బయట హితోపదేశాలు, ఇంట విద్వేషాలు!

ABN , First Publish Date - 2022-10-12T06:34:04+05:30 IST

‘నేటికాలం యుద్ధానికి అనువైనది కాదు. మనం ఎన్నోసార్లు ఫోన్‌లో మాట్లాడుకున్నాం. ప్రజాస్వామ్యం, దౌత్యనీతి, చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయి...

బయట హితోపదేశాలు, ఇంట విద్వేషాలు!

‘నేటికాలం యుద్ధానికి అనువైనది కాదు. మనం ఎన్నోసార్లు ఫోన్‌లో మాట్లాడుకున్నాం. ప్రజాస్వామ్యం, దౌత్యనీతి, చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్న ఆహారం, ఇంధన సమస్యలను పట్టించుకోండి..’ అని గత నెలలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌ఖండ్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్‌కు ధైర్యంగా చెప్పడాన్ని యావత్ప్రపంచం హర్షించింది. అమెరికన్ మీడియా సైతం మోదీని శ్లాఘించింది. అయితే మోదీ తిరిగి వచ్చిన నెల రోజుల తర్వాత కూడా రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య పరస్పర దాడులు ఆగలేదు. బాంబు దాడుల్లో క్రిమియా–రష్యా మధ్య ఉన్న వంతెన మార్గం ధ్వంసం కాగా ఉక్రెయిన్‌లోని పలు నగరాలపై రష్యా క్షిపణుల వర్షాన్ని కురిపించింది.


జాతీయవాద ధోరణులు శ్రుతి మించి రాగాన పడితే ఏమి జరుగుతుందో అనడానికి ఈ పరిణామాలే ఉదాహరణ. రష్యా, ఉక్రెయిన్‌లు రెండూ జాతీయవాద భావజాలంలో కొట్టుకుపోయి తాము ఏమి చేస్తున్నామో తెలియని పరిస్థితిలో పడ్డాయి. ఇతర పశ్చిమ దేశాలు కూడా ఈ పరిస్థితిని రెచ్చగొట్టడమో తమ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడమో జరుగుతున్నది. ఇద్దరు సైనికాధికారులు ఇలియట్ అకర్‌మన్, జేమ్స్ స్టావిర్డిస్ ‘2034–ఎ నావల్ ఆఫ్ ద నెక్స్ట్ వరల్డ్ వార్’ అన్న నవలలో దక్షిణ చైనా సముద్రంలో అమెరికా, చైనా యుద్ధ నౌకలు ఢీకొని మరో ప్రపంచ యుద్ధంగా పరిణమించిన భీకర సన్నివేశాలను ఒళ్లు గగొర్పొడిచేలా చిత్రించారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఆ నవల ప్రపంచానికి ఒక హెచ్చరిక అనడంలో సందేహం లేదు.


అంతర్జాతీయ రాజకీయాల్లో జాతీయవాద, లేదా మత పార్టీలు, రాజకీయ నాయకుల ప్రాబల్యం పెరుగుతున్న తీరును అమెరికన్ రాజనీతి శాస్త్రవేత్త ఫ్రాన్సిస్ ఫుకుయామా తన పుస్తకం ‘ఐడెంటిటీ – ద డిమాండ్ ఫర్ డిగ్నిటీ, ద పాలిటిక్స్ ఆఫ్ రిసెంట్‌మెంట్’లో చిత్రించారు. తొలుత పారిశ్రామికీకరణ, ఆధునికీకరణ తద్వారా తలెత్తిన జాతీయవాదం అదృశ్యం కాకుండా అనేక రూపాల్లో వ్యక్తమవుతున్నదని, ప్రజాస్వామికంగా ఎన్నికైన నేతలు కూడా జాతీయవాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారని ఆయన రాశారు. రష్యాలో పుతిన్, టర్కీలో ఎర్డోగన్, హంగరీలో ఓర్బాన్, పోలండ్‌లో కజెంస్కీ, అమెరికాలో డోనాల్డ్ ట్రంప్, భారతదేశంలో నరేంద్రమోదీ, జపాన్‌లో ఇటీవల హత్యకు గురైన షింజో అబే, చైనాలో షీ జిన్‌పింగ్ తదితరులను ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు, ఫ్రాన్స్, నెదర్లాండ్స్‌తో పాటు స్కాండినేవియా అంతటా ఈ ధోరణి ప్రబలిందని ఆయన తెలిపారు. అనేకచోట్ల మతం రాజకీయాలను ప్రభావితం చేస్తోందని, పలుచోట్ల ఇస్లామిక్ ఉద్యమాలు వ్యాప్తి చెందుతుండగా, శ్రీలంక, మయన్మార్ వంటి దేశాల్లో బౌద్ధం కూడా మిలిటెంట్ రూపం తీసుకున్నదని ఆయన విశ్లేషించారు. ఇజ్రాయిల్‌లో కూడా మత పార్టీల ప్రాబల్యం పెరుగుతుండగా, హంగరీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, డెన్మార్క్, బెల్జియం, స్వీడెన్ తదితర దేశాల్లో కూడా జాతీయవాద పార్టీలకు ఆదరణ పెరుగుతోంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత రెండు తరాల పాటు పశ్చిమ యూరప్ రాజకీయాలను తీర్చిదిద్దిన సోషల్ డెమొక్రటిక్ శక్తులు తిరోగమనంలో ఉన్నాయి. జర్మనీలో సోషల్ డెమొక్రాట్లు, ఫ్రాన్స్‌లో సోషలిస్టు పార్టీ అదృశ్యమయ్యే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. యూరప్‌లో అనేక వామపక్ష పార్టీలు మార్కెట్ ఆర్థిక వ్యవస్థను సమర్థించక తప్పడం లేదు. గత శతాబ్ది ఆఖరి దశాబ్దంలో లాటిన్ అమెరికాలోని పలు దేశాల్లో జయపతాకలు ఎగురవేసిన వామపక్షవాదం ఇప్పుడు సంక్షోభంలో ఉన్నది. గత మూడు దశాబ్దాలుగా అంతర్జాతీయంగా అసమానతలు పెరుగుతున్నాయి. ఆర్థికవేత్త థామస్ పికెటీ ప్రకారం అన్ని దేశాల్లో ధనిక పేద వ్యత్యాసాలు తీవ్రతరమయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా వామపక్షాలు దెబ్బతినడం ఆసక్తికరమని ఫుకుయామా రాశారు.


వామపక్షాల సంగతి అటుంచితే, జాతీయవాదం విధ్వంసకరంగా పరిణమించిన అనుభవం ప్రపంచ దేశాలకు రెండవ ప్రపంచ యుద్ధంతోనే వచ్చింది. హిట్లర్, ముస్సోలినీల జాతీయవాదం కొన్ని కోట్ల మంది మరణానికి కారణమైంది. విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ జపాన్ దురాక్రమణ వాదాన్ని తీవ్రంగా విమర్శించారు. జపాన్ దుందుడుకువాద జాతీయవాద ధోరణులను ఆయన 1916లోనే ఎత్తి చూపారు. పశ్చిమ దేశాల సామ్రాజ్యవాద శిబిరంలో చేరడం సరైంది కాదని ఆయన ఆనాడే ఆ దేశాన్ని హెచ్చరించారు. దేశభక్తి, జాతీయవాదం సరిహద్దులకే పరిమితం కావాలని, మానవత్వం కంటే అవి గొప్పవేం కాదని ఆయన స్పష్టం చేశారు. 1914–45ల మధ్య జాతీయవాదం సృష్టించిన దుష్ఫలితాలు తెలిసినప్పటికీ ప్రపంచ దేశాలు చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోలేదు. జపాన్‌లో తీవ్ర జాతీయవాదానికి ప్రతీకగా గుర్తింపు పొందిన మాజీ ప్రధాని షింజో అబే ఇటీవల హత్యకు గురికావడం, చైనాలో ఈ హత్యకు హర్షామోదాలు వ్యక్తం కావడం అనేక సంకేతాలను అందిస్తోంది. ఇప్పుడిప్పుడే కొన్ని దేశాలు తీవ్ర జాతీయవాద ధోరణులనుంచి బయటపడుతున్నాయి. జపాన్, రష్యా, అమెరికా, యూరప్‌లోని అనేక దేశాల్లో ప్రజలు తీవ్ర జాతీయవాద మైకం నుంచి వైదొలగి శాంతిని కోరుకుంటున్నారు. తమ నాయకత్వాలను విమర్శిస్తున్నారు. అయినప్పటికీ ప్రపంచంలో అనేక దేశాలు అతి జాతీయవాదం జ్వాలల నుంచి తమను తాము కాపాడుకోవడం ఇప్పట్లో జరిగేలా కనపడడం లేదు.


ఒక దేశ అభివృద్ధికి, నిర్మాణానికి, సాంస్కృతిక విలువలను కాపాడుకోవడానికి, ఆత్మగౌరవానికి జాతీయవాదం ప్రేరేపించడం ఆహ్వానకరమే. అయితే జాతీయవాదం పేరిట మానవతా విలువలను విధ్వంసం చేయడాన్ని, రాజకీయాల కోసం మతాన్ని ఉపయోగించుకోవడాన్ని ఆహ్వానించలేము. కేంద్రంలో బిజెపి తిరంగా యాత్రలు, స్వాతంత్ర్య అమృతోత్సవాలు, స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలను ఆవిష్కరించడం ఆరోగ్యకర పరిణామాలే. దేశభక్తి పేరిట మోదీ దేశ ప్రజలను సమైక్యం చేసే యత్నాలను కూడా ఆమోదించవచ్చు కాని అదే సమయంలో విద్వేష ప్రసంగాలు చేయడం, ఒక మతంపై మరో మతాన్ని పురికొల్పడాన్ని తీవ్ర జాతీయవాద విపరీత ధోరణులుగా వ్యవహరించక తప్పదు. ఢిల్లీ ఎంపి పర్వేజ్ వర్మ పూర్తిగా ఒక మతం వారిని సాంఘికంగా బహిష్కరించాలని పిలుపునిచ్చారు. అనేక చోట్ల కొన్ని మత సంస్థల వేదికలపై విద్వేష ప్రసంగాలు జరుగుతున్నాయి. ఏ మతంవారైనా చట్ట వ్యతిరేకంగా మరో మతంపై దాడి చేస్తే, చట్టప్రకారం చర్యలు తీసుకుని ప్రభుత్వం సహించబోదనే సంకేతాలు పంపించవచ్చు. కాని ఒక మతం వారిని బహిరంగంగా పోలీసులు స్తంభానికి కొట్టి చితకబాదడం, విద్వేష పూరిత ప్రసంగాలు చేసిన మరొకరిని చూసీ చూడనట్లు వదిలేయడం భారతదేశంలో సమ న్యాయపాలన (రూల్ ఆఫ్ లా)ను అపహాస్యం చేస్తోంది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా పలు సందర్భాల్లో చెప్పింది. ఈ పరిస్థితుల వల్ల దసరా సమయంలో ఆనందంగా జరగాల్సిన గర్బా నృత్యాలు కూడా అల్లర్లకు దారితీస్తున్నాయి. గుజరాత్‌లో గుర్తింపు కార్డులను తనిఖీ చేసి గర్బా నృత్యాలకు అనుమతించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశంలో అనేక చోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంటోంది.


రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అధినేత మోహన్ భాగవత్ కేంద్రానికి ఏం సంకేతాలు పంపించదలుచుకున్నారో కాని ఇటీవలి కాలంలో ఢిల్లీలోని రెండు ముఖ్యమైన మసీదులను సందర్శించారు. అఖిల భారత ఇమాం సంఘం అధినేత ఇలియాసీ మోహన్ భాగవత్‌ను ‘రాష్ట్ర పిత’గా అభివర్ణించారు. హిందూ ముస్లింలు కలిసి దేశం పురోగతికి కలిసికట్టుగా పనిచేయాల్సిన చారిత్రక కర్తవ్యాన్ని తమ సమావేశం నిరూపిస్తోందని ఆయన అన్నారు. అంతకు ముందు భాగవత్ ఢిల్లీలో మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, మాజీ ఎన్నికల కమిషనర్ ఖురేషి, అలీఘఢ్ ముస్లిం యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ జమీర్ ఉద్దీన్ షాతో సహా అనేక మంది ముస్లిం మేధావులను కలుసుకుని చర్చలు జరిపారు.


ఈ నేపథ్యంలో మన ప్రధాని నరేంద్రమోదీ ఉజ్బెకిస్తాన్ వెళ్లి రష్యా అధ్యక్షుడికి యుద్ధం దుష్ఫలితాల గురించి చెప్పడం ఆయన రాజనీతిజ్ఞతకు నిదర్శనం. ఇదే విషయాన్ని ఆయన అమెరికా, నాటో దేశాలకు కూడా చెప్పాల్సిన ఆవశ్యకత ఉన్నది. పిఎఫ్ఐపై ఎన్ఐఏ దాడులు చేసేముందు మోదీ, అమిత్ షా, అజిత్ దోవల్ ముస్లిం పెద్దలతో చర్చించడం సానుకూల సంకేతాలు పంపించింది. అదే సమయంలో విద్వేష ప్రసంగాలు చేసే పర్వేజ్ లాంటి వారిని ప్రోత్సహించడం లేదనే సంకేతాలు పంపించడం కూడా అవసరం.


‘అయం నిజః పరో వేతి గణనా లఘుచేతసామ్‌, ఉదార చరితానాం తు వసుధైవ కుటుంబకమ్‌ (అల్పబుద్ధి ఉన్నవాడు ఇతను నావాడు, అతను పరాయివాడు అంటూ లెక్కలు వేస్తుంటాడు. కానీ విశాలమైన హృదయం కలిగినవాడు ప్రపంచమంతా తన కుటుంబమే అన్న మనస్తత్వాన్ని కలిగి ఉంటాడు)’ అని పార్లమెంట్ ప్రవేశద్వారంపై చెక్కిన ‘హితోపదేశ’ సూక్తిని మన ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు నిరంతరం ఉటంకిస్తుంటారు. ఇదే సూక్తి స్ఫూర్తితోనే మోదీ ఉజ్బెకిస్తాన్ వెళ్లి పుతిన్‌కు నిజమైన ప్రజాస్వామ్యం విలువ గురించి చెప్పి ఉంటారు. అదే సమయంలో మన దేశంలో కూడా జాతీయవాదం వెర్రితలలు వేయకుండా చూడాల్సిన బాధ్యత మోదీపై ఉన్నది. భవిష్యత్‌లో అమెరికా, నాటో దేశాలకు కూడా ఆయన ఈ విలువల గురించి చెప్పాల్సిన ఆవశ్యకత ఉన్నది. దివంగత ప్రధాని పీవీ నరసింహారావు దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదికపై ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో నాగార్జునుడు బోధించిన మాధ్యమికవాద ప్రాశస్త్యాన్ని వివరించారు. ప్రపంచానికి మార్గదర్శకత్వం వహించేందుకు అనేక విలువైన తాత్విక దర్శనాలు, సూక్తులు భారతీయ జ్ఞానసంచయంలో ఉన్నాయి. ఎటొచ్చీ మన నేతలే సంకుచిత రాజకీయ ప్రయోజనాలకోసం హద్దుల్ని దాటి పరిస్థితులు చేయి దాటిపోవడానికి కారకులవుతారు. ఈ పరిణామాలవల్ల భారతీయత అన్న పదం విలువ కోల్పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత నేతలపై ఉన్నది.


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2022-10-12T06:34:04+05:30 IST