GDP: భారత వృద్ధి రేటు అంచనాలో కోత.. కారణాలు ఇవే..

ABN , First Publish Date - 2022-11-11T14:41:36+05:30 IST

ప్రస్తుత క్యాలెండర్ ఏడాది 2022లో భారత జీడీపీ (GDP) వృద్ధి రేటు అంచనాలను గ్లోబల్ రేటింగ్ కంపెనీ మూడీస్ (Moodys) సవరించింది. క్రితం అంచనా 7.7 శాతం నుంచి 7 శాతానికి కోత విధించింది.

GDP: భారత వృద్ధి రేటు అంచనాలో కోత.. కారణాలు ఇవే..

న్యూఢిల్లీ: ప్రస్తుత క్యాలెండర్ ఏడాది 2022లో భారత జీడీపీ (GDP) వృద్ధి రేటు అంచనాలను గ్లోబల్ రేటింగ్ కంపెనీ మూడీస్ (Moodys) సవరించింది. క్రితం అంచనా 7.7 శాతం నుంచి 7 శాతానికి కోత విధించింది. గ్లోబల్ ఆర్థిక వ్యవస్థలో మందగమనం, దేశీయంగా వడ్డీ రేట్లు పెరుగుదల వంటి కారణాలు ఆర్థిక వ్యవస్థలో గమనాన్ని దెబ్బతీయనున్నాయని మూడీస్ విశ్లేషించింది. అధిక ద్రవ్యోల్బణం, వడ్డీరేట్లు, నెమ్మదించిన గ్లోబల్ వృద్ధి వంటి అంశాలు గత అంచనాలను ప్రతికూలంగా ప్రభావితం చేయనున్నాయని ‘గ్లోబల్ మ్యాక్రో ఔట్‌లుక్స్ 2023-24’ రిపోర్టులో పేర్కొంది.

ఇక వచ్చేఏడాది 2023లో వృద్ధి రేటు మరింత క్షీణించి 4.8 శాతానికే పరిమితం కానుందని లెక్కగట్టింది. అయితే ఆ మరుసటి సంవత్సరం 2024లో పుంజుకుని 6.4 శాతానికి పెరగనుందని రిపోర్ట్ అంచనా వేసింది. గ్లోబల్ ఎకానమీ పతన అంచున నిలిచిన నేపథ్యంలో ఈ పరిస్థితులు ఎదురుకానున్నాయని పేర్కొంది. ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల సమీక్షల్లో కఠిన నిర్ణయాలు, ద్రవ్యలోటు సవాళ్లు, రాజకీయ పరిస్థితుల్లో మార్పులు, ఫైనాన్సియల్ మార్కెట్లలో అనిశ్చితి పరిస్థితులు ఇవన్నీ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ప్రతికూల పరిస్థితులని మూడీస్ పేర్కొంది.

కాగా మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ (Moody's Investors Servic) ఈ ఏడాది భారత వృద్ధి రేటు అంచనాలను తగ్గించడం ఇది రెండోసారి. ఈ ఏడాది వృద్ధి రేటు 8.8 శాతం నమోదవ్వొచ్చని మే నెలలో మూడీస్ అంచనా వేసింది. అయితే సెప్టెంబర్‌లో ఈ అంచనాను తొలిసారి 7.7 శాతానికి కుదించిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-11-11T14:58:50+05:30 IST