మొక్కలెక్కడ?
ABN , First Publish Date - 2022-12-15T00:30:06+05:30 IST
రైతు పంట వేసుకోవటానికి నానా తంటాలు పడుతున్నారు. కొవిడ్ తర్వాత పామాయిల్ తోటలు వేయడానికి మొక్కల కోసం రైతు లు ఏడాదికిపైగా ఎదురు చూస్తున్నారు. ఉద్యానవన శాఖ, ఆర్బీకే కేంద్రాల్లో దరఖాస్తులు చేసి కాళ్ళరిగేలా తిరుగుతున్నారు.
చింతలపూడి, డిసెంబరు 14 : రైతు పంట వేసుకోవటానికి నానా తంటాలు పడుతున్నారు. కొవిడ్ తర్వాత పామాయిల్ తోటలు వేయడానికి మొక్కల కోసం రైతు లు ఏడాదికిపైగా ఎదురు చూస్తున్నారు. ఉద్యానవన శాఖ, ఆర్బీకే కేంద్రాల్లో దరఖాస్తులు చేసి కాళ్ళరిగేలా తిరుగుతున్నారు. ఇటీవల స్పందనలో ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. రైతు సంఘం ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ యాజమాన్యంతో చింతలపూడి తహసీల్దార్ వద్ద ఇటీవల చర్చలు జరిపారు. ఈ సందర్భంగా చింతలపూడి మండలానికే ఫ్యాక్టరీ యాజమాన్యం అన్యాయం చేస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చర్చల్లో మూడు అంశాలు ప్రధానంగా తీసుకుని ఈ నెలలో ఇస్తామంటూ యాజమాన్యం భరోసా ఇచ్చింది. చింతంపల్లిలోని గోద్రేజ్ ఆయిల్ ఫ్యాక్టరీ మొక్కలు పెంచి రైతుల కు సరఫరా చేస్తారు. గురుభట్ల గూడెంలోను, కామవరపు కోటలోను రెండు నర్సరీలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో పామాయిల్ ప్రోత్సాహం కోసం ప్రభుత్వం మొక్కలకు సబ్సిడీ ఇచ్చేది. మూడేళ్ళుగా సబ్సిడీ ఎత్తివేయడంతో ఉద్యానవన శాఖతో పనిలేకుండా ఫ్యాక్టరీ యాజమాన్యం మొక్కలను విక్రయిస్తోంది. ఈ ఫ్యాక్టరీ పరిధిలో ఏడు మండలాలు ఉన్నాయి. చింతలపూడి, కామవరపుకోట, ద్వారకా తిరుమల, ముసునూరు, చాట్రా యి, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు ఉన్నాయి. చింతల పూడి మండలంలోనే అధికంగా 25 వేల ఎకరాల్లో పామాయిల్ పండిస్తున్నారు. కొవిడ్ తరువాత మొక్కలు సరఫరా జరగడం లేదు. ఏడాదికిపైగా ఆర్బీకే కేంద్రాల్లో అనేక దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. చింతలపూడి మండలం లోనే నాలుగు వేల ఎకరాల్లో పామా యిల్ సాగుకు రైతులు మొక్కల కోసం దరఖాస్తు చేశారు. పామాయి ల్కు ఇటీవల టన్ను 22 వేల ధర రావడంతో చాలా మంది రైతులు ఆదాయం లేని పంటల స్థానంలో ప్రత్యామ్నాయంగా పామాయిల్ పెంచడానికి ముందుకు వచ్చి ఈ దరఖాస్తులు చేసుకున్నారు. ఆగస్టులో మొక్కలు వస్తాయని ఎదురు చూసిన రైతులకు నిరాశే మిగిలింది. డిసెంబరు వచ్చినా మొక్కలు ఇవ్వడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. భూములను సిద్ధం చేసినా మొక్కలు ఇవ్వక పోవడంతో అవి బీడుగా మారుతున్నాయని వాపోతున్నారు. కొన్ని నెలల క్రితం కొన్ని గ్రామాల రైతులు తెలంగాణ ఫ్యాక్టరీకి అమ్ముతున్నారని, ఈ రవాణాను కట్టడి చేయాలని సరిహద్దులో కొంత కాలం జిల్లా అధికారులతో మాట్లాడి లారీల తనిఖీ కూడా చేశారు. ఇది రైతులకు ఆగ్రహాన్ని తెప్పించింది. చింతపల్లి ఫ్యాక్టరీ యాజమాన్యం తక్కువ ధర ఇస్తుందని, పక్కన తెలంగాణలో అధిక ధర వస్తుందని, అందుకే అక్కడకు తరలిస్తున్నామని రైతులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆరు నెలలుగా పామాయిల్ మొక్కల కోసం ఎదురుచూస్తూ సిద్ధం చేసుకున్న భూములు బీడుగా మారుతున్నాయని, తమ గోడు వినేదెవరని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు.