా సంజీవయ్య తల్లి సుంకులమ్మ అమాయకత్వాన్ని ఆకాశానికెత్తి చూపడం గర్హనీయం. గ్రామీణ ప్రాంతాల్లో పూరిగుడిసెల్లో నివసించడం, పొగగొట్టాలతో పొయ్యి ఊదడం, కుటుంబపోషణకు సతమతమవడం ఇత్యాది విషయాలు అన్ని కుటుంబాల్లో సర్వసామాన్యమే. సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఢిల్లీ నుంచి వచ్చిన ప్రముఖ కాంగ్రెసు నాయకుడు ఒకరు పెదపాడు గ్రామం వచ్చి ఈ దృశ్యాల్ని చూసిన సందర్భమే వేరు. బడుగువర్గాల నుంచి వచ్చి ముఖ్యమంత్రి స్థాయికి స్వశక్తితో, తన ప్రతిభాపాటవాలతో ఎదగడం, గిట్టనివాళ్లు చేసిన ఫిర్యాదులపై విచారణ కోసం ఆయన వచ్చారు.


న్యాయశాస్త్ర విద్యార్థిగా ఉన్నప్పుడు ఆయన సహాధ్యాయి అయిన రాచకొండ విశ్వనాథ శాస్త్రి నమోదు చేసిన జ్ఞాపకాలు ఈ సందర్భంగా గమనార్హం. ‘‘నేను, సంజీవయ్య కలిసి రెండేళ్ల పాటు న్యాయశాస్త్రాన్ని అభ్యసించాం. సంజీవయ్యలో ఎలాంటి న్యూనతాభావాలు ఉండేవి కావు. ఇతర కులాలవారితో తానూ సమానమేనని గట్టిగా విశ్వసించేవారు. ఆ విశ్వాసానికి అనుగుణంగానే ఆయన ప్రవర్తించారు’’ అన్న రావి శాస్త్రి వారి పరిశీలన సంజీవయ్య ఆత్మవిశ్వాసానికి, వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది.


కళాశాల రోజుల్లో రాజకీయాల పట్ల సంజీవయ్య అంతగా ఆసక్తిని కనబరచేవారు కాదు. బాల్యమిత్రుడు అవధానం రమేష్‌ జాతీయ నాయకుల సమావేశాలకు సంజీవయ్యను తీసుకుని వెళ్లేందుకు ఎంత ప్రయత్నించినా ఆయన నిరాసక్తత వ్యక్తం చేసేవారు. సంజీవయ్య సన్నిహితుడు ఏరాసు అయ్యపురెడ్డి విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే కాంగ్రెసు పార్టీకి అనుబంధంగా ఉండేవారు. ‘సంజీవయ్య ఏనాడూ జాతీయోద్యమంపై ఆసక్తి చూపలేదు. ఆయన కష్టపడి చదివేవాడు. పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలి, ఏదో ఒక ఉద్యోగాన్ని సాధించుకోవాలి’’ అన్నదే ఆయన లక్ష్యంగా కనిపించేది’ అని అయ్యపురెడ్డి పేర్కొన్నారు.


న్యాయవాదిగా గణపతి, జాస్తి సీతామహాలక్ష్మమ్మ అనే సీనియర్‌ న్యాయవాదుల దగ్గర శిక్షణ పొందుతున్న రోజుల్లో సంజీవయ్యకు రాజకీయాల పట్ల ఆసక్తి ఏర్పడింది. న్యాయవాద వృత్తిలో రాణించడం తనలాంటి వాళ్లకు అంత సులువు కాదు అన్న నిజాన్ని ఆపాటికే అవగాహన చేసుకున్నారు. అప్పటి సంజీవయ్య పరిస్థితి గురించి కె. రామస్వామి రాసిన జ్ఞాపకాలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. ‘‘నిజానికి ఈ వృత్తి (న్యాయవాద)లో చేరాలనుకునే కొత్తవారికి పుష్కలమైన ఆర్థికసంపత్తి అవసరం. కొద్దికాల వ్యవధిలోనే న్యాయవాద వృత్తి ఆయనకు ఎన్నో పాఠాలు నేర్పింది’’ అని రామస్వామి పేర్కొన్నారు. 


సంజీవయ్య 29 సంవత్సరాల వయస్సులో రాజకీయరంగ ప్రవేశం చేయడం, 1950లో తాత్కాలిక పార్లమెంటు సభ్యుడు కావడం, తదనంతరం 1952 ఎన్నికల్లో పత్తికొండ, ఎమ్మిగనూరు ద్విసభ్య స్థానం నుంచి పోటీచేసి గెలవడం, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రాజాజీ మంత్రివర్గంలో చేరడం చకచకా జరిగిపోయాయి. 31 సంవత్సరాల సంజీవయ్య రాజాజీ మంత్రిమండలిలో అతి పిన్న వయస్కుడు. ఎవరో సిఫార్సు చేస్తే ఆయన మంత్రి అయ్యారనే కంటే, సంజీవయ్యలోని విశ్వసనీయత, సేవాతత్పరత, కష్టపడే మనస్తత్వం నచ్చినందునే రాజాజీయే స్వయంగా ఆయనను ఎంపిక చేశారనేదే వాస్తవం. సంజీవయ్య సన్నిహితుడు జిఎల్‌ నర్సింహయ్య ఒకానొక సందర్భంలో వెల్లడించిన వాస్తవాలివి.1953 అక్టోబరు ఒకటిన కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడడం, టంగుటూరి ప్రకాశం పంతులు మార్గదర్శనంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించడం సంజీవయ్యకు దక్కిన అపూర్వ అవకాశం. అక్కడి నుంచి అప్రతిహతంగా రాష్ట్రమంత్రిగా, ముఖ్యమంత్రిగా, అఖిల భారత కాంగ్రెసు కమిటీ అధ్యక్షులుగా, కేంద్రమంత్రిగా సాగిన 22 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో డబ్బు, కీర్తిప్రతిష్ఠల కోసం ఆయన ఏనాడూ పాకులాడలేదు. 27 నెలల పాటు ముఖ్యమంత్రిగా ఉండి ఆ పదవి నుంచి వైదొలగే నాటికి స్వంత ఇల్లు, సెంటు భూమి, కారు కూడా లేనంత నిరాడంబరుడాయన. ఈ కోవకు చెందిన రాజకీయవేత్తలను వేళ్లమీద లెక్కించవచ్చు. జన్మతః సంజీవయ్య కవి, సాహిత్యాభిలాషి. నాటకకర్త, గాయకుడు, మంచివక్త. తెలుగును అధికారభాషగా ప్రకటించడానికి నాందీ, ప్రస్తావన సంజీవయ్య. ఢిల్లీలో ఉండగా తన అధికార నివాసాన్ని భాషా సంస్కృతుల పీఠంగా రూపుదిద్ది తెలుగుకు గౌరవ్రపదమైన స్థానం కల్పించడానికి ఎంతో శ్రమించారు.


సంజీవయ్య జీవిత చరిత్రను ప్రచురించాలనే ఉత్సాహం ఉన్న వాళ్లకు విషయ సంగ్రహణ కష్టతరమే. ఎందుకంటే సమగ్రమైన సమాచారం గానీ, ప్రచురణలు గానీ లేవు. అసెంబ్లీ, పార్లమెంటులలో వారు చేసిన ప్రసంగాలు, ప్రవేశపెట్టిన పాలనా సంస్కరణలు, ఆయన రాసిన పుస్తకాలు తక్కువ ప్రాచుర్యంలోకి రావడం మన దురదృష్టం. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చరిత్ర విభాగం అధ్యక్షులుగా పనిచేసిన ప్రొఫెసర్‌ జి. వేంకటరాజం 1995లో డాక్టరేట్‌ పొందడం కోసం సంజీవయ్య జీవితంపై పరిశోధన సాగించి, ఆంగ్లంలో ఒక పుస్తకాన్ని వెలుగులోకి తెచ్చారు. ఆ తర్వాత డా. గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి సహకారంతో రూపుదిద్దుకున్న దాని తెలుగు అనువాదం ‘దామోదరం సంజీవయ్య శకం’ ప్రచురణ పొందింది. అదే ఒరవడిలో మిత్రులు మరియాకుమార్‌ (ఐపిఎస్‌) రాసిన ‘సంజీవయ్య శతకం’ ఆయన వివిధ హోదాల్లో నిర్వర్తించిన ప్రజోపయోగ కార్యాలన్నింటినీ ఛందోబద్ధంగా పాఠకులకు తెలియపరుస్తుంది. ప్రముఖ పాత్రికేయులు కె. రామచంద్రమూర్తి సంజీవయ్య జీవిత విశేషాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నంలో ఉన్నారని తెలిసి ఎంతో సంతసించాను.


సంజీవయ్య నిక్కమైన జాతీయవాది. వ్యక్తిగత సంకుచిత స్వార్థాలకు అతీతంగా ఆలోచించిన మహనీయుడు. దేశభక్తి, సమతాదృష్టి, నిర్మాణాత్మక ఆలోచనలకు ఆనవాలయిన ఆయన జీవిత చరిత్ర మరింత వెలుగులోకి తీసుకుని రావాల్సిన బాధ్యత మనందరిపై ఎంతగానో ఉంది. శతజయంతి ఉత్సవాలు ఆ ఆలోచనలకు ఆద్యమివ్వాలని ఆశిద్దాం.


డా. డి. శ్రీనివాసులు

సంజీవయ్య శతజయంతి ఉత్సవాల కన్వీనర్‌

Updated Date - 2022-02-13T06:15:49+05:30 IST