జోడో యాత్రపై రాజస్థాన్ నీలినీడలు

ABN , First Publish Date - 2022-09-28T10:22:07+05:30 IST

కాంగ్రెస్ లేకుండా ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఏర్పాటు చేయలేమని గతవారం బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటించారు. ఈ వ్యాఖ్యలో వాస్తవం లేదని...

జోడో యాత్రపై రాజస్థాన్ నీలినీడలు

కాంగ్రెస్ లేకుండా ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఏర్పాటు చేయలేమని గతవారం బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటించారు. ఈ వ్యాఖ్యలో వాస్తవం లేదని చెప్పలేము. గత కొన్ని సార్వత్రక ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే ప్రాంతీయ పార్టీలకే ఎక్కువ సీట్లు వచ్చాయి. మొత్తం 545 లోక్‌సభ సీట్లకు గాను కాంగ్రెస్‌కు 2004లో 145; 2009లో 206 సీట్లు మాత్రమే వచ్చాయి. అయినప్పటికీ కాంగ్రెస్ సారథ్యంలో యూపీఏ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఆ రెండుసార్లూ 320 మందికి పైగా లోక్‌సభ సభ్యుల మద్దతుతో యూపీఏ ప్రభుత్వాలు నడిచాయి. బిఎస్‌పి, ఎస్‌పి, ఆర్‌జెడి, జనతాదళ్(ఎస్), కేరళ కాంగ్రెస్, ఇతర చిన్నా చితక పార్టీలతో పాటు వామపక్షాలు ఆ పదేళ్లూ కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణ సర్కార్‌కు అండగా నిలిచాయి. నిజానికి 2014 తర్వాత కూడా బిజెపి, కాంగ్రెసేతర పార్టీల బలం ఏ మాత్రం తగ్గలేదు. తగ్గిందల్లా కాంగ్రెస్ బలం మాత్రమే. కనీసం వందసీట్లు కూడా కాంగ్రెస్ దాటకపోతే దేశంలో బిజెపి ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఏర్పడడం ఎలా సాధ్యమవుతుంది?


బిజెపి జాతీయ కార్యాలయంలో మంగళవారం వివిధ రాష్ట్రాల పార్టీ ఇన్‌చార్జిలు, జాతీయ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శుల సమావేశాలు రోజంతా జరిగాయి. ఈ ఏడాది జరిగే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలతో పాటు మరో రెండేళ్లలో జరిగే సార్వత్రక ఎన్నికల్లో పార్టీ విజయానికి చేపట్టాల్సిన వ్యూహరచన గురించి వారు గంటల తరబడి చర్చలు జరిపారు. గత సార్వత్రక ఎన్నికల్లో బిజెపి సాధించలేకపోయిన 144 సీట్లను ఈసారైనా సాధించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ గురించి కొద్ది రోజుల క్రితం చర్చించారు. నిజానికి 2024 లోక్‌సభ ఎన్నికలకు బిజెపి ఎప్పుడో సన్నాహాలు ప్రారంభించింది. ప్రతి ఒక్క లోక్‌సభ సీటుపై దృష్టి కేంద్రీకరించింది. ఉదాహరణకు పంజాబ్‌లో పాటియాలా లోక్‌సభ సీటు సాధించడం కోసం కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను, దక్షిణ గోవా లోక్‌సభ సీటును సాధించడం కోసం మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్‌ను చేర్చుకుంది. ఎవరెవరిని ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలి, ఏ రాష్ట్రంలో ఎవరిని ముఖ్యమంత్రిగా నియమించాలన్న విషయమై బిజెపిలో అంతర్గత చర్చలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. ప్రతి రాష్ట్రంలోనూ చిన్న చిన్న పార్టీల్లో వేటిని కలుపుకుపోవాలన్న విషయమై బిజెపిలో స్పష్టత ఉన్నది. బిహార్‌లో పర్యటించినప్పడు హోంమంత్రి అమిత్ షా మాజీ ముఖ్యమంత్రి జీతన్ రాం మాంఝీకి సందేశం పంపారు. 2024 ఎన్నికల్లో 2019లో వచ్చిన ఫలితాలు పునరావృతం కావడం కష్టమని, తమకు కనీసం 50కి పైగా సీట్లు తక్కువ వచ్చే అవకాశాలున్నాయని బిజెపిలో చర్చ జరుగుతోంది. మళ్లీ మెజారిటీ సీట్లను సాధించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తూనే ఈ లోపే పలు ఇతర పార్టీలను కలుపుకుని ఎన్డీఏను బలోపేతం చేయక తప్పదని బిజెపి అగ్రనాయకత్వం భావిస్తోంది. కొత్త రాష్ట్రాల్లో విస్తరించేందుకు ప్రణాళికలు వేస్తోంది.


రాబోయే రెండేళ్లలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కానీ, 2024లో జరిగే సార్వత్రక ఎన్నికల్లో కానీ విజయం సాధించేందుకు కాంగ్రెస్ ఫలానా వ్యూహరచన చేస్తుందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. 2024లో బిజెపి, సహజంగానే పదేళ్ల తమ పాలన పట్ల వ్యతిరేకతను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. అయినా బీజేపీతో ముఖాముఖి బలంగా పోటీ పడే రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ ఏమి చేస్తున్నదో ఎవరికీ స్పష్టత లేదు! ఒకో రాష్ట్రంలో విస్తరించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్నంత కృషి కూడా కాంగ్రెస్ ప్రదర్శించడం లేదు. ఇతర పార్టీలను కలుపుకునేందుకు కాంగ్రెస్ చేస్తున్న యత్నాలు ఏమీ కనపడడం లేదు. పార్లమెంట్ జరిగినప్పుడు మోదీ ప్రభుత్వ విధానాలపై, కొన్ని బిల్లులపై వ్యతిరేకత ప్రదర్శించేందుకు ఏకమైన ప్రతిపక్షాలు పార్లమెంట్ సమావేశాలు పూర్తయిన తర్వాత ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. సెప్టెంబర్ 7 నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో యాత్రకూ ఎన్నికలకూ సంబంధం లేదని చెబుతున్నారు. ఈ ఏడాది ఆఖరులో జరిగే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లలో రాహుల్ యాత్ర ప్రవేశించడమే లేదు. కాంగ్రెస్ బలోపేతం కావాల్సిన చారిత్రక ఆవశ్యకత ఉన్న ఉత్తర ప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ ఒకటి రెండు రోజులకు మించి పాదయాత్ర జరపడం లేదు. మరి రాహుల్ గాంధీ ఈ యాత్ర ఎందుకు చేపట్టినట్లు?


గత నెల 22న రాహుల్ గాంధీ కొన్ని ప్రజాసంఘాలకు తన యాత్ర లక్ష్యాలను వివరించారు. ఆర్థిక అసమానతలు, కుల, మత, భాషాపరమైన విభేదాలు, సమాఖ్య స్ఫూర్తికి జరుగుతున్న నష్టం, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాయడంపై దేశ ప్రజలకు వివరించి వారిని చైతన్యవంతం చేయడమే తన లక్ష్యంగా రాహుల్ గాంధీ ప్రకటించారు. కాని ఆయన పాదయాత్ర చాలా సరదాగా సాగుతున్నట్లు కనిపిస్తోంది. రాజస్థాన్‌లో కాంగ్రెస్ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుండగా ఆయన పిల్లలతో బంతి ఆట ఆడుతూ కనపడ్డారు. భారత్ జోడో యాత్రను కాంగ్రెసేతర సంస్థలు, వ్యక్తులు తీసుకున్నంత సీరియస్‌గా రాహుల్ తీసుకున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఈ యాత్ర కాంగ్రెస్‌ను ఒక సంఘటిత శక్తిగా మార్చి దేశానికి దిశా నిర్దేశం చేయగల శక్తిని సమకూర్చుకోగలదని, భావసారూప్యత గల ఇతర శక్తులను కూడా తనతోపాటు కలుపుకు పోగలదని అనేక మంది భావించారు. భారత్ జోడో యాత్ర ప్రారంభించినప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా కొంత ఉలిక్కిపడి కాంగ్రెస్‌పై దాడులు ప్రారంభించింది. అదే సమయంలో తన రాజకీయ కార్యాచరణను కూడా వేగవంతం చేసింది. 


భారత్ జోడో యాత్ర మూలంగా రాజకీయంగా దేశంలో కొంత కదలిక ఏర్పడుతుందనుకుంటున్న సమయంలోనే రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఈ సంక్షోభం భారతీయ జనతా పార్టీ మూలంగానో, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల దాడుల వల్లనో సంభవించింది కాదు. ఈ సంక్షోభం కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల నిర్వహణలో ఉన్న లోపం వల్ల, కాంగ్రెస్ నాయకత్వంపై పార్టీ నేతలకు విశ్వాసం లేకపోవడం వల్ల తలెత్తింది. కాంగ్రెస్ పార్టీ తన సంస్థాగత ఎన్నికల కార్యక్రమం ప్రకటించినప్పుడు, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ సహా పలువురు నేతలు పార్టీ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగేందుకు ఉత్సుకత ప్రదర్శించినప్పుడు, తాను పోటీ చేయబోనని రాహుల్ గాంధీ ప్రకటించినప్పుడు కాంగ్రెస్‌లో నిజంగా ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్య ప్రక్రియ ప్రారంభమైందని చాలా మంది భావించారు. ఒక వైపు బిజెపిలో మోదీ, అమిత్ షాలు నిర్ణయించిన వ్యక్తే పార్టీ అధ్యక్షుడుగా ఎటువంటి ఎన్నికలు లేకుండా జరుగుతున్నప్పుడు కాంగ్రెస్‌లో పలువురు పోటీపడడం ఒక మంచి సంప్రదాయానికి తెరలేపినట్లు సంకేతాలు వెళ్లాయి. కాంగ్రెస్ వ్యూహం కొంత ఆసక్తిగా మారిన నేపథ్యంలో రాజస్థాన్ సంక్షోభం ఆ పార్టీ నేతల విజ్ఞతను ప్రశ్నార్థకం చేసింది.


ఒక వైపు సంస్థాగత ఎన్నికల ప్రక్రియ జరుగుతుండగా, అవి పూర్తి కాకముందే రాజస్థాన్‌లో అశోక్ గెహ్లోత్‌ను మార్చి సచిన్ పైలట్‌ను ముఖ్యమంత్రిగా నియమించాలని ఎందుకు నిర్ణయించారు? కాబోయే కొత్త అధ్యక్షుడి నిర్ణయాధికారానికి ఎందుకు వదలలేదు? గెహ్లోత్‌కు నచ్చచెప్పకుండా నాయకత్వం మార్చడం అంత సులభమని రాహుల్ భావించారా? జాతీయస్థాయిలో కాంగ్రెస్ నాయకత్వానికి పార్టీ పట్టు జారిపోతున్న సమయంలో ఏకవాక్య తీర్మానం చేసి ముఖ్యమంత్రిని నియమించే పాతకాలపు అప్రజాస్వామిక ధోరణి చెల్లుతుందని ఎలా అనుకున్నారు? పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించాలనుకున్నప్పుడు సిఎల్‌పి నేతకు కూడా అదే విధంగా ఎన్నికలు ఎందుకు నిర్వహించాలనుకోలేదు? దేశంలో వివిధ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు రాహుల్ గాంధీయే జాతీయ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టాలని తీర్మానించినప్పుడు వాటిని విస్మరించి, బాధ్యతలు లేనప్పటికీ అధికారం చలాయించాలని ఆయన భావించడం సరైనదా? అశోక్ గెహ్లోత్, సచిన్ పైలట్‌తోసహా సీనియర్ నేతలంతా కేరళకు వచ్చి తనను కలుసుకుని దిశానిర్దేశం కోసం ప్రయత్నించడం ఏ సంకేతాలను అందిస్తోంది? అశోక్ గెహ్లోత్ చోటా మోటా నేత కాదు, అనేక రాజకీయ యుద్ధాల్లో ఆరితేరిన నాయకుడు. 1998లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఉన్న సీతారాం కేసరి సోనియాగాంధీ కోసం తన పదవిని త్యాగం చేయడానికి నిరాకరించినప్పుడు కేసరిపై దాడి చేసి ఆయనతో బలవంతంగా రాజీనామా చేయించిన నేతల్లో గెహ్లోత్ ఒకరు. రాజస్థాన్‌లో బిజెపిని అడ్డుకొని విజయం సాధించడమే కాదు, తన ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బిజెపి యత్నాలను వమ్ము చేయగలిగిన శక్తి గెహ్లోత్‌కు ఉన్నదని నిరూపితమైంది. తన కోసం 90మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసేందుకు కూడా సిద్ధపడడమే గెహ్లోత్‌కు రాష్ట్రంలో పార్టీపై ఉన్న పట్టుకు నిదర్శనం. కాంగ్రెస్‌లో గాంధీ కుటుంబానికి చెందిన ఏ వ్యక్తి అధ్యక్షుడైనా సీతారాం కేసరి లాగే ఇంటి తోవ పట్టాల్సి ఉంటుందని, లేకపోతే అవమానించి బయటకు పంపుతారని గెహ్లోత్‌కు తెలియనిది కాదు. అందువల్ల పార్టీ అధ్యక్షుడైనా రాజస్థాన్ రాజకీయాలపై తన పట్టు ఉండాలని ఆయన భావించారు. తాను ముఖ్యమంత్రి పదవి కోల్పోయినా తాను నిర్ణయించిన వ్యక్తి, లేదా మెజారిటీ ఎమ్మెల్యేలు నిర్ణయించిన వ్యక్తి ముఖ్యమంత్రి కావాలనుకున్నారు.


ఈ ఉదంతం అనేక ఆవశ్యకతలను స్పష్టం చేస్తున్నది. 2024 సార్వత్రక ఎన్నికలకు కాంగ్రెస్ సమాయత్తం కావాలంటే ముందుగా ఆ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పటిష్ఠంగా నెలకొనాలి. వివిధ అంతర్గత వేదికలు, విభాగాలను బలోపేతం చేసి వాటి నాయకత్వాలకు నిర్ణయాధికారాలు అప్పగించాలి. రాష్ట్రాల్లో కూడా పీసీసీలను ప్రజా స్వామికంగా నిర్ణయించేందుకు వీలుకల్పించాలి. భావ సారూప్యత గల శక్తులను, ఇతర బిజెపియేతర పార్టీలను గుర్తించి బలమైన కూటమిని ఏర్పాటుచేసి జాతీయ స్థాయిలో కార్యాచరణకు సన్నద్ధమయ్యేలా చేయాలి. మరీ ముఖ్యంగా బిజెపిని ఎదుర్కోగల ఒక బలమైన సైద్ధాంతిక అవగాహనను, కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొం దించగలగాలి. పార్టీ కార్యకర్తల్లోనూ పట్టుకోల్పోయి, నేతల విశ్వాసమూ కోల్పోయి, భావికార్యాచరణపై ఎలాంటి స్పష్టతా లేనప్పుడు ఎన్ని యాత్రలు చేసినా ఏమి ప్రయోజనం?


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Read more