నేటి పాట్నా రేపటి ఢిల్లీ కాగలదా?

ABN , First Publish Date - 2022-08-17T06:30:33+05:30 IST

మహారాష్ట్రలో అనూహ్యంగా శివసేన చీలిపోయి బిజెపితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత దేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి తిరుగులేదనే అభిప్రాయం...

నేటి పాట్నా రేపటి ఢిల్లీ కాగలదా?

మహారాష్ట్రలో అనూహ్యంగా శివసేన చీలిపోయి బిజెపితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత దేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి తిరుగులేదనే అభిప్రాయం అంతటా తలెత్తింది. త్వరలో బిహార్, పంజాబ్, తెలంగాణలో కూడా మహారాష్ట్ర తరహా పరిణామాలు తలెత్తనున్నాయని బిజెపి నేత ఒకరు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో కూడా ఏకనాథ్ షిండేలు ఉన్నారని బిజెపి నేతలు బాహాటంగా ప్రకటించారు. పశ్చిమ బెంగాల్‌లో ఒక మంత్రి స్థావరాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసి అరెస్టు చేసిన తర్వాత తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ స్వరంలో మార్పు కనపడింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత శరద్ పవార్ కూడా భీతావహులై ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు చెప్పారు. దేశంలో అనేక పార్టీల నేతలు ప్రధాని మోదీకి స్నేహహస్తం చాచడం తప్ప మార్గం లేదని భావిస్తున్నారు. పార్లమెంట్‌లో కూడా ప్రతిపక్షాలు కలిసికట్టుగా పోరాడలేని పరిస్థితి స్పష్టంగా కనపడుతోంది.


ఈ పరిస్థితుల్లో బిహార్‌లో నితీశ్ కుమార్ ఎన్డీఏను వదుల్చుకుని రాష్ట్రీయ జనతాదళ్‌తో చేతులు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది అత్యంత సాహసోపేత నిర్ణయం తప్ప మరేమీ కాదు. ఒకప్పుడు తన సారథ్యంలో జూనియర్ భాగస్వామిగా ఉన్న బిజెపి 2020 అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ కంటే ఎక్కువ సీట్లు సాధించిన తర్వాత నితీశ్ కుమార్ బలహీనుడయ్యారు. రాంవిలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ఎన్డీఏ నుంచి వైదొలగి జెడి(యు) కు వ్యతిరేకంగా పోటీ చేయడంతో నితీశ్ కేవలం 43 సీట్లు మాత్రమే సాధించగలిగారు. చిరాగ్ పాశ్వాన్ వెనుక బిజెపి పెద్దల హస్తం ఉన్నదని ఆయన గ్రహించకపోలేదు. తన ప్రాధాన్యత రోజురోజుకూ తగ్గిపోవడం, బిజెపిలో తనకు మిత్రులైన సుశీల్ మోడీ లాంటి వారిని ప్రక్కకు తప్పించడం, తన మంత్రివర్గంలో బిజెపి మంత్రులు తనను సంప్రదించకుండా స్వతంత్ర నిర్ణయాలు ప్రకటించడం, చివరకు తన పార్టీకి చెందిన ఆర్‌సిపి సింగ్‌నే తనకు వ్యతిరేకంగా మార్చే ప్రయత్నం చేయడంతో బిజెపిని నితీశ్ వదుల్చుకున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. నితీశ్ కనుక బిజెపిని వదుల్చుకోకపోతే ఏమి జరిగేది? బిజెపి తప్పకుండా నితీశ్‌ను వదుల్చుకునేది. ఆర్‌సిపి సింగ్‌నో, మరొకరినో ఏకనాథ్ షిండేగా మార్చి జనతాదళ్ (యు)ను చీల్చేది అని వారు అంటున్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గోవా, కర్ణాటక, ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలు సహజంగానే నితీశ్‌లో అనుమానాలు రేకెత్తించాయనడంలో సందేహం లేదు. కనుక తాడో పేడో తేల్చుకునేందుకే నితీశ్ ఎన్డీఏ నుంచి వైదొలగి ఆర్‌జెడితో చేతులు కలిపి సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేశారనడంలో సందేహం లేదు.


ఎన్డీఏ నుంచి గతంలో తెలుగుదేశం, అకాలీదళ్, శివసేన వైదొలగాయి కాని ఆ పార్టీలు వైదొలగడానికీ నితీశ్ కుమార్ వైదొలగడానికి చాలా తేడా ఉన్నది. బిజెపితో నితీశ్ చాలా సంవత్సరాలుగా స్నేహం చేశారు. బిహార్‌లో బిజెపి బలోపేతం కావడానికి ఆయన ఒక రకంగా కారకులయ్యారు. జార్జి ఫెర్నాండెజ్‌తో కలిసి సమతా పార్టీ ఏర్పాటు చేసి వాజపేయి మంత్రివర్గంలో వ్యవసాయమంత్రిగా ఉన్నారు. జనతాదళ్(యు)ను స్థాపించి 2005లో బిజెపి మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. అయితే బిజెపి తనకు అనుకూలంగా, తన ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేసేంత వరకే ఆయన ఆ పార్టీతో స్నేహం నిలుపుకున్నారు. తనపై మతతత్వ ముద్ర రాకుండా చూసుకోవడమే కాదు, అనేకసార్లు స్వంత గొంతుకను వినిపించారు. గుజరాత్ అల్లర్లను వ్యతిరేకించారు. 2013లో నరేంద్రమోదీని ప్రధానమంత్రి పదవికి అభ్యర్థిగా ప్రకటించినప్పుడు ఆయన బిజెపితో తెగతెంపులు చేసుకుని ఆర్‌జెడి, కాంగ్రెస్‌తో మహాఘట్ బంధన్ ఏర్పాటు చేశారు. దేశంలో మోదీ ప్రభంజనాన్ని గమనించి 2017లో ఆయన ఘట్ బంధన్ నుంచి విడివడి మళ్లీ బిజెపికి స్నేహహస్తం చాచారు. 2019లో మోదీ–నితీశ్ కూటమి వల్ల లోక్‌సభలో మొత్తం 40 సీట్లలో 39 సీట్లు రెండు పార్టీలు గెలుచుకోగలిగాయి. అయితేనేం మోదీ గతంలో నితీశ్ తనకు వ్యతిరేకంగా వ్యవహరించిన విషయం గమనించి ఆయనను తొక్కిపెట్టే ప్రయత్నం చేయడం వల్ల 2020 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఆయనను నియంత్రించే స్థితికి రాగలిగింది. మోదీ గతాన్ని అంత తేలిగ్గా మరిచిపోయే వ్యక్తి కాదు. కాని నితీశ్ కుమార్ అనూహ్యంగా ఎన్డీఏను వదుల్చుకుంటారని మోదీ కూడా ఊహించి ఉండకపోవచ్చు. బిహార్‌లో 2025 వరకు అసెంబ్లీ ఎన్నికలు లేవు కనుక నితీశ్ కుమార్ ప్రభుత్వాన్ని కేంద్రంలోని బిజెపి ఏమీ చేయలేకపోవచ్చు. ఈలోపు 2024 లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి నరేంద్రమోదీ ప్రభంజనం బిహార్‌లో వీచకుండా జెడి(యు), ఆర్‌జెడి, కాంగ్రెస్, హిందూస్తానీ ఆవామ్ మోర్చా, వామపక్ష పార్టీలతో కూడిన కూటమి అడ్డుకట్ట వేసే అవకాశాలున్నాయి.


బిహార్‌లో ఆర్‌జెడి–జెడి(యు) కూటమి బలమైన సామాజిక కూటమిగా మారేందుకు ఆస్కారం ఉన్నది. ఆర్‌జెడికి యాదవ్, ముస్లింల బలమైన మద్దతు ఉన్నది. లాలూ ప్రసాద్ జైల్లో ఉన్నప్పుడే 2020 అసెంబ్లీ ఎన్నికల్లో తేజస్వి యాదవ్ ఈ విషయాన్ని రుజువు చేసుకోగలిగారు. మరో వైపు నితీశ్ కుమార్ యాదవేతర బలహీన వర్గాల మద్దతు కూడగట్టగలరని, దీనివల్ల దాదాపు 40 శాతం సామాజిక పునాది ఈ రెండు పార్టీలకు లభిస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ, బహుజన సమాజ్ పార్టీల మధ్య ఐక్యత అనేక కారణాల వల్ల విజయవంతం కాకపోవచ్చు కాని బిహార్‌లో జెడి(యు), ఆర్‌జెడి ఐక్యత విజయవంతం అయ్యేందుకు ఆస్కారం ఉన్నది. నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్‌లకు విద్యార్థి రాజకీయాలనుంచే కలిసి పనిచేసిన చరిత్ర ఉన్నది. ఇద్దరూ రాంమనోహర్ లోహియా, జయప్రకాశ్ నారాయణ్ శిష్యులే. ఈ రెండు పార్టీలు మరోసారి సామాజిక శక్తుల ఐక్యతను, చైతన్యాన్ని కలిగించేందుకు కృషి చేసే అవకాశాలూ లేకపోలేదు. బిజెపి బలంగా పోటీలో నిలదొక్కుకోవాలంటే ఈ రెండు పార్టీలకు మించి సామాజిక సమీకరణలకు ఇప్పటికే ఎత్తుగడలు వేయాల్సి ఉన్నది.


2019 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి 17 సీట్లు దక్కాయి, నితీశ్ కుమార్ మూలంగా మరో 16 సీట్లు, లోక్‌జనశక్తి మూలంగా 3 సీట్లు ఎన్డీఏ ఖాతాలో జమ అయ్యాయి. ఎన్డీఏ నుంచి నితీశ్ నిష్క్రమణ మూలంగా 2024 ఎన్నికల్లో మళ్లీ ఈ ఫలితాలు పునరావృతం అయ్యే అవకాశాలు లేవని బిహార్‌లో బిజెపి గట్టి పోటీ ఎదుర్కోవాల్సి వస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. అంతేకాక బిహార్‌లో జరిగిన పరిణామం ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిషాలో పడే అవకాశాలు లేకపోలేదు. ఒక్కో ప్రతిపక్ష ప్రభుత్వాన్ని కూలద్రోస్తూ వస్తున్న మోదీ దూకుడుకు బిహార్ పరిణామం అడ్డుకట్ట వేయవచ్చు. ఈ రీత్యా మోదీ ఎదుర్కొనే మూడో లోక్‌సభ ఎన్నికలకు ముందు బిహార్‌లో జరిగింది కీలక పరిణామంగా భావించవచ్చు.


ఇప్పటి వరకూ మోదీని జాతీయ స్థాయిలో ఎదుర్కోగలిగిన నేత ఎవరూ గత ఎనిమిదేళ్లలో ఆవిర్భవించలేదు. ముఖ్యంగా ఉత్తరాదిలో ఆయనను ఢీకొనగలిగిన నేత ఎవరూ లేరు. రాహుల్ గాంధీని బిజెపి నేతలే ముందుకు నెట్టడం వల్ల ఆయన కాల్పనిక ప్రత్యర్థిగా మిగిలిపోయారు కాని ఆయన నిజమైన ప్రత్యర్థి కానే కాదు. మమతా బెనర్జీ, శరద్ పవార్ స్వరాలు బలహీనంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో నితీశ్ కుమార్ జాతీయ స్థాయిలో మోదీకి ప్రత్యర్థిగా మారేందుకు ప్రయత్నించవచ్చు. వెనుకబడిన వర్గాలకు చెందిన నితీశ్ కుమార్ తిరుగుబాటు మూలంగా ఉత్తరాదిన వెనుకబడిన, బలహీన వర్గాల్లో చైతన్యం రాజుకునేందుకు ప్రయత్నాలూ సాగించవచ్చు. మోదీ ఉధృతి వల్ల క్రుంగిపోయి ఉన్న అనేక పార్టీలకు నితీశ్ కుమార్ ఆశాదీపంగా కూడా కనపడవచ్చు. ఎలెక్ట్రానిక్ ఇంజనీరింగ్ చదివిన నితీశ్ కుమార్ దేశంలో అనేక మంది నేతలకంటే విద్యాధికుడు. ఆయనపై వారసత్వ పాలనకు సంబంధించి కానీ, అవినీతికి సంబంధించి కానీ ఎలాంటి ఆరోపణలు లేవు. కనుక ఈడీ దాడులకు గురయ్యే అవకాశాలులేవు. దాదాపు 15 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పరిపాలనా అనుభవం ఉన్న, 24 గంటలు రాజకీయాలలో గడిపిన నేతగా నితీశ్ కుమార్ జాతీయ స్థాయిలో ఎలాంటి ప్రభావం చూపగలరో 2024 ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలుస్తుంది.


బిహార్ పరిణామాల వల్ల బిజెపికి 2024 ఎన్నికల్లో కనీసం ఆ రాష్ట్రంలో 20సీట్లకు పైగా నష్టం వచ్చే అవకాశాలున్నాయని అంచనాలు వినపడుతున్నాయి. ఉత్తరాదిన అనేక రాష్ట్రాల్లో బిజెపి ఇప్పటికే అత్యధిక స్థాయిలో సీట్లు గెలుచుకుంది కనుక ఈ సీట్లు తగ్గే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ప్రతిపక్షంలో ఆశావహులు భావిస్తున్నారు. బహుశా ఈ పరిణామాన్ని ఊహించినందువల్లనేమో బిజెపి తెలంగాణ, ఒడిషా, పశ్చిమ బెంగాల్‌లలో తన ఉధృతి పెంచాలని నిర్ణయించినట్లు కనపడుతోంది.


బిహార్ పరిణామం చూసి దేశంలో చాలా మంది మోదీ వ్యతిరేకులు ఎంతో ఉత్సాహాతిరేకాన్ని, ఉబలాటాన్ని ప్రదర్శిస్తున్నారు. మోదీకి వ్యతిరేకంగా ఒక చిన్న కొమ్మ వీచినా ఇంట్లో కూర్చుని సంతోషపడే వారు మన దేశంలో ఎక్కువ. నేటి పాట్నా రేపటి ఢిల్లీ అని ఇప్పటికే వారు ప్రకటిస్తున్నారు. కాని ఇది అతిశయోక్తి తప్ప మరేమీ కాదు. ఇప్పడున్న నేతల్లో నితీశ్ కుమార్ ప్రధాని మోదీకి మెరుగైన ప్రత్యర్థిగా కనిపించవచ్చు. అయితే మోదీకి వ్యతిరేకంగా, దేశంలో కకావికలైన అనేక శక్తులను కూడగట్టుకోవడం అంత సులభం కాదు. ముఖ్యంగా మోదీ దేశంలో ఒక సామాజిక శక్తిగా, బలమైన భావజాలానికి ప్రతినిధిగా అవతరించిన నేపథ్యంలో సుసంఘటిత ప్రత్యామ్నాయాన్ని నిర్మించగల శక్తి నితీశ్ కుమార్‌కు ఉన్నదా? కుప్పకూలిన కాంగ్రెస్ పునరుత్థానం ఎంతో కొంత జరగకుండా దేశంలో ఏ సామాజిక, రాజకీయ మార్పు అయినా సాధ్యమా?


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2022-08-17T06:30:33+05:30 IST