Elon Musk: ఉద్యోగులను అందుకే తొలగించా.. నిర్ణయాన్ని సమర్థించుకున్న మస్క్!

ABN , First Publish Date - 2022-11-05T11:38:59+05:30 IST

ఎలాన్ మస్క్(Elon Musk Twitter).. పరిచయం అవసరం లేని పేరు. ఈ ప్రపంచ కుబేరుడు తీసుకున్న ఏ నిర్ణయం అయినా.. హాట్ టాపిక్ అవ్వాల్సిందే. ఆయన ఆలోచనలు అలా ఉంటాయి మరి. అందుకే ప్రపంచలోని చాలా మంది యువతి, యువకులకు ఆయన రోల్ మోడల్. అయితే..

Elon Musk: ఉద్యోగులను అందుకే తొలగించా.. నిర్ణయాన్ని సమర్థించుకున్న మస్క్!

ఇంటర్నెట్ డెస్క్: ఎలాన్ మస్క్(Elon Musk Twitter).. పరిచయం అవసరం లేని పేరు. ఈ ప్రపంచ కుబేరుడు తీసుకున్న ఏ నిర్ణయం అయినా.. హాట్ టాపిక్ అవ్వాల్సిందే. ఆయన ఆలోచనలు అలా ఉంటాయి మరి. అందుకే ప్రపంచలోని చాలా మంది యువతి, యువకులకు ఆయన రోల్ మోడల్. అయితే.. మస్క్ తాజాగా తీసుకున్న నిర్ణయం కూడా ఎప్పటిలాగే ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాశం అయింది. Twitter యాజమాన్య బాధ్యతలు స్వీకరించిన మస్క్.. వారం రోజుల్లోనే అందులో పని చేస్తున్న ఉద్యోగులకు షాకిచ్చాడు. ట్విట్టర్‌లో పని చేస్తున్న మొత్తం ఉద్యోగుల్లో 50 శాతం సిబ్బందిని తొలగించాడు. దీంతో కొందరు ఉద్యోగులు ఆయన నిర్ణయంపై మండిపడుతూ కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే Elon Musk స్పందించారు. ఉద్యోగులను(Twitter layoffs) తొలగించడానికి గల కారణాన్ని వివరించాడు. అంతేకాదు తన నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు కూడా.

అందుకే తొలగించా

భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపుపై ట్విట్టర్(Twitter News) వేదికగా స్పందించిన ఎలాన్ మస్క్.. బలమైన కారణం దృష్ట్యానే ఈ పని చేసినట్టు వెల్లడించాడు. Twitter నష్టాల్లో పయనిస్తుందని మస్క్ అన్నాడు. సంస్థ రోజుకు దాదాపు 4 మిలియన్ డాలర్లను నష్టపోతుందని చెప్పాడు. నష్ట నివారణ చర్యల్లో భాగంగానే దాదాపు 50% (సుమారు 3,700 మందికి)పైగా ఉద్యోగులను తొలగించినట్టు తెలిపాడు. ఉన్నపళంగా తొలగించినా.. ఆ ఉద్యోగులకు మాత్రం అన్యాయం చేయలేదని Elon Musk వెల్లడించాడు. తొలగించిన ప్రతి ఉద్యోగికీ మూడు నెలల పరిహారాన్ని అందించనున్నట్టు తెలిపాడు. ఇది చట్టబద్ధంగా అందే దానికంటే 50% ఎక్కువ అని ఆయన అభిప్రాయపడ్డాడు.

టేకోవర్ చేసిన గంటల్లోనే

ట్విటర్‌ను మస్క్‌ 4,400 కోట్ల డాలర్లకు కొనుగోలు చేశాడు. గత వారంలో కంపెనీని తన ఆధీనంలోకి తీసుకున్న కొన్ని గంటల్లోనే ఉద్యోగాల కోతలకు శ్రీకారం చుట్టాడు. తొలుత సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌, లీగల్‌ ఎగ్జిక్యూటివ్‌ విజయ గద్దె, చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (సీఎఫ్ఓ) నెడ్‌ సెగల్‌, జనరల్‌ కౌన్సిల్‌ సీన్‌ ఎడ్జెట్‌ను తొలగించాడు. కంపెనీని ఆర్థికంగా నిలబెట్టడంతో పాటు 4,400 కోట్ల డాలర్ల భారీ డీల్‌ను లాభసాటిగా మార్చుకునేందుకు మస్క్‌ నిర్వహణ వ్యయాలు తగ్గించుకునే చర్యలు ప్రారంభించాడు. ట్విటర్‌ తన ఖాతాదారుల నుంచి బ్లూటిక్‌ వెరిఫికేషన్‌ కోసం నెలకు 8 డాలర్లు (దాదాపు రూ.660) రుసుము వసూలు చేయనున్నట్లు ఈ వారంలో ప్రకటించిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-11-05T11:52:35+05:30 IST