ఈ అసహనం ఏ పాలనకు సంకేతం?

ABN , First Publish Date - 2022-08-10T06:33:53+05:30 IST

మాజీముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గత వారం ఢిల్లీకి వచ్చినప్పుడు మధ్యాహ్నం 15 మంది, సాయంత్రం అయిదారుగురు జాతీయ మీడియా ప్రతినిధులు ఆయనను కలుసుకునేందుకు వచ్చారు.

ఈ అసహనం ఏ పాలనకు సంకేతం?

మాజీముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గత వారం ఢిల్లీకి వచ్చినప్పుడు మధ్యాహ్నం 15 మంది, సాయంత్రం అయిదారుగురు జాతీయ మీడియా ప్రతినిధులు ఆయనను కలుసుకునేందుకు వచ్చారు. దాదాపు గంటల తరబడి వారి మధ్య అనేక అంశాలపై చర్చలు జరిగాయి. ఎన్ని ఇబ్బందికరమైన ప్రశ్నలు వేసినప్పటికీ ఆయన తొణక్కుండా, బెణక్కుండా చాకచక్యంగా తప్పించుకుంటూ చిరునవ్వుతో జవాబులు ఇచ్చారు. దాదాపు మూడేళ్ల క్రితం అధికారం కోల్పోయినప్పటికీ, శాసనసభలోనూ, పార్లమెంట్‌లోనూ తెలుగుదేశం ప్రాతినిధ్యం అంతగా లేదని తెలిసినప్పటికీ జాతీయ మీడియాలో చంద్రబాబునాయుడు పట్ల ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు. ఈ ఆసక్తి ఇప్పటికిప్పుడు ఏర్పడింది కాదు. చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచీ ఢిల్లీ మీడియాతో సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నారు. జాతీయ రాజకీయాల్లో ఆయన నిర్వహించిన భూమిక కూడా చాలామందికి తెలుసు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పడున్న నేతల్లో చంద్రబాబు గురించే ఢిల్లీలో చాలామందికి అధికంగా తెలుసు. అందుకు అనేక కారణాలున్నాయి. నాయుడు ఏమి చేస్తున్నారు? ఆయన తిరిగి అధికారంలోకి రాగలుగుతారా అని ప్రశ్నించే వారు ఢిల్లీలో అనేకమంది.


దేశ రాజధానిలో ఎన్టీఆర్ తర్వాత తమ ముద్ర వేసిన రాజకీయ నాయకులు చాలా తక్కువ. మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి మరణించి రెండు సంవత్సరాలు దాటినా ఢిల్లీలో ఆయనను చాలా మంది గుర్తు చేసుకుంటుంటారు. జనతాదళ్, యునైటెడ్ ఫ్రంట్ నేతగా, తర్వాత కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధిగా, కేంద్రమంత్రిగా జైపాల్ రెడ్డి ఢిల్లీ మీడియాలో చెరగని ముద్రవేశారు. ఆయన ఓడిపోయిన తర్వాత కూడా ఢిల్లీ వస్తే మీడియా ప్రతినిధులు ఆయన చుట్టూ మూగేవారు. ఆయన రాజకీయ విశ్లేషణ వినేందుకు ఆసక్తి కనపరచేవారు. చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డిల గురించి కూడా ఇప్పటికీ గుర్తు చేసుకునే సీనియర్ పాత్రికేయులు ఉన్నారు. విమర్శనాత్మకంగా రాస్తానని తెలిసినా వైఎస్ నాకు కారులో విమానాశ్రయానికి వెళుతూ ఇంటర్వ్యూలు ఇచ్చిన సందర్భాలున్నాయి.


రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నేటితో పదవీవిరమణ చేస్తున్నారంటే ఢిల్లీలో అందరికంటే ఎక్కువగా మీడియా ప్రతినిధులు బాధపడడంలో ఆశ్చర్యంలేదు. భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా, రాజ్యసభ సభ్యుడుగా, కేంద్ర మంత్రిగా, ఉప రాష్ట్రపతిగా ఆయన ఏ పదవిలో ఉన్నా ఢిల్లీ మీడియా ఆయనకు సన్నిహితంగా మెలిగింది. బిజెపి నేతల్లో ఉత్తరాదిన తెలిసిన దక్షిణాది నేత ఎవరైనా ఉన్నారంటే ఆయన వెంకయ్యనాయుడే. రాష్ట్రంలో బిజెపికి బలం లేకపోయినా స్వంత గొంతుక వినిపించి, అంచెలంచెలుగా జాతీయస్థాయికి ఎదిగిన నేత వెంకయ్య నాయుడు. బిజెపి అధికారంలో లేనప్పుడు జరిగిన సభల్లో వెంకయ్య నాయుడు మైకందుకుని వాగ్ధాటి, ఛలోక్తులు, ప్రాసలతో కూడిన ప్రసంగం చేసి సభాస్థలి కిక్కిరిసిపోయేలా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. జనం లేరని వేదికపైకి వచ్చేందుకు తటపటాయిస్తున్న వాజపేయి, ఆడ్వాణీ కూడా వేదికపైకి వచ్చి ఆయన ప్రసంగాన్ని ముగ్ధులై వినేవారు. అశోకా రోడ్‌లో బిజెపి కార్యాలయం నిర్మానుష్యంగా ఉన్న సమయంలో ఉదయాన్నే వెంకయ్య వచ్చి ఆఫీసు తాళాలు తెరిపించి రాత్రి వరకూ పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ గడిపిన రోజులు గుర్తున్నాయి. 90వ దశకంలో కాంగ్రెస్‌లో గాడ్గిల్, జనతాదళ్‌లో జైపాల్ రెడ్డి, బిజెపిలో వెంకయ్య నాయుడులతోనే ప్రతి రోజూ మధ్యాహ్నమంతా మీడియాకు గడిచిపోయేది. సాయంత్రం ఆఫీసుకు తిరిగి రాగానే రాయడానికి బోలెడన్ని రాజకీయ కథనాలుండేవి. వెంకయ్య చమత్కార సంభాషణ, లోతైన రాజకీయ విశ్లేషణ, గంటల తరబడి వినేవారిని కదలకుండా చేసే వాక్పటిమ, అడపా దడపా ఆయన నెల్లూరు వంటకాలతో ఇచ్చే ఆతిథ్యం మరిచిపోలేనివి. గత వారం రోజులుగా జాతీయ మీడియాలో పుంఖానుపుంఖాలుగా వెంకయ్య గురించి వస్తున్న వ్యాసాలే ఆయన ఢిల్లీ రాజకీయాల్లో చూపిన ప్రభావానికి నిదర్శనం.


వెంకయ్య తర్వాత ఏమి జరుగుతుందో అని రాజ్యసభలో సీనియర్ ప్రతిపక్ష నాయకుడు ఒకరు వ్యాఖ్యానించడం వెనుక అంతరార్థం ఉన్నది. ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా వెంకయ్య నాయుడు రాజ్యసభలో చర్చకు అవకాశం ఇచ్చేవారు. సాధ్యమైనంతమేరకు చర్చలేకుండా బిల్లులను పాస్ చేయడాన్ని ఆయన ఇష్టపడేవారుకాదు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఏకాభిప్రాయం ద్వారా బిల్లులు ఆమోదం పొందేందుకు, చర్చలు జరిగేందుకు ఆస్కారం కలిగించేవారు. సభా వ్యవహారాల కమిటీ సమావేశాల్లో ఛలోక్తులు విసురుతూ వాతావరణాన్ని చల్లబరిచేవారు. ఆయన పదవీ విరమణ చేస్తున్నందుకు ఇవాళ అధికార పక్షం కంటే ప్రతిపక్ష సభ్యులే ఎక్కువగా బాధపడుతున్నారంటే అందులో అర్థం ఉన్నది. నరేంద్ర మోదీని తీవ్రంగా విమర్శించే మల్లిఖార్జున ఖర్గే, తిరుచి శివ, డెరెక్ ఓబ్రెయిన్, జైరాంరమేశ్ తదితరులు కూడా వెంకయ్యను ప్రశంసిస్తూ ఆయన సభా నిర్వహణా శైలిని, స్నేహశీలతను మెచ్చుకోవడం యాంత్రికంగా జరిగింది కాదు. నేటి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో వెంకయ్య నాయుడు లాంటి నేతల అవసరం ఎంతో ఉన్నదని సిపిఐ(ఎం) సభ్యుడు జాన్ బ్రిటాస్ సైతం వ్యాఖ్యానించారు. తనకు బిజెపి పార్లమెంటరీ పార్టీ ఇచ్చిన వీడ్కోలు సభలో వెంకయ్య తన సహజ శైలిలో అన్న వ్యాఖ్యలకు ఎంతో విలువున్నది. ‘మీకు పేషెన్స్ (సహనం) లేకపోతే మీరు పేషంట్ (రోగి)గా మారుతారు..’ అని ఆయన అన్నారు. ‘ప్రతిపక్షాలు చెప్పేది చెప్పనివ్వండి.. ఆ తర్వాత మీరు మాట్లాడండి..’ అని ఆయన అధికార పక్షానికి సలహాగా ఇచ్చారు.


కాని సహనశీలత, మీడియాతో సంబంధాలు, చర్చలకూ సంప్రదింపులకూ తావివ్వడం అనేది నేటి నాయకుల్లో కరువైంది. కొవిడ్ పేరుతో రెండేళ్ల క్రితం పార్లమెంట్ సెంట్రల్ హాలులో మీడియా ప్రవేశాన్ని నిషేధించారు. ఆ తర్వాత పరిస్థితులు మెరుగైనా ఇదే నిషేధాన్ని కొనసాగిస్తున్నారు. గతంలో సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, జైపాల్ రెడ్డి, శరద్ పవార్, అహ్మద్ పటేల్‌తో సహా అనేకమంది నేతలు, మంత్రులు సెంట్రల్ హాలుకు వచ్చినప్పుడు సీనియర్ మీడియా ప్రతినిధులతో చర్చలు జరిపేందుకు ఇష్టపడేవారు. అనేక రాజకీయ కథనాలు సెంట్రల్ హాలు చర్చల ద్వారా బయటకు వచ్చేవి. ఇప్పటి ప్రభుత్వం ఈ స్వేచ్ఛాయుత ధోరణికి అడ్డుకట్ట వేసింది. కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనంలో సెంట్రల్ హాలునే తీసి వేశారు. వందేళ్ల పాత పార్లమెంట్ భవనంతో పాటు చరిత్రాత్మకమైన సెంట్రల్ హాలు కథ కూడా ఈ సమావేశాలతో ముగిసిపోతోంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అర్ధరాత్రి ట్రిస్ట్ విత్ డెస్టినీ పేరుతో జవహర్ లాల్ నెహ్రూ ప్రసంగించిన చరిత్ర సెంట్రల్ హాలుకు ఉన్నది. ఒక రకంగా చర్చలకు, సంప్రదింపులకు, అభిప్రాయాల మార్పిడికి లభించే వాతావరణాన్ని ఉద్దేశపూర్వకంగా స్తంభింపచేస్తున్నారు. తమ పనితీరు, తమపై వచ్చే విమర్శల గురించి ఎవరూ బహిరంగంగా చర్చించకూడదనేదే ఉద్దేశంగా కనపడుతోంది. పార్లమెంట్‌లో కూడా చర్చలకు ఆస్కారం లేకుండా చేస్తూ కేవలం బిల్లులు ఆమోదింపచేసుకోవడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నప్పుడు ఇక బయట మీడియాతో చర్చలకు ఎందుకు ఆస్కారమిస్తారు? ఒక ప్రజాస్వామ్య దేశంలో గుంభనంగా, రహస్యంగా, ఎవరికీ జవాబుదారీ కాకుండా, చర్చలకు ఆస్కారం లేకుండా, ప్రశ్నించడానికి వీలు లేకుండా, తమ కార్యకలాపాలు ఎవరైనా గమనిస్తారనే భయంతో ప్రభుత్వాన్ని నడపాలనుకోవడం ఏ పాలనకు సంకేతం? కేంద్ర ప్రభుత్వ పెద్దల వైఖరిలోనే కాదు, నేడు కొందరు రాష్ట్ర ముఖ్యమంత్రులు, ఇతర నేతల వైఖరిలో కూడా ఎవరితో మాట్లాడకూడదనే, ముఖ్యంగా మీడియాతో చర్చించకూడదనే వైఖరి నాటుకుపోయింది. మాట్లాడితే ఏమి అడుగుతారో, ప్రశ్నిస్తారో అన్న భయం వారిలో ఉన్నట్లు కనపడుతోంది. దీని వల్ల మీడియాకు కూడా వారంటే పెద్దగా ఆసక్తి లేకుండా పోతోంది.


ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు పట్ల ఢిల్లీ మీడియా ఆసక్తిని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఒక సీనియర్ నాయకుడు తమతో మాట్లాడతారని తెలియగానే ఆగమేఘాలపై ఏదో నిధి దొరికినట్లు అనేక మంది మీడియా ప్రతినిధులు వాలిపోయే పరిస్థితి ఇప్పుడు నెలకొన్నది. దేశ రాజధానిలోనే కాదు, అనేక రాష్ట్రాల్లో కూడా సమాచారాన్ని గుప్పిట్లో బిగించడం, నేతలు, మంత్రులు, అధికారులు తమతో మాట్లాడే అవకాశాలివ్వకుండా తప్పించుకు తిరగడం. చాలాచోట్ల మీడియా ఎంట్రీని నిషేధించడం, ఆఖరుకు సమాచార హక్కు చట్టాన్ని కూడా నీరు కార్చడం ప్రస్తుతం మీడియా అనుభవంలో ఉన్నది. అధికారంలో ఉన్నవారు నిజంగా మంచిపనులు చేసినా వారికి వ్యతిరేకంగా కథనాలు రావడానికి ప్రధాన కారణం వారి వ్యవహారశైలి తప్ప మరేమీ కాదు. పారదర్శకత లేకుండా, ఇష్టారాజ్యంగా, చర్చలకు ఆస్కారం లేకుండా, సమాచారాన్ని గుప్పిట్లో బిగిస్తూ, ఒంటి స్తంభపు మేడలో నివసిస్తూ ఉన్నవారు, వ్యతిరేకంగా రాసినంత మాత్రాన బద్ధ శత్రువులుగా వ్యవహరించే వారు ఎన్ని మంచిపనులు చేసినా ఏమి లాభం? ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా భావించే మన దేశంలో ఆరోగ్యకరమైన, చర్చలకు ఆలవాలమైన సంస్కృతిని పెంచి పోషిస్తే అన్ని వ్యవస్థలతో పాటు మీడియా కూడా బాగుపడే అవకాశాలున్నాయి. ఔరంగజేబు, హిట్లర్, ముస్సోలినీ తదితరులు చేసిన మంచి పనులకు చరిత్ర అధిక ప్రాధాన్యత నీయలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2022-08-10T06:33:53+05:30 IST