పెద్ద సార్ల సుద్దులు!

ABN , First Publish Date - 2022-08-21T06:05:57+05:30 IST

స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా పంద్రాగస్టు రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి నోళ్ల నుంచి వెలువడిన సుభాషితాలు...

పెద్ద సార్ల సుద్దులు!

స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా పంద్రాగస్టు రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి నోళ్ల నుంచి వెలువడిన సుభాషితాలు ప్రముఖ ప్రవచనకారులైన గరికపాటి నరసింహారావు, చాగంటి వారు చెప్పే ప్రవచనాలను మరిపించే విధంగా ఉన్నాయి. ముందుగా ప్రధాని మోదీ చెప్పింది ఏమిటో చూద్దాం. అవినీతిపరులను ప్రజలు చీదరించుకోవాలన్నారు. ఈ మాట వినసొంపుగానే ఉంది. అయితే దేశంలో ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? ఎవరు అవినీతిపరులో, ఎవరు నీతిపరులో తేల్చుకొనే స్థితిలో ప్రజలు ఉన్నారా? అధికారం కోసం ప్రజలను కూడా మానసికంగా అవినీతిమయం చేశాం కదా! రాజకీయ అవసరాల కోసం అవినీతిపరులను కూడా చేరదీసి  రక్షణ కల్పించడాన్ని ఏమనాలి? ప్రధాని మోదీ వ్యక్తిగతంగా అవినీతిపరుడు కాదు. అయితే అవసరాల కోసం అవినీతిపరులను కూడా ఆయన ఆదరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి విషయంలో ప్రధానమంత్రి ప్రదర్శిస్తున్న ఔదార్యం ఇందుకు నిదర్శనం. రాజకీయంగా తమ అడుగులకు మడుగులొత్తని ప్రతిపక్ష నేతలను సీబీఐ, ఈడీ కేసులతో వేధిస్తున్న కేంద్ర పెద్దలు, ఇదివరకే అవినీతి కేసులలో పీకల్లోతు కూరుకుపోయిన జగన్మోహన్‌ రెడ్డిని మాత్రం ఏమీ అనరు! జగన్‌పై కేసులు నమోదై పుష్కర కాలం అవుతున్నా విచారణలో పురోగతి లేకుండా అడ్డుకుంటున్న ప్రచ్ఛన్న హస్తం ఎవరిది? వైఎస్‌ వివేకానందరెడ్డిని హత్య చేయించింది ఎవరో తెలిసినప్పటికీ వారిని సీబీఐ అధికారులు అరెస్టు చేయకపోవడానికి కారణం ఏమిటి? రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయినప్పటికీ అడిగిందే తడవుగా పరిమితికి మించి అప్పులు ఇస్తున్న వారిని ఏమనాలి? రాజకీయంగా విభేదించే వారిని ఏక్‌నాథ్‌ షిండేల రూపంలో దెబ్బకొట్టేవారిని ఎలా అర్థం చేసుకోవాలి? స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో రాష్ట్రపతి, ప్రధానమంత్రుల ప్రసంగాలను ప్రజలు రేడియోలలో శ్రద్ధగా ఆలకించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? ఇందుకు కారణం ఆ పదవులలో ఉన్నవారిలో చిత్తశుద్ధి కొరవడడమే. అత్యున్నత పదవులలో ఉన్నవారి మాటలకు, చేతలకు పొంతన ఉండకపోవడం వల్ల వారు చెప్పే మాటలను ప్రజలు విశ్వసించడం లేదు. అవినీతిపరులను ప్రజలు చీదరించుకోవాలని చెప్పడం వరకు బాగానే ఉంది కానీ, ‘పురుషులందు పుణ్య పురుషులు వేరయా’ అన్నట్టుగా అవినీతిపరులైన రాజకీయ నాయకులలో కొందరు మాత్రం దర్జాగా అధికారం వెలగబెట్టడానికి కారణం ఎవరు? రాజకీయ అవసరాల కోసం జగన్మోహన్‌ రెడ్డి వంటి వారిని ఆదరించి అక్కున చేర్చుకుంటున్న ప్రధాని మోదీకి ఈ సుద్దులు చెప్పే అర్హత ఉందా? కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే నాయకులు మాత్రమే అవినీతి కేసులలో చిక్కుకోవడం, ఇదివరకే కేసులలో ఉన్నవారికి ఉపశమనం లభించడాన్ని ఏమనాలి? రాజ్యసభలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతు అవసరం కనుక కేసులు ఉన్నప్పటికీ జగన్మోహన్‌ రెడ్డి నిశ్చింతగా ఉండగలుగుతున్నారు. అడిగినా అడగకపోయినా మద్దతు ఇవ్వడానికి జగన్మోహన్‌ రెడ్డి సదా సిద్ధంగా ఉంటారు కనుక ఆయన ప్రధాని దత్తపుత్రుడు అయిపోయారు. ఇప్పటిదాకా ఎలాంటి కేసులలోనూ చిక్కుకోని వారు కూడా నరేంద్ర మోదీ అధికారం ముందు మోకరిల్లుతున్నప్పుడు జగన్‌ వంటి వారి పరిస్థితి వేరే చెప్పాలా? ముఖ్యమంత్రి జగన్‌కు ప్రధాని మోదీ అండదండలు పుష్కలంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్‌లో ఎవరిని అడిగినా చెబుతారు. స్వయంగా అవినీతికి పాల్పడకపోయినంత మాత్రాన, అవినీతిపరులని తెలిసి కూడా చేరదీసి పక్కన కూర్చోబెట్టుకోవడాన్ని నరేంద్ర మోదీ ఎలా సమర్థించుకుంటారు? జగన్మోహన్‌ రెడ్డి అవినీతికి పాల్పడలేదని ప్రధాని మోదీ నమ్ముతున్నారా? అలా భావిస్తే ఆ మాట చెప్పాలి. ప్రజలకు స్పష్టత ఉంటుంది. జగన్‌ను సమర్థించే వారు, వ్యతిరేకించే వారు కూడా ఆయన అవినీతికి పాల్పడ్డారనే భావిస్తున్నారు.


అయినా ఆయన అధికారంలోకి రాగలిగారంటే ‘రాజకీయాల్లో ఉన్నవాళ్లు ఎవరు మాత్రం అవినీతికి పాల్పడటం లేదు?’ అన్న నిర్లిప్త ధోరణి ప్రజల్లో వ్యాపించడమే కారణం. నరేంద్ర మోదీ వంటి వారు కూడా అవినీతి ఆరోపణలు ఉన్నవారిని ఆదరించడం వల్ల ప్రజల్లో ఉదాసీనత ఏర్పడకుండా ఉండదు కదా! అలాంటప్పుడు అవినీతిపరులను చీదరించుకోవాలని చెప్పిన మాటలను ప్రజలు పట్టించుకుంటారా? మన దేశంలో రాజకీయాలు డబ్బు మయం అయిపోయాయి. ఎన్నికల్లో గెలవడం కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు చేయడానికి వెనుకాడటం లేదు. సొంత ఆస్తులు అమ్మి ఖర్చు చేయడంలేదుగా! అధికారంలోకి వచ్చిన వారు కమీషన్ల రూపంలో దండుకొని మళ్లీ మళ్లీ అధికారంలోకి రావడం కోసం ఖర్చు చేస్తున్నారు. అదే సమయంలో ప్రజల సొమ్ముతో జనాకర్షక పథకాలు ప్రకటిస్తున్నారు. మద్యం వ్యాపారాలకు లైసెన్సులు మంజూరు చేసే విషయమై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా లంచాలు తీసుకొని ఆ డబ్బును పంజాబ్‌ ఎన్నికల్లో తమ పార్టీ కోసం ఖర్చు చేశారని సీబీఐ తాజాగా ఆరోపిస్తోంది. అదే నిజమైతే ఇటువంటి వసూళ్లు చేయని పార్టీ భారతదేశంలో ఒక్కటైనా ఉందా? కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవారు 30–40 శాతం కమీషన్‌  డిమాండ్‌ చేస్తున్నారని ఆ మధ్య ఒక కాంట్రాక్టర్‌ ఆత్మహత్యాయత్నం చేశారు. కర్ణాటకలో పర్సెంటేజీల వ్యవహారం తారస్థాయికి చేరిందన్న విషయం బహిరంగ రహస్యమే. అయినా ఆ రాష్ట్రంలో మంత్రులపై సీబీఐ, ఈడీ అధికారుల దాడులు జరగనే జరగవు. అస్మదీయులు, తస్మదీయుల విషయంలో ఇంతటి వ్యత్యాసం చూపుతున్నప్పుడు ప్రధాని మోదీ చెబుతున్న సుభాషితాలకు విలువ ఏమి ఉంటుంది? ప్రధానమంత్రితో తమ సంబంధాలు భేషుగ్గా ఉన్నాయని జగన్‌ అండ్‌ కో మురిసిపోవడానికి కారణం ఏమిటి? తెలంగాణలో తెచ్చిపెట్టుకున్న మునుగోడు ఉప ఎన్నిక కోసం సొంత పార్టీ నేతలకే ప్రధాన పార్టీలు లంచాలు ఎరచూపడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మరో 14 మాసాలలో తెలంగాణలో సాధారణ ఎన్నికలు జరుగుతాయి. ఈలోపు తీసుకువచ్చిన మునుగోడు ఉప ఎన్నికలో ఎవరు గెలిస్తే ఏమిటట? ఉప ఎన్నిక కోసం సొంత పార్టీ నేతలనే అవినీతిపరులను చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ‘తిలా పాపం తలా పిడికెడు’ అన్నట్టుగా రాజకీయ వ్యవస్థ ఇంతలా భ్రష్టుపట్టడంలో అన్ని పార్టీల పాత్రా ఉంది. కమీషన్లు తీసుకోవడంలో కొందరు ఎక్కువ, కొందరు తక్కువ కావచ్చు.


కొంత మంది తీసుకున్న కమీషన్లను పార్టీ అవసరాలకే ఖర్చు చేశారు. మరికొందరు సొంత ఆస్తులను పెంచుకుంటున్నారు. దేశాన్ని కొన్ని దశాబ్దాలపాటు పాలించిన కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు నిధుల కొరతతో సతమతం అవుతోంది. ఆ పార్టీలో నాయకులు మాత్రం ఆర్థికంగా బలపడిపోయారు. భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఇందుకు కొంత భిన్నంగా ఉంటోంది. పార్టీ వద్ద నిధులు మూలుగుతున్నాయి. బీజేపీకి విరాళాలు ఇస్తున్నవారు అందరూ ఆ పార్టీ సిద్ధాంతాలను విశ్వసించి ఇచ్చిన వారు కాదే! కేంద్రంలో అధికారంలో ఉండి ఉండకపోతే ఆ పార్టీకి అంత పెద్ద ఎత్తున విరాళాలు అందేవా? అందరూ ఆ తాను ముక్కలే అయినందున నాయకుల మాటలపై ప్రజలకు విశ్వాసం పోతోంది. ప్రధానమంత్రి చెప్పిన మాటలను కూడా ఈ కోణంలోనే చూడాలి. మాటలకూ చేతలకూ పొంతన లేనప్పుడు వ్యవస్థలు, వ్యక్తులు విశ్వసనీయతను కోల్పోతారు. తాను ఈ తానులో ముక్కను కాదని రుజువు చేసుకోవాలంటే అవినీతి ఆరోపణలు ఉన్నవారిని ప్రధానమంత్రి దూరం పెట్టాలి.


కేసీఆర్‌ స్వయంకృతం!

ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ విషయానికి వద్దాం. ‘‘దేశంలో ఈ విద్వేష రాజకీయాలు ఏమిటండీ నాకు తెలియక అడుగుతా? దేశంలో ఏక పార్టీ వ్యవస్థ కోసం రాష్ర్టాలలో ఏక్‌నాథ్‌ షిండేలను సృష్టిస్తారా?’’ అని కేసీఆర్‌ కించిత్‌ ఆవేదనగా ప్రశ్నిస్తున్నారు. తనదాకా వస్తేగానీ తెలియదంటారు. బీజేపీపై యుద్ధం ప్రకటించినందున ఇప్పుడు ఆయనకు వేడి తెలుస్తోంది. అయితే 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిందేమిటి? విద్వేష రాజకీయాల గురించి కేసీఆర్‌ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అధికార పీఠం ఎక్కిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారిని పక్కన పెట్టింది ఎవరు? జీ హుజూర్‌ అనడానికి ఇష్టపడని ప్రొఫెసర్‌ కోదండరాం వంటి వారిని శత్రువులుగా ప్రకటించుకున్నది కేసీఆర్‌ కాదా? అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు అవుతున్నప్పటికీ ప్రతిపక్ష నాయకులను కలుసుకోవడానికి కూడా ఇష్టపడనిది ఎవరు? తెలంగాణ కోసం కొట్లాడిన వారిలో అత్యధికులు స్వరాష్ట్రంలో అనాథలయ్యారే? ప్రశ్నించే అవకాశం ఉన్న గొంతులను గడీలో కట్టిపడేసింది కేసీఆర్‌ కాదా? తన ప్రభుత్వానికి భజన చేయడానికి ఇష్టపడని మీడియా సంస్థలతో పాటు ఇతర ప్రముఖులపై విషం కక్కుతున్నది ఆయన కాదా? అవసరం లేదనుకున్న వారిని ఆమడ దూరంలో పెడుతూ వంధిమాగధులను కొలువులో నింపుకొన్నది కేసీఆర్‌ కాదా? ఏకపార్టీ వ్యవస్థ విషయమై బీజేపీని నిందిస్తున్న కేసీఆర్‌, తెలంగాణలో కూడా ఏకపార్టీ వ్యవస్థ కోసం ప్రయత్నించారు కదా? 2014లో అధికారంలోకి రాగానే తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీలను కబళించారు కదా? 2018లో మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేయాలన్న దుష్ట తలంపుతోనే కదా కాంగ్రెస్‌ పార్టీని చీలికలుపేలికలు చేసి బలహీనపరచింది? రాష్ట్రంలో మరే రాజకీయ పక్షం బతికి బట్టకూడదన్న లక్ష్యంతో ప్రధాన ప్రతిపక్షాన్ని దెబ్బతీయలేదా? ఒకప్పుడు టీఆర్‌ఎస్‌లో చీలిక తేవడానికి ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్‌ రాజశేఖర రెడ్డి ప్రయత్నించినప్పుడు సదరు చర్య ఎంత అనైతికమో చెప్పి బావురుమనలేదా? ఒక పార్టీ తరఫున గెలిచిన వారిని మరో పార్టీలో ఎలా చేర్చుకుంటారు? అని నిలదీయలేదా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నొప్పి కలిగిందని బాధపడిన కేసీఆర్‌ అధికారంలోకి రాగానే మారిపోయారు. తన నిజ స్వరూపాన్ని ప్రదర్శించడం మొదలెట్టారు.


అడ్డొస్తారనుకున్న వారిని వేధించారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేయాలనుకున్నారు. ఈ దుర్బుద్ధి కారణంగా పెద్దపులి వంటి భారతీయ జనతా పార్టీ నోటికి చిక్కే పరిస్థితిని కేసీఆర్‌ తెచ్చుకున్నారు. ‘పొట్టోడిని పొడుగోడు కొడితే, పొడుగోడిని పోచమ్మ కొట్టినట్టు’గా కేసీఆర్‌ పరిస్థితి తయారైంది. అందుకే విద్వేష రాజకీయాల గురించి కేసీఆర్‌ గొంతు చించుకుంటున్నప్పటికీ సానుభూతి లభించడం లేదు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే అందుకు కేసీఆర్‌ మాత్రమే కారణం అవుతారు. స్వపక్షంలో కూడా తనను ప్రశ్నించే వారు ఉండకూడదన్న ఉద్దేశంతోనే కదా ఈటల రాజేందర్‌ను పార్టీ నుంచి తరిమేసింది? దీంతో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరి హుజూరాబాద్‌ నుంచి గెలిచి ఇప్పుడు సవాల్‌గా మారారు. మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేసిన వెంటనే ఈటల రాజేందర్‌ అసైన్డ్‌ భూములు ఆక్రమించుకున్నారంటూ అధికారులను పంపి హడావుడి చేయడానికీ, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పెద్దలు సీబీఐ, ఈడీలతో ఇబ్బందులు పెట్టడానికీ తేడా ఉందా? మంత్రిగా ఉన్నంతకాలం రాజేందర్‌ భూముల వ్యవహారం కేసీఆర్‌కు ఎందుకు గుర్తుకు రాలేదు? తన ప్రభుత్వాన్ని ఎదిరించిన వారిపైకి పోలీసులను, ఇతర శాఖల అధికారులనూ కేసీఆర్‌ ఉసిగొల్పలేదా? అందుకే ఇప్పుడు తెలంగాణలో ఈడీ దాడులు జరిపినా ప్రజలు పట్టించుకోరు. మనం ఉంటున్నది ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్న విషయం విస్మరించి రాచరిక పోకడలు పోతున్న కేసీఆర్‌కు విద్వేష రాజకీయాల గురించి మాట్లాడే అర్హత ఉందా? దుబ్బాక నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున గెలిచిన రఘునందనరావు కూడా ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితికి చెందినవారే కదా? అరువు తెచ్చుకున్న నాయకులను నమ్ముకొని సొంత పార్టీ నాయకులను తరిమేసుకోవడం వల్లనే కదా? కేసీఆర్‌కు ప్రస్తుత పరిస్థితి! ఒకప్పుడు హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైన బీజేపీ, ఇప్పుడు దాదాపు అన్ని జిల్లాలకు విస్తరించడానికి కారణం ఎవరు? ఒకప్పుడు నక్సలైట్ల ప్రాబల్యం బలంగా ఉండిన ఉత్తర తెలంగాణలో బీజేపీ ఇంతగా బలపడటానికి కారణం ఏమిటో కేసీఆర్‌ అన్వేషించారా? తెలంగాణ సమాజంలో సహజసిద్ధంగా ఉన్న చైతన్యాన్ని చంపింది ఎవరు? ఒకప్పుడు కమ్యూనిస్టులకు కోటగా ఉన్న మునుగోడులో బీజేపీ సవాలుగా మారడానికి కేసీఆర్‌ కారకుడు కారా? సమయం సందర్భం లేకుండా కేంద్ర పెద్దలను కవ్వించడం ద్వారా కేసీఆర్‌ కోరి కష్టాలు తెచ్చుకున్నారు. ఇప్పుడు భారత రాష్ట్ర సమితి పేరిట త్వరలో జాతీయ పార్టీని ప్రారంభించి దేశమంతటా పర్యటించాలని కేసీఆర్‌ నిర్ణయించుకున్నారు. దేశవ్యాప్తంగా రైతులు అందరికీ ఉచిత విద్యుత్‌, ఉచిత మంచినీరు వంటి వాగ్దానాలతో జాతీయ నేతగా ఎదగాలని ఆయన కలలు కంటున్నారు. ఇంతలో మునుగోడు ఉప ఎన్నిక వచ్చిపడుతోంది. దీంతో అక్కడ సొంత పార్టీ నాయకులను కాపాడుకోవాల్సిన స్థితిలో కేసీఆర్‌ చిక్కుకున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ కూడా వెలువడకముందే మునుగోడులో భారీ బహిరంగ సభ నిర్వహించడం దేనికి సంకేతం? గతంలో ఉప ఎన్నికల గురించి ఏమాత్రం పట్టించుకోని కేసీఆర్‌, ఇప్పుడు స్వయంగా రంగంలోకి దిగవలసి రావడం స్వయంకృతం కాదా? ఇప్పటిదాకా కమ్యూ నిస్టులకు అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వని కేసీఆర్‌ ఇప్పుడు మునుగోడు కోసం వారిని దువ్వడం లేదా? కేసీఆర్‌ బలహీనపడ్డారని అనడానికి ఇది నిదర్శనం కాదా? పశ్చిమ బెంగాల్లో వామపక్షాలతో పాటు కాంగ్రెస్‌ పార్టీని దెబ్బతీసిన మమతా బెనర్జీ, ఇప్పుడు బీజేపీ నుంచి పోటీ ఎదుర్కోవలసి రావడం లేదా? తెలంగాణలో కూడా ఇదే పరిస్థితిని కేసీఆర్‌ కొనితెచ్చుకున్నారు. మునుగోడులో కాంగ్రెస్‌ పార్టీని ఒకవైపు నుంచి బీజేపీ, మరోవైపు నుంచి టీఆర్‌ఎస్‌ పీక్కుతింటున్నాయి. కాంగ్రెస్‌ బలహీనపడేకొద్దీ దక్షిణ తెలంగాణలో కూడా బీజేపీ ప్రాభవం పెరుగుతుంది.


విద్వేష రాజకీయాల గురించి ఇప్పుడు మాట్లాడుతున్న కేసీఆర్‌, తాను కూడా విద్వేష రాజకీయాలకు పాల్పడిన విషయాన్ని విస్మరిస్తే ఎలా? చిల్లర మాటలు, చీలికల రాజకీయాలు సరికావు అని ఇప్పుడు సుద్దులు చెబుతున్న కేసీఆర్‌ ఇప్పటిదాకా చేసిందేమిటి? ఎంతటివారైనా కర్మఫలాన్ని అనుభవించాల్సిందే! తెలంగాణలో తనకు తిరుగు ఉండకూడదని భావించి ప్రధాన ప్రతిపక్షాలను మింగేసి, ప్రజా సంఘాలను విచ్ఛిన్నం చేసి, బీజేపీ ఎదుగుదలకు రాచమార్గం వేసిన కేసీఆర్‌ ఫలితాన్ని అనుభవిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తప్పు పడుతున్న కేసీఆర్‌ ఆత్మపరిశీలన చేసుకోవడం అవసరం.


ప్రజలు ఏమైపోతేనేం?

ఇక ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి విషయానికి వద్దాం. కేవలం మూడేళ్లలోనే ప్రజలందరినీ మురిపించానని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారు క్యూ కడుతున్నారని కూడా ప్రచారం చేసుకున్నారు. ఇందులో ఇసుమంతైనా నిజముందా? పేదల బతుకులు మార్చే పథకాలను పప్పుబెల్లాలతో పోల్చడం ఏమిటని అంటున్నారు. బటన్‌ నొక్కడం ద్వారా డబ్బు పంచుతున్న జగన్‌ ఈ మూడేళ్లలో ప్రజల తలసరి ఆదాయం పెరిగిందని చెప్పగలరా? ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయా? అప్పులు చేస్తూ డబ్బు పంచుతూ ఎంతకాలం ప్రజలను మురిపిస్తారు? ఈ మూడేళ్లలో ప్రభుత్వ ఆస్తులు పెరిగాయా? కొత్తగా ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా? రాష్ట్ర ఆదాయం పెరిగిందా? గత ప్రభుత్వంలో పురుడు పోసుకున్న వాటికి రిబ్బన్లు కత్తిరించడం మినహా మూడేళ్లలో ఒక్క పరిశ్రమ అయినా తీసుకురాగలిగారా? ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తనకు మెరుగైన సంబంధాలు ఉన్నాయని మురుసుకోవడం తప్పితే రాష్ట్రం కోసం సదరు సత్సంబంధాలను వాడుకొనే ప్రయత్నం చేశారా? పెళ్లిలో అరుంధతి నక్షత్రం కనబడటం ఎంత నిజమో, జగన్‌ పాలనలో అభివృద్ధి కూడా అంతే నిజం. గతంలో రాష్ర్టానికి కేంద్రం మంజూరు చేసిన ప్రిజన్‌ అనే సంస్థను కూడా తమిళనాడు తన్నుకుపోతే గుడ్లప్పగించి చూడటం మినహా కేంద్ర పెద్దలతో ఉన్న సంబంధాలను వాడుకొని అడ్డుకోలేదెందుకు? రాష్ట్రం మేలు కోసం ఆలోచనలు చేయవలసిన పాలకుడు, నిస్సిగ్గుగా బట్టలూడదీసుకుని వీడియో తీసుకున్న ఎంపీని కాపాడుకోవడం కోసం మాత్రమే ఆలోచించడాన్ని మించిన దౌర్భాగ్యం ఉంటుందా? నంద్యాలలో ఒక పోలీసును రౌడీలు వేటాడి చంపితే అందులో ఒక్కరిని కూడా పట్టుకోలేకపోయిన పోలీసు పెద్దలు అంగ ప్రదర్శన చేస్తున్న ఎంపీకి అండగా నిలబడటానికి ఉత్సుకత ప్రదర్శించడం దేనికి సంకేతం? ప్రజల్లో కుల పిచ్చిని, కుల విద్వేషాలను రగిలించడం మాత్రమే జగన్‌ చేస్తున్న కార్యక్రమం. ఈ కుల పిచ్చి ఏ స్థాయికి చేరిందంటే సెక్రటేరియట్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ఏకంగా హైకోర్టు జడ్జీలనే తప్పు పట్టేంతగా. జగన్‌ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని పిలుపునివ్వడం వెంకట్రామిరెడ్డిలో పేరుకుపోయిన కులపిచ్చికి నిదర్శనం కాదా? ఒక ఉద్యోగ సంఘం నాయకుడికి హైకోర్టు న్యాయమూర్తులను తప్పుపట్టే అర్హత ఉందా? అవసరం ఏమిటి? గతంలో ఎప్పుడైనా ఇటువంటి పోకడలను చూశామా? సమాజంలో విచక్షణ లేకుండా చేస్తూ ఉన్మాద పోకడలను ప్రవేశపెట్టిన ఘనత జగన్‌కే చెల్లుతుంది. ఉద్యోగుల సమస్యపై మాట్లాడాల్సిన వాళ్లు రాజకీయ కార్యకర్తల్లా మారిపోయే పరిస్థితి కల్పించింది ఎవరు? తన మూడేళ్ల పాలనను చూసి తానే మురిసిపోతున్న జగన్‌రెడ్డి, ప్రజలందరూ కూడా మురిసిపోతున్నారని భావించడం ఆశ్చర్యంగా ఉంది. కేంద్ర ప్రభుత్వంతో ఏర్పరుచుకుంటున్న దోస్తానా తనపై ఉన్న కేసులకు మాత్రమే వాడుకుంటానని ముఖ్యమంత్రి చెప్పకనే చెబుతున్నారు. అందుకే ప్రధానమంత్రి మోదీ కూడా జగన్‌ పట్ల ప్రత్యేక అభిమానం ప్రదర్శిస్తున్నారని అనుకోవాలి. వారు ఉభయులకూ రాజకీయ ప్రయోజనాలు నెరవేరుతుండవచ్చు కానీ మధ్యలో ప్రజలు ఏమి కావాలి? ఆంధ్రప్రదేశ్‌ ప్రజల పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బాధ్యత లేదా? నాకు నువ్వు ఉపయోగపడు, నిన్ను నేను బాగా చూసుకుంటాను అని మోదీ, జగన్‌ అనుకుంటే సరిపోతుందా? వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి శుక్రవారం తిరుపతిలో చేసిన వ్యాఖ్యల్లో అర్థం ఉంది. పతనం అయినవాడు అధికార అందలం ఎక్కితే ఇలాగే ఉంటుందని ఆయన అన్న మాటలు జగన్‌రెడ్డికి మాత్రమే వర్తిస్తాయి. ఏ అర్హత ఉందని జగన్మోహన్‌ రెడ్డిని అందలం ఎక్కించామో ప్రజలు ఇప్పటికైనా ఆలోచిస్తారని ఆశిద్దాం. నిజానికి భూమన కరుణాకర్‌ రెడ్డి దివంగత రాజశేఖర రెడ్డి కుటుంబానికి అత్యంత ఆప్తుడు. కాంగ్రెస్‌ను వీడి జగన్‌ బయటకు వచ్చినప్పుడు భూమన ఆయనతో ఉన్నారు. 2019లో జగన్‌ అధికారంలోకి వచ్చేవరకు ఆయనకు కుడిభుజంగా మెలిగారు. బహుశా ఆయనకు ఇప్పుడు తత్వం బోధపడినట్టుంది. అందుకే దూరంగా ఉంటున్నారు. వైసీపీ నాయకులకే కాదు– ప్రజలకు కూడా ఇటువంటి జ్ఞానోదయం త్వరలోనే కలగాలని కోరుకుందాం!

ఆర్కే


యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Updated Date - 2022-08-21T06:05:57+05:30 IST