అదరం.. బెదరం అడుగు ముందుకే!

ABN , First Publish Date - 2022-10-16T09:47:02+05:30 IST

పునరుజ్జీవం పొందిన ‘ఆంధ్రజ్యోతి’ పత్రిక 20 వసంతాలు పూర్తి చేసుకుంది. 2000 డిసెంబరు 30వ తేదీన మూతబడిన ‘ఆంధ్రజ్యోతి’ పత్రికను 2002 అక్టోబరు 15వ తేదీన పునఃప్రారంభించాం....

అదరం.. బెదరం  అడుగు ముందుకే!

పునరుజ్జీవం పొందిన ‘ఆంధ్రజ్యోతి’ పత్రిక 

20 వసంతాలు పూర్తి చేసుకుంది. 

2000 డిసెంబరు 30వ తేదీన మూతబడిన 

‘ఆంధ్రజ్యోతి’ పత్రికను 2002 అక్టోబరు 15వ 

తేదీన పునఃప్రారంభించాం. మూతపడిన ఒక పత్రిక 

పునరుజ్జీవం పొంది రెండు దశాబ్దాలు విజయవంతంగా 

పూర్తి చేసుకోవటం మన దేశంలోనే అరుదైన సందర్భం. 

మీడియా గురించి ఎవరు పడితే వారు అవాకులు చవాకులు పేలుతున్న వర్తమానం నుంచి 20 ఏళ్లు వెనక్కి వెళితే మూతబడిన పత్రిక నిర్వహణా భారాన్ని చేపట్టడం ఎంత సాహసమో తెలుస్తుంది. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ‘ఆంధ్రజ్యోతి’ బాధ్యతను తీసుకోవడానికి ఒక్కరు కూడా ముందుకు రాని పరిస్థితులలో అది ఎంతటి దుస్సాహసమో తెలియకుండానే మేం నడుం బిగించాం. ‘అక్షరమే ఆయుధం’గా ముక్కుసూటితనంతో వార్తలు ఇవ్వడం ఒరవడిగా ‘ఆంధ్రజ్యోతి’ తన మలి ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఈ ప్రస్థానంలో ఎన్నో నిందలను, అప వాదులను, అసత్య ప్రచారాలను భరించాల్సి వచ్చింది.. వస్తున్నది. ఇవాళ మీడియా బహుముఖంగా విస్తరించి ఉండవచ్చు గానీ 20 ఏళ్ల క్రితం కొన్ని వందల మంది జర్నలిస్టులు, ఇతర విభాగాల సిబ్బంది.. ఉపాధి లేక చాలా దయనీయ స్థితిలో ఉండేవారు. ఇప్పుడు ‘ఆంధ్రజ్యోతి’పై చౌకబారు విమర్శలు చేస్తున్న ఎంతో మందిని మేం చేరదీసి నీడనిచ్చాం. పాత్రికేయులకు తగినంత స్వేచ్ఛను ఇవ్వడంతో, మా సంస్థలో పనిచేసిన పలువురు ఇప్పుడు అనేక సంస్థలకు సంపాదకులుగా ఉన్నారు. దాదాపు అరడజను మంది సంపాదకులుగా ఎదిగే అవకాశం కల్పించామని గర్వంగా చెప్పగలం. ఇప్పుడు పెట్టుబడులు పెట్టడానికి ఫలానా రాయితీలు కావాలని అడుగుతున్నారు గానీ, అప్పుడు ప్రభుత్వం నుంచి ఏమీ ఆశించకుండానే ‘ఆంధ్రజ్యోతి’ని పునఃప్రారంభించాం. వివిధ పత్రికలకు స్థలాలు కేటాయించిన ప్రభుత్వాలు పునరుజ్జీవం పోసుకున్న ‘ఆంధ్రజ్యోతి’కి మాత్రం గజం భూమి కూడా ఇవ్వలేదు. ఇందుకు మేము అనుసరించిన నిక్కచ్చితనం కారణం కావచ్చు. ఈ ఇరవై ఏళ్లలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాం. ‘ఆంధ్రజ్యోతి’ ఉసురు తీయడానికి పాలకులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయినా ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులు విరజిమ్ముతూనే వస్తున్నది. ఆర్థికంగా ఇబ్బందులు సృష్టించినా ప్రయోజనం లేకుండా పోతున్నదని గ్రహించిన పాలకులు కొందరు.. ‘ఆంధ్రజ్యోతి’ విశ్వసనీయతను దెబ్బతీసే ప్రయత్నాలు మొదలెట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రయత్నాలు మొదలయ్యాయి. ‘ఆంధ్రజ్యోతి’లో చంద్రబాబునాయుడు పెట్టుబడులు ఉన్నాయని ప్రచారం చేయడం మొదలెట్టారు. అదే నిజమైతే 2002లో ‘ఆంధ్రజ్యోతి’ తొలి సంచికలోనే ‘చంద్రజాలానికి రాహుకాలం’ అని బ్యానర్‌ పెట్టడం సాధ్యమా? రాజశేఖర్‌ రెడ్డి పాదయాత్రకు విశేష ప్రచారం కల్పించగలమా? పాదయాత్ర జరిగినన్ని రోజులు ప్రత్యేకంగా రాజశేఖర్‌రెడ్డి మాటల్లోనే డైరీ ముద్రించే వాళ్లం. అప్పుడు రాజశేఖర్‌ రెడ్డికి ఇష్టంగా ఉండిన ‘ఆంధ్రజ్యోతి’, ఆయన ముఖ్యమంత్రి అయ్యాక కష్టంగా మారింది. ముఖ్యమంత్రిగా రాజశేఖర్‌ రెడ్డ్డి నిర్ణయాలను ఎండగట్టడంతో వాటికి సమాధానం చెప్పాల్సింది పోయి, మాకు చంద్రబాబుతో ముడిపెట్టి ఎల్లో మీడియా అని ప్రచారం చెయ్యడం మొదలెట్టారు. పాదయాత్రకు ప్రచారం కల్పించాల్సిందిగా కోరిన రాజశేఖర్‌ రెడ్డ్డి, ఆ తర్వాత పత్రిక అమ్ముకోవడానికే తన యాత్రకు ప్రచారం కల్పించారని వ్యాఖ్యానించారు. మీడియాపై ఎదురుదాడి అనేది రాజశేఖర్‌ రెడ్డి హయాంలోనే ప్రారంభమై ఇప్పుడు ఆయన సుపుత్రుడు జగన్మోహన్‌రెడ్డి హయాం వచ్చేసరికి వెర్రితలలు వేయడం మొదలెట్టింది. పులివెందుల మార్కు రాజకీయంతో మీడియాను కూడా కులాల రొచ్చులోకి లాగి పాఠకుల మెదళ్లలో విషం నింపే ప్రయత్నాలు చేశారు. 


ఆ ముగ్గురే..!

గతంలోకి వెళితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు నుంచే ‘ఆంధ్రజ్యోతి’ పత్రిక ఉంది. మూతబడిన ఏడాదిన్నరను కలుపుకొంటే ‘ఆంధ్రజ్యోతి’ ప్రారంభమై 63 ఏళ్లు అవుతోంది. అప్పుడు జగన్మోహన్‌ రెడ్డి పుట్టలేదు కూడా. రాజశేఖర్‌ రెడ్డి కూడా చిన్నవాడే. కేఎల్‌ఎన్‌ ప్రసాద్‌ ప్రారంభించిన పత్రిక నిర్వహణ బాధ్యతను ఇప్పుడు నేను చేపట్టడం నా అదృష్టంగా భావిస్తాను. ఉమ్మడి రాష్ట్రంలో గానీ, ఇప్పుడు గానీ మీడియాపై దాడికి దిగిన ముఖ్యమంత్రుల జాబితాలో రాజశేఖర్‌ రెడ్డి, కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు, జగన్మోహన్‌ రెడ్డి మాత్రమే కనిపిస్తారు. మధ్యలో కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీల తరఫున ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్లు ఎవరూ మీడియాపై ఇంతలా నిందలు వేయలేదు. ప్రత్యేక రాష్ట్రం కావాలని తెలంగాణ ప్రజలు కోరుకోవడంలో న్యాయం ఉందని నమ్మిన మేం తెలంగాణ ఉద్యమానికి ఇతోధిక ప్రచారం కల్పించాం. ఫలితంగా సీమాంధ్రలో నష్టం జరుగుతుందని తెలిసినా ఖాతరు చేయలేదు. తెలంగాణ ఉద్యమాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వడానికి కేంద్రం నియమించిన శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో ‘ఆంధ్రజ్యోతి’ని కట్టడి చేయగలిగితే తెలంగాణ ఉద్యమం మరుగునపడుతుంది అని వ్యాఖ్యానించింది అంటే ఉద్యమంలో మా పాత్ర ఏమిటో స్పష్టమవుతుంది. అయితే ఉద్యమ ప్రస్థానంలో కేసీఆర్‌ పోకడలను ‘ఆంధ్రజ్యోతి’ నిర్మొహమాటంగా తప్పుబట్టింది. దీంతో ఆగ్రహించిన కేసీఆర్‌.. ‘ఆంధ్రజ్యోతి’ తెలంగాణ వ్యతిరేకి అని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ప్రజలకు జ్ఞాపకశక్తి తక్కువ అని అంటారు. ఫలితంగా తెలంగాణ సమాజంలో కొంత మంది మాత్రం కేసీఆర్‌ ప్రచారాన్ని నమ్మారు. నిజం చెప్పులు వేసుకుని బయలుదేరేలోగా అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందని అంటారు. ‘ఆంధ్రజ్యోతి’ విషయంలో అదే జరిగింది. తెలంగాణ ఏర్పడి కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కొంతకాలం పాటు ఇటువంటి దుష్ప్రచారాన్ని కొనసాగించారు. దాదాపు రెండున్నరేళ్ల పాటు తెలంగాణలో ‘ఏబీఎన్‌–ఆంధ్రజ్యోతి’ చానల్‌ ప్రసారాలను నిలిపి వేయించారు. అయినా మేం అదరలేదు బెదరలేదు. న్యాయ పోరాటం చేసి విజయం సాధించాం. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఎనిమిదిన్నరేళ్లు పూర్తిచేసుకుంటున్నారు. ఈ ఎనిమిదిన్నరేళ్లలో రెండేళ్లను మినహాయిస్తే మిగతా కాలంలో ‘ఆంధ్రజ్యోతి’కి న్యాయంగా రావాల్సిన ప్రభుత్వ ప్రకటనలను కూడా నిలిపివేశారు. కేసీఆర్‌ రెండవ పర్యాయం ముఖ్యమంత్రి అయ్యి నాలుగేళ్లు అవుతోంది. ఈ నాలుగేళ్లలో ‘ఆంధ్రజ్యోతి’కి ప్రకటనలను పూర్తిగా నిషేధించారు. అయినా మేం తలవంచలేదు. 


తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్‌ పాలనలో ఎటువంటి నియంతృత్వ పోకడలు కొనసాగుతున్నాయో చూస్తున్నాం. కేసీఆర్‌తో ఎంతోమంది రాజీ పడిపోయారు. మేం ఏ తప్పూ చేయలేదు కనుక ప్రకటనల ఆదాయం కోల్పోతున్నప్పటికీ రాజీపడలేదు. ఉద్యమ సమయంలో గానీ, ఇప్పుడు గానీ తెలంగాణలో ప్రజల గొంతుకగా ‘ఆంధ్రజ్యోతి’ నిలుస్తుందని గర్వంగా చెప్పగలం. వ్యాపార దృష్టి మాత్రమే ఉండి ఉంటే మిగతావారి వలె మేం కూడా వాళ్ల బాటనే ఎంచుకుని ఉండేవాళ్లం. జర్నలిజం మీద ఉన్న మమకారంతో మేం నమ్మిన దానికే కట్టుబడి ఉన్నాం. అయితే మా సంస్థలో పనిచేసి వెళ్లిపోయిన కొంతమంది ఆ తర్వాత చేసిన వ్యాఖ్యలు, రాసిన రాతలు మాత్రం మమ్మల్ని కొంత బాధించాయి. ‘ఆంధ్రజ్యోతి’లో పనిచేసినప్పుడు ఎటువంటి స్వేచ్ఛను అనుభవించారో తెలిసి కూడా మాకు దురుద్దేశాలు ఆపాదించారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా లేదా తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా వార్తలు రాయాలని నేను ఒక్కరిని కూడా కోరలేదని చెప్పగలను. పత్రిక ప్రయోజనాలకు విరుద్ధంగా, వ్యక్తిగత అభిప్రాయాలతో పత్రికను నింపినవాళ్లు కూడా బయటకు వెళ్లి నిందలు వేయడం ఆశ్చర్యం కలిగించింది. ‘ఆంధ్రజ్యోతి’లో పనిచేసినప్పుడు కేసీఆర్‌ పోకడలను విమర్శిస్తూ వ్యాసాలు, వార్తలు రాసినవారు ఆ తర్వాత అదే కేసీఆర్‌ పంచన చేరి ‘ఆంధ్రజ్యోతి’ని టార్గెట్‌ చేయడం చూసి కలికాలమని సరిపుచ్చుకున్నాం. గతంలో మీడియాలో అవాస్తవాలు ప్రచురించారని భావించిన పాలకులు సంపాదకుల దృష్టికి ఆ విషయం తీసుకువెళ్లేవారు. రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక యాజమాన్యాలను టార్గెట్‌ చేయడం మొదలైంది. కులం రంగు పూయడం మొదలైంది. వందల మంది జర్నలిస్టులు పనిచేసే మీడియాలో వచ్చే ప్రతి వార్త గురించి సంపాదకుడికే తెలియదు. యాజమాన్యాలకు ఎలా తెలుస్తుంది? అయినా ‘ఆంధ్రజ్యోతి’లో ఏ వార్త వచ్చినా నేను స్వయంగా కూర్చుని రాసినట్టుగా ప్రచారం చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో రాజశేఖర్‌ రెడ్డి, కేసీఆర్‌ సొంత మీడియా సంస్థలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత నుంచి జర్నలిజం పూర్తిగా కలుషితమైపోయింది. ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపితే అందులో నిజం ఉందో లేదో చెప్పకుండా కులం రంగు, పసుపు రంగు పూసి ప్రజలను ఏమార్చడానికి ఎదురుదాడి ఉధృతమైంది. తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబడితే తెలంగాణకు వ్యతిరేకమని, ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ ప్రభుత్వ చర్యలను ఎత్తి చూపితే తెలుగుదేశం కోసం చేస్తున్నారని ప్రచారం చేయడం పరిపాటి అయింది. మేధావులు, తటస్థుల ముసుగులో కొంత మంది ఈ ప్రచారంలో పాలకులతో గొంతు కలపడం విషాదం. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపితే ఆ పత్రిక తెలంగాణకు వ్యతిరేకం, జగన్మోహన్‌ రెడ్డికి వ్యతిరేకం అని ప్రచారం చేయడం ఫ్యాషన్‌ అయింది. ఈ దిక్కుమాలిన ప్రచారం చేస్తున్న వాళ్లు ‘ఆంధ్రజ్యోతి’ అవాస్తవాలు ప్రచురించిందని మాత్రం చెప్పరు. అసలు ప్రచురితమైన వార్తలను కనీసం ప్రస్తావించరు. కేసీఆర్‌, జగన్‌ ప్రారంభించిన వారి సొంత మీడియాకు విశ్వసనీయత ఉండదు కనుక మిగతా మీడియాకు కూడా విశ్వసనీయత లేకుండా చేయడమే ఈ మూక లక్ష్యం. ఫలితంగా ప్రభుత్వ తప్పిదాల నుంచి ప్రజల దృష్టి మళ్లించవచ్చునని వారు భావిస్తున్నారు. పాలకులకు అనుకూలంగా సన్నాయి నొక్కులు నొక్కేవారు ముఖ్యమంత్రుల నియంతృత్వ పోకడలను మాత్రం తప్పుబట్టరు. ఆంధ్రప్రదేశ్‌లో మూడున్నరేళ్లుగా జగన్‌ ప్రభుత్వం ‘ఆంధ్రజ్యోతి’ పత్రికకు ప్రభుత్వ ప్రకటనలను నిషేధించింది. అది తప్పు అని చెప్పకుండా జగన్‌ తరఫున ఎల్లో మీడియా అని కారుకూతలు కూస్తున్న వారిని ఏమనాలి? ఆంధ్రప్రదేశ్‌లో ‘ఏబీఎన్‌–ఆంధ్రజ్యోతి’ చానల్‌ ప్రసారాలను మూడున్నరేళ్లుగా నిలిపివేసినప్పటికీ, శాసనసభ సమావేశాలకు హాజరుకాకుండా నిషేధం విధించినప్పటికీ తప్పు అని చెప్పలేని వారు మీడియాకు సుద్దులు చెప్పే ప్రయత్నం చేయడం రోత పుట్టిస్తోంది. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఇటువంటి ప్రయత్నాలను చేయబోగా, జగన్‌ మీడియా తరఫున ఎంతమంది వకాల్తా పుచ్చుకున్నారో తెలియంది కాదు.


300 కోట్లు పోయినా సరే..!

ఆదాయమే ముఖ్యం అనుకుంటే కేసీఆర్‌తో గానీ, జగన్మోహన్‌ రెడ్డితో గానీ రాజీపడిపోవడం ఎంతసేపు? ప్రభుత్వానికి సహకరించడానికి అంగీకరిస్తే స్వయంగా వచ్చి కలుస్తానని జగన్మోహన్‌ రెడ్డి నాకు కబురు పంపడం నిజం కాదా? జగన్మోహన్‌ రెడ్డి పోకడల వల్ల ఆంధ్రప్రదేశ్‌ దెబ్బతింటుందని మేం గట్టిగా నమ్ముతున్నాం. ఈ మూడున్నరేళ్లలో ఏం జరిగిందో, జరుగుతున్నదో చూస్తున్నాం కదా? జగన్‌తో రాజీపడటానికి సిద్ధపడి ఉంటే ఈ మూడున్నరేళ్లలో ‘ఈనాడు’, ‘సాక్షి’ తరహాలోనే ‘ఆంధ్రజ్యోతి’కి కూడా 300 కోట్ల ఆదాయం వచ్చి ఉండేది. అంత పెద్ద మొత్తం కోల్పోవడానికి సిద్ధపడ్డాం గానీ జర్నలిజాన్ని అమ్ముకోదలచుకోలేదు. చంద్రబాబు హయాంలో ‘ఆంధ్రజ్యోతి’కి అయాచితంగా వందల కోట్లు దోచి పెట్టారు అని అసత్య ప్రచారం చేశారు. అప్పట్లో ఆ ప్రచారాన్ని పట్టించుకోకపోవడమే మేం చేసిన తప్పు. అబద్ధాలకే ప్రజలు ఆకర్షితులవుతారనే విషయాన్ని విస్మరించాం. కావాలంటే జగన్‌రెడ్డి ప్రభుత్వం రాగానే ఈ అంశంపై విచారణ జరిపి ఉండొచ్చుగా. ఆ ప్రచారంలో వాస్తవం లేదన్న విషయం వాళ్లకు తెలుసుకాబట్టే విచారణ జోలికి పోలేదన్నది కాదనలేని సత్యం. అప్పుడు సదరు దుష్ప్రచారం చేసినవాళ్లు ఇప్పుడు మాకు ప్రకటనలు నిషేధించడాన్ని మాత్రం పొరపాటున కూడా ఆక్షేపించరు. చంద్రబాబు అభివృద్ధి నమూనాను సమర్థించినంత మాత్రాన ‘ఆంధ్రజ్యోతి’ ఆయనకు లొంగి ఉంటుందనుకోవడం అవివేకం. అధికారంలో చంద్రబాబు గానీ, మరొకరు గానీ.. ఎవరు ఉన్నప్పటికీ స్వతంత్రంగా ఉండటానికే మా ఓటు. కష్టాలు, నష్టాలు ఎన్ని వచ్చినా ఇందులో రాజీ లేదు. ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలి. చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్‌ సినిమాకు సంబంధించి ‘ఏబీఎన్‌’ వెబ్‌సైట్‌లో అనుచితమైన వ్యాఖ్యలు కొన్ని ప్రచురించడంతో, బ్యాన్‌ ‘ఏబీఎన్‌– సేవ్‌ టీడీపీ’ అని తెలుగుదేశం పార్టీ సోషల్‌ మీడియాలో కొంత ప్రచారం జరిగింది. దీన్నిబట్టి మేమెవ్వరికీ దగ్గర కాదు అని స్పష్టమవుతోంది కదా! నిజానికి గాడ్‌ఫాదర్‌ సినిమాకు సంబంధించి ‘ఏబీఎన్‌’ వెబ్‌సైట్‌లో వచ్చిన సమీక్షల గురించి నాకు తెలియదు. ఈ–పేపర్‌, వెబ్‌సైట్‌, ఈమెయిల్స్‌ చూడటం నాకు రాదు అని చెపితే చాలామంది నమ్మకపోవచ్చు. అయితే అదే నిజం! గాడ్‌ఫాదర్‌ విషయం నా దృష్టికి రాగానే సంబంధిత సిబ్బందిని నేను పిలిపించి మందలించాను. వాస్తవం ఇది కాగా, చిరంజీవి అభిమానులమని చెప్పుకొనేవాళ్లు నేను ఫలానా కులానికి వ్యతిరేకం అని ప్రచారం మొదలుపెట్టారు. చిరంజీవిపై వ్యక్తిగతంగా మాకు ఎటువంటి వ్యతిరేకతా లేదు. ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఇదే విషయాన్ని చిరంజీవి మాట్లాడినప్పుడు కూడా చెప్పాను. అయినా ఇక్కడ కూడా నిజం బయటకు వచ్చేముందే అబద్ధం ఊరంతా తిరిగొచ్చింది. అపవాదులు, అపోహలు ఎలా ఉంటాయో చెప్పడానికి ఒక ఉదంతాన్ని చెబుతాను. కొంతకాలం క్రితం నందమూరి బాలకృష్ణ నా ఫోన్‌కు ఒక మెసేజ్‌ చేశారు. దాని సారాంశం ఏమిటంటే, ‘‘ఆంధ్రజ్యోతి’ని, ‘ఏబీఎన్‌’ను నేను బ్యాన్‌ చేస్తున్నాను. నా వార్తలు ప్రచురించి, ప్రసారం చేసే సాహసం చేయవద్దు’’ అని. ఆ మెసేజ్‌ ఎవరు పంపారో తెలియక, ‘‘ఎవరు?’’ అని అడిగాను. ‘‘నేను నందమూరి బాలకృష్ణను. అంతేలే.. మీకు చిరంజీవి నంబరు గుర్తుంటుంది గానీ, నా నంబరు గుర్తుండదు’’ అని ఆయన నిష్ఠురమాడారు. ఇక ఆయనతో సంభాషణ కొనసాగించడం అనవసరమని నేను మౌనంగా ఉండిపోయాను. చిరంజీవికి నేను సన్నిహితమని బాలకృష్ణ భావిస్తుంటే, బాలకృష్ణకు సన్నిహితమని చిరంజీవి మనుషులు అభిప్రాయపడుతున్నారు. నిజం చెప్పాలంటే చిరంజీవితోనే నాకు సాన్నిహిత్యం ఉండేది. అయితే ఈ మధ్య తరచుగా కలవడం లేదు. అలా అని మా మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలూ లేవు. అపోహలు, అపార్థాలకు ఇంతకు మించిన నిదర్శనం ఏముంటుంది? సమాజంలో కుల, మత, ప్రాంతాలపరంగా వైషమ్యాలు ఏర్పడినప్పుడు ఇటువంటి అపోహలు సహజమనే భావిస్తున్నాం. హేతుబద్ధంగా ఆలోచించే తీరిక, ఓర్పు ఎవరికీ ఉండటం లేదు. 


కులం రంగు.. రోత రాజకీయం!

ఇప్పుడు మీడియాకు కులాన్ని అంటగడుతున్న విషయానికి వద్దాం. రాజశేఖర్‌ రెడ్డి హయాంలో మమ్మల్ని తెలుగుదేశం పార్టీతో ముడిపెట్టే ప్రయత్నాలు జరగ్గా, ఇప్పుడు జగన్‌ రెడ్డి హయాంలో మరో అడుగు ముందుకువేసి మీడియాకు కులాన్ని ఆపాదిస్తున్నారు. కుల పత్రికలు అంటూ విజయసాయిరెడ్డి వంటివారు తరచుగా వ్యాఖ్యానిస్తుంటారు. ఇప్పుడు వారు నిందిస్తున్న ఇదే మీడియాలో పనిచేస్తున్న వాళ్లు కూడా ఇప్పుడు కులం గురించి మాట్లాడటం ఎవరికైనా ఆవేదన కలిగించకమానదు. నిజానికి మీడియాలో, అంటే పాఠకుల్లో కులం, మతం తీసుకువచ్చింది జగన్‌ అండ్‌ కోనే! తెలుగుదేశం పుట్టక ముందునుంచే ఉన్న ‘ఆంధ్రజ్యోతి’కి ఆనాటి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు కులం ఆపాదించే దుస్సాహసం చేయలేదు. పాఠకులను కుల, మత ప్రాతిపదికన విడగొట్టే చర్యలకు తెగబడిన జగన్‌ అండ్‌ కో మాకు కులం రంగు పూయడం రోతగా ఉంది. జగన్మోహన్‌ రెడ్డి సొంత పత్రికను ప్రారంభించినప్పుడు ఇంతకాలానికి మన పత్రిక వస్తోందంటూ రెడ్డి, క్రైస్తవులకు ఫోన్లో మెసేజ్‌లు పంపడం నిజం కాదా? మీడియాలో తన మనుగడ కోసం ఇంత నీచానికి దిగజారిన జగన్మోహన్‌ రెడ్డి ఇతరులకు కులం రంగు పూయాలనుకోవడం దౌర్భాగ్యం. ‘ఆంధ్రజ్యోతి’లో పనిచేసి సంపాదకులుగా ఎదిగిన వారిలో ఒక్కరైనా కమ్మ సామాజిక వర్గంవారు ఉన్నారా? లేరే? ఈ 20 ఏళ్లలో ‘ఆంధ్రజ్యోతి’లో ఎంతో మంది పనిచేశారు. బయటకు వెళ్లారు. కులానికే మేము ప్రాధాన్యం ఇస్తామని బయటకు వెళ్లినవాళ్లు కూడా చెప్పలేరు. మా సంస్థలో పనిచేస్తున్నవారిలో అన్ని వర్గాలవారు, అన్ని అభిప్రాయాలూ ఉన్నవారు కీలక స్థానాలలో ఉన్నారు. ‘ఆంధ్రజ్యోతి’లో కమ్మవారి ఆధిపత్యం ఉంటుందని ఎవరైనా చెప్పగలరా? జగన్మోహన్‌ రెడ్డి మీడియాలో ఇటువంటి పరిస్థితి ఉందా? రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారికి మాత్రమే శాఖాధిపతులుగా అవకాశం ఎందుకు కల్పించారో జగన్‌ అండ్‌ కో చెప్పగలరా? ఆత్మరక్షణలో పడినందువల్ల ఈ విషయాలు చెబుతున్నామని ఎవరైనా అనుకుంటే పొరపాటు. ‘ఆంధ్రజ్యోతి’కి కులం రంగు పులమాలనుకుంటున్నవారు తమ కులానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పడానికే ఇదంతా. రాజకీయ పార్టీల కోసం పత్రికలు పనిచేయడం ఏమిటని జగన్మోహన్‌ రెడ్డి ఆ మధ్య ప్రశ్నించారు. తెలుగునాట ఈ ప్రశ్నకు సమాధానం చెప్పవలసినవారు ఎవరైనా ఉన్నారంటే అది ఆయనే! స్వీయ రాజకీయ ప్రయోజనాల కోసం అక్రమ సంపాదనతో సొంత మీడియా సంస్థలను ఏర్పాటు చేసుకున్న జగన్‌కు, ఇతర మీడియా సంస్థలను నిందించే నైతికత ఉందా? ఆయనకు చిడతలు కొడుతున్న కూలి మీడియా కూడా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. శాసనసభ వేదికగా రక్షణ పొందుతూ ‘ఆంధ్రజ్యోతి’ని ‘చంద్రజ్యోతి’గా జగన్‌ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. ‘ఆంధ్రజ్యోతి’తో చంద్రబాబుకు ప్రత్యక్ష లేదా పరోక్ష సంబంధం ఉందని రుజువు చేస్తే, ఆ మధ్య విజయసాయిరెడ్డి అన్నట్టుగా మా సంస్థలను రాసిస్తాం. జగన్‌ అండ్‌ కోలో ఏ మాత్రం నిజాయితీ ఉన్నా ఈ సవాలును స్వీకరించాలి. అపవాదులు, అపోహలతో ‘ఆంధ్రజ్యోతి’ని అంతం చేయాలనుకునే వారికి నిరాశే మిగులుతుంది. మూతపడిన ఒక పత్రికను 20 ఏళ్లుగా విజయవంతంగా నడపగలగడమే ఇందుకు నిదర్శనం. సమస్యలు, సంక్షోభాలు మాకు నిత్యకృత్యం. ఒకప్పుడు నిందలు వేసిన వాళ్లు ఆ తర్వాత కొంత కాలానికి మీరైనా అండగా నిలబడండి అని ‘ఆంధ్రజ్యోతి’ని ఆశ్రయించడం మాకు గర్వకారణం కాదా? అధికారం ఉంది కదా అని ఇవాళ మాపై నిందలు వేస్తున్న జగన్‌ అండ్‌ కోకు రేపు ఇదే పరిస్థితి ఎదురవ్వదన్న గ్యారెంటీ ఉందా? నీచపు ఆలోచనలు చేసేవారికి మాత్రమే అన్నింటా కులం, మతం, ప్రాంతం కనిపిస్తాయి. ‘ఆంధ్రజ్యోతి’ పులుకడిగిన ముత్యమని మేం చెప్పడం లేదు. ఇన్ని వేల మందితో పనిచేసే సంస్థలో తప్పులు జరగడం సహజం. వాటిని సరిచేసుకోవడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. ఉద్దేశపూర్వకంగా తప్పుడు వార్తలు రాయడం మా విధానం కాదు. మాకు నచ్చిన, మేము సరైనదని భావిస్తున్న మార్గంలో మా ఈ ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. కష్టం, నష్టం మాకు అలవాటుగా మారింది. మీడియా అంటే చాలెంజ్‌గా ఉండాలి. అలా ఉంటేనే మాకు కిక్‌ వస్తుంది. పాఠకులు, శ్రేయోభిలాషుల ఆదరాభిమానాలు ఉన్నంతకాలం మేం ఈ కిక్‌ను అనుభవిస్తూనే ఉంటాం. కేసీఆర్‌, జగన్మోహన్‌ రెడ్డి వంటి ముఖ్యమంత్రులు వచ్చి పోతుంటారు. రెండు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో మా వైపు నుంచి తప్పులు జరిగి ఉంటే వాటిని సరిదిద్దుకొని ముందుకు సాగుతామని పాఠకులకు హామీ ఇస్తున్నాం. ఏ పత్రికకైనా పాఠకుల ఆదరణే శ్రీరామరక్ష. ఇంతకాలంగా మమ్మల్ని ఆదరించిన పాఠకులు, ప్రకటనకర్తలు ఇకముందు కూడా మాకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎవరు ఎన్ని కుట్రలు, కుయుక్తులు పన్నినా ‘ఆంధ్రజ్యోతి’ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వెలుగులు ప్రసరింపజేస్తూనే ఉంటుంది!

ఆర్కే


యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Read more