నేరమే అధికారంగా మారుతోందా?

ABN , First Publish Date - 2022-09-21T06:03:19+05:30 IST

‘ఓబుళాపురం అక్రమ మైనింగ్‌కు సంబంధించి గాలి జనార్దన్‌ రెడ్డిపై కేసు 12 సంవత్సరాలుగా హైదరాబాద్ లోని సిబిఐ ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి ముందు పెండింగ్‌లో ఉండడం దురదృష్టకరం. ఒక నేరానికి సంబంధించి...

నేరమే అధికారంగా మారుతోందా?

‘ఓబుళాపురం అక్రమ మైనింగ్‌కు సంబంధించి గాలి జనార్దన్‌ రెడ్డిపై కేసు 12 సంవత్సరాలుగా హైదరాబాద్ లోని సిబిఐ ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి ముందు పెండింగ్‌లో ఉండడం దురదృష్టకరం. ఒక నేరానికి సంబంధించి అసలు విచారణే సాగకపోవడం న్యాయవ్యవస్థను అపహాస్యం చేయడమే’ అని జస్టిస్ ఎం.ఆర్. షా, కృష్ణ మురారిలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ వ్యాఖ్యానించింది. దేశంలో న్యాయవ్యవస్థ ఏ విధంగా పనిచేస్తున్నదో ఆ వాఖ్య స్పష్టం చేస్తోంది. అసలు విచారణ ఎందుకు ముందుకు వెళ్లడం లేదో చెబుతూ సీల్డ్ కవర్‌లో నివేదిక సమర్పించాల్సిందిగా సిబిఐ కోర్టు జడ్జిని సుప్రీంకోర్టు అసాధారణ రీతిలో ఆదేశించింది. దేశంలోని న్యాయమూర్తులు అందరూ తమ ముందున్న కేసుల విచారణ శీఘ్రగతిన ఎందుకు సాగడం లేదో సీల్డ్ కవర్లలో నివేదికలు ఇస్తే, వాటిని చదివినప్పుడు కళ్లు తిరిగే వాస్తవాలు బయటపడతాయనడంలో సందేహం లేదు.


2011లో ఓబుళాపురంలో అక్రమ మైనింగ్ ఆరోపణపై అరెస్టయిన గాలి జనార్దన్‌ రెడ్డి కేసుకు సంబంధించి ఆ రోజుల్లో పత్రికల్లో వార్తలు పుంఖానుపుంఖంగా వచ్చాయి. బెయిల్ పొందేందుకై న్యాయమూర్తులను జనార్దన్‌ రెడ్డి ప్రలోభపెట్టారనే విమర్శలు వచ్చాయి. తనకు రూ.40 కోట్ల మేరకు ముడుపులు ఇవ్వజూపారని నాగమారుతి శర్మ అనే న్యాయమూర్తి న్యాయస్థానానికే చెప్పారు. ఆ తర్వాత జనార్దన్‌ రెడ్డికి బెయిల్ ఇచ్చినందుకు పది కోట్లు లంచం తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొని అరెస్టయిన పట్టాభిరామారావు అనే మరో న్యాయమూర్తి అనుమానాస్పద స్థితిలో మరణించారు. గాలి బెయిల్‌కు సంబంధించి ముగ్గురు న్యాయమూర్తులను హైకోర్టు సస్పెండ్ చేయాల్సి వచ్చింది. పోనీ ఆ తర్వాతనయినా కేసు ముందుకు సాగిందా అంటే అదీ లేదు. డిశ్చార్జి, క్వాష్ పిటిషన్లంటూ నిందితులు రకరకాల పిటిషన్లు వేస్తూ విచారణను ఆలస్యం చేస్తున్నారని సిబిఐ తరఫు న్యాయవాది అడిషనల్ సొలిసిటర్ జనరల్ మాధవీ దివాన్ గత ఏడాది ఒక సందర్భంలో సుప్రీంకోర్టు ముందు వాపోయారు. ‘ఈ కేసులో 300 మంది సాక్షులు ఉన్నారు. ఈ విధంగా విచారణ సాగుతూపోతే అది పూర్తయ్యేందుకు జీవితకాలం పడుతుంది. అందుకు మా క్లయింట్ గాలి జనార్దన్‌ రెడ్డి ఎందుకు నష్టపోవాలి’ అంటూ ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గి సుప్రీంలో బలంగా వాదించారు. గాలి జనార్దన్‌ రెడ్డి తన స్వంత జిల్లా బళ్లారి వెళ్లేందుకు అనుమతి కూడా పొందారు. ‘జనార్దన్‌ రెడ్డి అత్యంత శక్తిమంతుడు. ఆయన మూలంగా ఒక సిబిఐ న్యాయమూర్తి, మరో ఇద్దరు న్యాయమూర్తులు దెబ్బతిన్నారు. బళ్లారి వెళ్లేందుకు అనుమతిస్తే ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన సాక్షులు ఎదురు తిరుగుతారు. మళ్లీ విచారణ ముందుకు సాగదు..’ అని సిబిఐ చేసిన వాదనలు గాలికి కొట్టుకుపోయాయి. 2015లో గాలికి బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు ఇప్పుడు విచారణ ఎందుకు ముందుకు సాగడం లేదని సిబిఐ కోర్టును ప్రశ్నిస్తోంది.


దేశ సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ముందు ఇలాంటి కేసులు వచ్చినప్పుడల్లా దేశంలో న్యాయవ్యవస్థతో పాటు అనేక వ్యవస్థలు అపహాస్యం అవుతున్న విషయం స్పష్టమవుతుంది. తన తండ్రి, మాజీ ఎంపీ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి సిబిఐ విచారణ జరపాలని హైకోర్టు రెండేళ్ల క్రితం ఆదేశించినా ఇంతవరకూ దర్యాప్తు ఒక కొలిక్కి రాలేదని, దర్యాప్తు అధికారులు కూడా ప్రతికూల వాతావరణం ఎదుర్కొంటున్నారని ఆయన కూతురు డాక్టర్ సునీత సోమవారం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం విచారణకు స్వీకరించింది. ఈ దర్యాప్తును ఉన్నత న్యాయస్థానం నేరుగా పర్యవేక్షించాలని, కేసును ఆంధ్రప్రదేశ్ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణ పూర్తయ్యేందుకు ఎన్నాళ్లు పడుతుందో చెప్పలేము.


ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసుల సంఖ్య ఐదువేలకు చేరుకున్నదని గత ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు నియమించిన అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా సర్వోన్నత న్యాయస్థానానికి నివేదికను సమర్పించారు. సుప్రీంకోర్టు ఎన్ని ఆదేశాలిచ్చినా, నిరంతర పర్యవేక్షణ చేస్తున్నా పరిస్థితిలో మార్పు లేదని, పార్లమెంట్‌లోనూ, శాసనసభల్లోనూ నేరచరితులు పెరిగిపోతూనే ఉన్నారని ఆయన తన నివేదికలో వాపోయారు. 2011లోనే పబ్లిక్ ఇంటరెస్ట్ ఫౌండేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులపై ఆరోపణలు నమోదైన ఏడాదిలోపే అవినీతి కేసుల విచారణ జరగాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2012లో వినోద్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో అవినీతికి సంబంధించిన కేసుల్లో ఎలాంటి ఆలస్యం జరగకూడదని, ఎలాంటి వాయిదాలు వేయకుండా రోజు వారీ విచారణలు జరగాలని తెలిపింది. క్రింది కోర్టుల్లో విచారణ జరుగుతున్నప్పడు క్రాస్ ఎగ్జామినేషన్ పేరుతోనో, మరో కారణంతోనో వాయిదాలు వేయడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. సాక్షులను ఒత్తిడి చేసేందుకు న్యాయమూర్తులే నిందితులకు సమయాన్ని ఇస్తున్నారని విమర్శించింది. లేని పోని కారణాలతో వాయిదాలు వేయడం విచారణనే హాస్యాస్పదం చేయడం లాంటిదని, చట్టబద్ధమైన పాలన (రూల్ ఆఫ్ లా)ను ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు ఆనాడే స్పష్టం చేసింది. ‘న్యాయాన్ని ఒంటరిగా, అనాథగా వదిలివేయలేం’ అని వ్యాఖ్యానించింది. నిందితుడు నేరానికి పాల్పడేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని న్యాయమూర్తి భావిస్తే వెంటనే నేరారోపణల్ని నమోదు చేయాలని, అందుకు వివరంగా కారణాలు కూడా పేర్కొనక్కర్లేదని 2014లో మరో కేసులో సుప్రీం కోర్టు తెలిపింది. అన్ని డిశ్చార్జి పిటిషన్లను ప్రత్యేక కోర్టు ఒకేసారి చేపట్టి రోజువారీ విచారణ జరిగేలా చూడాలని కూడా ఆదేశించింది. కాని ఈ ఆదేశాలు ఎందుకు అమలు కావడం లేదు?


ఎంపీలు, ఎమ్మెల్యేలపై నేరారోపణలు ఉన్నప్పుడు క్రింది కోర్టులు ఏడాది లోపు దర్యాప్తు పూర్తి చేయకపోతే హైకోర్టుకు నివేదిక సమర్పించాలని 2014లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లోధా స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులపై కేసులను వేగవంతంగా పరిష్కరించాలని జస్టిస్ లోధా తర్వాత ప్రధాన న్యాయమూర్తులైన జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ కూడా వరుసగా చెబుతూనే వచ్చారు. కాని వారి ఆదేశాలు నీటిపై రాసిన రాతలయ్యాయి. విజయ్ హన్సారియా నివేదికల్లో నేరచరితులైన ప్రజా ప్రతినిధుల సంఖ్య పెరిగిపోతూనే ఉన్నది. వేగవంతంగా దర్యాప్తు పూర్తి చేయడం, న్యాయస్థానాలకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం, కేసుల విచారణ ఆలస్యానికి కారణాలను సమీక్షించేందుకు పర్యవేక్షక కమిటీలు నియమించడం మొదలైన అంశాలపై కేంద్రం సుప్రీంకోర్టుకు ఎలాంటి ప్రతిస్పందనా తెలియజేయలేదు.


అన్ని రాష్ట్రాలకంటే ఎక్కువగా ఉత్తరప్రదేశ్‌లో ప్రజాప్రతినిధులపై 1339 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కర్ణాటకలో ఎమ్మెల్యేలపై యావజ్జీవ శిక్ష పడదగ్గ కేసులు 58 ఉండగా, వాటిలో 14 కేసులు మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప పైనే ఉన్నాయి. కనీసం నాలుగు కేసుల్లో ఆయనకు పదేళ్ల జైలు శిక్ష పడవచ్చునని అమికస్ క్యూరీ తెలిపారు. గాలి జనార్దన్ రెడ్డిపై కూడా యావజ్జీవ శిక్ష పడదగ్గ ఎనిమిది కేసులు ఉన్నాయని, ఒక కేసులో ఆయనకు ఏడేళ్ల శిక్ష పడవచ్చునని ఆయన తెలిపారు. ఈ కేసులన్నీ ఎప్పుడు తేలాలి?


దేశంలో సివిల్ కేసుల కంటే క్రిమినల్ కేసుల సంఖ్య ఎక్కువగా పెరిగిపోతున్నదంటే చట్టం పట్ల, న్యాయవ్యవస్థ పట్ల గౌరవం కోల్పోతున్నవారి సంఖ్య పెరిగిపోతున్నదనే అభిప్రాయం నెలకొనడమేనని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్వీ రవీంద్రన్ ‘అనామలీస్ ఇన్ లా అండ్ జస్టిస్’ పేరిట రాసిన ఒక పుస్తకంలో తెలిపారు. ‘భారత దేశంలో అత్యధిక నేరాలు రిపోర్టు కావు, రిపోర్టు అయినప్పటికీ నమోదు కావు, నమోదయినప్పటికీ నిజమైన నిందితుడిని గుర్తించి, అరెస్ట్ చేసే బదులు అమాయకులను ఇరికిస్తారు. నిజమైన నిందితుడిని గుర్తించినప్పటికీ, చాలా సార్లు అతడిపై నేరారోపణలు జరగవు, నేరారోపణలు జరిగినప్పటికీ సరైన విధంగా విచారణ జరగదు. విచారణ జరిగినప్పటికీ శిక్ష పడదు. శిక్షపడినప్పటికీ సరైన విధంగా శిక్ష ఉండదు. నేరం రిపోర్టు చేసినప్పటి నుంచీ ఎఫ్ఐఆర్ నమోదు కావడం దర్యాప్తు జరగడం, నేరారోపణ జరగడం, విచారణ జరగడంలో ఎన్నో లోపాలుంటాయి. దీని వల్ల నేరస్థులు స్వేచ్ఛగా బయట తిరుగుతూ కనపడతారు’ అని ఒక ప్రముఖ న్యాయవాది అన్న మాటల్ని జస్టిస్ రవీంద్రన్ ఉటంకించారు.


భారత దేశంలో ‘రూల్ ఆఫ్ లా’ అనేది ప్రస్తుతం అత్యంత సవాళ్లను ఎదుర్కొంటోంది. పేదలు, అణగారిన వర్గాలు, ఆదివాసీలు వేల సంఖ్యలో జైళ్లలో ఏళ్లతరబడి మగ్గుతుండగా, పలుకుబడి గలవారు, ధనికులు, వేల కోట్ల మేరకు దేశాన్ని లూటీ చేసిన వారు ఎంత పెద్ద నేరాలకు పాల్పడినా తప్పించుకు తిరగడం స్పష్టంగా కనపడుతోంది. అప్పుడప్పుడూ సుప్రీంకోర్టు ఈ పరిస్థితిపై తీవ్ర వ్యాఖ్యలు చేసినా మళ్లీ యథాతథ స్థితి అమలు అవుతూనే ఉంటోంది. ఇందుకు కారణం పోలీసులు, సిబిఐ వంటి వ్యవస్థలు అధికారంలో ఉన్న వారి చేతుల్లో ఉండడమే. అయితే న్యాయవ్యవస్థ కూడా ప్రలోభాలకు అతీతం కాదని అనేక సార్లు స్పష్టమయింది. తాను కర్ణాటకలో న్యాయసలహాదారుగా ఉన్నప్పుడు గాలి జనార్దన్ రెడ్డి, యడ్యూరప్పతో పాటు అనేకమంది నేరచరితులపై కేసులు నమోదు చేసేలా చూశారని, కాని తర్వాతి కాలంలో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చిందని ప్రముఖ న్యాయవాది వికాస్ బన్సోడే చెప్పారు. దేశంలో ‘రూల్ ఆఫ్ లా’ తీవ్ర సవాలును ఎదుర్కొంటున్నదనడంలో సందేహం లేదని ఆయన అన్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో అధికారంలో ఉన్నవారు, అధికార వ్యవస్థకు దగ్గరగా ఉన్నవారిపై కేసుల విచారణ ఏళ్ల తరబడి ఆలస్యం కావడం వెనుక ఎవరి హస్తం ఉన్నది? న్యాయవ్యవస్థతో సహా వివిధ వ్యవస్థల్ని ఎవరు ప్రభావితం చేస్తున్నారు? హత్యకేసుల్లో కూడా సిబిఐ అధికారులు ఎందుకు ఒత్తిడి ఎదుర్కొంటున్నారు? దేశంలో ప్రజలకు సరైన న్యాయం జరిగేలా, నేరస్థులకు సకాలంలో శిక్షలు పడేలా, వ్యవస్థలు పనిచేసేలా చేయలేనప్పుడు స్వాతంత్ర్య అమృతోత్సవాల గురించి మాట్లాడడంలో అర్థం లేదు.


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2022-09-21T06:03:19+05:30 IST