కమీషన్‌ కథేంటో?

ABN , First Publish Date - 2022-09-13T05:37:21+05:30 IST

ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న ధాన్యం సహకార సంఘాలకు భారంగా మారింది.

కమీషన్‌ కథేంటో?

లెక్కలు చెప్పని సొసైటీలు..
ధాన్యం కమీషన్‌ సొమ్ములు ఇవ్వని ప్రభుత్వం
జిల్లాలో రూ.80 కోట్లు పెండింగ్‌
నేతల ధనదాహానికి బలైన సహకార సంఘాలు


ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న ధాన్యం సహకార సంఘాలకు భారంగా మారింది. డ్వాక్రా సంఘాలకు కమీషన్‌ మంజూరు చేయని ప్రభుత్వం ఇప్పుడు సహకార సంఘాలను అదే జాబితాలో చేర్చేసింది. లెక్కలు చెప్పాలంటూ మెలిక పెట్టింది. నేతల ధనదాహంతో లెక్కలు చెప్పలేని దుస్థితిలో జిల్లాలోని కొన్ని సొసైటీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఇదే అదనుగా  కేంద్రం ఇచ్చే కమీషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం సొంతానికి వినియోగించుకుంటోంది. అంతిమంగా సొసైటీలు నష్టపోతున్నాయి.


(భీమవరం–ఆంధ్రజ్యోతి)
గడచిన మూడేళ్ల నుంచి బకా యిలను ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. జిల్లాలోని సొసైటీలకు రూ.80 కోట్లు కమిషన్‌ రూపం లో మంజూరు చేయాలి. లెక్క లు చెప్పనిదే మంజూరు చేసేది లేదంటూ ప్రభుత్వం కొండెక్కి కూర్చుంది. కొన్ని సొసైటీలకు ప్రభుత్వం మంజూరు చేసిన కమీషన్‌ను నేతలు బొక్కేశారు. జిల్లాలోని మెట్ట ప్రాంతంలోని కొన్ని సొసైటీల్లో నియోజకవర్గానికి చెందిన ఒక ప్రజాప్రతినిధితో సహా సహకార సంఘాల అధ్యక్షులు కమీషన్‌ను జేబులో వేసుకున్నారు. జిల్లాలోని పలు సొసైటీల్లో కమిషన్‌ ఇదేరీతిలో మాయమైంది. అదే ఇప్పుడు ఇతర సహకార సంఘాల మెడకు చుట్టు కుంది. లెక్కలు సమర్పించలేక పోతున్నాయి. ప్రభుత్వం  ఇదివరకు మంజూరు చేసిన కొద్దిపాటి కమీషన్‌ను వెచ్చించుకోలేని దుస్థితిలో ఉన్నాయి. భీమవరం రూరల్‌ మండలంలో ఒక్క సొసైటీకే ప్రభుత్వం నుంచి దాదాపు రూ.60 లక్షలు రావాల్సి ఉంది. గతంలో ధాన్యం కొను గోలుకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన సొమ్ములు పూర్తిగా సొసైటీ ఖాతాల్లో జమ అయ్యేవి. నిధులు పుష్కలంగా ఉండేవి. సొసైటీలు బలోపేతం కావడానికి ఇది ఒక రకంగా దోహద పడింది. ప్రతి సొసైటీకి కమీషన్‌ రూపంలో ఏటా లక్షల్లో ఆదాయం వచ్చి పడేది. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు అధికంగా ఉండడంతో సొసైటీల పంట పండింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారింది.

ఎదురు పెట్టుబడి
ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.31.25 కమిషన్‌ ఇస్తోంది. ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలకే ఆ మొత్తాన్ని కేటాయించేవారు. డ్వాక్రా సంఘాలు, సహకార సొసైటీల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు చేసేవారు.  కమీషన్‌ను పూర్తిగా ఆయా సంఘాలకే జమ అయ్యేవి. తెలుగుదేశం హయంలో డ్వాక్రా సంఘాల కమీషన్‌తో గ్రామ సమాఖ్య భవనాలు నిర్మించారు. కొనుగోలు కేంద్రాల్లో పనిచేసే మహిళలకు గౌరవ వేత నాన్ని ఇచ్చేవారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో డ్వాక్రా సంఘాలను పూర్తిగా విస్మరించారు. గౌరవ వేతనాన్ని ఇవ్వలేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాల బాధ్యత నుంచి తప్పించి కేవలం సొసైటీలకే ఆ బాధ్యతను అప్పగించారు. రైతు భరోసా కేంద్రాలు ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు, పర్యవేక్షించే బాధ్యతను సొసైటీలపై పెట్టారు. అందుకు సంబంధించి పరికరాలు, సిబ్బందిని సొసైటీలు ఏర్పాటు చేసుకున్నాయి. వేతనాలు ఇస్తున్నాయి. ఇలా ఎదురు పెట్టుబడి పెడుతున్నాయి. కమీషన్‌ ఇచ్చేటప్పటికి రాష్ట్ర ప్రభుత్వం మెలిక పెట్టింది. కేంద్రం కేటాయించే కమీషన్‌లో హమాలీలకు రూ.25 ఇవ్వాలని ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. కేవలం రూ.6.25 మాత్రమే సొసైటీలు వినియోగించుకోవాలని సూచించింది. అయితే కమీషన్‌ దారులు  రైతుల నుంచి ధాన్యం సేకరిస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నమోదు చేసి మిల్లులకు తరలిస్తున్నారు. సొసైటీలకు హమాలీల ఊసే లేకుండా పోయింది. ప్రభుత్వం మంజూరు చేసిన కమీషన్‌ను ఈ క్రమంలో పలు సొసైటీలు దుర్వినియోగం చేశాయి. సొసైటీలకు బాధ్యత వహిస్తున్న ప్రతినిధులు, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు ఆ మొత్తాన్ని సొంత జేబుల్లో వేసుకున్నారు. ఇది కాస్త రచ్చగా మారింది. దాంతో ఇతర సొసైటీలు తమ ఖాతాల్లోనే కమీషన్‌ను ఉంచేశాయి. మిగిలిన కమీషన్‌ను విడుదల చేయాలంటే ఇప్పటివరకు ఇచ్చిన కమీషన్‌కు అన్ని సొసైటీలు లెక్కలు చెప్పాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే నేతలు జేబులు నింపేసిన సొసైటీల్లో లెక్కలు చెప్పే పరిస్థితి లేదు. అది ఇతర సొసైటీలకు శాపంగా మారింది.

 సొంతానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు

సొసైటీలు లెక్కలు చెప్పకపోవడంతో కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే కేంద్రం ఇచ్చే కమీషన్‌ను ప్రభుత్వం వినియోగిం చుకుంటోంది. సొసైటీలు ఎదురు పెట్టుబడి చేయాల్సి వస్తోంది. వాస్తవానికి జిల్లాలో ఖరీఫ్‌, రబీ సీజన్‌లలో దాదాపు  16 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కమీషన్‌ రూపంలో సొసైటీలకు రూ.50 కోట్లు మంజూరు చేయాలి. గతంలో సొసైటీ ఖాతాల్లోనే జమ అయ్యేవి. ఆర్థికంగా బలోపేతం కావడానికి ఇది ఒక రకంగా ప్రయోజనం చేకూర్చింది. ఇప్పుడు లెక్కల మెలికతో ప్రభుత్వం కమీషన్‌లు ఇవ్వడాన్ని నిలిపివేసింది. సొంతానికి ప్రభుత్వం వాడుకుంటోందంటూ సొసై టీలు గగ్గోలు పెడుతున్నాయి. అంతిమంగా సొసైటీలు నష్టపోతున్నాయి.

Updated Date - 2022-09-13T05:37:21+05:30 IST