Xiaomi: భారత్‌లో ఆర్థిక సేవల వ్యాపారాన్ని మూసేసిన షావోమీ

ABN , First Publish Date - 2022-10-28T20:41:00+05:30 IST

చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ షావోమీ కార్ప్ (1810.HK) భారత్‌లో తన ఆర్థిక సేవల వ్యాపారాన్ని మూసివేసింది. నాలుగేళ్ల క్రితం

Xiaomi: భారత్‌లో ఆర్థిక సేవల వ్యాపారాన్ని మూసేసిన షావోమీ

న్యూఢిల్లీ: చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ షావోమీ కార్ప్ (1810.HK) భారత్‌లో తన ఆర్థిక సేవల వ్యాపారాన్ని మూసివేసింది. నాలుగేళ్ల క్రితం దేశంలో ప్రారంభించిన ఈ సేవలను ఇప్పుడు మూసివేసినట్టు షావోమీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. వార్షిక వ్యూహాత్మక అంచనా కార్యకలాపాలు, తమ ప్రధాన వ్యాపార సేవలపై మరింతగా దృష్టి సారించే ఉద్దేశంతో తమ ఆర్థిక సేవలను ఈ ఏడాది మార్చిలో మూసివేసినట్టు పేర్కొన్నారు. కంపెనీ ఎంఐ పే యాప్ (Mi Pay app) ద్వారా బిల్ పేమెంట్స్, నగదు బదిలీ వంటివి చేసుకునే వీలుండేది. అయితే, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) వెబ్‌సైట్‌లో గుర్తింపు పొందిన థర్డ్-పార్టీ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) యాప్‌లలో ఇకపై ఇది కనిపించదు. షావోమీ ఇటీవల తన ‘ఎంఐ క్రెడిట్’(MI Credit)ను ఉపసంహరించుకుంది. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు త్వరగా రుణాలు పొందేందుకు ఉద్దేశించిన యాప్ ఇది.

చైనా తర్వాత షావోమీకి అతిపెద్ద మార్కెట్ ఇండియానే. ఇటీవల ఈ సంస్థపై పలు ఆరోపణలు వచ్చాయి. ట్యాక్స్ నిబంధనలను ఉల్లంఘించి సొంత దేశం చైనాకు పెద్ద ఎత్తున సొమ్మును తరలించి మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు గుర్తించిన ఈడీ 676 మిలియన్ డాలర్ల విలువైన షావోమీ ఆస్తులను ఫ్రీజ్ చేసింది. రాయల్టీ చెల్లింపుల పేరుతో విదేశీ సంస్థలకు పెద్ద ఎత్తున చెల్లించినట్టు ఈడీ గుర్తించింది. అయితే, ఈ ఆరోపణలను షావోమీ ఖండించింది. ఈ చర్యలు ఇండియాలో తమ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపాయని పేర్కొంది.

2020లో చైనాతో సరిహద్దు ఘర్షణలు చెలరేగిన తర్వాత చైనాకు చెందిన చాలా కంపెనీలు ఇండియా వ్యాపార కార్యకలాపాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రెండు దేశాల మధ్య రాజకీయపరమైన ఉద్రిక్తతలు చైనా మొబైల్ సంస్థల కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. భద్రతాపరమైన కారణాలను చూపుతూ 300 చైనా యాప్‌లను భారత్ ఇప్పటికే నిషేధించింది. వీటిలో పాప్యులర్ యాప్ అయిన టిక్‌టాక్‌(TikTok) కూడా ఉంది.

Updated Date - 2022-10-28T20:41:17+05:30 IST