అరాజకీయం అటు.. ఇటు!

ABN , First Publish Date - 2022-08-28T05:58:05+05:30 IST

తెలుగు రాష్ర్టాల రాజకీయాలు ఆందోళనకరంగా ఉంటున్నాయి. రాజకీయ పార్టీలు సంయమనం కోల్పోతున్నాయి. ఫలితంగా ఉద్రిక్తతలు ఏర్పడుతున్నాయి. పార్టీల మధ్య సిద్ధాంతపరంగా ఉండాల్సిన విభేదాలు వ్యక్తిగత వైషమ్యాలకు...

అరాజకీయం అటు.. ఇటు!

తెలుగు రాష్ర్టాల రాజకీయాలు ఆందోళనకరంగా ఉంటున్నాయి. రాజకీయ పార్టీలు సంయమనం కోల్పోతున్నాయి. ఫలితంగా ఉద్రిక్తతలు ఏర్పడుతున్నాయి. పార్టీల మధ్య సిద్ధాంతపరంగా ఉండాల్సిన విభేదాలు వ్యక్తిగత వైషమ్యాలకు దారితీస్తున్నాయి. కుప్పంలో చంద్రబాబునాయుడు పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న సంఘటనలు, రెండు రోజులుగా హైదరాబాద్‌ పాతబస్తీలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రజలను ఉలిక్కిపడేలా చేశాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో మూడు రోజుల పర్యటనకు వెళ్లినప్పుడు అధికార పక్షమైన వైసీపీకి చెందినవారు అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేయడం రాజకీయాల్లో కొత్త పెడ ధోరణిగా చెప్పవచ్చు. చంద్రబాబుకు కంచుకోటగా ఉంటున్న కుప్పంలోనే రానున్న ఎన్నికల్లో ఆయనను ఓడించాలని ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి నిర్ణయించుకున్నారు. రాజకీయ ప్రత్యర్థులను ఓడించాలనుకోవడంలో తప్పు లేదు. అయితే అందుకు ఎంచుకున్న మార్గం ఆక్షేపణీయంగా ఉంది. ప్రతిపక్ష నాయకుడు సొంత నియోజకవర్గంలో స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేకపోవడం ఏమిటి? పోలీసులు తమ ధర్మాన్ని విస్మరించి అధికార పార్టీ ఏజెంట్లుగా మారిపోవడం విషాదం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా జగన్‌రెడ్డి కొన్ని నెలలు పాదయాత్ర నిర్వహించారు. అప్పుడు అధికారపక్షం ఆయనకు ఇబ్బందులు కల్పించలేదు. పులివెందులలో కూడా తెలుగుదేశం పార్టీ అప్పుడు ఇలా చేయలేదు. రాజకీయ ప్రత్యర్థులను గతంలో గౌరవించేవారు. ఎన్నికల్లో ప్రత్యర్థిని ఓడించి తీరాలన్న కసి ఉండేది కాదు. రాయలసీమలో ఫ్యాక్షన్‌ నాయకులకు ఆయా నియోజకవర్గాల్లో పట్టు ఉండేది. దీంతో గెలుపు కోసం ఫ్యాక్షన్‌ నాయకులు రిగ్గింగ్‌కు పాల్పడేవారు. అయినా అధికార పార్టీకి చెందినవారు పోలీసులను ప్రయోగించేవారు కాదు. 1996లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో కడప నుంచి పోటీ చేసిన వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి రిగ్గింగ్‌కు పాల్పడకుండా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గట్టి ప్రయత్నం చేశారు. దీంతో రాజశేఖర్‌ రెడ్డి స్వల్ప మెజారిటీతో ఆ ఎన్నికల్లో గెలిచారు.


ఇంతకుమించి రాజకీయ ప్రత్యర్థులు వారి నియోజకవర్గాల్లో స్వేచ్ఛగా తిరగకుండా అడ్డుకోవడం ఎన్నడూ జరగలేదు. కుప్పంలో చంద్రబాబును ఓడించడానికి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రయత్నిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు. గత ఎన్నికల్లో చంద్రబాబుకు కుప్పంలో మెజారిటీ గణనీయంగా తగ్గింది. అప్పుడు ప్రజలు స్వచ్ఛందంగానే ఓటు వేశారు. ఇప్పుడు కూడా ప్రజలను తమవైపు ఆకర్షించుకుని చంద్రబాబును ఓడించడానికి ప్రయత్నించాలి గానీ, అధికారం ఉంది కదా అని దౌర్జన్యాలకు పాల్పడటం ఏమిటి? చంద్రబాబు భద్రత కోసం నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌ సంఖ్యను రెట్టింపు చేయడం దేనికి సంకేతం? స్థానిక పోలీసులు ఆయనకు భద్రత కల్పించడంలో చేతులు ఎత్తేయడంతో ఎన్‌ఎస్‌జీ ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిణామం జగన్‌రెడ్డి ప్రభుత్వానికి అప్రతిష్ఠ కాదా? పేదలకు పట్టెడన్నం పెట్టడానికి ఉద్దేశించిన అన్న క్యాంటీన్‌ను ధ్వంసం చేయడం ఏమిటి? చంద్రబాబు పర్యటన రోజే వైసీపీ నాయకులు పోటీ ర్యాలీ నిర్వహించడం ఏమిటి? తమ దుర్మార్గాలకు పోలీసులను కవచంగా వాడుకుంటారా? అధికారం శాశ్వతం కాదు కదా? ఇప్పుడు జగన్‌రెడ్డి ఎంచుకున్న మార్గాన్ని భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేవాళ్లు కూడా ఎంచుకుంటే గౌరవప్రదమైన వ్యక్తులు రాజకీయాల్లో కొనసాగగలరా? రాజకీయాల్లోకి రౌడీయిజం జొప్పిస్తే రౌడీలు, నేరస్తులే పాలకులుగా ఉంటారు. ఏపీలో రౌడీ రాజకీయాలు తీసుకురావాలని ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అనుకుంటున్నారా? పోలీసులు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇటువంటి సంస్కృతిని అనుమతించడం వల్ల భవిష్యత్తులో వారి కుటుంబాలకు కూడా రక్షణ లేకుండా పోదా? కుప్పంలో చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటే రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థయిర్యం దెబ్బతింటుందని జగన్‌ భావిస్తుండవచ్చు. అయితే ఇలాంటి సంఘటనల వల్ల అవతలి వారిలో కసి, పట్టుదల పెరుగుతాయి. కుప్పంలో చోటుచేసుకున్న సంఘటనలను గమనిస్తే వచ్చే ఎన్నికల్లో దౌర్జన్యాలు ఏ విధంగా ఉండబోతున్నాయో అర్థమవుతోంది. ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉద్రిక్తతలు సృష్టిస్తే మధ్య తరగతి, ఆపై వర్గాల ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనరు. అధికార పార్టీ ఇదే కోరుకుంటున్నట్టు కనిపిస్తోంది. వైసీపీ నాయకుల ఆలోచనలు, నైజం ఇప్పుడు బయటపడినందున అందుకు తగ్గట్టుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సిద్ధం కావాలి. కార్యకర్తలకు నాయకులు అడుగడుగునా అండగా నిలబడాలి. పార్టీని ఆ దిశగా సమాయత్తం చేయాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది. ఆయన ఇప్పటిదాకా చేసిన రాజకీయాలు వేరు. ఇప్పటి రాజకీయాలు వేరు. జగన్మోహన్‌రెడ్డి రాజకీయాల్లో ప్రవేశపెట్టిన నూతన ఒరవడికి తగినట్టుగా చంద్రబాబు తన వ్యూహాన్ని మార్చుకోవాలి. సంప్రదాయ రాజకీయాలకు కాలం చెల్లినట్టు కనిపిస్తోంది. ఈ సందర్భంగా పోలీసుల పాత్రపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారిపోతే ఎవరికి మాత్రం రక్షణ ఉంటుంది? తెలుగుదేశం పార్టీ తరఫున సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉన్న వెంగళరావు అనే కార్యకర్తను అరెస్టు చేసి అరికాళ్లపై కొట్టడం మరీ మరీ ఆక్షేపణీయంగా ఉంది. ముఖ్యమంత్రిని విమర్శిస్తే కేసు పెట్టి అరెస్టు చేసి, అరికాళ్లపై కొట్టడానికి తమకు లైసెన్స్‌ ఉన్నట్టుగా వారు ప్రవర్తిస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రిని ఎదిరించిన వైసీపీ ఎంపీ రఘురామరాజును అరెస్ట్‌ చేసి అరికాళ్లపై కొట్టారు. హైకోర్టు విచారణలో కూడా ఇది రుజువైంది. అయినా తప్పు చేసిన అధికారులపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. దీంతో సీఐడీ అధికారులు మరింత రెచ్చిపోతున్నారు. అవినీతి కేసుల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని సీబీఐ అధికారులు గతంలో అరెస్ట్‌ చేసి విచారణ జరిపారు. అప్పుడాయనను ఎవరూ కొట్టలేదే? ఇప్పుడు సీఐడీ అధికారుల బాటలోనే సీబీఐ అధికారులు కూడా నడిచి ఉంటే జగన్‌ పరిస్థితి ఎలా ఉండేది? ప్రతిపక్ష నాయకులు బయటతిరగకూడదు, సోషల్‌ మీడియాలో కార్యకర్తలు ఎవరూ ముఖ్యమంత్రిని విమర్శించకూడదు అని ప్రభుత్వం భావిస్తే ఎలా? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ముఖ్యమంత్రిని విమర్శించకూడదా? హద్దులు మీరితే కేసులు పెట్టవచ్చు. అంతేగానీ కొట్టడం ఏమిటి? ప్రతిపక్ష నాయకుడు సొంత నియోజకవర్గానికి వెళ్లకూడదని ప్రభుత్వం భావిస్తోందా? ఈ ధోరణులను సమాజం పట్ల బాధ్యత ఉన్న ప్రతి ఒక్కరూ ఖండించాలి. లేనిపక్షంలో రౌడీలే రాజ్యమేలుతారు.


సేవ్‌ హైదరాబాద్‌!

తెలంగాణ విషయానికొస్తే మతకలహాల గురించి అందరూ మర్చిపోయారు. ఒకప్పుడు హైదరాబాద్‌ అంటేనే మతకలహాలు గుర్తుకు వచ్చేవి. ఎన్టీఆర్‌, ఆ తర్వాత చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మత ఘర్షణలకు పాల్పడేవారిని ఉక్కుపాదంతో అణచివేశారు. దీంతో మూడున్నర దశాబ్దాలుగా తెలంగాణలో ప్రశాంత వాతావరణం నెలకొంది. హైదరాబాద్‌ అభివృద్ధిలో పరుగులు పెడుతోంది. బహుళజాతి కంపెనీలు హైదరాబాద్‌కు క్యూ కడుతున్నాయి. ఇప్పుడు 40 ఏళ్లు వయసున్నవారెవరికైనా మత కలహాల గురించి తెలియదంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు మళ్లీ ఇంతకాలానికి తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ మధ్య నెలకొన్న రాజకీయ వైరం కారణంగా పాతబస్తీలో మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. దీంతో నగరవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ చేసిన వ్యాఖ్యలు ఈ ఉద్రిక్తతలకు కారణం. మరోవైపు టీఆర్‌ఎస్‌–బీజేపీ కార్యకర్తలు తరచుగా ఘర్షణలకు దిగుతున్నారు. టీ–బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కేసీఆర్‌ ప్రభుత్వం ఆయన పాదయాత్రను అడ్డుకోగా హైకోర్టు అనుమతి ఇచ్చింది. పాదయాత్ర ముగింపు సందర్భంగా వరంగల్‌లో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్న బహిరంగ సభకు కూడా హైకోర్టు కల్పించుకుని అనుమతించింది. రెండు పార్టీల కార్యకర్తలు పోటీపడి మరీ ఫ్లెక్సీలు చించుకుంటున్నారు. తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ పట్టుదలగా ఉంది. బీజేపీ నాయకుల వ్యాఖ్యలను అడ్డుపెట్టుకుని తన అధికారాన్ని నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ భావిస్తున్నారు. దీంతో రెండు పార్టీలూ బాహాబాహీకి దిగుతున్నాయి. మధ్యలో మతం కార్డు తెరపైకి వచ్చింది. భారతీయ జనతా పార్టీని అడ్డుకునే క్రమంలో కేసీఆర్‌ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. దీనివల్ల మైనారిటీలు ఆయనకు అండగా నిలబడే అవకాశం ఉంది. అయితే బీజేపీ నాయకులు ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకోవడం కోసం హిందువులను ఆకర్షించే పనిలో పడ్డారు. ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఉద్రిక్తతల సుడిగుండంలోకి పోతోంది. అధికారంలో ఉన్నవాళ్లు, అధికారంలోకి రావాలనుకుంటున్నవాళ్లు మతపరమైన ఉద్రిక్తతలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కారకులు కావడం క్షంతవ్యం కాదు. ఏదో ఒక పార్టీ అధికారంలోకి రావడానికి లేదా అధికారంలో కొనసాగడానికి తెలంగాణ రాష్ట్రం నష్టపోవలసిరావడం ఆందోళన కలిగించే అంశం. ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌రెడ్డి పాలన పుణ్యమా అని పెట్టుబడిదారుల చూపు ఇప్పుడు తెలంగాణ మీద ఉంది. అందుకే అట్టే ప్రయత్నం చేయకపోయినా హైదరాబాద్‌కు పెట్టుబడులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మతపరమైన ఉద్రిక్తతలు మరింత ముదిరితే తెలంగాణలో పరిస్థితి ఏమిటి? ఒకప్పుడు మత ఘర్షణలకు మారు పేరుగా ఉన్న హైదరాబాద్‌కు నూతన బ్రాండ్‌ ఇమేజ్‌ తీసుకువచ్చిన ముఖ్యమంత్రులలో చంద్రబాబు అగ్రభాగాన ఉంటారు. ఇప్పుడు టీఆర్‌ఎస్‌–బీజేపీ మధ్య మొదలైన యుద్ధం వల్ల హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతినకూడదు. రాజకీయ పార్టీల ఎజెండాను ప్రజలే అర్థం చేసుకోవాలి. అధికారంలో ఉన్నవాళ్లు, అధికారంలోకి రావాలనుకుంటున్నవాళ్లకు రాష్ట్రంలో ప్రశాంత పరిస్థితులు ఉండేలా చూడాల్సిన బాధ్యత ఉంది. హైదరాబాద్‌ ఇప్పుడు మినీ ఇండియా. అన్ని రాష్ర్టాలకూ చెందిన వాళ్లు ఇక్కడ నివసిస్తున్నారు. లక్షలాది మందికి ఉపాధి దొరుకుతోంది. వారందరికీ హైదరాబాద్‌పై గొప్ప భావన ఉంది. బీజేపీ నాయకులు కోరుకుంటున్నట్టు వారు అధికారంలోకి వచ్చినా మతసామరస్యం కొరవడితే ప్రజలకు ఏం సమాధానం చెబుతారు? ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా బీజేపీ నాయకుల కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేయకుండా వారి పాటికి వారిని వదిలేస్తే తమను ఎవరు పాలించాలో ప్రజలే తేల్చుకుంటారు కదా. సేవ్‌ హైదరాబాద్‌! సేవ్‌ తెలంగాణ!


జూనియర్‌ రూటు ఎటు?

కేంద్ర మంత్రి అమిత్‌ షా వారం రోజుల క్రితం హైదరాబాద్‌ వచ్చినప్పుడు చోటుచేసుకున్న ఒక సమావేశం గురించి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఉన్నవారు తమదైన శైలిలో భాష్యం చెబుతున్నారు. సినీ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌తో అమిత్‌ షా ప్రత్యేకంగా సమావేశం కావడం హాట్‌ టాపిక్‌గా మారింది. సమావేశం జరిగింది హైదరాబాద్‌లోనే అయినప్పటికీ తెలంగాణలో సమాజం సదరు సమావేశం గురించి పట్టించుకోలేదు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఎవరికి తోచిన విధంగా వారు ఊహాగానాలు చేస్తున్నారు. నిజానికి జూనియర్‌ ఎన్టీఆర్‌తో అమిత్‌ షా సమావేశం కావడం గురించి స్థానిక బీజేపీ నాయకులకు కూడా ముందు తెలియదు. ఆద్యంతం రహస్యంగానే ఉంచారు. ఈ సమావేశాన్ని పురందేశ్వరి ఏర్పాటు చేశారని ప్రచారం కూడా జరిగింది. తెలంగాణలో అధికారంలోకి రావడమే తరువాయి అని నమ్ముతున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షా తమ దృష్టిని ఆంధ్రప్రదేశ్‌పై కూడా కేంద్రీకరించారు. ఏపీలో పార్టీ పుంజుకోవడం లేదని గుర్తించిన మోదీ–షా ద్వయం సినిమా గ్లామర్‌ను పార్టీకి అద్దాలన్న నిర్ణయానికి వచ్చారు. తొలుత వారు మెగాస్టార్‌ చిరంజీవిని పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నం చేశారు. అయితే తనకు రాజకీయాల పట్ల ఆసక్తి లేదని చిరంజీవి తేల్చిచెప్పడంతో వారి దృష్టి ఎన్టీఆర్‌పై పడింది. బీజేపీలో ఎన్టీఆర్‌ చేరితే ఏపీలో పార్టీ బలపడుతుందన్న అభిప్రాయానికి కేంద్ర పెద్దలు వచ్చారు. అందుకే ఎన్టీఆర్‌ను పార్టీలో చేరవలసిందిగా ఆహ్వానం అందజేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై బీజేపీ అగ్ర నాయకులకు సదభిప్రాయం లేదు. ఈ కారణంగానే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంతో కలవకుండా సొంత కాళ్లపై నిలబడాలని వారు కోరుకుంటున్నారని తెలిసింది. అవినీతి కేసులలో విచారణ ఎదుర్కొంటున్న జగన్మోహన్‌ రెడ్డిని దెబ్బకొట్టడం చేతిలో పనే అయినందున ముందుగా తెలుగుదేశం పార్టీని బలహీనపరిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో భాగంగానే ఎన్టీఆర్‌ను దువ్వాలన్న నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు. ఎన్టీఆర్‌ బీజేపీలో చేరితే రాజకీయ సమీకరణాలు నిజంగా మారతాయా? సినీ పరిశ్రమలో తన కెరీర్‌ను వదులుకుని ఎన్టీఆర్‌–రాజకీయాల్లోకి వెళతారా? అన్నది చర్చనీయాంశంగా ఉంది. అది కూడా బీజేపీలో చేరితే ప్రజలు హర్షిస్తారా? అన్నది కూడా ప్రశ్నార్థకమే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్లో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉంది. తెలుగుదేశం పార్టీ ఓటర్లలోనే కాకుండా తటస్థుల్లో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత ఉంది. జగన్మోహన్‌ రెడ్డి ఆటలు సాగడానికి బీజేపీ పెద్దల అండదండలు కారణమని ప్రజలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీలో చేరాలని అమిత్‌ షా నుంచి అందిన ఆహ్వానానికి ఎన్టీఆర్‌ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు ఈసడించుకున్నారు. అదే విధంగా రాష్ట్రం ప్రస్తుత దుస్థితికి బీజేపీ పరోక్ష కారణమని ప్రజానీకం భావిస్తున్నందున జూనియర్‌ ఎన్టీఆర్‌ ఆ పార్టీలో చేరినప్పటికీ పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చన్నది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. 2014 ఎన్నికల సమయంలో చిరంజీవి కాంగ్రెస్‌లోనే ఉన్నారు. అప్పుడాయన కాంగ్రెస్‌ తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు ప్రజలు ముఖం చాటేశారు. చిరంజీవికి ఎంత గ్లామర్‌ ఉన్నప్పటికీ కాంగ్రెస్‌పై ఉన్న కోపం కారణంగా ఆయనను చూడటానికి కూడా ఎవరూ రాలేదు. ఇప్పుడు జగన్మోహన్‌ రెడ్డిపై కూడా ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఈ కారణంగానే చిరంజీవి అంతటివాడు జగన్మోహన్‌ రెడ్డి వద్ద చేతులు జోడించి వేడుకోవడాన్ని కూడా జీర్ణించుకోలేకపోయారు. ఆయన నటించిన ‘ఆచార్య’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా దెబ్బతినడానికి ఈ వ్యతిరేకతా ఒక కారణమైంది. నిజానికి ఆ సినిమా మరీ అంత నాసిరకంగా లేదని అంటారు. కొత్తగా విడుదలైన సినిమాలపై ప్రజాభిప్రాయం ప్రతిబింబిస్తుంటుంది. ఉదాహరణకు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు బాలకృష్ణ నటించి, నిర్మించిన ‘కథానాయకుడు’ చిత్రం విడుదలైంది. ఎన్‌.టి.రామారావు బయోగ్రఫీ ఆధారంగా నిర్మితమైన ఆ చిత్రం బాగున్నప్పటికీ ప్రజలు ఆదరించలేదు. చిరంజీవి సినిమా ‘ఆచార్య’ దెబ్బతినగా, పవన్‌ కల్యాణ్‌ నటించిన ‘భీమ్లా నాయక్‌’ సక్సెస్‌ కావడం ప్రజాభిప్రాయం సినిమాలపై ప్రతిబింబిస్తుందనడానికి మరో నిదర్శనం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి బయోగ్రఫీ ఆధారంగా నిర్మించిన ‘యాత్ర’ చిత్రం హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. తాము అభిమానించే నటులు ఎంతటివాళ్లైనా తమకు నచ్చకపోతే ప్రజలు తిరస్కరించడం సహజం. 1989 ఎన్నికల్లో ఎన్టీఆర్‌ స్వయంగా ఓడిపోయారు. ఈ నేపథ్యంలోనే బీజేపీలో జూనియర్‌ ఎన్టీఆర్‌ చేరికను కూడా చూడాల్సి ఉంటుంది. 


పవన్‌ మదిలో...!

తాను బీజేపీలో ప్రస్తుత పరిస్థితుల్లో చేరితే లాభమా? నష్టమా? అని తెలుసుకోలేనంత అమాయకుడేమీ కాదు జూనియర్‌ ఎన్టీఆర్‌. ఆయనను పార్టీలోకి ఆహ్వానించి పార్టీకి గట్టిగా పునాదులు వేయాలని అమిత్‌ షా భావించడంలో తప్పు లేదు. అయితే ప్రస్తుతం తమతో కలిసి ప్రయాణిస్తున్న జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ఈ ప్రతిపాదనను ఎలా స్వీకరిస్తారా? అన్నది కూడా ఆసక్తి కలిగించే అంశమే. తమతో కలిసి ప్రయాణిస్తే భవిష్యత్తులో ముఖ్యమంత్రిని చేస్తామని పవన్‌ కల్యాణ్‌కు బీజేపీ నాయకులు హామీ ఇచ్చారు. ఇప్పుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ను పార్టీలోకి ఆహ్వానించిన కేంద్ర పెద్దలు ఆయనకు కూడా ఇటువంటి ఆశ చూపకుండా ఉంటారా? ఈ కారణంగా జూనియర్‌ను బీజేపీలోకి ఆహ్వానించడంపై పవన్‌ కల్యాణ్‌ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. జూనియర్‌ ఎన్టీఆర్‌కు కూడా రాజకీయాలపై ఆసక్తి ఉందని చెబుతారు. తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహించాలన్న కోరిక ఆయనలో బలంగా ఉందని అంటారు. ఈ నేపథ్యంలోనే బీజేపీలో చేరే బదులు తెలుగుదేశం పార్టీ నాయకత్వం కోసం ప్రయత్నించవలసిందిగా వైసీపీలో ఎన్టీఆర్‌ సన్నిహితులు సలహా ఇస్తున్నట్టు కూడా చెబుతున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణలో అధికారంలోకి రావాలంటే ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీతో సఖ్యతగా ఉండటం అవసరమని తెలంగాణ బీజేపీ నాయకులు కొందరు కేంద్ర పెద్దలపై ఈ మధ్య కాలంలో ఒత్తిడి పెంచారు. తెలంగాణలో 27 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల సంఖ్య గణనీయంగా ఉందని, వారు ఏ పార్టీకి మద్దతు ఇస్తే ఆ పార్టీనే గెలుస్తుందని ఎంపీ డాక్టర్‌ లక్ష్మణ్‌ వంటివారు తమ పెద్దలకు చెబుతున్నారు. హైదరాబాద్‌ నగర పాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో మెజారిటీ లభించకపోవడానికి ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓటర్లు బీజేపీని తిరస్కరించడమే కారణమని వారు అమిత్‌ షాకు వివరించినట్టు తెలిసింది. ఈ కారణంగా తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు బీజేపీవైపు ఆకర్షితులు కావాలంటే ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశంతో జత కట్టడం తప్పనిసరి అని తెలంగాణ నాయకులు చేస్తున్న వాదనతో బీజేపీ కేంద్ర పెద్దలు ఎంత వరకు ఏకీభవిస్తారో తెలియదు. బీజేపీ పెద్దల ఆలోచన ఒకలా, తెలంగాణకు చెందిన ఆ పార్టీ నాయకుల ఆలోచన మరోలా ఉన్నందున మోదీ–షా ద్వయం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూద్దాం!

ఆర్కే

Updated Date - 2022-08-28T05:58:05+05:30 IST