ఆకలి భారతం మాయంటావా?

ABN , First Publish Date - 2022-10-19T06:07:57+05:30 IST

మండుటెండల్లో మండిపోయిన నేలపై ఉన్నట్లుండి వర్షం కురిస్తే, మట్టి పరిమళం అంతటా వ్యాపిస్తే, తడిసిపోయిన ఆనందంతో చెట్ల ఆకులు పలకరిస్తే ఎలా ఉంటుందో నిన్న మొన్నటి వరకు ఢిల్లీ వాసులకు...

ఆకలి భారతం మాయంటావా?

మండుటెండల్లో మండిపోయిన నేలపై ఉన్నట్లుండి వర్షం కురిస్తే, మట్టి పరిమళం అంతటా వ్యాపిస్తే, తడిసిపోయిన ఆనందంతో చెట్ల ఆకులు పలకరిస్తే ఎలా ఉంటుందో నిన్న మొన్నటి వరకు ఢిల్లీ వాసులకు అనుభవంలోకి వచ్చింది. యమునా నదిపై నిర్మించిన వంతెనలపై వాహనాలలో వెళ్లే ప్రజలకు మరో అనుభవం కూడా ఎదురైంది. గత కొద్ది రోజులుగా వంతెనలకు, సమీపంలోని రహదారులకు ఇరువైపులా చివర్లో కట్టిన టార్పాలిన్ గుడిసెల క్రింద వేలాది ప్రజలు తల దాచుకుంటూ కనిపిస్తున్నారు. యమునానదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వాడల్లో ఉన్నవారంతా అకస్మాత్తుగా వరదలు వస్తే దిక్కుతోచక చేతికందిన వస్తువులు తీసుకుని రోడ్లపైకి వచ్చి ఫుట్‌పాత్‌లపై సంసారాలు చేయాల్సి వస్తే తలెత్తిన పరిస్థితి ఇది. సరైన దుస్తులు లేని చిన్న పిల్లలు మేకలు, కోళ్ల మధ్య నిలుచుని రోడ్లపై భీకరంగా వెళుతున్న వాహనాలను చూస్తూ కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టామేమోనని బిత్తరపోయి కనపడుతున్నారు. ఉదయాన్నే కాలనీల్లోంచి మార్నింగ్ వాక్‌కు వచ్చే వారికి స్త్రీలు తమ కాలకృత్యాలు తీర్చుకునేందుకు కష్టపడి వంతెన దిగి చెట్ల మధ్యకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాలు కనపడుతున్నాయి. అన్నిటికన్నా మించి ఏదో ఎన్జీవో వాహనంలో ఆహారం తీసుకువస్తే మైళ్ల పొడుగునా పళ్లాలు, గిన్నెలను పట్టుకుని పేద జనం క్యూలలో నిలబడిన దృశ్యాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. దేశ రాజధానిలో ఉన్నామా అన్న అనుమానం కలుగుతుంది. గతంలో కరోనా వ్యాపించినప్పుడు ప్రభుత్వం ఆకస్మికంగా లాక్‌డౌన్ విధిస్తే లక్షలాది వలస కార్మికులు బస్‌స్టాండ్‌ల్లో కిక్కిరిసిపోవడం; రైలు పట్టాలపై, రహదారులపై వందలాది మైళ్లు నడిచి తమ స్వస్థలాలకు వెళ్లడం వంటి దృశ్యాలు కనపడినప్పుడు ఇంతమంది పొట్టకూటికోసం నగరాలకు వలస వస్తారా అని ప్రభుత్వాలే ఆశ్చర్యపడాల్సి వచ్చింది. కాని ప్రతీ ఏటా నదులకు వరదలు వచ్చినప్పుడు తట్టాబుట్టా సర్దుకుని రోడ్ల పైకి వస్తున్న వేలాది అభాగ్యులకు ఏ ప్రభుత్వాలు శాశ్వత పరిష్కారాన్ని అందిస్తున్నాయి?


వరద బాధితులు, నిర్వాసితులు, వలస కార్మికులు, రైతు కూలీలు, ఆకలి చావుల గురించి ప్రభుత్వాలు యాంత్రికంగా తీసుకుంటున్నాయి. ఈ కారణంగానే అనేక దేశాల్లో ముఖ్యంగా భారత్‌లో పేదరికాన్ని, ఆకలి చావులను నిర్మూలించడం సాధ్యపడడం లేదు. అందుకే ప్రతి ఏటా కొన్ని సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పరిశోధన చేసి ఏఏ దేశాల్లో పేదరికం ఎంత ఉన్నది, ఆకలిని ఎంతవరకు తగ్గించగలిగారు అన్న అంశాలపై నివేదికలు ప్రచురించినప్పుడు కూడా ప్రభుత్వాలు యథాలాపంగా కొట్టి పారేస్తాయి. విదేశాలు మన దేశంపై పన్నిన కుట్రలో భాగమే ఆ నివేదికలు అని తీసిపారేస్తాయి. తాజాగా విడుదలైన ‘ప్రపంచ ఆకలి సూచీ’ (గ్లోబల్ హంగర్ ఇండెక్స్) నివేదిక ప్రకారం 121 దేశాల్లో భారతదేశం 107వ స్థానంలో ఉన్నది; పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక కంటే కూడా మనం ఎంతో వెనుకబడి ఉన్నాము! దక్షిణాసియాలోని చాలా దేశాల కంటే భారతదేశం స్థితి దయనీయంగా ఉన్నదని ఆ నివేదిక చెప్పింది. అయిదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల్లో 19.3 శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని తేల్చింది. ఎక్కడో ఐర్లాండ్, జర్మనీలో ఉన్న సంస్థలకు భారత్‌ను పనిగట్టుకుని అవమానించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవి ఒక్క భారత్‌లోనే తమ సర్వేలు చేయలేదు. ప్రపంచంలోని అన్ని దేశాలలో సర్వేలు నిర్వహించాయి. పోషకాహారం లేకపోవడం ఆకలిని అంచనా వేయడంలో కీలకపాత్ర పోషిస్తుందని ‘ప్రపంచ ఆకలి సూచీ’ భావిస్తుంది. పోషకాహార లోటు అనే ప్రమాణానికి విస్తృత ఆమోదం ఉన్నది.


ఈ నేపథ్యంలో మరో అయిదేళ్లలో అమెరికా, చైనా తర్వాత మనమే మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనున్నామని, జర్మనీ, జపాన్‌లు మనకంటే వెనుకబడిపోతున్నాయని, భారతదేశం వేగంగా ఆభివృద్ధి చెందుతూ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారబోతున్నదని మన నేతలు చెప్పుకోవడంలో ఎంత వాస్తవం ఉన్నది? ఈ విషయంలో కొన్ని అంతర్జాతీయ నివేదికలను ఉటంకించి సమర్థించుకుంటున్న మన పాలకులు ఆకలి విషయంలో కూడా అంతర్జాతీయ సంస్థలు ఇచ్చే నివేదికలను ఎందుకు తేలికగా కొట్టి పారేస్తున్నారు? ఆకలి విషయంలో 2020లో 94వ స్థానంలో, 2021లో 101వ స్థానంలో ఉన్న మన దేశం 2022లో 107వ స్థానానికి చేరుకోవడం అభివృద్ధికి తార్కాణమా? లేక రోజురోజుకూ పెరుగుతోన్న పేదరికానికి సంకేతమా? గత రెండేళ్లుగా మేము 80కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు సరఫరా చేస్తున్నాం కదా ఇంకా ఆకలి ఎక్కడుంటుంది? అని ప్రభుత్వం సమర్థించుకోవచ్చు. ఆకలి ఉంటేనే కదా జనాభాలో మూడోవంతుకు ఆహార ధాన్యాలు ఉచితంగా ఇవ్వాల్సి వస్తోంది అన్న ఆలోచన కూడా వెంటనే తలెత్తుతుంది.


ప్రపంచ దేశాల్లో భారత గౌరవం పెరిగిపోతోందని ప్రధాని మోదీతో పాటు ఆయన మంత్రులు తరుచూ ప్రకటనలు చేస్తుంటారు. మోదీతో సంప్రదించిన తర్వాతే ప్రపంచంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని ఒక మంత్రి వ్యాఖ్యానించారు. భారతదేశం విశ్వగురువుగా రూపుదాలుస్తోందని కూడా అనేకమంది బిజెపి నేతలు పదే పదే చెప్పుతున్నారు. మరి అంతటి ఉన్నత స్థానంలో ఉన్న భారత దేశంలో ఇంతటి దరిద్రం ఎందుకు ఉన్నది? ఎక్కడో ఉత్తర అమెరికాలో ఉన్న ‘మార్నింగ్ కన్సల్ట్’ అనే సంస్థ పదే పదే ప్రపంచంలో అత్యంత జనాదరణ గల నేత నరేంద్రమోదీయే అని ప్రకటిస్తోంది. ఇండియాలో మోదీ అధికారంలోకి వచ్చిన సంవత్సరమే ఈ సంస్థను నెలకొల్పారు. ఈ సంస్థ చేసే ప్రకటనలకు బిజెపి నేతలు పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తుంటారు. మన దేశంలో ఆకలి గురించి సర్వే చేసిన సంస్థల మాటలు నిజమా లేక మార్నింగ్ కన్సల్ట్ లాంటి సంస్థల మాటలు నిజమా? లేక రెండు సర్వేలు బూటకమా? ఏ సర్వే సంస్థలైనా రెండు, మూడు వేల మంది ప్రజలను శాంపిల్‌గా మాత్రమే తీసుకుని సర్వేలు చేస్తాయి. వారు ఏ విషయం చెప్పదలుచుకున్నారన్న దానిపై సర్వే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. అయితే ప్రైవేట్ సంస్థలు చేసే సర్వేల కంటే ఐక్యరాజ్యసమితి సంస్థలు చేసే సర్వేలకు విశ్వసనీయత ఎక్కువ ఉంటుంది, అందుకే ఐక్యరాజ్యసమితికి చెందిన సంస్థలు మన పేదరికం, ఆకలిపై ఇచ్చే నివేదికలకు ప్రాధాన్యమివ్వాల్సి ఉంటుంది. నిజానికి ‘ప్రపంచ ఆకలి సూచీ’కి ఆధారభూతమైన సర్వేల్లో మాత్రమే కాదు, కొద్ది రోజుల క్రితం ఇతర సంస్థలు కూడా భారతదేశంలో పరిస్థితి అంత ఆశాజనకంగా లేదని తేల్చాయి. భారతదేశంలో 5.6 కోట్ల మంది పేదలు అదనంగా పేదరికంలోకి జారుకున్నారని ప్రపంచ బ్యాంకు తన నివేదికలో తేల్చింది. ప్రపంచంలో ఆహార భద్రత, పోషకాహార విలువలపై ఐదు ఐక్యరాజ్యసమితి సంస్థలు గత జూలైలో విడుదల చేసిన నివేదిక (ఎస్ఓఎఫ్ఐ) ప్రకారం కూడా భారతదేశంలో 56 కోట్లమంది ప్రజలు అంటే 40.6శాతం మంది ప్రజలు ఆహార అభద్రతలో ఉన్నారని తేల్చాయి. భారతదేశంలో ఆహార అభద్రతకు గురవుతున్న వారి సంఖ్య ప్రతీ ఏటా పెరుగుతోందని ఈ నివేదికలు తెలిపాయి. తాజాగా విడుదలైన ‘ప్రపంచ ఆకలి సూచిక’ నివేదికకూ ప్రపంచ బ్యాంకు, ఐక్యరాజ్యసమితికి చెందిన సంస్థలు విడుదల చేసిన నివేదికకూ పెద్ద తేడా ఏమీలేదు.


అందువల్ల తమకు అనుకూలంగా కనిపించే సర్వేలకు ప్రచారం కల్పించి, ప్రతికూలంగా ఉన్న సర్వేలను కొట్టి పారేయడం వల్ల తాత్కాలిక ప్రయోజనం ఉంటుందేమో కాని ఆ సర్వేల ప్రాధాన్యాన్ని తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. సమస్యలను నిరాకరించడం వల్ల సమస్యలను పరిష్కరించలేము. పేదరికం, ఆకలిపై వచ్చే అంతర్జాతీయ నివేదికల్లోనే కాదు, ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ, మానవ హక్కుల ఉల్లంఘన, మత స్వాతంత్ర్యం వంటి అనేక అంశాలపై వచ్చే నివేదికల్లో కూడా భారతదేశం గురించి ఆయా అంతర్జాతీయ సంస్థలు ఏమంత సదభిప్రాయం వ్యక్తం చేయలేదు. భారతదేశంలో పాక్షిక స్వేచ్ఛ, పాక్షిక ప్రజాస్వామ్యం మాత్రమే ఉన్నదని పలు సంస్థలు తెలిపాయి. ఎల్ సాల్వడార్, టర్కీ, హంగరీతో పాటు నియంతృత్వ రాజ్యాలుగా మారుతున్న పది ప్రధాన దేశాల్లో భారతదేశం ఉన్నదని స్వీడన్‌కు చెందిన ఒక సంస్థ తెలిపింది. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని చెప్పుకునే మన దేశం గురించి ఇలాంటి సంస్థలు ప్రకటించే నివేదికలు తప్పని తేల్చాల్సిన బాధ్యత మన దేశ నాయకులపై ఉన్నది. మన దేశంలో ప్రజాస్వామ్యం సవ్యంగా ఉన్నదని, మన దర్యాప్తు సంస్థలు, పోలీసులు ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా పారదర్శకంగా, రాజ్యాంగం ప్రకారం పనిచేస్తాయని, స్వేచ్ఛగా అభిప్రాయాలు వెలిబుచ్చేవారి విమర్శలకు భారతదేశంలో ఎంతో గౌరవం ఉంటుందని, అన్ని నిర్ణయాలను ప్రజాస్వామ్యబద్ధంగా, చర్చల ద్వారా తీసుకుంటామని, మన జైళ్లు, న్యాయవ్యవస్థలు, రాజ్యాంగ సంస్థలు సవ్యంగా సక్రమంగా పనిచేస్తున్నాయని ఘంటాపథంగా ప్రపంచానికి చెప్పుకోవడానికి మనం వెనుకాడాల్సిన పని లేదు. మన దేశానికి వ్యతిరేకంగా విడుదలైన నివేదికలను గణాంక వివరాలతో సహా శాస్త్రీయంగా ఖండించే అవకాశం ఎప్పటికీ ఉంటుంది. ఈ నివేదికలు తప్పని, అందులో ఉన్నదంతా చెత్తని తేలికగా కొట్టి పారేయడంతో సరిపోదు. మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వాషింగ్టన్ వెళ్లి రూపాయి విలువ పడిపోవడం లేదని, డాలర్ బలోపేతమవుతుందని సమర్థించుకున్నారు. ఇటీవల చెన్నైలో ఒక కూరగాయల మార్కెట్‌కు వెళ్లినప్పుడు కూరగాయలు కొనేందుకు ఆమె ఏ కరెన్సీ ఉపయోగించారా అన్న సందేహం కలుగుతోంది.


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Read more