దుమ్ముమీదేసి, గోడదూకేసిన ఆజాద్‌

ABN , First Publish Date - 2022-08-31T07:58:59+05:30 IST

ఒకపార్టీలో సైద్ధాంతిక విలువలు లేకపోతే ఆ పార్టీ దుస్థితి ఏ విధంగా ఉంటుందో ఇవాళ కాంగ్రెస్‌ను చూస్తే అర్థమవుతుంది. ఒక సైద్ధాంతిక నిబద్ధత ఉన్న పార్టీగా కాంగ్రెస్ ఎన్నడో...

దుమ్ముమీదేసి, గోడదూకేసిన ఆజాద్‌

ఒకపార్టీలో సైద్ధాంతిక విలువలు లేకపోతే ఆ పార్టీ దుస్థితి ఏ విధంగా ఉంటుందో ఇవాళ కాంగ్రెస్‌ను చూస్తే అర్థమవుతుంది. ఒక సైద్ధాంతిక నిబద్ధత ఉన్న పార్టీగా కాంగ్రెస్ ఎన్నడో చరిత్ర కోల్పోయింది. వ్యవస్థాపకులు నిర్దేశించిన లక్ష్యాల సాధనకు దృఢ సంకల్పంతో పనిచేసే కార్యకర్తల సంఘటిత సంస్థగా రూపొందించడంలోనూ ఆ పార్టీ నేతలు విఫలమై చాలా కాలమైంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక బలమైన సైద్ధాంతిక, సువ్యవస్థిత పునాదితో ఆ సేతు శీత నగం విస్తరిస్తోంది. ప్రత్యర్థి పార్టీ నుంచి గట్టి సవాళ్లు ఎదురవుతున్న ప్రస్తుత సమయంలోనూ కాంగ్రెస్ తన సైద్ధాంతిక మూలాలను బలోపేతం చేసుకునేందుకు సీరియస్‌గా ప్రయత్నించడంలేదు. బడా నేతల చుట్టూ తిరుగుతూ వారికి భజనపరత్వం చేస్తూ పదవులు పొందే విద్యలో కాంగ్రెస్ వారు దశాబ్దాలుగా ఆరితేరిపోయారు. మరి అటువంటి పార్టీలో సైద్ధాంతిక నిబద్ధత ఎలా విలసిల్లుతుంది? స్వార్థమే సిద్ధాంతమైపోయిన కాంగ్రెస్ నేతలలో గులాంనబీ ఆజాద్ ఒకరు.


కాంగ్రెస్ పరిభాషలో చెప్పాలంటే ఆజాద్ ఒకప్పటి ఛోటా మోటా నాయకుడు. 1973లో కశ్మీర్‌లో బ్లాక్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచే ఢిల్లీలో పార్టీ నేతల చుట్టూ తిరగడాన్ని ఆయన నేర్చుకున్నారు. లౌకికవాదం, మైనారిటీల ప్రయోజనాలను సంరక్షించడంలో కాంగ్రెస్ ఒకప్పుడు నిబద్ధత చూపేది కదా. అయితే ఈ కశ్మీరీ నేతకు అటువంటి ఆదర్శాలు పట్టలేదు. అసలు ఆయన ముస్లింల కూలిన బతుకుల ఆధారంగానే పదవులు సంపాదించారు! ఎమర్జెన్సీలో సంజయ్ గాంధీ ప్రేరణతో టర్క్‌మన్ గేట్ వద్ద ముస్లింల గుడిసెలను కుప్పకూల్చినప్పుడు సంజయ్ భజన చేయడం ఆయనకు ఉపయోగపడింది. ముస్లింలను కాంగ్రెస్ వైపుకు తిప్పుకోవడం కోసం మైనారిటీల సదస్సు నిర్వహించమనే సలహాతో సంజయ్ దృష్టిలో పడిన నేత ఆజాద్. ఒరిస్సాకు చెందిన రామచంద్ర రథ్‌తో కలసి, తలకటోరా వద్ద ప్రణబ్ ముఖర్జీ నివాసం పైన సర్వెంట్లకు ఉద్దేశించిన బర్సాతీలో ఆజాద్ ఉండేవారు. సంజయ్ పూనికతోనే రాంచంద్ర రథ్ అధ్యక్షతన ఉన్న యువజన కాంగ్రెస్‌కు ప్రధాన కార్యదర్శిగా ఆయన నియమితులయ్యారు. ఆ తరువాత తానే యువజన కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. సొంత రాష్ట్రమైన కశ్మీర్‌లో ఆజాద్ గెలిచే అవకాశాలు పూర్తిగా కొరవడ్డాయి. దీంతో సంజయ్ అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అంతూలేపై ఒత్తిడి చేసి 1980లో వాషిం నియోజకవర్గం నుంచి ఆజాద్‌ను లోక్‌సభకు నిలబెట్టి గెలిపించారు. అప్పటి నుంచీ ఆయనకు తిరుగులేకుండా పోయింది. రెండుసార్లు లోక్‌సభకు, అయిదుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఎన్నో కేంద్రమంత్రి పదవులు, ఒకసారి జమ్మూ- కశ్మీర్ ముఖ్యమంత్రి పదవి నిర్వహించారు. 52 ఏళ్ల రాజకీయ జీవనంలో 50 ఏళ్లు ఆయన కాంగ్రెస్‌లో ఏదో ఒక పదవి నిర్వహిస్తూ వస్తున్నారు. కీలకమైన పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యుడుగా కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నారు. ఇప్పుడు రాజ్యసభకు తనను తిరిగి ఎంపిక చేసే అవకాశం లేకపోయేసరికి కాంగ్రెస్ ఆయనకు ఒక పనికి రాని పార్టీ అనిపించింది! 


ఇంతకీ కాంగ్రెస్ మెరుగుపడేందుకు ఆయన ఏ సలహాలనిచ్చారు? ఇవాళ దేశంలో కాంగ్రెస్ దుస్థితి గురించి, దాని లోపాల గురించి మాట్లాడని వారు అంటూ లేరు. కానీ కాంగ్రెస్ ఎలా బాగుపడాలో చెప్పేవారు కనపడడం లేదు. కాంగ్రెస్‌ను తీవ్రంగా వ్యతిరేకించేవారో, లేక పూర్తిగా సమర్థించేవారో తప్ప తటస్థంగా నిలబడి బలమైన ప్రతిపక్షం ఏర్పడాల్సిన చారిత్రక ఆవశ్యకత గురించి చెప్పేవారు అసలే కనపడడం లేదు. కాంగ్రెస్ పరిస్థితి గురించి తార్కికంగా విశ్లేషించేవారు లేకుండా పోయారు. 73 ఏళ్ల తన జీవితంలో 52 ఏళ్లకు పైగా కాంగ్రెస్‌లో జీవించిన ఆజాద్ కూడా తన అయిదు పేజీల సుదీర్ఘ లేఖలో కాంగ్రెస్‌లో లోపాల గురించి చెప్పారు కానీ ఎక్కడా పరిష్కార మార్గాల గురించి సూచించలేదు.


ఎన్నికల్లో మాటిమాటికీ పరాజయం పొందడమే కాంగ్రెస్ చేసిన పాపమా? ఒక రాజకీయ పార్టీ ఎన్నికల్లో ఓడిపోవడం కానీ, గెలుపొందడం కానీ ఆ పార్టీ గొప్పతనానికి నిదర్శనాలు కావు. ఓడిపోయినంత మాత్రాన ఒక పార్టీ నుంచి వైదొలగడం సరైన కారణం కాకూడదు. గత ఎనిమిది సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ రెండు లోక్‌సభ ఎన్నికలు, 39 శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిందని ఆజాద్ అన్నారు. ఎన్నికల్లో ఓడిపోతే పార్టీ నుంచి రాజీనామా చేయడం సరైనదేనా? ఇవాళ అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ స్థాయికి రావడానికి ఎన్నో ఏళ్లు పట్టింది. బిజెపి పూర్వరూపమైన జనసంఘ్ 1952 ఎన్నికల్లో కేవలం 3 సీట్లు మాత్రమే గెలుచుకుంది. 1957లో అటల్ బిహారీ వాజపేయి మూడు సీట్లకు పోటీ చేస్తే రెండు సీట్లలో ఓడిపోయారు. పడుతూ లేస్తూ వస్తూనే జనసంఘ్ ఎమర్జెన్సీ తర్వాత 1977లో జరిగిన ఎన్నికల్లో 93 సీట్లను గెలుచుకుంది. ఇదే జనసంఘ్ 1980లో బిజెపిగా రూపాంతరం చెందినప్పటికీ 1984లో ఇందిర మరణానంతరం వెలువడిన సానుభూతి పవనాలకు తట్టుకోలేక కేవలం రెండు సీట్లు మాత్రమే గెలుచుకుంది. బిజెపి తొలి అధ్యక్షుడైన వాజపేయి కూడా గ్వాలియర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. బిజెపి వైఫల్యానికి పార్టీ అధ్యక్షుడుగా తాను బాధ్యత వహించి రాజీనామా చేస్తానని అటల్‌జీ అన్నప్పటికీ పార్టీ ఒప్పుకోలేదు. కానీ రెండు సంవత్సరాల తర్వాత జరిగిన జాతీయమండలి ప్లీనరీలో వాజపేయి తప్పుకుని అడ్వాణీని అధ్యక్షుడుగా ఎన్నుకునేందుకు మార్గం సుగమం చేశారు. ఒకప్పుడు కేవలం రెండు సీట్లు గెలుచుకున్న బిజెపి 1989లో 86 సీట్లు గెలుచుకున్న తర్వాత దినదిన ప్రవర్థమానమవుతూ వచ్చింది. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయగల దశ నుంచి పూర్తి మెజారిటీ సాధించగల స్థాయికి చేరుకుంది. చివరకు నరేంద్ర మోదీ సారథ్యంలో రెండుసార్లు లోక్‌సభలో ఘన విజయం సాధించడమే కాక, దేశంలో అనేక రాష్ట్రాలలో అధికారంలో ఉన్నది.


భారతీయ జనతా పార్టీ కానీ, అంతకు ముందు జనసంఘ్ కానీ ఎంత దుస్థితిలో ఉన్నా, ఎన్ని ఢక్కా మొక్కీలు తిన్నా ఆ పార్టీ నేతలు తమ పార్టీని విడిచిపెట్టిన దాఖలాలు లేవు. ఓడిపోయిన కొద్దీ మరింత సమరోత్సాహంతో ఆ పార్టీ నేతలు పోరాడుతూనే వస్తున్నారు కనుక ఇవాళ అది అధికారంలో వర్థిల్లుతోంది. ఇందుకు ప్రధాన కారణం ఆ పార్టీ తన సైద్ధాంతిక పునాదిని పటిష్ఠంగా ఉంచుకునే ప్రయత్న చేయడమే. కమ్యూనిస్టు పార్టీలు కూడా లెక్కలేనన్ని సార్లు ఎన్నికల్లో ఓడిపోయాయి, 2004 తర్వాత నుంచి ఆ పార్టీల సంఖ్యాబలం పడిపోతూనే ఉంది. అయినా ఆ పార్టీల నేతలు తమ పార్టీని వదిలిపెట్టి వెళ్లారన్న వార్తలు చాలా తక్కువ సందర్భాల్లో మనకు వినపడతాయి. 


ఇలాంటి దౌర్భాగ్యం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నది. అధికారంలో లేకపోతే చాలు ఆ పార్టీ నేతలు తమ పార్టీ నాయకత్వాన్ని దూషించి వేరే పార్టీలోకి వెళ్లి పబ్బం గడుపుకోవాలని చూస్తారు. లేదా ఇతర ప్రలోభాలకు లోబడుతారు. తమకు అధికారం లేకపోతే చాలు అసమ్మతివాదిగా తయారవుతారు. ఆజాద్ లాంటి వారి హయాంలో ఇలాంటి పరిణామాలు తీవ్రతరమయ్యాయి. ఆయన ఇన్‌ఛార్జిగా ఉన్న కొన్ని రాష్ట్రాల్లో ఒకప్పుడు కాంగ్రెస్ గెలిచి ఉండవచ్చు. అయితే తప్పుడు నిర్ణయాలు తీసుకుని అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలహీనం కావడంలో ఆయన పాత్ర లేకపోలేదు. ఆయా రాష్ట్రాల నేతలు ఆజాద్‌ను మచ్చిక చేసుకునేందుకు ఎన్ని కళలు ప్రయోగించేవారో, ఆయన ఎన్ని తప్పుడు నివేదికలు అధిష్ఠానానికి ఇచ్చేవారో అన్నది చరిత్ర పుటల్లో రికార్డు కాకుండా పోలేదు. ఆజాద్ హయాంలో కనీసం గాంధీ భవన్ మెట్లు కూడా ఎక్కకుండా బీ-–ఫారంలు పొందిన నేతల యుగం ఆవిర్భవించడం ప్రారంభమైంది. ఒక రకంగా కాంగ్రెస్ ప్రస్తుత దుస్థితికి ఆజాద్ కూడా కారణం. 


అందువల్లే నేటి కాంగ్రెస్ రాజకీయాల్లోను, దాని సామాజిక ఆర్థిక సిద్ధాంతాల్లోనూ లోపాలు ఏమున్నాయో చెప్పడంలో ఆయన విఫలమయ్యారు. కాంగ్రెస్ తన విలువలతో ఎక్కడ రాజీ పడిందో ఆజాద్ చెప్పలేకపోయారు. ప్రధానమంత్రి పదవిలో ఉన్న వ్యక్తిని చోర్ (దొంగ) అనడం సబబు కాదని ఆయన అనడాన్ని ఆక్షేపించవలసిన అవసరం లేదు. అయితే మోదీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ ఎలాంటి సైద్ధాంతిక వైఖరిని అవలంబించాలో చెప్పేంత మేధావితనం ఆజాద్‌లో లేదు. ఆయన అన్నట్లు కాంగ్రెస్‌లో కొన్ని లోపాలు ఉండవచ్చు. రాహుల్ నిర్ణయాలు ఫలితాలు తేకపోవచ్చు కాని వ్యక్తులను దూషించకుండా ఆ లోపాలను అరికట్టేందుకు, ఫలితాలను సాధించేందుకు పార్టీని వీడకుండానే సైద్ధాంతిక చర్చను లేవనెత్తే అవకాశం ఆజాద్ లాంటి నేతలకు ఎప్పుడూ ఉంటుంది. అయితే ఆజాద్‌కు అలాంటి యోచనే లేదు. కశ్మీర్‌లో ఒక ప్రత్యామ్నాయ పార్టీని రూపొందించి అధికారంలోకి రావడమే ఆయన లక్ష్యం. పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ వంటి పార్టీల ఆలోచనా విధానం మోదీ ఆలోచనా విధానానికి సరిపోదు కనుక ఆజాద్ కశ్మీర్‌లో మోదీ ఎజెండాను అమలు చేయడంలో ఉపయోగపడే అవకాశాలున్నాయి. ఆజాద్ ద్వారా కశ్మీర్‌లో ప్రజాస్వామ్యాన్ని సాధించానన్న ఘనత పొందాలన్న ఆలోచన మోదీలో లేకపోలేదు. రాజ్యసభలో ఆజాద్ పదవీ విరమణ సందర్భంగా మోదీ కన్నీరు వెనుక రహస్యం ఇదేనేమో?!


ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ స్వైరవిహారం తర్వాత భారత్‌లో బహు పార్టీ ప్రజాస్వామ్యం తిరిగి రానే రాదని ఇక దశలో చాలా మంది భావించారు. ఒకే పార్టీ వ్యవస్థను ఏర్పర్చడం వల్ల లాభాల గురించి నాడు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేషనల్ హెరాల్డ్ సంపాదకీయాలు కూడా రాసింది. ప్రజాస్వామ్యం కంటే దేశం ముఖ్యం అని ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రకటించారు. ఇప్పుడు ప్రధాని మోదీ వీర విజృంభణను చూసి కూడా అనేకమంది ఇక దేశంలో ప్రతిపక్షానికి అవకాశం లేదని భావించడంలో ఆశ్చర్యం లేదు. నాడు ఇందిరాగాంధీ అనుకున్నట్లే ప్రజాస్వామ్యం కంటే బిజెపి విస్తరణ ముఖ్యమని మోదీ అనుకోవడంలో కూడా ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. తమకు తిరుగులేదనుకునే వారు ఎంతమందికో చరిత్ర గుణపాఠాలు చెప్పిందని తెలుసుకోవాలి.


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Read more