ఎగ్జిట్‌పోల్స్ దేనికి సంకేతం?

ABN , First Publish Date - 2022-03-09T07:11:40+05:30 IST

చరిత్ర పునరావృత్తమవనున్నదా? 2017 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 2022 అసెంబ్లీ ఎన్నికలలో సమాజ్ వాది పార్టీ సంఖ్యాబలం పెద్ద ఎత్తున పెరుగుతుందని, ఆ పార్టీ 47 సీట్లనుంచి 150 సీట్ల వరకు పెంచుకునే...

ఎగ్జిట్‌పోల్స్ దేనికి సంకేతం?

చరిత్ర పునరావృత్తమవనున్నదా? 2017 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 2022 అసెంబ్లీ ఎన్నికలలో సమాజ్ వాది పార్టీ సంఖ్యాబలం పెద్ద ఎత్తున పెరుగుతుందని, ఆ పార్టీ 47 సీట్లనుంచి 150 సీట్ల వరకు పెంచుకునే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన వివిధ మీడియా సంస్థలు సోమవారం నాడు ప్రకటించాయి. భారతీయ జనతా పార్టీకి గతంతో పోలిస్తే కొన్ని నష్టాలు జరుగుతాయి కాని అది మెజారిటీకి అవసరమైనదానికంటే ఎక్కువ సీట్లే సాధించగలదని ఈ పోల్స్ ద్వారా వెల్లడవుతోంది. ఇక ఈ ఎన్నికల్లో మిగతా పార్టీలు నామమాత్రంగానే సీట్లు సాధిస్తాయని, అవి 20 నుంచి 30 సీట్ల వరకే సాధింవచ్చునని అవి అంచనా వేశాయి. నిజానికి ఎగ్జిట్‌పోల్స్‌కూ, అంతకు ముందు ఇవే మీడియా సంస్థలు ప్రకటించిన ఓపీనియన్ పోల్స్, సర్వేలకూ పెద్ద తేడా లేదు కనుక ఎగ్జిట్‌పోల్స్ ప్రకటించిన అంకెలు అభిప్రాయాలే కాని నిజమైన ఫలితాలకు సూచికలు కాకపోవచ్చునని కొట్టిపారేసే వారుంటారు. 2017లో ఇవే మీడియా సంస్థలు బిజెపి అధికారం చేరువలోకి రాదని, సమాజ్‌వాది పార్టీ, కాంగ్రెస్ పార్టీలకు 150 కంటే ఎక్కువ సీట్లే వస్తాయని తేల్చాయి. కానీ బిజెపి 312 సీట్లు, ఎస్‌పి–కాంగ్రెస్ 54 సీట్లు సాధించడంతో అంతా దిగ్బ్రాంతులయ్యారు. 2017 ఎగ్జిట్ పోల్స్ విఫలమయినందువల్ల 2022 ఎగ్జిట్‌పోల్స్ విఫలమవుతాయని చెప్పడానికి వీలులేదు. అయితే భారత రాజకీయాలపై నరేంద్ర మోదీ ప్రభావం ప్రసరించిన తర్వాత ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్‌పోల్స్ కూడా బిజెపి దారిలో పయనించక తప్పదని తేలిపోయింది.


నిజానికి ఉత్తరప్రదేశ్‌లో వివిధ కులాలు తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తే భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం కష్టమేనని ఇటీవల సీనియర్ బిజెపి నాయకుడు ఒకరు విలేఖరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ అన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు, గోరఖ్ పూర్‌కు చెందిన ప్రముఖ కవి విశ్వనాథ ప్రసాద్ తివారీతో మాట్లాడినప్పుడు కూడా 1989 తర్వాత జరిగినట్లు వివిధ కులాలు సంఘటితమయితే బిజెపి గెలుపు కష్టమని, అయితే అలా జరుగుతుందో లేదో తనకు అనుమానమేనని చెప్పారు.


కులాలు చీలిపోయి, ఆయా కులాలకు చెందిన వివిధ రాజకీయ పార్టీలు పోటీ చేస్తే ఓట్లు చీలిపోయి విజయం సాధించే ఫార్ములాను ఉత్తరప్రదేశ్‌లో బిజెపి అనుసరించింది. కేవలం రెండు పార్టీల మధ్యే ప్రధాన పోటీ ఏర్పడి వివిధ కులాలు ఆయా పార్టీల వారీగా విడిపోతే తమకు కష్టమని కొందరు బిజెపి నేతలు కూడా నిన్నమొన్నటి వరకు భయపడ్డారు. కేవలం రెండు పార్టీల మధ్య లేదా రెండు ధ్రువాల మధ్య (బై పోలార్) పోటీ జరిగితే అనుకున్న ఫలితాలు సాధించలేమని వారి అభిప్రాయం. రెండు ధ్రువాల మధ్య ఎన్నికలు జరిగినప్పుడు అధికారంలోకి రావాలంటే 45 శాతం ఓట్లు రావాలని, కులాలను చీల్చినప్పుడు కూడా తమకు 37 నుంచి 39 శాతం మాత్రమే ఓట్లు వచ్చాయని బిజెపి నేతల అభిప్రాయం. ఈసారి ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు దాదాపు రెండు ధ్రువాల మధ్య జరిగినట్లు వార్తలు వచ్చాయి. బిఎస్‌పి దాదాపు పోటీలో లేదని, బిజెపి, బిఎస్‌పిల నుంచి యాదవేతర ఓబీసీలు, జాతవేతర దళితుల నేతలు సమాజ్‌వాది పార్టీకి వలస వెళ్లారని కూడా వార్తలు వచ్చాయి. ఈ పరిణామాలే కాక సాగు చట్టాలపై జరిగిన ఉద్యమాలు, అధిక ధరలు, నిరుద్యోగం వంటి సమస్యలు, అయిదేళ్ల ఆదిత్యనాథ్ పాలనపై వ్యతిరేకత ఇవన్నీ తోడైతే బిజెపి గెలుపు ఇంకా కష్టసాధ్యమవుతుందని అంచనా వేసిన వారున్నారు. అయినప్పటికీ అన్ని ఎగ్జిట్‌పోల్స్ బిజెపి వైపే మొగ్గు చూపాయి.


సిఎస్‌డిస్–-లోక్‌నీతిలో పనిచేసే ఒక మిత్రుడి ప్రకారం ఎగ్జిట్‌పోల్స్ ఈసారి గురితప్పే అవకాశాలు లేవు. అఖిలేశ్ యాదవ్‌ను భారీ మెజారిటీతో గెలిపించే దిశగా యూపీ ఎన్నికలు సాగలేదని ఆయన చెప్పారు. బిజెపికి పూర్తిగా అనుకూలంగా ఉన్న అగ్రవర్ణాల ఓట్లు యదాతథంగా ఆ పార్టీకే పడడం, యాదవేతర ఓబీసీలు కొందరు ఎస్‌పి వైపు మొగ్గి నప్పటికీ అఖిలేశ్ అనుకున్నంతగా పూర్తిగా ఆయన నాయకత్వాన్ని సమర్థించకపోవడం, అదే విధంగా జాతవేతర దళితులు కూడా అఖిలేశ్ అంచనాలకు అనుగుణంగా కాకుండా బిజెపి వైపే మొగ్గు చూపడం ఇందుకు కారణాలుగా ఆయన భావిస్తున్నారు. నిజానికి 1984లో కల్యాణ్‌సింగ్‌ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చేయడం, 1991లో ఆయనను ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థిగా రంగంలోకి దించడం జరిగినప్పుడే బిజెపి లోధా, కుర్మీలతో సహా యాదవేతర ఓబీసీలను తన వైపుకు ఆకర్షించింది. 1991లో 31.5 శాతం ఓట్లతో 221 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చిన బిజెపి 1993లో 33.3 శాతం ఓట్ల తో 178 సీట్లను సాధించింది. అయినప్పటికీ అధికారంలోకి రావడానికి బిజెపికి 37 సీట్లు తగ్గడంతో సమాజ్‌వాది పార్టీ – బహుజన సమాజ్ పార్టీ ఏకమయ్యాయి. ఈ ప్రయోగం రెండేళ్లలోనే విఫలం కావడంతో అప్పటి వరకూ బిజెపిని మనువాద పార్టీ అని విమర్శించిన బిఎస్‌పి అధినేత్రి మాయావతి ఆ పార్టీతో చేతులు కలిపి ముఖ్యమంత్రి అయ్యారు. 1985లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో 269 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ సంఖ్యాబలం 1989లో 94 సీట్లకు, 1991లో 46 సీట్లకు పడిపోవడానికి కారణం రాజీవ్ గాంధీ హయాంలో తీసుకున్న నిర్ణయాలు కారణమైతే బిజెపి బలపడడానికి కాంగ్రెస్ వైఫల్యమే కాదు, బిసి-దళిత ఐక్యత విఫలం కావడం కూడా కారణం. ఏ సమీకరణలైతే నాడు యూపీలో ప్రాబల్యం పెంచుకోవడానికి బిజెపికి ఉపయోగపడ్డాయో, ఇప్పుడూ అవే సమీకరణలు పార్టీకి ఉపయోగపడుతున్నాయి. కేవలం హిందూత్వ భావోద్వేగాల వల్లే నిలదొక్కుకోలేమని బిజెపికి అప్పుడూ తెలుసు, ఇప్పుడూ తెలుసు. బిజెపికి యూపీలో ఆమోదయోగ్యత లభించేందుకు కాంగ్రెస్‌తో పాటు ఎస్‌పి, బిఎస్‌పి కూడా కారణమని వేరే చెప్పనక్కర్లేదు. తొలుత కాంగ్రెస్ ఓటు బ్యాంకును తర్వాత ప్రాంతీయ పార్టీల ఓటు బ్యాంకును హరించే విద్య బిజెపి యూపీ నుంచే ప్రారంభించింది. ఇవాళ అదే ప్రయోగం దేశమంతటా విస్తరిస్తోంది.


సిఎస్‌డిఎస్–-లోక్‌నీతి మిత్రుడి మరో అభిప్రాయం ప్రకారం ఆదిత్యనాథ్, మోదీ విధానాలు, నిర్ణయాల పట్ల ప్రజల్లో వ్యతిరేకత బిజెపిని ఓడించేంత ప్రబలంగా మారలేదు. ముఖ్యంగా బిజెపికి ఓటువేయడమా, సమాజ్‌వాది పార్టీకి ఓటువేయడమా అన్న ఆలోచన వచ్చినప్పుడు అయిష్టంగానైనా బిజెపికి ఓటు వేయాల్సివచ్చిందని, ఇది మోదీ–యోగీ ప్రజలపై చూపించిన మానసిక ప్రభావ ఫలితమని సిఎస్‌డిఎస్ – లోక్ నీతి మిత్రుడి అభిప్రాయం. 2012–17 మధ్య కాలంలో అఖిలేశ్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం యాదవులు- ముస్లింలు కేంద్రంగా పాలన జరిగిందని, అప్పటి దుష్పరిపాలన ఫలితాల ప్రభావం ఇతర వర్గాలపై ఇప్పటికీ ఉన్నదని ఆయన అన్నారు. అయితే కేవలం ఆదిత్యనాథ్‌కే వదిలేస్తే బిజెపి యూపీలో విజయం సాధించలేకపోవచ్చునని, ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా రంగంలోకి దిగి చివరి వరకూ జనం మధ్యలో ఉండడం, అనేక రాజకీయ చర్యలు తీసుకోవడం, వివిధ వర్గాలకు చెందిన ప్రజల భావోద్వేగాలను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు తీవ్రం చేయడం బిజెపి విజయానికి కారణమవుతుందని ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఇన్‌ఛార్జిగా పని చేసిన మరో సీనియర్ బిజెపి నాయకుడి అంచనా.


ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు నిజమైతే యూపీలో బిజెపికి సరైన ప్రత్యామ్నాయాన్ని ప్రజల ముందుంచడంలో ప్రతిపక్షాలు అనుకున్నంత మేరకు విజయం సాధించలేదనే చెప్పాల్సి ఉంటుంది. కేంద్రంలో మోదీ విధానాలు, ఆదిత్యనాథ్ అయిదేళ్ల పాలన పట్ల వ్యతిరేకతనే ప్రతిపక్షాలు ఉపయోగించుకోలేకపోతే అవి తమ స్వరూప, స్వభావాలనే సమీక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జాతీయస్థాయిలోను, వివిధ రాష్ట్రాల్లోను బిజెపిని ఎదుర్కోవడానికి కొత్త ఎజెండాను, వ్యూహాన్ని రూపొందించుకోవాల్సి ఉంటుంది. యూపీలో బిజెపి గెలిచినంత మాత్రాన 2024లో బిజెపికి బలమైన ప్రత్యామ్నాయం రాదని చెప్పలేమని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అంటున్నారు. అయితే అది ఆయన తన గిరాకీని యథాతథంగా ఉంచుకుని పబ్బం గడుపుకోవడానికి చేసిన ప్రకటన కూడా కావచ్చు. పైగా ఆయన గెలిచే అవకాశాలున్న పార్టీలనే ఎంచుకుంటారన్న ప్రచారం ఒకటుంది. ఒకవేళ ఉత్తరప్రదేశ్‌లో బిజెపి మరోసారి గెలిస్తే ఏమవుతుంది? యూపీ ప్రయోగం దేశమంతటా విస్తరించేందుకు తోడ్పడుతుంది. 2019లో కాంగ్రెస్‌తో తలపడిన సీట్లలో బిజెపి 92 శాతం మేరకు విజయం సాధించింది. ఇప్పుడు అదే విజయాన్ని ప్రాంతీయ పార్టీల విషయంలో సాధించేందుకు ప్రయత్నిస్తుంది. గతంలో కాంగ్రెస్‌ను ఎదుర్కొనేందుకు సమాయత్తమైన ప్రాంతీయ పార్టీల నేతలు కొత్త నెత్తురు నిండిన, స్వచ్ఛమైన, సోషలిస్టు ఆదర్శాలతో కూడిన నేతలు. ఇవాళ దేశంలో అన్ని ప్రాంతీయ పార్టీల నేతల ప్రభుత్వాల తీరు తెన్నులను ప్రజలు చవి చూశారు. కనుక ఇప్పుడు రచ్చ గెలవాలంటే ఆయా నేతలకు ఇంట గెలవడం ముఖ్యం. అఖిలేశ్ గెలిచినా, ఓడినా, ఆయన అనుభవం ప్రాంతీయ పార్టీల అధినేతలకు ఒక అధ్యయనాంశం కాక తప్పదు.


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2022-03-09T07:11:40+05:30 IST