బీఆర్ఎస్ వెనుక గెలుపు వ్యూహం!

ABN , First Publish Date - 2022-06-19T05:54:52+05:30 IST

తెలంగాణలో కేసీఆర్‌ను కట్టడి చేయడానికి ప్రయత్నిస్తున్న బీజేపీ అగ్రనాయకత్వం, ఆంధ్రప్రదేశ్‌ విషయంలో మాత్రం భిన్నంగా ఆలోచిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో సొంతంగా లేదా జనసేనతో కలసి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కనుక...

బీఆర్ఎస్ వెనుక గెలుపు వ్యూహం!

తెలంగాణలో కేసీఆర్‌ను కట్టడి చేయడానికి ప్రయత్నిస్తున్న బీజేపీ అగ్రనాయకత్వం, ఆంధ్రప్రదేశ్‌ విషయంలో మాత్రం భిన్నంగా ఆలోచిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో సొంతంగా లేదా జనసేనతో కలసి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కనుక ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి పరోక్షంగా అండదండలు అందించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోని పక్షంలో జగన్మోహన్‌ రెడ్డిని ఇంటికి పంపలేమని బీజేపీ అగ్రనాయకులకు నచ్చజెప్పడానికి పవన్‌ కల్యాణ్‌ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. జగన్‌ పోయి చంద్రబాబు అధికారంలోకి వస్తే మనకు ఏమిటి లాభం? అని ఢిల్లీ స్థాయి నాయకులు పవన్‌ కల్యాణ్‌ను ప్రశ్నిస్తున్నారని తెలిసింది. చంద్రబాబుకు వయసు మీద పడుతోంది.. 2029 ఎన్నికల నాటికి ఆయన పనైపోతుంది. అప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన లేదా బీజేపీలో విలీనమవుతుంది. అప్పుడు మీరే ముఖ్యమంత్రి కావొచ్చు. అంతవరకు ఓపిక పట్టండి అని జనసేనానికి బీజేపీ నాయకత్వం హితబోధ చేసినట్టు చెబుతున్నారు. దీంతో నిరాశ చెందిన పవన్‌ కల్యాణ్‌ ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాక తన ముందు మూడు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని ప్రకటించారు. జనసేన వర్గాలు చెబుతున్న దాన్నిబట్టి ముఖ్యమంత్రి జగన్‌కు బీజేపీ కేంద్ర నాయకత్వం ఆశీస్సులు బలంగా ఉన్నాయి. 2024 తర్వాత కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని వారు కోరుకుంటున్నారు.


జగన్మోహన్‌ రెడ్డి విధానాల వల్ల రాష్ట్రం దెబ్బతింటోందన్న వాదనలను బీజేపీ కేంద్ర నాయకత్వం పట్టించుకోవడం లేదట. జగన్‌ను దత్తపుత్రుడిగా బీజేపీ అగ్రనాయకులు పరిగణించడం ఆశ్చర్యంగా ఉందని జనసేన నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వయసు కూడా 70 ఏళ్లు దాటింది. అయినా చంద్రబాబుకు మాత్రమే వయసు అయిపోయిందని మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందని ఆయన అన్నారు. బీజేపీని కలుపుకెళ్లడానికి చివరి వరకు ప్రయత్నిస్తామని, కుదరని పక్షంలో తాము మాత్రం తెలుగుదేశంతో చేతులు కలపాలని అనుకుంటున్నామని జనసేనకు చెందిన ముఖ్య నాయకుడొకరు చెప్పారు. పవన్‌ కల్యాణ్‌ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని చెబుతున్నారు. బీజేపీ అగ్రనాయకత్వం ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఇప్పటికీ ఆగ్రహంగా ఉన్నప్పటికీ, ప్రజలు చంద్రబాబు నాయకత్వం పట్ల ఆకర్షితులవుతున్నారు. చంద్రబాబు చేపట్టిన జిల్లాల పర్యటనకు జనం పోటెత్తుతున్నారు. ఉత్తరాంధ్రలో జరుగుతున్న పర్యటనకు వేలాది మంది స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు సభలు 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్‌ రెడ్డి సభలను తలపిస్తున్నాయి. దీంతో రానున్న ఎన్నికల్లో విజయం తమదేనన్న ఆత్మవిశ్వాసం తెలుగుదేశం శ్రేణుల్లో ఏర్పడింది. ‘ఒక్క చాన్స్‌ ప్లీజ్‌’ అని వేడుకున్న జగన్‌ మాటలను నమ్మి తప్పు చేశామన్న అభిప్రాయానికి మెజారిటీ ప్రజలు వచ్చారు. తెలంగాణకు చెందిన ఒక సీనియర్‌ మంత్రి ఇటీవల తిరుమల కొండకు కాలినడకన వెళ్లారు. ఈ సందర్భంగా తనతో పాటు నడిచిన పలు బృందాలను ఆరా తీయగా అత్యధికులు జగన్‌ ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. వారంతా కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందినవారు కావడం గమనార్హం. అతి కొద్దిమంది మాత్రమే జగన్‌ ప్రభుత్వాన్ని సమర్థించారట. జగన్‌ ప్రభుత్వం డబ్బులు ఇస్తోంది కదా అని ఆ మంత్రి ప్రశ్నించగా, ఇచ్చేదానికంటే పన్నుల రూపంలో గుంజుకుంటున్నదే అధికంగా ఉంటున్నదని పలువురు చెప్పడం విశేషం. దీంతో జగన్మోహన్‌ రెడ్డిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని స్పష్టమవుతోందని ఆ మంత్రి చెప్పారు. క్షేత్రస్థాయి పరిస్థితులు కూడా ఈ అభిప్రాయాన్ని బలపరుస్తున్నాయి. చంద్రబాబు సభలకు ఈ స్థాయిలో జనం స్వచ్ఛందంగా తరలి రావడం గతంలో ఎప్పుడూ చూడలేదు. తెలుగుదేశం పార్టీని ప్రారంభించినప్పుడు ఎన్టీఆర్‌ సభలకు జనం తరలివచ్చినట్టుగా ఇప్పుడు చంద్రబాబు సభలకు వస్తున్నారని ఉత్తరాంధ్రకు చెందిన రాజకీయ ప్రముఖుడొకరు చెప్పుకొచ్చారు.


జనసేనాని పవన్‌ కల్యాణ్‌ కూడా జనంలోకి వెళ్లబోతున్నారు. ఆయన పర్యటన తర్వాత ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత మరింత పెరిగే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో చంద్రబాబును ఓడించడం ద్వారా తమ భవిష్యత్తును తామే నాశనం చేసుకున్నామని చంద్రబాబు సభలకు హాజరవుతున్న పలువురు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా అంశం మళ్లీ తెర మీదకు వచ్చింది. బీజేపీ పోటీకి నిలబెట్టే రాష్ట్రపతి అభ్యర్థి గెలుపొందాలంటే వైసీపీ మద్దతు అవసరం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ప్రత్యేక హోదా ఇస్తేనే మద్దతు ఇస్తామని జగన్‌ షరతు విధించాలన్న డిమాండ్‌ తెర మీదకు వచ్చింది. దీంతో జగన్‌ పరిస్థితి ఇరకాటంలో పడింది. అయితే బీజేపీ నాయకత్వం ముందు అటువంటి షరతులు పెట్టే పరిస్థితిలో జగన్‌ లేరు. అందుకే ప్రత్యేక హోదా నిర్ణయంపై వైసీపీ నాయకులు నోరు మెదపడం లేదు. దీంతో జగన్‌–-బీజేపీ మధ్య తెర వెనుక నెలకొన్న మిత్రత్వం బట్టబయలవుతోంది. మరోవైపు ప్రతిపక్షాల నుంచి దాడి పెరుగుతోంది. ఇప్పటివరకు పోలీసులను ప్రయోగించి ప్రతిపక్షాలను కట్టడి చేయగలిగిన జగన్‌, ఇప్పుడు చేతులు ఎత్తేయక తప్పడం లేదు. ప్రజాభిప్రాయం జగన్‌కు వ్యతిరేకంగా మారిపోయిందని నిర్ధారణ అయ్యాక పొత్తుల విషయంలో బీజేపీ అధినాయకత్వం పునరాలోచన చేసే అవకాశం లేకపోలేదు. బీజేపీ కలిసి వచ్చినా, రాకపోయినా తెలుగుదేశం పార్టీతో చేతులు కలపాలని జనసేన దాదాపుగా నిర్ణయానికొచ్చింది. పొత్తు కుదిరితే ఓట్ల బదిలీ సాఫీగా జరిగేలా ఉభయ పక్షాలూ సంయమనంతో వ్యవహరించాలన్న నిర్ణయానికి వచ్చాయి. మూడు ప్రత్యామ్నాయాలను పవన్‌ కల్యాణ్‌ ప్రకటించినప్పుడు తెలుగుదేశం పార్టీ మౌనంగా ఉండిపోవడం ఇందులో భాగమే. పవన్‌ కల్యాణ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంగీకరిస్తేనే ఎవరితోనైనా పొత్తు అని కొంతమంది జనసేన నాయకులు ప్రకటనలు జారీ చేయడంతో పవన్‌ కల్యాణ్‌ అప్రమత్తమైనట్టు చెబుతున్నారు. అలాంటి ప్రకటనలు ఏవీ చేయవద్దని పార్టీ నాయకత్వం నుంచి ఆదేశాలు వెళ్లినట్టు చెబుతున్నారు. రాజకీయాలలో ఎవరైనా ప్రజాభిప్రాయానికి అనుకూలంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నాటికి ప్రతిపక్షాల మధ్య పొత్తు కుదిరే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా జన సైనికులను రెచ్చగొట్టేలా వైసీపీకి చెందిన సోషల్‌ మీడియా రంగంలోకి దిగింది. ఇది గమనించిన జనసేన నాయకత్వం సంయమనం పాటించవలసిందిగా తమ కార్యకర్తలను ఆదేశించింది. ముఖ్యమంత్రి జగన్‌కు రక్షణగా బీజేపీ అగ్ర నాయకత్వం చివరి వరకు ఉంటుందా? అన్నది వేచి చూడాలి.


బీఆర్‌ఎస్‌ వెనుక..?

శకునం చెప్పే బల్లి కుడితిలో పడినట్టు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పన్నిన వ్యూహంలో చిక్కుకున్నారు. ‘భారత రాష్ట్ర సమితి’ (బీఆర్‌ఎస్‌) పేరిట జాతీయ పార్టీ స్థాపించి ప్రధాని నరేంద్ర మోదీపై యుద్ధం చేయబోతున్నట్టు కేసీఆర్‌ ఇటీవల హడావుడి చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌కు ఆదరణ లభిస్తుందా? సొంతంగా ప్రధానమంత్రిని ఎదిరించి నిలబడగలరా? అన్న విషయంలో కేసీఆర్‌కు స్పష్టత ఉంది. లేనిది అరుణ్‌ కుమార్‌ వంటి వారికి మాత్రమే అని టీఆర్‌ఎస్‌ వర్గాలే అంటున్నాయి. పకడ్బందీగా రూపొందించుకున్న వ్యూహంలో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉండవల్లిని భోజనానికి ఆహ్వానించి సుదీర్ఘ చర్చలు జరిపిన కేసీఆర్‌, సదరు చర్చల సారాంశాన్ని ఉండవల్లితోనే చెప్పించారు. నరేంద్ర మోదీని ఢీకొనే సత్తా కేసీఆర్‌కు ఉందని, ఆయనకు వివిధ అంశాలపై గొప్ప అవగాహన ఉందని, కేసీఆర్‌ పోరాటంపై తనకు నమ్మకం కుదిరిందని ఉండవల్లి ప్రశంసలతో ముంచెత్తారు. కేసీఆర్‌ కోరుకున్నది కూడా ఇదే. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఆయా నాయకుల్లో ఎవరిని, ఎప్పుడు, ఎలా వాడుకోవాలో కేసీఆర్‌కు తెలిసినంతగా వర్తమాన రాజకీయ నాయకులలో మరెవరికీ తెలియదనడంలో అతిశయోక్తి లేదు. రాష్ట్ర విభజనకు ముందు కరడుగట్టిన సమైక్యవాదిగా ఉన్న ఉండవల్లి విభజనను ప్రతిఘటించడమే కాకుండా కేసీఆర్‌ను ఘాటుగా విమర్శించేవారు. అటువంటి ఉండవల్లి ఇప్పుడు కేసీఆర్‌ను ప్రశంసించడం ఆశ్చర్యంగానే ఉంటుంది. తెలంగాణకు చెందిన మేధావులు, ప్రజాసంఘాల నాయకులు ఇప్పుడు కేసీఆర్‌తో అంతగా రాసుకుపూసుకు తిరగడం లేదు. దీంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉండవల్లిని కేసీఆర్‌ చేరదీశారు. రాజకీయాల నుంచి విరమించుకున్నప్పటికీ రెండు తెలుగు రాష్ర్టాలలో మేధావిగా ఆయనకు మంచి పేరే ఉంది. ఈ నేపథ్యంలోనే తన వ్యూహంలో భాగంగా ఉండవల్లికి కేసీఆర్‌ ఆహ్వానం పంపారు. ఆయన ఆశించినట్టుగానే ఉండవల్లి రాజమండ్రి వెళ్లి కేసీఆర్‌ను ప్రశంసించారు.


ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ‘భారత రాష్ట్ర సమితి’ పేరిట జాతీయ పార్టీని ఎందుకు ప్రకటించారో? జాతీయ రాజకీయాలలో బిజీగా ఉండాలని ఎందుకు అనుకుంటున్నారో కేసీఆర్‌కు బాగా తెలుసు. రాజకీయాలలో గండరగండడుగా పేరు పొందిన కేసీఆర్‌తో ఇప్పుడు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ జత కలిశారు. ఈ ఇరువురి కలయిక తర్వాత భారత రాష్ట్ర సమితి పేరిట జాతీయ పార్టీ ఆలోచన తెర మీదకు వచ్చింది. ఈ ఆలోచనను తెర మీదకు తెచ్చే ముందే ప్రశాంత్‌ కిశోర్‌ తెలంగాణవ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ పరిస్థితిపై సర్వే చేయించారు. ఈ సర్వేలో పార్టీ పరిస్థితి ఆశాజనకంగా లేదని తేలింది. మూడవసారి కూడా అధికారంలోకి రావాలంటే పలు విరుగుడు చర్యలు తీసుకోవాలని ప్రశాంత్‌ కిశోర్‌ సూచించారు. ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించడానికి కొత్తగా పెన్షన్లు, రేషన్‌కార్డులు మంజూరు చేయాలని, జిల్లాలలో కేసీఆర్‌ విస్తృతంగా పర్యటించాలని పీకే సూచించారు. ఈ చర్యలతో పాటు ప్రధాని మోదీకి ఎదురు నిలబడి పోరాడుతున్న యోధుడిగా కేసీఆర్‌ ప్రొజెక్ట్‌ కావాల్సిన అవసరం ఉందని పీకే సూచించారు. 2019 ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌ రెడ్డిని ప్రొజెక్ట్‌ చేసిన విధంగానే తెలంగాణలో కేసీఆర్‌ను ప్రొజెక్ట్‌ చేయాలని ప్రశాంత్‌ కిశోర్‌ ప్రతిపాదించారు. గత ఎన్నికలలో చంద్రబాబు బూచిని చూపించి తెలంగాణ సమాజాన్ని తనవైపు మళ్లించుకొని రెండవ పర్యాయం అధికారంలోకి వచ్చినట్టుగానే, వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో నరేంద్ర మోదీని చూపించి అధికారంలోకి రావొచ్చన్న పీకే సలహా మేరకు కేసీఆర్‌ ఆ పార్టీ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్‌ పోరాట పటిమను తెలంగాణ సమాజం గుర్తించని పక్షంలో ఫలితం ఉండదు కనుక ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ వంటి వారిని వాడుకున్నారు. భారతదేశం పేరిట తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా విస్తరించాలని ఒకప్పుడు ఎన్టీ రామారావు కూడా తలపోశారు. అప్పట్లో ఇందిరాగాంధీని ఢీకొంటున్న శూరుడిగా ఎన్టీఆర్‌కు గుర్తింపు ఉండేది. ఇప్పుడు కేసీఆర్‌ కూడా అదే బాటలో పయనించబోతున్నారు. అయితే భారత రాష్ట్ర సమితి భవిష్యత్తు ఏమిటి? అన్న విషయంలో కేసీఆర్‌కు స్పష్టత ఉంది.


ప్రధాని మోదీని ఒంటి చేత్తో ఓడించగల సత్తా తనకు లేదని కూడా కేసీఆర్‌కు తెలుసు. తెలంగాణలో మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యం కనుక జాతీయ పార్టీ పేరిట హడావుడి చేయాలని నిర్ణయించుకున్నారు. నరేంద్ర మోదీ పాలనలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, అందుకే జరగాల్సినంత అభివృద్ధి జరగలేదని తెలంగాణ ప్రజలను నమ్మించాలన్నదే కేసీఆర్‌-–పీకేల వ్యూహం. భారతీయ జనతాపార్టీపై కేసీఆర్‌ చేస్తున్న పోరాటం ఉత్తుత్తిదే అన్న అభిప్రాయం తెలంగాణ మేధావుల్లో ఉంది. నిజానికి ఇందులో వాస్తవం లేదు. ప్రధాని మోదీకీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌కూ మధ్య దూరం పెరగడమే కాకుండా శత్రుభావం కూడా ఏర్పడిందన్నది నిజం. తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ అగ్ర నాయకత్వం ఆ దిశగా అన్ని చర్యలూ తీసుకుంటోంది. కేసీఆర్‌కు సినిమా చూపించాలన్న నిర్ణయానికి ప్రధాని మోదీ వచ్చారు. కేసీఆర్‌ కుటుంబ పెత్తనం ఎక్కువైందన్న అభిప్రాయం తెలంగాణ ప్రజల్లో బలంగా ఉంది. హైదరాబాద్‌ నగరానికి చెందిన పార్టీ కార్పొరేటర్లతో ప్రధాని మోదీ ఇటీవల ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న కార్పొరేటర్లలో కొందరు కేసీఆర్‌ అవినీతిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించగా ప్రధాని మోదీ విభేదించారు. ‘తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ కుటుంబ పెత్తనాన్ని వ్యతిరేకిస్తున్నారు, ఈ విషయమై నా వద్ద స్పష్టమైన సమాచారం ఉంది. ఈ అంశమే మన ఎజెండాగా ఉండాలి’ అని మోదీ దిశానిర్దేశం చేశారు. అవినీతికి సంబంధించిన విషయాలను తమకు వదిలేయాలని కూడా ప్రధాని వారికి సూచించారు. కేంద్ర ప్రభుత్వం తనను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నదని గుర్తించిన కేసీఆర్‌, ఎన్నికల వ్యూహకర్త పీకేను పిలిపించుకొని జాతీయ రాజకీయ పార్టీ అనే ఎజెండాకు రూపకల్పన చేశారు. తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడుతున్న యోధుడిగా కేసీఆర్‌ను తెలంగాణ సమాజం గుర్తించేలా చేసే బాధ్యతను పీకే తీసుకోబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం దూకుడు పెంచి కేసీఆర్‌కు వ్యతిరేకంగా చర్యలకు ఉపక్రమిస్తే దాన్ని తమకు అనుకూలంగా మలచుకోవాలని ఈ ఇరువురూ నిర్ణయించుకున్నారని తెలిసింది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని కూడా నిర్ణయించుకున్నారు. తెలంగాణలో మళ్లీ అధికారంలోకి రావడమే ప్రధాన లక్ష్యం కనుక ప్రతిపక్షాల తరఫున రాష్ట్రపతి పదవికి ఉమ్మడి అభ్యర్థిని పోటీ పెట్టడం కోసం పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన సమావేశానికి కేసీఆర్‌ వెళ్లలేదు.


ఉమ్మడి అభ్యర్థిగా శరద్‌ పవార్‌ను నిర్ణయించుకున్నామని సమావేశానికి ముందు మమతా బెనర్జీ ఫోన్‌ చేసి చెప్పగా, నిర్ణయం తీసుకున్నాక ఫోన్‌ చేయడం ఎందుకు? అని కేసీఆర్‌ ప్రశ్నించారట! ఈ సాకుతో సదరు సమావేశానికి ఆయన డుమ్మా కొట్టారు. అంతేకాదు, ఇతర ప్రతిపక్షాలతో కూడా కేసీఆర్‌ ఇకపై రాసుకుపూసుకు తిరగకపోవచ్చు. జాతీయ రాజకీయాల పేరిట హడావుడి చేస్తూనే బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే ప్రముఖులను పిలిపించుకొని, వారితో సమావేశాలు జరిపి చివరగా తన గురించి నాలుగు మంచి మాటలు చెప్పించడమే ఇకపై కేసీఆర్‌ అనుసరించబోయే వ్యూహమని చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మళ్లించడమే ధ్యేయంగా కేసీఆర్‌ ముందుకు సాగుతారు. సబ్జెక్ట్‌ ఏదైనా దాని మీద పూర్తి అవగాహన కలిగి ఉండటమే కేసీఆర్‌ ప్రత్యేకత. ఈ కారణంగానే నీటి వనరులు వంటి అంశాలపై ఆయన అనర్గళంగా ప్రసంగించగలరు. సంబంధిత రంగాల నిపుణుల వద్ద మాత్రమే ఉండే సమగ్ర సమాచారం రాజకీయ నాయకుడైన కేసీఆర్‌ వద్ద ఉంటుంది. అందుకే ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ వంటి వారు కూడా కేసీఆర్‌తో సమావేశం తర్వాత ఫిదా అయిపోయారు. కేసీఆర్‌ వ్యూహం ఏమిటో బీజేపీ అగ్ర నాయకత్వానికి కూడా అవగతం అయింది. అందుకే సొంత రాష్ట్రంలోనే కేసీఆర్‌ విఫలమయ్యారని రుజువు చేసే పనిలో బీజేపీ ఉంది. ఇందులో భాగంగా ఎడాపెడా అప్పులు చేసే అవకాశం లేకుండా కట్టడి చేస్తున్నారు. కార్పొరేషన్‌ పేరిట రుణాలు తీసుకోవడంపై ఆంక్షలు విధించారు. ఆర్థిక పరిమితులను తట్టుకొని కేసీఆర్‌ నిలబడగలరా? నిలబడి ప్రకటించిన పథకాలన్నీ సజావుగా అమలుచేయగలరా? అన్నది వేచి చూడాలి. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో విజయం సాధించాలనే ప్రధాన లక్ష్యంతోనే కేసీఆర్‌ జాతీయ పార్టీని తెర మీదకు తెచ్చారని స్పష్టమవుతున్నందున తెలంగాణ సమాజం ఎలా స్పందిస్తుందో చూడాలి. తెలంగాణ ప్రైడ్‌ను తెర మీదకు తేవడం ద్వారా వచ్చే ఎన్నికల్లో గెలవాలన్నది కేసీఆర్‌ వ్యూహం. అంతకు మించి ఆయన చెబుతున్న జాతీయ పార్టీ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. ప్రశాంత్‌ కిశోర్‌తో సమావేశానికి ముందు వివిధ పార్టీల నాయకులను కలసి ప్రత్యామ్నాయ ఫ్రంట్‌ గురించి చెప్పుకొచ్చిన కేసీఆర్‌, హఠాత్తుగా మాట మార్చడానికి పీకే సలహాయే కారణమని అంటున్నారు.


మోదీపై మచ్చ!

ఇదిలావుంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్ఠ మసకబారుతోందా? అన్న అనుమానాలు ఇటీవలికాలంలో ముసురుకుంటున్నాయి. ఇప్పటివరకు నరేంద్ర మోదీ నిప్పులాంటి వాడని బీజేపీ నాయకులు, కార్యకర్తలు గర్వంగా చెప్పుకొనేవారు. ఇప్పుడు గౌతం అదానీ రూపంలో ప్రధాని మోదీపై మచ్చ పడింది. శ్రీలంకలో 5000 కోట్ల రూపాయల విద్యుత్‌ ప్రాజెక్టును అదానీకే కట్టబెట్టాలని ప్రధాని మోదీ తమ దేశాధ్యక్షుడిపై ఒత్తిడి తెచ్చారని శ్రీలంకకు చెందిన అధికారి చేసిన ఆరోపణ సంచలనం రేకెత్తించింది. ఇది నిజమైతే ప్రధాని చర్య దేశానికే అప్రతిష్ఠ. విదేశాల్లో కాంట్రాక్టులను తమవారికి ఇప్పించడానికి ప్రయత్నించినట్టు మన దేశ ప్రధానుల్లో ఇంతవరకు ఒక్కరిపై కూడా ఆరోపణలు రాలేదు. ఇప్పుడు మొదటిసారిగా నరేంద్ర మోదీపై ఆరోపణ వచ్చింది. దీనిపై మోదీనే సమాధానం చెప్పాలి. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక ఈ ఎనిమిదేళ్లలో గౌతం అదానీ వ్యాపార సామ్రాజ్యం మర్రిచెట్టులా విస్తరించింది. అంతులేని సంపద ఇప్పుడు ఆయన సొంతం. పోర్టులు, ఎయిర్‌పోర్టులు, బొగ్గు గనులు, విద్యుత్‌ కేంద్రాలలో అదానీ గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ అండదండలతోనే ఇది సాధ్యమైందన్న విమర్శలు ఉన్నాయి. ఒక వ్యాపారవేత్త కోసం ప్రధానమంత్రి పట్టుపట్టడం నిజమైతే మాత్రం అది మనందరికీ తలవంపు. మామూలుగా అయితే ఇటువంటి ఆరోపణలు రుజువైతే ప్రధాని పదవికి రాజీనామా చేయవలసి వస్తుంది. 


ఇక ఆర్మీకి సంబంధించిన ‘అగ్నిపథ్‌’ పేరిట ప్రభుత్వం ప్రకటించిన నియామక ప్రక్రియ కూడా విమర్శలకే కాకుండా దేశవ్యాప్త ఆందోళనలకు కారణమైంది. ఉత్తరాదినే కాకుండా హైదరాబాద్‌లో కూడా యువత ఆందోళనకు దిగింది. శుక్రవారం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్లో విధ్వంసం జరగడం, పోలీసు కాల్పుల్లో ఒక యువకుడు మరణించడం చూశాం. అగ్నిపథ్‌ పేరుతో నాలుగేళ్ల కాల పరిమితితో రక్షణ బాధ్యతలు చేపట్టడానికి యువకులను ఎంపిక చేయాలన్న నిర్ణయమే అపసవ్యంగా ఉంది. కరోనా కారణంగా రెండేళ్లుగా ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కూడా నిలిచిపోయింది. దాంతో తీవ్ర నిరాశలో ఉన్న యువత ఈ నిర్ణయంతో మండిపడింది. ఫలితంగా విధ్వంసాలకు పూనుకుంటున్నారు. దేశంలో నిరుద్యోగం యువతను కుంగదీస్తోంది. దాని పర్యవసానమే ఆందోళనలు. అగ్నిపథ్‌ పథకం కూడా ప్రధాని మోదీకి అప్రతిష్ఠను తెచ్చిపెట్టిందని చెప్పవచ్చు. ఇప్పటివరకు మోదీకి దేశంలో ఎదురులేకుండా ఉండింది. ఇప్పుడు ఆయన నాయకత్వం ముందు కొత్త కొత్త సవాళ్లు వస్తున్నాయి. ఈ సవాళ్లను ఆయన ఎలా అధిగమిస్తారో వేచి చూద్దాం. అగ్నివీర్‌ల నియామకం మెరుగైన విధానమే అయితే, అది ఎలాగో యువతకు వివరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. హడావుడిగా ప్రకటన చేయడంవల్లనే ప్రస్తుత ఆందోళనలు. కేంద్రం చేపట్టిన దిద్దుబాటు చర్యలు పరిస్థితులను అదుపులోకి తెస్తాయో లేదో వేచి చూడాలి!

ఆర్కే

యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Updated Date - 2022-06-19T05:54:52+05:30 IST