కాంగ్రెస్‌ను ఈ భీష్ముడు కాపాడగలరా?

ABN , First Publish Date - 2022-10-26T01:19:02+05:30 IST

కాంగ్రెస్ చరిత్రలో బుధవారం నుంచి ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవనున్నది. 1998 నుంచి కాంగ్రెస్ అధినేత్రిగా ఉన్న సోనియాగాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలను మల్లికార్జున్ ఖర్గేకు అప్పగించనున్నారు..

కాంగ్రెస్‌ను ఈ భీష్ముడు కాపాడగలరా?

కాంగ్రెస్ చరిత్రలో బుధవారం నుంచి ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవనున్నది. 1998 నుంచి కాంగ్రెస్ అధినేత్రిగా ఉన్న సోనియాగాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలను మల్లికార్జున్ ఖర్గేకు అప్పగించనున్నారు. కాంగ్రెస్ చరిత్రలో ఇది ఒక చెప్పుకోదగ్గ మార్పు అనక తప్పదు. 1991లో భర్త రాజీవ్ గాంధీ చనిపోయిన బాధలో సోనియా పార్టీ పగ్గాలు చేపట్టలేదు. రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టేందుకు పదే పదే నిరాకరించడంతో చేసేది ఏమీ లేక మల్లికార్జున్ ఖర్గేకు బాధ్యతలు అప్పగించాలని సోనియా నిర్ణయించారు. నిజానికి అశోక్ గెహ్లోత్ రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవి వదిలి పెట్టి పార్టీ అధ్యక్ష పదవి చేపట్టేందుకు అంగీకరించి ఉంటే ఖర్గేను రంగంలోకి దించాల్సిన అవసరం ఉండేదికాదు. గెహ్లోత్ ముళ్లకిరీటంగా భావించిన పార్టీ అధ్యక్ష పదవిని అంగీకరించేందుకు ఖర్గే సిద్ధమయ్యారు.

అపార రాజకీయ అనుభవం, పాలనా సామర్థ్యం ఉన్నప్పటికీ అట్టడుగు వర్గాలకు చెందిన నేతలు ఎప్పటికప్పుడు విధేయత నిరూపించుకుంటూ, ఇచ్చిన పదవులను ప్రసాదంగా కళ్లకు అద్దుకుని నిర్వహించడం, అడిగినప్పుడు ఆ పదవులు వదులుకోవడం తప్ప వారికి వేరే గత్యంతరం ఉండదు. ఆ విధేయతే అత్యున్నత పదవి రాష్ట్రపతి నుంచి మంత్రి పదవులు, పార్టీ అధ్యక్ష పదవులు పొందేందుకు అవకాశాలు కలిగిస్తోంది. దామోదరం సంజీవయ్య, బంగారు లక్ష్మణ్, రాంనాథ్ కోవింద్, ద్రౌపది ముర్ము, మల్లికార్జున్ ఖర్గేలకూ ఇదే సూత్రం వర్తిస్తుంది.

జీవితంలో పలు దారుణాలు, అవమానాలు చవిచూసిన నేత ఖర్గే బాల్యంలో బీదర్ ప్రాంతంలో వేలాది రజాకార్లు గ్రామాలపై దాడులు చేసి ప్రజలను ఊచకోత కోసినప్పుడు ఆయన తల్లీ, చెల్లెలు ప్రాణాలు కోల్పోయారు. తండ్రితోపాటు తప్పించుకున్న ఖర్గే ఒక మిల్లులో పనిచేసి కష్టపడి చదువు పూర్తి చేశారు. ఆ వెన్వెంటనే కార్మిక నాయకుడుగా ఆయన ఖ్యాతి కెక్కారు. రిపబ్లికన్ పార్టీలో చేరి క్రియాశీలకంగా పనిచేస్తున్న సమయంలో దేవరాజ్ అర్స్ దృష్టిని ఆకర్షించి కాంగ్రెస్ రాజకీయాల్లో ప్రవేశించారు. 1999, 2004, 2013లో ముఖ్యమంత్రి పదవి ఆయనకు సమీపందాకా వచ్చి దక్కకుండా పోయింది. ప్రతీసారీ ఇతర సమీకరణాల వల్ల ఆయనకు ఆ పదవి దక్కలేదు. ఎస్ఎం కృష్ణ, ధరమ్ సింగ్, సిద్దరామయ్యలకు వివిధ సామాజిక కారణాల వల్ల అవకాశం లభించింది. ఖర్గే అవకాశం కోల్పోయిన ప్రతీసారీ అధిష్ఠానం ఆయనకు ఏదో ఒక పదవినిచ్చి సంతృప్తిపరిచింది. చివరకు ఆ రకంగానే ఆయన జాతీయ రాజకీయాల్లోకి వచ్చారు.

కావేరీ నదీ జలాల వివాదం నుంచి నటుడు రాజకుమార్ కిడ్నాప్ వరకు ఎన్నో సంక్షోభాలను పరిష్కరించడంలో ఖర్గే కీలక పాత్ర నిర్వహించారు. కేంద్ర, రాష్ట్రాల్లో వివిధ శాఖల్లో మంత్రిగా తన సమర్థత నిరూపించుకున్నారు. హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని పటిష్ఠంగా నిర్మించడమే కాక, భారతీయ జనతా పార్టీని బలంగా అడ్డుకున్నారు. 2014లో లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటక అంతటా మోదీ ప్రభంజనం వీచినా ఆయన హైదరాబాద్– కర్ణాటక ప్రాంతంలో బిజెపిని బలంగా ఢీకొన్నారు. లోక్‌సభకు కేవలం 44 మందే కాంగ్రెస్ నుంచి ఎన్నికైనప్పటికీ పార్టీ నేతగా మోదీ ప్రభుత్వాన్ని అడుగడుగునా అడ్డుకుని పార్టీ ఉనికిని చాటారు. దీనితో 2019లో మోదీ– అమిత్ షాలు ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టిసారించి ఖర్గేను ఆయన జీవితంలో తొలిసారి ఓటమి చవిచూసేలా చేశారు. ఆ ప్రాంతంలోకి బిజెపి చొచ్చుకురావడం మోదీ–షాల వ్యూహరచనకు సంకేతం. అయినప్పటికీ కాంగ్రెస్ ఖర్గేను వదిలిపెట్టకుండా రాజ్యసభలో పార్టీ నేతను చేయడం, ఇప్పుడు పార్టీ అధ్యక్షుడిని చేయడం యాదృచ్ఛికంగా జరిగింది కాదు. అనేక మంది సీనియర్ నేతలు వెళ్లిపోయినా పట్టించుకోని గాంధీ కుటుంబం 80 ఏళ్లు దాటిన ఖర్గేకు ఎంతో విలువనిచ్చింది. కేవలం ఇది విధేయతను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయం కూడా కాకపోవచ్చు. హైదరాబాద్ – కర్ణాటక ప్రాంతంతో పాటు మొత్తం కర్ణాటకలో కాంగ్రెస్‌కు సానుకూల పవనాలు వ్యాపించేలా చేయడంలో ఖర్గే కీలక పాత్ర పోషిస్తారని కాంగ్రెస్ వర్గాలు ఆశిస్తున్నాయి.

కాంగ్రెస్‌కు ఖర్గే కంటే ఉత్తమ నేత మరొకరు లభించరని తేలిన తర్వాతే ఆయనకు పగ్గాలు కల్పించాలని గాంధీ కుటుంబం నిర్ణయించింది. యుక్త వయస్సులో దేవరాజ్ అర్స్‌తో పాటు తిరుగుబాటు చేసిన నేపథ్యం ఉన్నప్పటికీ ఎనిమిది పదుల వయస్సులో ఉన్న ఖర్గే అలాంటి ఆలోచనలు పెట్టుకునే అవకాశాలు లేవు. గత పదేళ్లుగా ఆయన పార్లమెంట్‌లో గాంధీ కుటుంబానికి తలలోనాలుకలా వ్యవహరిస్తూ వారి వ్యూహాలకు అనుగుణంగా పార్టీని నడిపారు. పలుసార్లు రాహుల్ గాంధీయే తన నాయకుడని, ఆయనను ప్రధానమంత్రి చేయడమే తన ధ్యేయంగా ప్రకటించిన ఖర్గే కాంగ్రెస్ సంస్కృతిని నరనరానా జీర్ణించుకున్నారు. అధికారం కోసం ఎటువంటి అకృత్యాలకైనా పాల్పడే కాంగ్రెస్ నేతల గురించి ఖర్గేకు వేరే చెప్పనవసరంలేదు. ఆయనకే ఆయన నియోజకవర్గంలో వెన్నుపోట్లు ఎదురయ్యాయి. రెండు రోజులకోసారి ఢిల్లీకి పనిగట్టుకునివచ్చే అసమ్మతివాదుల విషయంలో ఖర్గేకున్నంత అనుభవం మరొకరికి లేదు. ఇక బిజెపి మూలాలు ఖర్గేకు తెలిసినంత మరే నేతకూ తెలియకపోవచ్చు.

ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, రాజస్థాన్, కర్ణాటక, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అంతర్గత కుమ్ములాటలు నివారించడం, నేతలను బుజ్జగించడం, జీ–23 పేరిట నేతలు వేరు కుంపట్లు నడపడం, ఇతర పార్టీలకు నేతలు ఫిరాయించకుండా చూడడం ఖర్గే ముందున్న బాధ్యతలు. ఖర్గే అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడానికి ముందు రాహుల్ ఆదేశాల ప్రకారం రాజస్థాన్ వెళ్లి ముఖ్యమంత్రిని మార్చాలని ప్రయత్నించారు. కానీ ఆయనను పార్టీ ఎమ్మెల్యేలెవరూ కలుసుకునేందుకు సిద్దపడకపోవడం, సిఎల్‌పి సమావేశానికి హాజరు కాకపోవడం వంటి విషాద పరిణామాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు పార్టీ అధ్యక్షుడైన తర్వాత ఆయన ఇలాంటి అగ్నిపరీక్షలు ఎన్నో ఎదుర్కోవాల్సి ఉంటుంది. గత ఎనిమిదేళ్లలో సోనియా, రాహుల్ హయాంలోనే దాదాపు 200 మంది ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీని వదిలిపెట్టారు. బిజెపి ప్రలోభాలకు గురై పిసిసి అధ్యక్షులు, సిఎల్‌పి నేతలు, చీఫ్ విప్‌లు కూడా ఫిరాయించారు. పార్టీ తరఫున పోటీ చేయాల్సిన వందలాది అభ్యర్థులు, నేతలు కాంగ్రెస్‌కు తిలోదకాలు సమర్పించారు. గులాంనబీ ఆజాద్, కపిల్ సిబాల్, జ్యోతిరాదిత్య సింధియా, ఆర్‌పిఎన్ సింగ్, రీటా బహుగుణ ఇలా ఎందరో నేతల గురించి చెప్పనక్కర్లేదు. సోనియా, రాహుల్ గాంధీలకే ఇట్లాంటి విషమ పరిస్థితి ఎదురైనప్పుడు ఖర్గే ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోగలరా అన్నది ప్రధాన ప్రశ్న.

పార్టీ కార్యకర్తలు, నేతలకు అందుబాటులో ఉంటూ గాంధీ కుటుంబంతో పాటు అందర్నీ సంప్రదించి, ఒప్పించగలిగిన శక్తి ఉన్నందువల్ల ఖర్గే ఈ ప్రశ్నకు పరిష్కారాలు సాధించే అవకాశం లేకపోలేదని అనేకమంది కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఢిల్లీకి వచ్చే వివిధ నేతలను కలుసుకునేందుకు పార్టీనేతలెవరూ ఇప్పుడు అందుబాటులో లేరు. రాహుల్ గాంధీ పూర్తిగా విశ్వసించే కేరళ నేత కేసి వేణుగోపాల్‌ను కలుసుకోవడమే అతికష్టమైన పనిగా భావిస్తున్నారు. గతంలో వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను ఏఐసిసి కార్యాలయంలో కలుసుకోవడం సులభంగా ఉండేది. కాని గత కొన్ని సంవత్సరాలుగా ఏఐసిసి ప్రజాస్వామిక వాతావరణం కరువయిపోయింది. బిజెపిలో కూడా దాదాపు ఇదే పరిస్థితి నెలకొన్నది. ఒక రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహరచన గురించి ఎవర్ని సంప్రదించాలో తమకు తెలియదని, మోదీ, అమిత్ షా మనసుల్లో ఏమున్నదో అర్థం కావడం అంత సులభం కాదని ఒక బిజెపి నేత వ్యాఖ్యానించారు. ఈ రీత్యా బిజెపి అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా కంటే మెరుగైన పాత్రే ఖర్గే నిర్వహించే అవకాశాలు ఉన్నాయనడంలో సందేహం లేదు.

కాంగ్రెస్‌లో వివిధ యంత్రాంగాలను, అనుబంధ సంస్థలను పునర్వ్యవస్థీకరించడం ద్వారా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్నదని నిరూపించేందుకు ఖర్గే తప్పక ప్రయత్నిస్తారు. ఖర్గేకు ఉన్న పెద్ద శక్తి ఆయనకు ఉన్న అనుభవమే. పార్లమెంటరీ రాజకీయాల్లోనూ పార్టీ వ్యవహారాల్లోనూ పరిపాలనలోనూ, ఆయనకున్నంత అనుభవం కాంగ్రెస్‌లో మరొకరికిలేదు. తనకుతాను దళిత నేతగా చెప్పుకునేందుకు ఇష్టపడని ఖర్గే బౌద్ధ ధర్మాన్ని అనుసరిస్తారు కనుక అందులో భాగమైన మధ్యేమార్గం స్ఫూర్తితో పార్టీని నడిపించేందుకు ప్రయత్నిస్తారని పలువురు భావిస్తున్నారు. సిద్ధాంతాలకంటే అధికారానికి ప్రాధాన్యమిచ్చే నాయకులు ప్రబలి పోయిన కాలంలో ఒక సిద్ధాంతానికి కట్టుబడి కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్న నేతల్లో ఖర్గే అగ్రస్థానంలో ఉంటారనడంలో అతిశయోక్తి లేదు.

పార్టీ నిర్మాణం, నేతల అసమ్మతి గురించి పట్టించుకోకుండా దేశమంతటా తిరిగి మోదీ భావజాలానికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ భావజాలాన్ని నిర్మించే స్వేచ్ఛ రాహుల్ గాంధీకి లభించింది. ఖర్గే లాంటి నేత సురక్షిత హస్తాల్లో పార్టీని ఉంచితే ఆయనే తమకు కళ్లూ చెవులుగా వ్యవహరిస్తారని గాంధీ కుటుంబం విశ్వసిస్తోంది. గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పటికీ తమకు విశ్వాసపాత్రంగా నడుచుకున్న మాదిరే మల్లికార్జున ఖర్గే నడుచుకుంటారని వారు భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. గాంధీ కుటుంబ ప్రయోజనాలేమనిటో, వారి మనసులో ఏమున్నదో ప్రధానిగా మన్మోహన్‌కు తెలిసినట్లే ఇపుడు పార్టీ అధ్యక్షుడుగా ఖర్గేకు కూడా తెలుసు. 2024 ఎన్నికల్లో మోదీకి ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఉంటారని ఎవరైనా అనుకుంటే అమాయకత్వమే అవుతుంది. జరిగేది జగత్ ప్రకాశ్ నడ్డా, మల్లిఖార్జున ఖర్గేల మధ్య పోరు కాదని, ప్రధానమంత్రి నరేంద్రమోదీకీ, ఏపదవి లేకపోయినా భారత్ జోడో యాత్ర అంటూ దేశమంతటా తిరిగేందుకు సంకల్పించిన రాహుల్ గాంధీకి అని రాజకీయాలు తెలిసినవారెవరైనా చెబుతారు. ఖర్గే అధ్యక్షుడైనందుకు మోదీ ఆయనకు అభినందనలు తెలిపినప్పటికీ ఆయన దృష్టి భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్న రాహుల్ గాంధీపైనే ఉంటుందని వేరే చెప్పనక్కర్లేదు.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2022-10-26T01:20:59+05:30 IST
Read more