ఈ పరిణామాలు భావి ప్రభాతాలా?

ABN , First Publish Date - 2022-10-05T06:53:24+05:30 IST

భారత రాజకీయాల్లో ఈ విజయదశమి నుంచి కీలక మార్పులు జరిగే అవకాశాలున్నాయా? విజయదశమికి అటూ ఇటుగా దేశంలో కొన్ని రాజకీయ పరిణామాలు ప్రారంభం కావడమే ఈ ప్రశ్నకు ఆస్కారమిస్తోంది...

ఈ పరిణామాలు భావి ప్రభాతాలా?

భారత రాజకీయాల్లో ఈ విజయదశమి నుంచి కీలక మార్పులు జరిగే అవకాశాలున్నాయా? విజయదశమికి అటూ ఇటుగా దేశంలో కొన్ని రాజకీయ పరిణామాలు ప్రారంభం కావడమే ఈ ప్రశ్నకు ఆస్కారమిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సంబంధించి త్వరలో జరగబోయే ఉప ఎన్నికలు, ఆ తర్వాత వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2024 సార్వత్రక ఎన్నికలు అత్యంత కీలకమైనవి. ఈ నవంబర్, డిసెంబర్ లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ లలో భారతీయ జనతా పార్టీ విజయానికి ఢోకా లేదని, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేవని ఏబీపీ-సీఓటర్ సంస్థ నిర్వహించిన సర్వే స్పష్టం చేసింది. అయినప్పటికీ ఏ ఎన్నికనూ మోదీ యథాలాపంగా తీసుకునే అవకాశం లేనేలేదు. గుజరాత్‌లో మోదీ గత ఆరు నెలలుగా సుడిగాలి పర్యటనలు చేస్తూ వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. హిమాచల్‌లో గత వారం మండీలో బిజెపి యువమోర్చా నిర్వహించిన విజయ్ సంకల్ప్ ర్యాలీలో మోదీ పాల్గొన్నారు. అదే రాష్ట్రంలో విజయ దశమి రోజు ఎయిమ్స్‌ను ప్రారంభించనున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ముందే అయిదు రాష్ట్రాల్లో ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఉప ఎన్నికలకు విశేష రాజకీయ ప్రాధాన్యమున్నది. భారత్ జోడో యాత్ర ద్వారా తన రాజకీయ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలనుకుంటున్న రాహుల్ గాంధీ, బిజెపితో తెగతెంపులు చేసుకుని రాష్ట్రీయ జనతాదళ్‌తో చేతులు కలిపిన నితీశ్ కుమార్, ఉత్తర ప్రదేశ్‌లో పునరుత్థానం కోసం ప్రయత్నిస్తున్న సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేశ్ యాదవ్, మహారాష్ట్రలో బాల్ ఠాక్రే వారసత్వాన్ని నిలబెట్టుకోవాలని ఆశిస్తున్న శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రేతో పాటు విజయదశమి రోజు జాతీయ పార్టీ ప్రారంభిస్తున్న కేసీఆర్‌ల ప్రస్థానమేమిటో అర్థమయ్యేందుకు ఈ ఉప ఎన్నికల ఫలితాలు సంకేతాలు ఇవ్వవచ్చు.


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయపరంపరకు ఇప్పటివరకు అడ్డు లేనప్పటికీ భవిష్యత్తులో కూడా ఆయన జైత్రయాత్ర సాఫీగా జరుగుతుందని చెప్పడానికి వీల్లేదు. ఉప ఎన్నికల్లో మెజారిటీ సీట్లు, గుజరాత్, హిమాచల్ రాష్ట్రాల్లో గెలిచినప్పటికీ అసలు యుద్ధం 2023లో జరిగే కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌, త్రిపుర, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల రూపంలో జరగనుంది. ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం 2024 సార్వత్రక ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పడే అవకాశాలు ఉన్నాయి.


పాలనకు సంబంధించి తాను ఎదుర్కొంటున్న విమర్శలు మోదీకి తెలియనివి కాదు. పెచ్చరిల్లుతున్న నిరుద్యోగం, ధరల పెరుగుదల, అధికమవుతున్న ఆర్థిక అసమానతలు, యువతలో అశాంతి గురించి ప్రతిపక్షాలు విమర్శించడం సహజం. అయితే ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే తమ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ మంచ్ నిర్వహించిన ఒక వెబినార్‌లో చేసిన వ్యాఖ్యలు మాత్రం మోదీ తేలిగ్గా తీసిపారేయదగినవి కాదు. ‘దేశంలో పేదరికం మన ముందు ఒక రాక్షసిలా నిలుచున్నది. 20 కోట్ల మంది పేదలు ఇంకా దారిద్ర్యరేఖ దిగువన ఉండడం విషాదకరం, దాదాపు 23 కోట్ల మంది ప్రజలు రోజుకు రూ.375 కంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్నారు, లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం మన దేశంలో నిరుద్యోగం 7.6 శాతం మేరకు ఉన్నది’ అని దత్తాత్రేయ హోసబలే తీవ్రంగా విమర్శించారు. భారతదేశం ప్రపంచంలో ఆరవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం మంచిదే కాని దేశ జనాభాలో కేవలం ఒక శాతం మంది మాత్రమే 20 శాతం జాతీయ ఆదాయాన్ని అనుభవిస్తున్నారని, 50 శాతం మంది చేతుల్లో కేవలం 13 శాతం జాతీయ ఆదాయం ఉన్నదని ఆయన గుర్తు చేశారు. ఈ ఆర్థిక అసమానతల గురించి మనం ఆలోచించాలని హోసబలే అన్నారు. కోట్లాది భారతీయులకు స్పచ్ఛ నీరు, పోషక విలువలు ఉన్న ఆహారం ఆందుబాటులో లేదని, విద్యా ప్రమాణాలు అతి పేలవంగా ఉన్నాయని దత్తాత్రేయ హోసబలే తెలిపారు. ‘దుర్గామాత రాక్షసులను సంహరించినందుకు ఈ నవరాత్రి ఉత్సవాలను మనం జరుపుకుంటాం. దశాబ్దాలుగా మనను పట్టి పీడిస్తున్న పేదరికం రాక్షసిని కూడా మనం సంహరించాల్సి ఉన్నది. ఇదొక పెద్ద సవాలు’ అని ఆయన అన్నారు. 


దత్తాత్రేయ హోసబలే ఎత్తి చూపిన అనేక సవాళ్లను దేశం ఎదుర్కొంటున్నదనడంలో సందేహం లేదు. మోదీ పట్ల గత ఎనిమిది సంవత్సరాలకు పైగా ఆదరణ చూపిస్తున్న ప్రజలు ఈ సవాళ్ల మూలంగానే సందేహాలకు లోనవుతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న డాలర్ ధరతో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడం, దిగుమతులు ఎగుమతుల కంటే వేగంగా పెరగడంతో మన వర్తకపు లోటు కూడా పెరగడం, విదేశీ మదుపరిదారులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటుండడం కూడా తీవ్రంగా ఆందోళనకరమైన విషయాలే. ప్రజల దైనందిన జీవితాలపై తీవ్ర ప్రభావం చూపే ఈ అంశాలు బిజెపికి రాజకీయంగా అవరోధం కాకుండా చూసుకోవడం మోదీ బాధ్యత.


ఇప్పటివరకూ మోదీకి బలమైన ప్రతిఘటన ఇవ్వలేకపోయిన ప్రతిపక్షాలు దత్తాత్రేయ హోసబలే చూపిన కారణాలు, మోదీ ఎదుర్కొంటున్న ఇతర సమస్యల ఆధారంగా రాజకీయంగా పుంజుకునే అవకాశాలు ఉన్నాయా? ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఇటీవలి కొన్ని పరిణామాలు ఈ ప్రశ్నలకు సమాధానాలిస్తాయా అన్నది యోచించాల్సి ఉన్నది. ముఖ్యంగా రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర కర్ణాటకలో ప్రవేశించగానే ఊహించిన దానికంటే ఎక్కువ ప్రతిస్పందన లభించడం కాంగ్రెస్ నేతలకు కొంత ఆనందం కలిగించే విషయం. ఈ కదలిక మరింత వేగం పుంజుకుంటే క్రమక్రమంగా కాంగ్రెస్ తనను తాను నిలదొక్కుకునేందుకు, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కార్యకర్తల నైతికస్థైర్యం పెరిగేందుకు అవకాశం ఉన్నది. ఇటీవలి కాలంలో రాజస్థాన్‌లో అశోక్ గెహ్లోత్ సృష్టించిన సంక్షోభం తర్వాత కాంగ్రెస్ అధిష్ఠానం తేరుకుని విధేయుడైన మల్లిఖార్జున ఖర్గేను పార్టీ అధ్యక్షుడుగా చేయాలని నిర్ణయించడం శశిథరూర్ అన్నట్లు పార్టీలో యథాతథ స్థితికి ప్రతిబింబం. అయినప్పటికీ సోనియా, రాహుల్‌ల నుంచి అంతకంటే ఎక్కువ ఆశించడానికి వీల్లేదని ప్రజలకు తెలుసు. ఎంత ప్రజాస్వామికవాదులమని చెప్పుకుంటున్నప్పటికీ తమ పట్టు నుంచి పార్టీ జారిపోవాలని ఎవరు ఆశిస్తారు?


రాహుల్ గాంధీ జోడోయాత్రతో పాటు అదే స్థాయిలో ఆసక్తి కలిగిస్తున్న అంశం కె. చంద్రశేఖర రావు విజయదశమి రోజు ప్రారంభించనున్న జాతీయ పార్టీ. నిజానికి బిజెపికి ప్రత్యామ్నాయంగా దేశంలో ఒక బలమైన పార్టీ ఉండాలన్న ఆవశ్యకత ఉన్నదని, ఈ ఆవశ్యకతను కాంగ్రెస్ పూరించలేకపోతోందని కూడా చాలా మందికి తెలుసు. మిగతా ప్రతిపక్షాలన్నీ తమ రాష్ట్రాల్లో తాము నిలదొక్కుకునేందుకే సంఘర్షించవలసి వస్తున్నది. నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్, మమతా బెనర్జీ, శరద్ పవార్, ఉద్ధవ్‌ ఠాక్రే, అఖిలేశ్ యాదవ్, స్టాలిన్, కుమారస్వామి వంటి నేతలు కూడా జాతీయ స్థాయిలో ఒక ప్రత్యామ్నాయం ఉండాలని అనుకుంటున్నప్పటికీ తమంతట తాము జాతీయ స్థాయిలో ప్రవేశించగలిగిన సాహసం వారికి లేదు. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ కాకుండా ఒక్కో రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు కాని, తనది జాతీయ పార్టీ అని చెప్పుకోగలిగిన ధైర్యం ఆయన ప్రదర్శించలేదు. కాంగ్రెస్ లేకుండా ప్రత్యామ్నాయం నిర్మించలేమని నితీశ్, లాలూప్రసాద్ ప్రకటించారు. శరద్ పవార్ కూడా అదే వైఖరి ప్రదర్శించారు. తనకు జాతీయ స్థాయిలో ప్రవేశించాలన్న ఆకాంక్షలు లేవని ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చెప్పారు. గతంలో ఎన్టీఆర్ కూడా భారతదేశం అన్న పార్టీ పెట్టాలని యోచించి విరమించుకున్నారు. మరి వీరందరూ చేయని సాహసాన్ని కేసీఆర్ ఎందుకు చేస్తున్నట్లు? 


గత కొంత కాలంగా కేసీఆర్ తన ఆలోచనా ధోరణి గురించి దేశంలో అనేకమంది రాజకీయ నేతలు, విద్యావేత్తలు, సీనియర్ జర్నలిస్టులు మేధావులతో ఆంతరంగిక చర్చలు జరుపుతూ వస్తున్నారు. రైతులు, యువత, మధ్యతరగతి, నిరుద్యోగులు, మహిళలకు న్యాయం చేసే ఒక ప్రత్యామ్నాయ సిద్ధాంతంతో జాతీయ పార్టీ రావల్సిన ఆవశ్యకతను ఎవరూ కాదనడం లేదు. అయితే హేమాహేమీలకు సాధ్యం కానిది కేసీఆర్ సాధ్యం చేయగలరా? అన్నదే ప్రధాన ప్రశ్న. కేసీఆర్‌ను కలిసిన పలువురు రాజకీయ పరిశీలకులు, జర్నలిస్టులు మాత్రమే కాదు, టీఆర్ఎస్ నేతలు కూడా ఆయన పట్ల నమ్మకాలు, అపనమ్మకాల మధ్య ఊగిసలాటలో ఉన్నారు. కేసీఆర్ పెట్టే జాతీయ పార్టీ గురించి ఆ పార్టీ సీనియర్ నేతలను ఎవర్ని అడిగినా వారి పెదాలపై చిరునవ్వు విరబూస్తున్నది. ‘చూద్దాం, ఏం జరుగుతుందో’ అని వారు తప్పించుకుంటున్నారు. కేసీఆర్ పూర్తిగా కొట్టి పారేయదగిన వ్యక్తి కాదని వారి అభిప్రాయమేమో? టిఆర్‌ఎస్ స్థానంలో జాతీయ పార్టీ ఏర్పర్చడం ద్వారా ఒక కొత్త హవాను సృష్టించాలని, కొత్త ప్రాంతాలకు విస్తరించాలని, తద్వారా తన పార్టీ ఉనికిని, విజయావకాశాలను సుస్థిరం చేసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారన్న విషయం స్పష్టమవుతోంది. తెలంగాణలో విస్తరించాలనుకుంటున్న బిజెపి ఈ పరిణామాన్ని ఎలా ఎదుర్కొంటుందనేది వేచి చూడాల్సి ఉన్నది. 


మునుగోడులో గెలిచే అవకాశాలు టిఆర్‌ఎస్‌కే ఎక్కువగా ఉన్నాయన్న విషయాన్ని బిజెపి జాతీయ నేత ఒకరితో ప్రస్తావించినప్పుడు ఆయన నవ్వుతూ ‘పిక్చర్ అభీ బాకీ హై’ అన్నారు! ఇందులో సవాలక్ష సంకేతాలు ఉన్నాయి.


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Read more