నేతిబీర వంటి నీతి శతకం...

ABN , First Publish Date - 2022-08-24T06:51:18+05:30 IST

రాబోయే సార్వత్రక ఎన్నికల్లో విజయం సాధించడానికి తన ఆయుధాలేమిటో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రకటించారు...

నేతిబీర వంటి నీతి శతకం...

రాబోయే సార్వత్రక ఎన్నికల్లో విజయం సాధించడానికి తన ఆయుధాలేమిటో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రకటించారు. అవినీతి, ఆశ్రిత పక్షపాతంపై పోరాటాన్ని ఉధృతం చేసేందుకు సమయం ఆసన్నమైందని స్పష్టం చేస్తూ అందుకు తనకు ప్రజల ఆశీర్వాదాలు కావాలని కోరారు. భారతీయ జనతా పార్టీ మినహా తప్ప మిగతా పార్టీలన్నీ అవినీతిమయమయిపోయాయనీ, ఆశ్రిత పక్షపాతం, వారసత్వ పాలనలో కూరుకుపోయాయని చిత్రించేందుకు ఆయన గత కొంతకాలంగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మోదీ వ్యూహరచనకు అనుగుణంగా వివిధ బిజెపియేతర పార్టీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సిబిఐ దాడులు ఎడతెరిపి లేకుండా సాగుతున్నాయి.


ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అవినీతి వ్యతిరేక పోరులో నుంచి పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ప్రభుత్వం కూడా అవినీతికి అతీతం కాదని కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు నిరూపించే ప్రయత్నం చేయడం. నిన్నమొన్నటి వరకూ కేజ్రీవాల్‌కు ఎంత లేదన్నా స్వచ్ఛమైన, అవినీతి రహితమైన పాలన అందిస్తారన్న పేరుండేది. అయితే ఈడీ, సిబిఐ దాడులతో ఈ అభిప్రాయాన్ని మార్చేందుకు ప్రయత్నం జరుగుతోంది. ప్రజల మనసుల్లో ఈ అభిప్రాయం ఒకసారి మారిందంటే ఇక ఆప్ ప్రభుత్వ పతనం మొదలయినట్లేనని మోదీకి తెలుసు. యుపిఏ హయాంలో మన్మోహన్ సింగ్ సర్కార్ కూడా అవినీతి రహిత ప్రభుత్వం నడిపారనే పేరు సంపాదించారు. కానీ కుంభకోణాలు ఒక దాని తర్వాత మరొకటి వరుసగా బయల్పడేసరికి ప్రజల మనసుల్లో మార్పు ఏర్పడి దాని ప్రయోజనం నరేంద్రమోదీకి కలిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా దాని వల్ల లాభం పొంది ఢిల్లీలో అధికారంలోకి వచ్చేందుకు వీలు కలిగింది. ఇప్పుడిదే ఆయుధాన్ని నరేంద్రమోదీ ఆమ్ ఆద్మీ పార్టీపైనా, దేశంలో ఇతర పార్టీలపైనా ప్రయోగిస్తున్నారనడంలో సందేహం లేదు. నిజానికి కాంగ్రెస్ కూడా 2019 ఎన్నికల్లో రాఫెల్ కుంభకోణాన్ని లేవనెత్తి నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేసింది కాని అది ఫలించలేదు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న ప్రయత్నాలు ఇంతవరకూ ఎందుకు విఫలమవుతున్నాయో ప్రతిపక్షాలు శాస్త్రీయంగా అన్వేషించాల్సి ఉంది.


దేశంలో అవినీతిపై నిర్ణాయక పోరు చేయాల్సిన అవసరం ఉన్నదని స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ప్రకటించడం ఎంతో ఆనందం కలిగించే విషయమే. అధికార వర్గాల అవినీతి నుంచి స్వేచ్ఛ పొందడం మానవ హక్కుగా ప్రముఖ తత్వవేత్త జాన్ లాక్ అభివర్ణించారు. మోదీ ఈ మానవ హక్కును ప్రజలకు ప్రసాదించగలరా? అవినీతి అనేది కేవలం ప్రతిపక్షాలకు సంబంధించిందా? బిజెపి పాలిత రాష్ట్రాలలో కాని, బిజెపి నేతల్లో కాని అవినీతి లేదా?


‘కర్ణాటకలో ఒక్క ఫైలు కూడా లంచం ముట్టకుండా ముందుకు కదలదు’ అని కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి నటరాజన్ ఆగస్టు 20న ఒక అవినీతి అధికారికి బెయిల్‌ను నిరాకరిస్తూ ప్రకటించారు. తమ మఠాలకు మంజూరైన గ్రాంట్లు పొందడానికి కూడా 30 శాతం కమిషన్ చెల్లించాల్సి ఉంటుందని గత ఏప్రిల్‌లో లింగాయత్ మఠాధిపతి ఆరోపించారు. తమ పనులు కావాలంటే ముడుపులు చెల్లించక తప్పదని యూపీలో 74 శాతం మంది, మధ్యప్రదేశ్‌లో 55 శాతం మంది, గుజరాత్‌లో 48 శాతం మంది ప్రజలు ఒక సర్వేలో తెలిపారు. యూపీలో ప్రభుత్వోద్యోగుల బదిలీలో భారీ అవినీతి జరుగుతోందని ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ లేఖ రాసిన తర్వాత దానిపై ఒక విచారణ కమిటీని నియమించడం ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌కు అనివార్యమయింది. ఉత్తరాఖండ్‌లో సబార్డినేట్ సర్వీస్ సెలెక్షన్ కమిషన్ పరీక్ష పేపర్లు లీక్ చేసినందుకు ఒక బిజెపి నేతను అరెస్టు చేశారు, దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం (క్రోనీ క్యాపిటలిజం) కొనసాగుతోంది. ఉదాహరణకు గుజరాత్‌లో అదానీ కంపెనీలతో సహా కొన్ని కంపెనీలు మాత్రమే గత కొద్ది సంవత్సరాల్లో వేల కోట్ల మేరకు ప్రభుత్వాల ద్వారా ప్రయోజనాలు పొందిన దాఖలాలున్నాయి. అతి తక్కువ ధరలకు ప్రభుత్వ భూములు, ఖనిజ వనరులను కట్టబెట్టిన సందర్భాలు ఉన్నాయి. అవినీతిలో తమిళనాడు, ఒడిషా తర్వాత గుజరాత్ మూడో స్థానంలో ఉన్నది. అక్కడ హోం, రెవిన్యూ శాఖల్లో అధిక అవినీతి ఉన్నదని ఏసీబీ నివేదికలు చెబుతున్నాయి.


ప్రజలకు ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ప్రారంభించిన తర్వాత రూ.2లక్ష కోట్ల మేరకు అవినీతి జరగకుండా కాపాడగలిగామని మోదీ చెప్పుకున్నారు. నగదు నేరుగా బదిలీ అయితే సరిపోదు. స్థానిక రాజకీయ నాయకులు ప్రజల ఇళ్లకు వెళ్లి వసూళ్లు చేయడం లేదా, సర్పంచ్‌లు ముందుగానే డబ్బు తీసుకుని ప్రధానమంత్రి ఆవాస్ యోజన దరఖాస్తులను ఆమోదిస్తున్నారా, స్థానిక పోలీసులు డబ్బులు లేకుండా కేసులు పరిష్కరిస్తున్నారా తదితర విషయాలపై ఆయన యోచించాల్సి ఉన్నది.


అవినీతి మూలాలు ఎన్నికల రాజకీయాల్లో ఉన్నాయన్న విషయం అందరికీ తెలుసు. నేతలు అధికారంలోకి వచ్చేందుకు ఎందుకంత ఆతురత ప్రదర్శిస్తున్నారు? అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో మాత్రమే కాదు, స్థానిక ఎన్నికల్లో కూడా భారీ ఎత్తున డబ్బు ఎందుకు ఖర్చు జరుగుతోంది? రాజకీయాలు వేల కోట్ల డబ్బులు గడించేందుకు సాధనమయ్యాయా? మరి మోదీ ఎన్నికల సంస్కరణలు, పోలీసు సంస్కరణలపై ఎందుకు దృష్టి సారించడం లేదు?


2017లో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగం చేస్తూ ఎన్నికల నిధుల్లో పారదర్శకత తెచ్చేందుకే ఎన్నికల బాండ్లను ప్రవేశపెట్టామని అన్నారు. కాని ఎక్కడుంది పారదర్శకత? కేవలం స్టేట్ బ్యాంక్ ద్వారానే బాండ్లను కొనాలని నిబంధన ఎందుకు విధించారు? పార్టీలకు విరాళాలిచ్చేందుకు బాండ్లు ఎవరు కొంటున్నారు? విరాళాలకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ డబ్బుకు పార్టీలు ఎలాంటి లెక్కలు ఎందుకు చెప్పనక్కర్లేదు? విరాళాలిచ్చేందుకు గతంలో కార్పొరేట్ కంపెనీలకు విధించిన 7.5 శాతం పరిమితిని ఎందుకు ఎత్తివేశారు? విదేశీ కంపెనీలు కూడా విరాళాలిచ్చేందుకు వీలుగా ఎఫ్‌సిఆర్‌ఏ చట్టాన్ని ఎందుకు మార్చారు? ఈ ప్రశ్నలకు ఇంతవరకూ ఎవరూ సమాధానం ఇవ్వలేదు. ఈ దేశంలో 99 శాతం ఎన్నికల బాండ్లు కార్పొరేట్ కంపెనీల నుంచే వచ్చాయని, 95 శాతం విరాళాలు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకే వచ్చాయని తెలిస్తే మనకు సమాధానం లభించినట్లే.


అవినీతిని చట్టబద్దం చేసేందుకు. క్విడ్ ప్రో కో ను ప్రోత్సహించేందుకే ఎన్నికల బాండ్లను మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్న ఆరోపణలకు ప్రధానమంత్రి ఏం సమాధానమిస్తారు? ఇవి ఆరోపణలు కావు. ఎన్నికల బాండ్లు మనీలాండరింగ్‌కు దారితీస్తాయని 2017లోనే రిజర్వుబ్యాంకు అభ్యంతరాలు తెలిపింది, అవినీతిపరులు, రాజకీయ నాయకులు కుమ్మక్కయ్యేందుకు ఎన్నికల బాండ్లు దోహదం చేస్తాయని, మన ఎన్నికలపై విదేశీ ప్రభావం పడుతుందని ఎన్నికల కమిషన్ ఆందోళన కూడా వ్యక్తం చేసింది. ఎన్నికల బాండ్లపై విచారణకు సంయుక్త పార్లమెంటరీ కమిటీని నియమించాలన్న ప్రతిపక్షాల డిమాండ్ ‌ను ఎందుకు విస్మరించారు? బాండ్లను చట్ట ప్రకారం త్రైమాసికంగా జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ తొలి పది రోజుల్లోనే విడుదల చేయాల్సి ఉంటే, 2018లో కర్ణాటక ఎన్నికలకు ముందు ఏప్రిల్, మే నెలల్లో, ఆరు రాష్ట్రాల ఎన్నికల ముందు నవంబర్‌లో బాండ్లకోసం ప్రత్యేక విండోలు తెరవాల్సిందిగా ఎస్‌బిఐపై కేంద్రం ఎందుకు ఒత్తిడి తెచ్చింది? రాజకీయ అవినీతిని మటుమాయం చేస్తామని 2014లో అధికారంలోకి రాగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఎన్నికల బాండ్లు రాజకీయ అవినీతిని తగ్గించాయా లేక వ్యవస్థీకృతం చేశాయా?


2018 ఏప్రిల్‌లో ఏడీఆర్, కామన్ కాజ్ అనే సంస్థ ఎన్నికల బాండ్లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే అది ఇంతవరకూ విచారణకు రాకపోవడానికి కారణమేమిటో, కనీసం దాని విచారణపై స్టే విధించకపోవడానికి కారణమేమిటో తెలియదు. ఈ విచారణలో జాప్యం వల్లనే దాదాపు నాలుగేళ్లుగా ఒకే ఒక పార్టీ ఈ ఎన్నికల బాండ్ల ద్వారా ప్రయోజనం పొందడానికి వీలవుతోందని సుప్రీంకోర్టుకు తెలియదా? కోల్‌కతాలో ఒక కంపెనీ తమపై ఐటీ దాడులనుంచి తప్పించుకునేందుకు రూ.40కోట్లను విరాళంగా ఇచ్చిందని, ఎన్నికల బాండ్లు ప్రజాస్వామ్యాన్ని హాస్యాస్పదం చేస్తున్నాయని సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తీసుకువచ్చారు. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ తాజా డేటా ప్రకారం అవినీతి విషయంలో భారతదేశం 85వ స్థానంలో ఉన్నది. దేశంలో అధికారులు లంచాలు లేకుండా పనిచేయరని 50శాతం మంది; ఆరోగ్య, విద్యారంగంలో చేతులు తడపకుండా సేవలు ముట్టవని 32శాతం మంది; అధికారిక పత్రాలను పొందాలన్నా ముడుపులు ఇవ్వాల్సిందేనని 41శాతం మంది; పోలీసులకు ఆమ్యామ్యాలివ్వక తప్పడం లేదని 41శాతం మంది ఈ సంస్థ సర్వేలో తెలిపారు.


ప్రజలకు సకాలంలో సేవలందించే బాధ్యతను నెరవేర్చేందుకు, వారి ఫిర్యాదులను పరిష్కరించేందుకు 2011లో పార్లమెంట్‌లో సిటిజన్ చార్టర్ బిల్లును ప్రవేశపెట్టారు. కాని దానికి కాలదోషం పట్టింది. అన్నాహజారే ఉద్యమం మూలంగా లోక్‌పాల్ చట్టాన్ని 2013లో ఆమోదిస్తే, మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత దాన్ని వ్యవస్థీకృతం చేశారు. మాజీ ప్రధానమంత్రులు, కేంద్ర మంత్రులు, మాజీ ఎంపీలు, కేంద్ర ప్రభుత్వ అధికారుల అవినీతిని విచారించాల్సిన ఈ వ్యవస్థ ఇంతవరకూ ఏ పెద్ద అవినీతి కేసునూ చేపట్టలేదు. చిన్నా చితక కేసుల్ని మాత్రమే ఈ సంస్థ విచారిస్తుంటే ఫిర్యాదులే రాని పరిస్థితి ఏర్పడింది. తనకు ఇక్కడ ఏ పనీ లేదని అలహాబాద్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోసలే తనను నియమించిన ఆరునెలలకే లోక్‌పాల్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. లోక్‌పాల్‌లో నలుగురు న్యాయమూర్తుల పదవుల్లో ఇద్దరి పదవులు రెండేళ్లుగా ఖాళీలు ఉన్నా భర్తీ చేయడానికి ప్రభుత్వం ఆసక్తి ప్రదర్శించడం లేదు. లోక్‌పాల్ సెక్రటేరియట్‌లో కూడా కీలకమైన పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చాలీ చాలని నిధులు కేటాయించడంతో అసలీ వ్యవస్థ ఉన్నదో లేదో తెలియని పరిస్థితి ఏర్పడింది. మరి దేశంలో అవినీతి పోరుపై నిర్ణాయక దశ ప్రారంభమైందని మోదీ ఆగస్టు 15న చేసిన ప్రకటన నిజాయితీ ఉన్నదా? లేక కేవలం రాజకీయాలే ఆయనకు ప్రధానమా?


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Read more