కోటీశ్వరులపై సంపద పన్ను వేస్తారా?

ABN , First Publish Date - 2022-01-26T06:56:42+05:30 IST

మోదీప్రభుత్వం గురించి దేశ ప్రజలుఏమి ఆలోచిస్తున్నారు? ఇండియా టుడే తాజాగా నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ద నేషన్’ సర్వే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పెరుగుతున్న జనాదరణపై విశేషచర్చ రేకెత్తించింది...

కోటీశ్వరులపై సంపద పన్ను వేస్తారా?

మోదీప్రభుత్వం గురించి దేశ ప్రజలుఏమి ఆలోచిస్తున్నారు? ఇండియా టుడే తాజాగా నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ద నేషన్’ సర్వే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పెరుగుతున్న జనాదరణపై విశేషచర్చ రేకెత్తించింది. అయితే ఆ సర్వే ఎత్తి చూపిన ఆయన వైఫల్యాలపై అంత చర్చ జరగకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రధాని మోదీకి తిరుగులేదని, రాహుల్ గాంధీ కంటే ఆయన ఎన్నో ఎక్కువ రెట్లు ముందంజలో ఉన్నారని చెప్పడానికి ఇండియా టుడే సర్వే ఏమీఅక్కర్లేదు. రాహుల్ గాంధీకి కూడా బహుశా ఆ విషయం తెలిసే ఉంటుంది. ప్రచారానికి, ఎన్నికల వ్యూహరచనకు, ఎత్తుగడలకు, ప్రత్యర్థులను అనేక రకాలుగా కకావికలు చేయడానికి, వ్యతిరేకులను భయపెట్టడానికి సంబంధించి నరేంద్ర మోదీ సారథ్యంలోని బిజెపికి ఉన్న అద్భుత యంత్రాంగం ముందు మరేదీ సాటి రాదు, రాలేదు. కనుక బిజెపి ఫలానా ఎన్నికల్లో ఓడిపోతుందని చెప్పడానికి ఏ సర్వే కూడా సాహసించలేదు. అయితే మోదీ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు సగం రోజులు పూర్తయిన రీత్యా ఆయన ప్రభుత్వం ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితుల గురించి ఇండియా టుడే చెప్పిన అంశాలకు రావాల్సినంత ప్రాధాన్యత లభించలేదు. మరో వారం రోజుల్లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఈ సర్వేలో చెప్పిన కొన్ని అంశాలకు కీలక ప్రాధాన్యం ఉన్నది.


దేశంలో ప్రజలు వ్యక్తం చేసిన అసలైన ఆందోళన ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్షోభమేనని ఇండియా టుడే తెలిపింది. ప్రభుత్వం ఆర్థిక అంశాలను సరైన విధంగా నిర్వహించలేకపోతున్నదని, ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దిగజారిందని అనేకమంది భావిస్తున్నారని ఈ సంస్థ నిర్వహించిన సర్వే ద్వారా తెలుస్తోంది. నిరుద్యోగం, ధరల పెరుగుదల మోదీ ప్రభుత్వ అతి పెద్ద వైఫల్యాలుగా తేల్చింది. పట్టణ నిరుద్యోగం 9.3 శాతానికి, గ్రామీణ నిరుద్యోగం 7.3 శాతానికి పెరిగాయని, ద్రవ్యోల్బణం అత్యధికంగా 5.6 శాతానికి చేరుకుందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ చెప్పిన గణాంక వివరాలను ఇండియా టుడే తో పాటు అనేక పత్రికలు ఇప్పటికే ఉటంకించాయి. మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాలు కేవలం బడా వ్యాపారులకే దోహదం చేస్తున్నాయని, చిన్న పరిశ్రమలు మనుగడ కోసం కొట్టుమిట్టాడుతుంటే బడా వ్యాపారులు నిలదొక్కుకోవడమే కాక కొవిడ్ సమయంలో కూడా లాభాలు ఆర్జించగలగుతున్నారని తెలుస్తోంది. కార్పొరేట్ పన్నులను తగ్గించడం, కొత్తగా ప్రకటించిన భారీ ప్రాజెక్టులు కొందరు బడా కార్పొరేట్లకు మాత్రమే హస్తగతం కావడం జనం దృష్టిని దాటిపోలేదు. నిజానికి కార్పొరేట్లకు పెద్దపీట వేయడం మోదీ స్వీయ ఆర్థిక విధానాల్లో భాగం. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రిలయన్స్, ఎస్సార్, అదానీ వంటి గ్రూపులకు నిబంధనలకు విరుద్ధంగా ప్రయోజనాలు కట్టబెట్టడం వల్ల ప్రభుత్వరంగ సంస్థలకు వందల కోట్ల నష్టం వచ్చిందని కాగ్‌ నివేదిక వెల్లడించింది. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ ప్రభుత్వం అవే ఆర్థిక విధానాలను కొనసాగించడంతో కార్పొరేట్లు ఇబ్బడిముబ్బడిగా బలోపేతం అయితే, చిన్న వ్యాపారులు, రైతులు, అసంఘటిత రంగం, రోజువారీ వేతన కూలీలు తీవ్రంగా దెబ్బతిన్నారు. గత మార్చి నుంచి ఇప్పటివరకూ భారతదేశంలోని వంద మంది కోటీశ్వరులు తమ సంపదను రూ. 12,97,822 కోట్లకు పెంచుకున్నారని ఆక్స్‌ఫామ్ తాజా నివేదిక తెలిపింది. ‘ప్రపంచంలోని ఆరోగ్య రంగానికి అతి తక్కువ నిధులు కేటాయిస్తున్నది భారతదేశంలోనే. దేశంలో అగ్రశ్రేణిలో ఉన్న 11 మంది సంపన్న కోటీశ్వరులపై ఒక శాతం మేరకు పన్ను విధించినా పేదలకు, అణగారిన వర్గాలకు తక్కువ వ్యయానికి మందులు సమకూర్చే జన ఔషధి పథకానికి 140 రెట్లు కేటాయింపులు పెంచవచ్చు’ అని ఆ సంస్థ తెలిపింది.


ఇదే ఆక్స్‌ఫామ్ నివేదిక ప్రపంచంలోని పదిమంది అత్యంత సంపన్నులు కరోనా సమయంలో తమ సంపదను 1.2 ట్రిలియన్ డాలర్ల మేరకు రెట్టింపు చేసుకున్నారని వెల్లడించింది. ఈ విషయం దావోస్‌లోని ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో సంచలనం సృష్టించింది. అయితే తమపై సంపద పన్ను వేసి ప్రపంచంలో పేదలను రక్షించవలిసిందిగా ప్రపంచంలోని 102 మంది కోటీశ్వరులు దావోస్ సదస్సుకు విజ్ఞప్తి చేస్తే వారిలో ఒక్క భారతీయ కోటీశ్వరుడు కూడా లేకపోవడం గమనార్హం. తమపై పన్ను వేయడం ద్వారా 230 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేయవచ్చునని ప్రపంచ సంపన్నులు సూచించారు. ఈ నిధులు 360 కోట్ల మంది కోసం వాక్సిన్ల తయారీకి, సార్వత్రిక ఆరోగ్య సంరక్షణకు, సామాజిక సంరక్షణకు ఉపకరిస్తాయని వారు భావించారు. ‘మాపై పన్నులు వేయండి. వెంటనే..’ అని వారన్నారు. మోదీ ఈ పిలుపునకు స్పందిస్తారా? లేక యథాప్రకారం రానున్న బడ్జెట్‌లో కూడా సంపన్నులను భుజానికెక్కించుకుంటారా?


మోదీ ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు ఉపాధి కల్పన, ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు వీలుగా ఆర్థికాభివృద్ది సాధించడమేనని స్పష్టమవుతోంది. ఇండియా టుడే మాత్రమే కాదు, బడ్జెట్ గురించి విశ్లేషణలు చేస్తున్న అనేకమంది నిపుణులు కూడా నిరుద్యోగం, వివిధ రంగాల్లో అభివృద్ధి సాధించడమే ముఖ్యమని చెబుతున్నారు. జాతీయ గణాంక సంస్థ వివరాల ప్రకారం దేశంలో వినియోగం తీవ్రంగా పడిపోయింది. ఉపాధి కోల్పోవడం, తక్కువ ఆదాయాలు, వైద్య ఖర్చులు పెరగడం, పొదుపు తగ్గిపోవడం వల్ల భవిష్యత్ ఎలా ఉంటుందో తెలియకపోవడం వల్ల వినియోగం పడిపోయిందని క్రిసిల్ రేటింగ్ ఏజెన్సీ కూడా తెలిపింది. సామాజిక సంక్షేమానికి, గ్రామీణాభివృద్ధికి నిధుల కేటాయింపు తీవ్రంగా తగ్గిపోయింది. 16 ప్రధాన రాష్ట్రాలలో రెవిన్యూ వసూళ్లు దాదాపు 12 శాతం పడిపోగా, కేంద్రం నుంచి పన్నుల పంపిణీ కూడా 22 శాతం తగ్గిపోయిందని, దాదాపు ప్రతి రాష్ట్రం ఆర్థిక లోటు ఎదుర్కొంటున్నదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ నివేదిక తెలిపింది. ప్రధానమంత్రి స్వంత రాష్ట్రం గుజరాత్‌లోనే రెవిన్యూ వసూళ్లు 10 శాతం మేరకు పడిపోయాయి. ఈ నేపథ్యంలో సామాన్యులు, రైతులు, మధ్యతరగతి వర్గాలు, చిన్న వ్యాపార సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు, నిరుద్యోగుల ఆకాంక్షలు మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై కేంద్రీకృతమయ్యాయి. ‘మోదీ హై తో ముమ్కీన్ హై (మోదీ ఉంటే సాధ్యం)’ అన్న తన నినాదాన్ని ఆయన నిలబెట్టుకుంటారా? కేంద్ర మంత్రుల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పనితీరు బాగా ఉన్నదని కేవలం 6.4 శాతం మందే చెప్పారని ఇండియా టుడే సర్వే తేల్చిన విషయం ఆయన దృష్టికి వచ్చే ఉంటుంది.


స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిందని ప్రభుత్వం అమృత మహోత్సవాలు జరుపుకుంటోంది. రాజ్యాంగం అమలులోకి వచ్చి 72 సంవత్సరాలూ పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో స్వాతంత్ర్య ఫలాలు ఎంతమేరకు జనానికి చేరాయి, భారత రాజ్యాంగం ఆశించిన లక్ష్యాలు ఎంత మేరకు నెరవేరాయి అని చర్చించుకోవడం అవసరం. దేశంలో ప్రజాస్వామ్య మనుగడ పట్ల, రాజ్యాంగ సంస్థల అస్తిత్వం పట్ల ఆందోళన పెరుగుతోందని కూడా ఇండియా టుడే సర్వే చెప్పిన విషయం మరిచిపోరాదు. నిరసన తెలిపే హక్కు ప్రమాదంలో పడిందని, వ్యతిరేకించేవారి పట్ల ప్రభుత్వ సంస్థల ప్రయోగం, చట్టాల దుర్వినియోగం పెరుగుతోందని కూడా తెలిపింది. పార్లమెంట్ సమావేశాలు మొక్కుబడిగా సాగుతున్నాయి. ప్రతిపక్షాలు వివిధ అంశాలపై వెల్ లోకి దూసుకువస్తుంటే, ప్రభుత్వం తన మానాన తాను చర్చలు లేకుండా బిల్లులను ఆమోదించుకుంటూ పోతున్నది. రాష్ట్రాలను ప్రభావితం చేసే అనేక కీలక బిల్లులు చర్చలు లేకుండా ఆమోదం పొందుతున్నాయి. ప్రభుత్వానికి ప్రతిపక్షం పట్ల, ప్రతిపక్షాలకు ప్రభుత్వం పట్ల గౌరవం లేకుండా పోతోంది. అసలు సంప్రదింపుల ద్వారా, పట్టువిడుపుల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలనే వైఖరి ఇరు పక్షాలకూ లేకుండా పోతున్నది. ఇందుకు కారణం ఎవరు? అధికారంలో ఉన్న ప్రభుత్వానికే ఎక్కువ బాధ్యత ఉంటుంది. చిన్న చిన్న అంశాలపై కూడా కేంద్రం రాష్ట్రాలతో సంఘర్షణాయుత వైఖరిని అవలంబించడం స్పష్టంగా కనిపిస్తోంది. లేకపోతే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులపై తమ పెత్తనమే సాగాలని, తాము చెప్పిన వారిని కేంద్రానికి పంపించాల్సిందేనని కేంద్రం రాష్ట్రాలకు లేఖలు రాయడంలో అర్థం లేదు. గతంలో ఇలాంటి నిర్ణయాలన్నీ సమాఖ్య స్ఫూర్తితో జరిగేవి. కాని ఈ అధికారులను తమ గుప్పిట్లో ఉంచుకునేందుకు, వారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలను నియంత్రించేందుకు ఒక పద్ధతి ప్రకారం కేంద్రం ప్రయత్నిస్తోందన్న విషయం స్పష్టమవుతోంది. అందుకే బిజెపి మిత్రపక్షం అధికారంలో ఉన్న బిహార్‌తో సహా దాదాపు డజను రాష్ట్రాలు కేంద్ర నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇవాళ మెజారిటీ సివిల్ సర్వీస్ అధికారులు ఢిల్లీలో పనిచేసేందుకు వెనుకాడుతున్నారన్న చర్చ అధికారిక వర్గాల్లో జరుగుతోంది. గతంలో ఏ సంఘటన జరిగినా సిబిఐకి అప్పగించమనే డిమాండ్లు వచ్చేవి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థల విశ్వసనీయత తగ్గిపోయింది. లఖీంపూర్ ఖేరీ ఘటన విషయంలోనైనా, పంజాబ్‌లో ప్రధానమంత్రి భద్రతా వైఫల్యం విషయంలోనైనా సుప్రీంకోర్టు కలుగచేసుకుని స్వతంత్ర విచారణలకు ఆదేశించడమే కేంద్ర సంస్థల విశ్వసనీయత ప్రశ్నార్థకమైందనడానికి నిదర్శనం. ఆర్థిక విధానాలను మార్చుకోవడంతో పాటు విశాల రాజకీయ సమన్వయం కోసం ప్రధాని చర్చల ద్వారా జనంలో అశాంతిని దూరం చేయాలని మోదీ నుంచి ఇండియా టుడే ఆశించడడం పగటి కల మాత్రం కాకూడదు.


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Read more