పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఎక్కడుంది?

ABN , First Publish Date - 2022-07-27T06:23:16+05:30 IST

భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం విజయవంతంగా అమలవుతోందని చెప్పుకుంటాం. కానీ పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడల్లా అసలు పార్లమెంటరీ...

పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఎక్కడుంది?

భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం విజయవంతంగా అమలవుతోందని చెప్పుకుంటాం. కానీ పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడల్లా అసలు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఎక్కడుందన్న అనుమానం కలుగుతుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమై ఏడు రోజులైనప్పటికీ ఒక్క రోజు కూడా పార్లమెంట్ సరిగ్గా సాగలేదు. పార్లమెంట్ ముఖాన్ని తొలిసారి చూస్తున్న కొత్తగా ఎంపికైన కొన్ని పార్టీల ఎంపీలు ఓనమాలు కూడా నేర్చుకోకముందే మొదటి రోజు నుంచే వెల్‌లోకి దూసుకువచ్చి సస్పెన్షన్‌కు గురవుతున్నారు. సభలో అన్నిటికంటే ముందుగా దేశంలో పెరుగుతున్న ధరలు, జీఎస్టీ పెంపు, అగ్నిపథ్, నిరుద్యోగం లాంటి అంశాలపై చర్చించి జవాబివ్వాలని ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్‌ను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ప్రతిపక్షాలు ప్రవేశపెడుతున్న వాయిదా తీర్మానాలను సభాపతులు బుట్టదాఖలు చేస్తున్నారు. కనీసం సభా వ్యవహారాల కమిటీ సమావేశాల్లో కూడా కీలక అంశాలపై చర్చకు సమయాన్ని కేటాయించేందుకు ప్రభుత్వం మనస్ఫూర్తిగా ముందుకు రావడం లేదు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పుడల్లా ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రతి అంశంపై చర్చించడానికి తాము సిద్ధమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అంటూనే ఉంటారు కానీ సభలు సమావేశమైన తర్వాత అలాంటి సుహృద్భావ వాతావరణం మాత్రం కనపడదు.


పార్లమెంటరీ రాజకీయాలను అర్థం చేసుకోవాలంటే చట్టసభల నియమ నిబంధనల పట్ల అవగాహన ఉండాలి. గతంలో పైకి అత్యంత తీవ్రంగా కనిపించిన సమస్య ఉన్నట్లుండి చల్లారిపోయేది. సభ ఈ రోజు కూడా సజావుగా సాగదేమో అనుకుని గ్యాలరీలోకి ప్రవేశించేసరికి అధికార, ప్రతిపక్షాలు హాయిగా నవ్వుకుంటూ సభా కార్యకలాపాలను సజావుగా నడిపిస్తూ కనపడేవారు. ఒక రోజు తీవ్రంగా ఘర్షణ పడి అధికారపక్షం వేసే ప్రతి అడుగునూ అడ్డుకునే విపక్ష సభ్యులు మరునాడు ఏమీ ఎరుగనట్లు మౌనంగా ఉండిపోయేవారు. పార్లమెంట్‌ను నడిపించేందుకు రాజనీతిజ్ఞత అవసరం. ఒక్కోసారి చిన్న చిరునవ్వు, స్నేహపూర్వక కరచాలనం అతి పెద్ద సమస్యను కూడా పరిష్కారమయ్యేలా చేస్తాయి. మిత్రులను మంచి మిత్రులుగా, శత్రువులను తటస్థులుగా, తటస్థులను మిత్రులుగా మార్చుకోగలగడమే సరైన రాజనీతికి, నిర్వహణా శక్తికి నిదర్శనం.


నిజానికి గతంలో సభల నిర్వహణ సజావుగా సాగే విషయంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కీలకపాత్ర పోషించేవారు. కాంగ్రెస్ హయాంలో గులాంనబీ ఆజాద్, కమల్‌నాథ్‌లు ప్రతిపక్ష నేతలతో నేరుగా సంబంధం పెట్టుకుని వివాదాస్పద అంశాలపై ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదుర్చుకునేవారు. వెంకయ్యనాయుడు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా ఉన్న కాలంలో తొలి రోజుల్లో ఇలాంటి వాతావరణమే కనపడేది. ప్రధానమంత్రి తన ప్రిన్సిపల్ సెక్రటరీగా నృపేంద్ర మిశ్రా అనే అధికారిని నియమించుకునేందుకు సంబంధించిన ఒక ఆర్డినెన్స్ బిల్లుపై 2014లో వర్షాకాల సమావేశాల్లో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆర్‌జెడి, సిపిఐ(ఎం), అన్నాడిఎంకె, ఎస్పీ, డిఎంకెతో పాటు అనేక ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. కాని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా వెంకయ్యనాయుడు రంగంలోకి దిగిన తర్వాత పరిస్థితి మారిపోయింది. టెలికమ్యూనికేషన్ల మంత్రి రవిశంకర్ ప్రసాద్ బిల్లును ఓటింగ్‌కు ప్రవేశపెట్టినప్పుడు ఆ బిల్లును కాంగ్రెస్, ఆర్‌జెడి, సిపిఐ(ఎం) సభ్యులు తప్ప ఎవరూ వ్యతిరేకించలేదు. ‘‘ఒక అధికారి నియామకం ఏమైనా దేశ ప్రయోజనాలకు వ్యతిరేకమా? లేక సైద్ధాంతిక అంశమా? ఎందుకు అనవసరంగా వ్యతిరేకిస్తున్నారు?’’ అని వెంకయ్య జయలలిత, మమతా బెనర్జీ, ములాయం సింగ్ యాదవ్, మాయావతి, శరద్ పవార్, కనిమొళి, శరద్ యాదవ్ తదితరులను అడిగారు. చివరకు ఇతర పార్టీలు సహకరించకపోవడంతో కాంగ్రెస్ కూడా వాకౌట్‌తో సరిపెట్టుకుంది. 2016 జనవరిలో జీఎస్టీ బిల్లుకు ప్రతిపక్షాల మద్దతును పొందేందుకు చేసిన ప్రయత్నాల్లో భాగంగా వెంకయ్యనాయుడు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని కూడా కలుసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా సోనియా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లను తేనీటి విందుకు ఆహ్వానించి ఈ అంశంపై చర్చించారు. మోదీ ప్రభుత్వం ఏర్పడిన తొలి సంవత్సరాల్లో రాజకీయ సుహృద్భావ వాతావరణం ఉండేదని చెప్పేందుకు ఇది నిదర్శనం. కాని క్రమక్రమంగా ఈ వాతావరణం మాయమైపోయింది. 2016 జూలైలో వెంకయ్యను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ నుంచి తప్పించి సమాచార, ప్రసార శాఖను కేటాయించారు, ఆయన స్థానంలో వచ్చిన అనంతకుమార్ అంత సమర్థవంతంగా పనిచేయలేకపోయారు. క్రమంగా ప్రతిపక్షాలకూ, ప్రభుత్వానికీ మధ్య ఘర్షణ వాతావరణం పెరగడమే కానీ, తగ్గిన దాఖలాలు కనపడలేదు. మోదీ రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత సంఘర్షణ మరింత పెరుగుతూ వస్తోంది. ఇప్పుడైతే అధికార, ప్రతిపక్షాల మధ్య పరిస్థితి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మారింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఫలానా బిల్లును ఫలానారోజు ఆమోదించాల్సిందేనని సభాపతులకు చెప్పడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. ప్రతిపక్షాలు ఎంత గందరగోళం రేకెత్తించినా తమకు అవసరమైన బిల్లులను ఆమోదింపచేసుకోవడం ప్రభుత్వానికి ఆనవాయితీ అయిపోయింది. అంతేకాదు, ప్రతిపక్షాలు ఎంత తీవ్రమైన సమస్యను లేవనెత్తినా వారికి జవాబివ్వనవసరం లేదని ప్రభుత్వంలో ఉన్నవారు భావించే పరిస్థితి ఏర్పడింది.


ఈ పరిణామం జరగడానికి ప్రధాన కారణం ప్రజలు రెండోసారి కూడా నరేంద్రమోదీ సారథ్యంలో బిజెపిని ఎన్నుకోవడం, ప్రతిపక్షాలను తిరస్కరించడం. 2019కి ముందు పెద్ద నోట్ల రద్దుపై ప్రతిపక్షాలు ఎంత తీవ్ర స్వరాన్ని వినిపించినా మోదీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ మరింత కుంచించుకుపోయింది. ఆ తర్వాత సిఏఏ, సాగు చట్టాలు, రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు, లఖింపూర్ ఖేరీలో వాహనం కింద నలిగి రైతులు మరణించడం, ధరల పెరుగుదల మొదలైన అనేక అంశాలపై కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు ఉభయ సభలను రోజుల తరబడి ప్రతిష్టంభింప చేశాయి. కాని ఉత్తరప్రదేశ్‌లో కూడా రెండోసారి బిజెపి ఘన విజయం సాధించింది. అనేక ఇతర రాష్ట్రాల్లో బిజెపి తిరిగి అధికారంలోకి రాగలిగింది. ప్రతిపక్షాలు బలహీనమవుతున్నకొద్దీ వాటిని మరింత బలహీనం చేసేందుకు బిజెపి అనేక ఎత్తుగడలను ప్రయోగించి పలు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను, ముఖ్య నేతలను తమ వైపుకు తిప్పుకుని అధికారాన్ని హస్తగతం చేసుకున్నది. 2014లో బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాడులు పెరిగిపోయాయని, 2019లో మోదీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈడీ మరింత విజృంభించిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌధురి సోమవారం లోక్‌సభలో అంగీకరించారు. 2014–15లో ఈడీ చేపట్టిన కేసుల సంఖ్య 1,093 కాగా, 2021–22 నాటికి ఈ సంఖ్య అయిదురెట్లకు పెరిగి 5,493 కేసులకు చేరుకున్నదని ఆయన చెప్పారు. గత పదేళ్లలో ఈడీ విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం కింద 24,893 కేసులను, మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద 3,985 కేసులను చేపట్టిందని ఆయన చెప్పారు. మోదీ హయాంలో రాజకీయ ప్రత్యర్థులను బలహీనపరిచేందుకు కేంద్ర సంస్థలను ప్రయోగిస్తున్నారని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు కేంద్ర మంత్రి ఇచ్చిన సమాచారం బలం చేకూరుస్తోందా?


ఏమైనా ప్రతిపక్షాలన్నా, వారి నిరసనలన్నా ప్రభుత్వానికి లెక్కలేకుండా పోయిందని అర్థమవుతోంది. అసలు వారితో చర్చించడమే అనవసరమని ప్రభుత్వం భావిస్తోంది, ఏ విధంగానైనా తాము అధికారంలోకి రాగలమన్న ధీమా, సభ్యులను సస్పెండ్ చేసి మరీ బిల్లులను ఆమోదించుకోగలమన్న ధైర్యం ప్రభుత్వానికి ఏర్పడింది. తద్వారా ధరల పెరుగుదల, అగ్నిపథ్ వంటి కీలక అంశాలపై ప్రభుత్వం ఏమనుకుంటుందో తెలుసుకునే అవకాశం ప్రజలకు లేకుండా పోతోంది. ఇవాళ దేశంలో అసాధారణమైన రీతిలో ద్రవ్యోల్బణం కొనసాగుతోంది. నిత్యావసర వస్తువుల దిగుమతి వ్యయం తీవ్రంగా పెరిగింది. పెట్రోలు, డీజిల్, గ్యాసు, వంటనూనెల ధరలే కాక, ప్రతి నిత్యావసర వస్తువు ధరా ఆకాశానికి అంటింది. పైపెచ్చు ఆహార పదార్థాలపై కూడా జీఎస్టీ వడ్డింపులు పెరిగాయి. వీటన్నిటికీ సమాధానాలు ఇవ్వమని ప్రతిపక్షాలు కోరితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొవిడ్‌తో బాధపడుతున్నారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి విచిత్రమైన సమాధానం చెబుతున్నారు. ఆర్థిక మంత్రి లేకపోతే ఆర్థిక వ్యవస్థ సాగదా? పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రతి అంశానికి ప్రభుత్వానికి సమష్టి బాధ్యత ఉంటుంది. ప్రధానమంత్రి కాకపోయినా, ఇతర సీనియర్ మంత్రులైనా పార్లమెంట్‌లో సమాధానం చెప్పకపోవడానికి కారణాలేమిటి? ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు వారి వద్ద సమాధానాలు లేవా? లేక లెక్కలేనితనం ప్రభుత్వాన్ని ఆవరించిందా? ఏ పార్టీకైనా రాజకీయాలు, ఎన్నికల్లో విజయం సాధించడాలు అవసరమే. కానీ విజయం సాధించినంత మాత్రాన, ప్రతిపక్షాలు ఏమీ చేయలేకపోయినంత మాత్రాన పార్లమెంట్ సమావేశాలతో పాటు పార్లమెంటరీ సంప్రదాయాలు గంగలో కలుస్తున్నా పట్టించుకోకపోవడం ఆరోగ్యకర ప్రజాస్వామ్యానికి సంకేతం కాదు. కోరలు చాచిన సింహాల కింద నిర్మించిన కొత్త పార్లమెంట్ భవనంలో జరగబోయే సమావేశాలైనా సజావుగా సాగుతాయా? లేక ప్రభుత్వం ఇదే విధంగా ప్రతిపక్షాలపై కోరలు చాస్తుందా?


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Read more