మోక్షమెప్పుడో?
ABN , First Publish Date - 2022-05-17T05:38:47+05:30 IST
భీమవరం–తాడేపల్లిగూడెం ఆర్ అండ్‌బీ రోడ్డులో పిప్పర వరకు ప్రయాణం ప్రత్యక్ష నరకాన్ని తలపి స్తోంది.. ఈ రోడ్డు దుస్థితిపై సోషల్ మీడియాలో ఎన్నో సెటైర్లు..ఎన్నో కామెంట్లు హల్చల్ చేస్తున్నా అధికారుల్లో స్పందన లేదు.

అధ్వానంగా భీమవరం– తాడేపల్లిగూడెం రోడ్డు
జాతీయ రహదారి జాబితాలో రెండోసారి పెండింగ్..
భీమవరం, మే 16: భీమవరం–తాడేపల్లిగూడెం ఆర్ అండ్‌బీ రోడ్డులో పిప్పర వరకు ప్రయాణం ప్రత్యక్ష నరకాన్ని తలపి స్తోంది.. ఈ రోడ్డు దుస్థితిపై సోషల్ మీడియాలో ఎన్నో సెటైర్లు..ఎన్నో కామెంట్లు హల్చల్ చేస్తున్నా అధికారుల్లో స్పందన లేదు. రోడ్డు ముఖ చిత్రం మార్చేస్తామంటూ ఎన్నోసార్లు హామీలు.. ఎన్నో ప్రతిపాదనలు.. అయినా ఇప్పటికీ ముందుకు ఫైలు కదలని దుస్థితి నెలకుంది.
భీమవరంలోని 165 జాతీయ రహదారి నుంచి తాడేపల్లిగూడెంలోని కోల్కత్తా–చెన్నై రహదారి16ను కలుపుతూ 34.5 కి.మీ. పొడవునా వైసీ పీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జాతీయ రహదారుల హోదా కల్పించాలని ప్రతిపాదనలు వెళ్లాయి. అయితే జాతీయ రహదారుల సంస్థ కార్యాలయంలో పెండింగ్ లో పడింది. దీనికి విముక్తి కలిగించాలని ఆర్అండ్బీ మంత్రి దాడిశెట్టి రాజాను ఇటీవల జరిగిన డీఆర్సీ సమావేశంలో మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు కోరారు. వాస్తవానికి గతంలోనే ఆర్అండ్బీ ద్వా రా సుమారు రూ.120 కోట్లతో పకడ్బందీగా ఈ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు చేసినా నిధులు కొరతతో ముందడుగు పడలేదు. అయితే యండగండి వద్ద రిటైనింగ్ వాల్ నిర్మాణానికి, కొద్దిపాటి ప్యాచ్‌వర్క్‌లకు మాత్రం గతేడాది రూ.11.50 కోట్లు మంజూరు చేయగా పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. మంజూరైన నిధులు ఈ రహదారి ప్రక్షాళనకు ఏమాత్రం సరిపోని పరిస్థితి. ఈక్రమంలో డాక్టర్ బీవీ రాజు విద్యా సంస్థల నుంచి పిప్పర వరకు 15 కి.మీ. వరకైనా అధ్వానంగా ఉన్న రోడ్డును అభివృద్ధి చేస్తే కొంత సమస్య పరిష్కా రమవుతుందని వాహనదారులు భావిస్తున్నారు. వాస్త వానికి భీమవరం బైపాస్ సెంటర్ నుంచి బీవీరాజు విద్యాసంస్థల వరకు సుమారు 3 కిలోమీటర్లు గతం లోనే ఫోర్‌లైన్స్ రహదారి నిర్మించారు. మరో రెండు కిలోమీటర్లు గొల్లలకోడేరు వరకు విస్తరించి వదిలేశా రు. దీంతో ఈ రహదారి అభివృద్ధిపై నీలినీడలు కమ్ముకున్నాయి.
2015లోనే జాతీయ రహదారి ప్రతిపాదన
భీమవరం–తాడేపల్లిగూడెం రోడ్డును జాతీయ రహదారులు జాబితాలో చేర్చాలని 2015లో తొలిసారిగా గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదనలు వెళ్లాయి. పేరుపాలెం నుంచి భీమవరం, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమహేంద్రవరం, పాడేరు, అరకు మీదుగా విజయనగరం వరకు జాతీయ రహదారి చేయాలని ప్రతిపాదన చేశారు. ఇది టూరిజానికి ఉపయోగపడే రహదారి. ఈ ప్రతిపాదన పెండింగ్‌లో పడింది. అనం తరం అధికారం చేపట్టిన వైసీపీ ప్రభు త్వం ఆర్అండ్ బీ శాఖ ద్వారా నిధులు కూడా మంజూరు చేయలేదు. కేవలం భీమవరం–తాడేపల్లిగూడెం మధ్య రెండు జాతీ య రహదారులు కలిపే విధంగా జాతీయ రహదారుల జాబితాకు ప్రతిపాదన పంపారు. ఈ ప్రతిపాదన కూడా పెండింగ్‌లో పడింది. భీమవరం–పిప్పర మధ్య ప్రయాణం నరకప్రాయంగా మారింది. రెండు వైపులా ఇరిగేషన్ కాల్వలు ఉండడంతో భూసేకరణ ఎక్కువ చేయాల్సి ఉండడం కూడా ఓ కారణమని చెరుకువాడ ప్రస్తావించారు. ఏదేమైనా ఈ రోడ్డుకు ఎప్పుడు విము క్తి లభిస్తుందో వేచి చూడాల్సిందే.