భావ విప్లవాన్ని మోదీ సాధిస్తారా?

ABN , First Publish Date - 2022-09-14T07:32:34+05:30 IST

‘ఒకప్పుడు తమ వలస రాజ్యాన్ని నడిపేందుకు బ్రిటిష్‌వారు రూపొందించిన పరిపాలనా వ్యవస్థే ఇప్పుడు ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని నిర్వహిస్తోంది...

భావ విప్లవాన్ని మోదీ సాధిస్తారా?

‘ఒకప్పుడు తమ వలస రాజ్యాన్ని నడిపేందుకు బ్రిటిష్‌వారు రూపొందించిన పరిపాలనా వ్యవస్థే ఇప్పుడు ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని నిర్వహిస్తోంది. నాకు పాతికేళ్ల వయసు ఉన్నప్పుడు మా ముత్తాతలైన బ్రిటిష్ వలసవాదులు రాసిన చట్టాలను ఇక్కడ ప్రయోగిస్తున్నారు. ఇదే ఈ దేశానికి ఇప్పటికీ అత్యంత నష్టం కలిగిస్తోంది’ అని భారతదేశంలో స్థిరపడ్డ ప్రముఖ బ్రిటిష్ జర్నలిస్టు మార్క్ టుల్లీ అన్నారు. బ్రిటిష్‌వారు భారత్‌ను దోపిడీ చేసేందుకు ఉపయోగించిన వలస కాలం నాటి చట్టాలను ఇప్పటి రాజకీయ నాయకులు కూడా ఉపయోగించుకుంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. భారతదేశంలో దాదాపు అయిదు దశాబ్దాలుగా జీవిస్తున్న మార్క్ టుల్లీ భారతీయ సంస్కృతికి ఇష్టపడి ఇక్కడే స్థిరపడ్డారు. ఆయన మన దేశం గురించి పలు పుస్తకాలు రాశారు. భారతదేశంలో వ్యవస్థల్ని ఆధునిక కాలానికి తగ్గట్లుగా ఉపయోగించుకోవడంలో భారతదేశ నేతల అసమర్థత వల్లే వలసపాలన వారసత్వం కొనసాగుతోందని ఆయన స్పష్టంగా చెప్పారు. ఒక అమెరికన్ ఆర్థికవేత్తను ఉటంకిస్తూ ‘భారతదేశం విఫలమవుతున్న దేశం కాదు, కాలం చెల్లుతున్న పరికరాలతో కూడిన దేశం. మీకు ప్రభుత్వాలు ఉంటాయి, సంస్థలు ఉంటాయి. ప్రజాస్వామ్యానికి అవసరమయ్యే ప్రతి ఒక్కటీ ఉంటుంది. ప్రభుత్వం విధానాలను రూపొందిస్తుంది. అయితే అవి అమలు కావు. ఇది ఒక వ్యక్తి కుంచించుకుపోయిన భుజం లాంటిది. భుజం ఉంటుంది కాని విస్తరించలేదు’ అని మార్క్ టుల్లీ అన్నారు.


భారతీయులను బానిస మనస్తత్వం నుంచి విముక్తి చేసేందుకే ఢిల్లీలోని ఇండియాగేట్ వద్ద రాజ్‌పథ్ పేరును కర్తవ్యపథ్‌గా మార్చానని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో మార్క్ టుల్లీ అభిప్రాయాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారతీయ జనతా పార్టీ భావజాలాన్ని మోదీ వలే అత్యంత సమర్థంగా సిద్ధాంతీకరించే శక్తి ఆ పార్టీ నేతల్లో మరెవరికీ లేదు. కాంగ్రెస్ ఈ దేశాన్ని ఏడు దశాబ్దాల పాటు ఏలినప్పటికీ వలస పాలన కాలం నాటి బానిస మనస్తత్వాన్ని మార్చలేకపోయారని తానే ఇప్పుడు దేశం రూపురేఖలు మార్చి నిజమైన స్వాతంత్ర్యం దిశగా నడిపిస్తున్నానని చెప్పేందుకు మోదీ శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. తాను ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్న సమయంలో ఆజాద్ హింద్ ఫౌజ్ జెండాను నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎగురవేసిన క్షణాలు గుర్తుకు వచ్చాయని చెప్పిన మోదీ తనను ఎవరితో పోల్చుకుంటున్నారో ఊహించుకోవచ్చు.


రహదారుల పేర్లను మార్చినంత మాత్రాన, విగ్రహాలను నెలకొల్పినంత మాత్రాన ఈ దేశంలో వలసపాలన వారసత్వాలు అంతరిస్తాయా అన్న విషయంపై చర్చ జరగాల్సి ఉన్నది. బ్రిటన్‌కు చెందిన మార్క్ టుల్లీ మాత్రమే కాదు, అనేకమంది మేధావులు ఈ దేశంలో చట్టాలు, వ్యవస్థలు, ఉపకరణాలను మార్చకుండా ఎలాంటి మార్పూ జరగదని పలు సందర్భాల్లో అభిప్రాయపడ్డారు. ఈ దేశంలోని ప్రభుత్వాధికారులలో అత్యధికులు తామే ఈ దేశాన్ని పాలిస్తున్నామనుకుంటారని, ప్రజలను తమతో సమానంగా కాకుండా తమ ముందు యాచించేవారుగా భావిస్తారని ఆ మేధావులు విమర్శించారు. ఉదాహరణకు బ్రిటిష్‌వారు నిర్మించిన ఇంపీరియల్ సివిల్ సర్వీస్ అనే ఉక్కు చట్రంలోంచే ఇండియన్ సివిల్ సర్వీస్ ఏర్పడింది. ఇందులో ఇండియన్ కానీ, సివిల్ కానీ, సర్వీస్ కానీ ఏమీ లేవని ఒక మేధావి ఏనాడో వ్యాఖ్యానించారు. అదే విధంగా ఇండియన్ పోలీసు సర్వీసు కూడా. భారతీయ ప్రజలకు సేవ చేసేందుకు కాకుండా బ్రిటిష్ సామ్రాజ్య ఆధిపత్యాన్ని కాపాడే లక్ష్యంతో రూపొందించిన పోలీసు వ్యవస్థనే మనం కొనసాగిస్తున్నామని, అందుకే తమ రాజకీయ యజమానుల ప్రయోజనాలను కాపాడే లక్ష్యంతో అణిచివేత ఈ వ్యవస్థ ప్రధాన స్వభావమైందని రెండవ పరిపాలనా సంస్కరణల కమిషన్ తెలిపింది. మన ఇండియన్ పీనల్ కోడ్ తొలి అధ్యాయమే నేరపూరిత కుట్ర, రాజ్యానికి వ్యతిరేకంగా నేరాలతో ప్రారంభమవుతుంది. మహాత్మాగాంధీ, బాలగంగాధర్ తిలక్‌లను అరెస్టు చేసేందుకు ఉపయోగించిన రాజద్రోహ చట్టాన్ని ఇంకా కొనసాగించడం అవసరమా అని గత మేలో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ ప్రశ్నించాల్సి వచ్చింది. రాజద్రోహమే కాదు బ్రిటిష్ ప్రభుత్వం రద్దు చేసిన పలు చట్టాలు ఇంకా మన దేశంలో కొనసాగుతున్నాయి.


1947 తర్వాత కేంద్ర సాయుధ పోలీసు బలగాల సంఖ్యను పెంచడం, రాజకీయ ఇంటెలిజెన్స్‌ను విస్తరించడం తప్ప పోలీసు వ్యవస్థలో జరిగిన మార్పులు ఏమీ లేవని హోం శాఖ మాజీ అధికారి కె. సుబ్రహ్మణ్యం తెలిపారు. ఐపీసీలోనూ, క్రిమినల్ ప్రోసీజర్ కోడ్‌లోనూ అరకొర మార్పులే జరిగాయి. జరిగిన మార్పులు కూడా అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగానికే ఎక్కువ తోడ్పడ్డాయని ఆయన అన్నారు. సిఆర్‌పిసిలో దర్యాప్తు, నేరాల విచారణ కంటే ఎక్కువ ప్రాధాన్యత పోలీసు బలగాలను ప్రయోగించడానికే ఇచ్చారని ఆయన చెప్పారు. అల్లర్లు జరిగాయన్న పేరుతో ప్రజలను శిక్షించడం, అణిచివేయడం, ప్రైవేట్ వ్యక్తులను ప్రత్యేక పోలీసు అధికారులుగా నియమించడం, ఎవరినైనా అరెస్టు చేసి కనీసం 24 గంటలు నిర్బంధించగలగడం వంటి విస్తృత అధికారాలు కల్పించారని సుబ్రహ్మణ్యం చెప్పారు. 1861లో బ్రిటిష్ ప్రభుత్వం చేసిన పోలీసు చట్టం ఇంకా అమలు అవుతోంది. బ్రిటిష్ పాలనలో నెలకొల్పిన ఐబీ, స్పెషల్ బ్రాంచ్ ఇప్పుడు అవే రూపంలో అవే పనులు చేస్తున్నాయి. 1942లో భారత స్వాతంత్ర్యోద్యమాన్ని అణిచివేసేందుకు బ్రిటిష్ కాలంలో చేసిన ఆర్డినెన్స్ ఆధారంగా రూపొందించిన సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని క్రమక్రమంగా ఈశాన్య రాష్ట్రాల నుంచి కశ్మీర్‌కు విస్తరించారు. ఎప్పుడుపడితే అప్పుడు ఎవరిని అయినా కాల్చివేసే విచక్షణాధికారాలు ఉన్న ఈ చట్టం స్వాతంత్ర్యం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత కూడా దేశంలో కొన్ని ప్రాంతాల్లో అమలు అవుతోంది.


ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ తర్వాత బిజెపి పూర్వరూపమైన జనసంఘ్ భాగస్వామిగా ఉన్న జనతా పార్టీ ప్రభుత్వం నియమించిన జాతీయ పోలీసు కమిషన్ పోలీసు సంస్కరణలకు సంబంధించి ఎనిమిది నివేదికలను సమర్పించింది. పోలీసుల పనిలో రాజకీయ నేతల విచ్చలవిడి జోక్యాన్ని స్పష్టంగా పేర్కొంటూ రాజకీయేతర వ్యక్తుల పర్యవేక్షణలో భద్రతా కమిషన్లను నియమించాలని కోరింది. కానీ ఈ సిఫారసులను ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు. ఆ తర్వాత రెబేరో, పద్మనాభయ్య, మాలిమత్ తదితర కమిటీల సిఫారసులూ కాలగర్భంలో కలిసిపోయాయి. పైగా కొత్త చట్టాలు, ఎన్ఐఏ వంటి కొత్త సంస్థలను పాత వ్యవస్థ ఆశించిన అణిచివేతను మరింత బలోపేతం చేసేందుకే నూతన ఆయుధాలుగా ఉపయోగించుకున్నారు కాని ప్రజాస్వామ్యం, ప్రజల స్వేచ్ఛ ఆరోగ్యవంతంగా పరిఢవిల్లేందుకు అవి దోహదం కాలేదు. మన జైళ్ల వ్యవస్థ కూడా బ్రిటిష్ కాలం నాటిదే. 1894 నాటి జైళ్ల చట్టమే మౌలికంగా మారకుండా ఇప్పుడు అమలు అవుతోంది. జైళ్లను మానవీయంగా మార్చేందుకు అనేక సంస్కరణల కమిటీలను నియమించినప్పటికీ జైళ్లు ఆధునిక నేర స్వభావ ఆలోచనా విధానానికి, సామాజిక సూత్రాలకు అనుగుణంగా మారలేకపోయాయి. సమాజంలో అణగారిన వర్గాలు, ఆదివాసీలు, దళితులు అత్యధిక సంఖ్యలో జైళ్లలో మగ్గుతున్నారని గణాంక వివరాలు చెబుతున్నాయి.


మారుతున్న కాలానికి ప్రతిబంధకంగా ఉన్న వలస పాలననాటి పోలీస్, సివిల్, ఇతర అధికార వ్యవస్థల్ని, బ్రిటిష్ కాలం నాటి చట్టాల్ని సమూలంగా మార్చవలసిన అవసరమున్నది. ప్రధాని మోదీ ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడే ఆయన భారతదేశాన్ని వలస పాలన కాలం నాటి బానిస మనస్తత్వం నుంచి విముక్తి చేసినట్లవుతుంది. ఈ వ్యవస్థలే కాదు, ఎన్నికలు నిర్వహించే ఎన్నికల కమిషన్, అవినీతిని, నేరాలను దర్యాప్తు చేసే సిబిఐ, సివిసి, ఈడీ లాంటి సంస్థలు ఒక రాజకీయ పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా కాక, స్వతంత్రంగా, ప్రజాస్వామికంగా పనిచేసేందుకు అవకాశం కల్పించాలి. అప్పుడే వలసపాలకుల స్వభావం నుంచి భారతదేశానికి స్వేచ్ఛను సాధించినట్లవుతుంది. ఎన్నికల్లో వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రజాస్వామ్యాన్ని కొనుగోలు చేసే సంస్కృతిని మార్చినప్పుడే దేశాన్ని ఆధునికంగా మార్చేందుకు వీలవుతుంది.


కుటుంబ, వారసత్వ పాలన నుంచి దేశాన్ని విముక్తి చేయాలన్న ఆలోచన సరైనదే. కానీ దేశంలో అధికారంలో ఉన్న అతి పెద్ద పార్టీ కేవలం ఒక వ్యక్తి జేబు సంస్థగా మారడం, మిగతా వ్యక్తులు అంతా ఆ వ్యక్తి చుట్టూ భజనపరుల్లా మారే పరిస్థితి ఏర్పడడం వారసత్వ పాలన కంటే ప్రమాదకరమైనది. కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం చుట్టూ తిరగడం ప్రశ్నించదగ్గ విషయమే. మరి 2024 ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ మోదీ తర్వాత ఎవరు, ఆయనకు ప్రత్యామ్నాయం ఎవరు అన్న చర్చ కొనసాగేందుకు బిజెపిలో ఎవరూ ముందుకు రాకపోవడం ఆశ్చర్యకరం.


అంతే కాదు, ఆర్థిక విధానాలు, కార్పొరేటీకరణ కొందరు వ్యక్తులకు అనుగుణంగా జరగడం కూడా చర్చించాల్సిఉన్నది. ఇద్దరు వ్యాపారుల కోసమే మోదీ పనిచేస్తున్నారన్న రాహుల్ ఆరోపణలను నిర్దిష్టంగా ఖండించాల్సిన బాధ్యత వలసపాలన కాలం నాటి బానిసత్వం నుంచి విముక్తి కావాలనుకుంటున్నవారిపై ఉన్నది. విదేశాంగ విధానం విషయమేమిటి? అది స్వతంత్ర విధానమేనా అన్న చర్చ జరుగుతోంది, మోదీ అధికారంలోకి వచ్చాక గత ఎనిమిదేళ్లలో భారత విదేశాంగ విధానం పూర్తిగా అమెరికా కేంద్రీకృతంగా మారింది. అయినప్పటికీ మన అభ్యంతరాలను ప్రక్కన పెట్టి పాకిస్థాన్‌కు ఎఫ్–16 యుద్ధ విమానాల ఆధునికీకరణకోసం అమెరికా తాజాగా 450 మిలియన్ డాలర్ల విలువైన పరికరాలను సరఫరా చేసింది. ఇప్పటికైనా భారత్ మన విదేశాంగ విధానంలో వలసకాలపు అవలక్షణాలను వదిలించుకోవాలి. మన ప్రయోజనాలకు తగ్గట్లుగా స్వతంత్ర విదేశాంగ విధానాన్ని రూపొందించుకోవాల్సి ఉన్నది. వలస మనస్తత్వం పోవాలంటే మన భావాల్లో, ఆచరణలో, నిర్ణయాల్లో, వ్యవస్థల ప్రక్షాళనలో మార్పు రావాలి కాని కేవలం రోడ్లూ, రాళ్లూ రప్పల పేర్లు మారిస్తే సరిపోదు.


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Read more